Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందూత్వ పేరిట దేశంలో మతతత్వ రాజకీయాలు రగిలించిన ఆరెస్సెస్ బీజేపీ కూటమి వచ్చే ఎన్నికలకోసం రోజురోజుకు మరిన్ని విపరీత పోకడలకు పాల్పడుతున్నది. ఆర్థిక సంక్షోభం, ఉపాధి ఉత్పత్తి క్షీణత, కరోనా, అనంతర ప్రభావాలు, ధరల పెరుగుదల, చార్జీలమోత వంటివాటిని పక్కదోవ పట్టించేందుకు మతం ప్రాతిపదికన కృత్రిమ వివాదాలు రగిలించడం మోడీ హయాంలో నిత్యకృత్యమైంది. ఈ అసలైన సమస్యల బదులు హిజాబ్, హలాల్, ఆజామ్ వంటివాటిచుట్టూ దేశం పరిభ్రమించేలా చేస్తున్నారు. గతంలో ఉత్తరభారతంలో గోరక్షణ పేరిట మూక హత్యలు జరిగితే ఇప్పుడు దక్షిణభారతంలో వారి ఏకైక అధికారపీఠం కర్ణాటక వీటికి వేదికగా మారింది. సంస్కార వంటి చిత్రాలతో, గిరీష్కర్నాడ్ వంటి రచయితలతో, హెచ్.నరసింహయ్య వంటి హేతువాద వైస్‌ఛాన్స్‌లర్లతో ఒకప్పుడు నవ కర్ణాటక అనిపించుకున్న ఆ రాష్ట్రం ఇప్పుడు మత చాందసానికి మారుపేరుగా తయారవుతున్నది. ఎపి తెలంగాణ కూడా మినహాయింపులుగా లేవు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండిసంజరు తన సంగ్రామయాత్రలో రోజూ ఇవే మాట్లాడుతున్నారు. హిందువులు పండుగలు జరుపుకోవడానికి ఆటంకాలు లేకుండా చేస్తామని లేనిపోని హామీలిస్తున్నారు. ఇక ఏపీలోనైతే ఆలయాలకు సంబంధించిన చిన్న పెద్ద సమస్యలు తీసుకుని హిందూమతంపై దాడి జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. టీటీడీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒకరోజు తొక్కిసలాట జరిగితే వెంటనే భక్తులను రాకుండాచేసే కుట్ర అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రజలను కదిలించడం కంటే హిందూమతానికి ముప్పు వచ్చిందనే వాదనతో తేలికగా ఆకర్షించవచ్చునన్నది బీజేపీ నాయకత్వం అంతర్గత వ్యూహంగా వుంది. దురదృష్ట వశాత్తూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా హిందూమతానికి ఏదోనష్టం జరుగుతుందనే ప్రచారానికి వంతపాడుతున్నాయి. పాలక వైసీపీ అయితే తానే అసలైన హిందూమత రక్షకురాలిననే ప్రచారం పనిగా పెట్టుకుంది. టీఆర్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఖండిస్తున్నా, ఆలయాల నిర్మాణం నుంచి యాగాల వరకూ తామే అసలైన హిందూత్వ వాదులమంటున్నది. మరోవైపు మజ్లిస్‌తో దానికి చెలిమి వుంది.
మతాలు, రాజ్యాంగం
ఈపరిణామాలన్నీ మత రాజకీయాల సవాలు ముంగిట్లోకి వస్తున్న తీరుకు ఉదాహరణలు. మీడియా సోషల్‌మీడియాలు ఇందుకు ముఖ్య సాధనాలుగా దోహదం చేస్తున్నాయి. ఆన్లైన్ వాలంటీర్లనే వారు అచ్చంగా ఈ పనికోసమే నియమితుల వుతున్నారు. పట్టణ మధ్యతరగతిభాషలో వారు మతతత్వ ప్రచారం చేయడమే గాక లౌకికవాదులపై ముఖ్యంగా కమ్యూనిస్టులూ ప్రగతిశీల మేధావులపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఈ విషప్రచారం యువతను బడిపిల్లలను కూడా వదలడం లేదు. సిలబస్‌నే మార్చేస్తూ భగవద్గీత బోధన వరకూ తీసుకెళుతున్నారు. ప్రతిదీ మతకోణంలో చూపించే పాఠాలు ప్రవేశపెడుతున్నారు. భారత దేశంలో అత్యధిక శాతం హిందువులు గనక మెజార్టీవాదం అమలయ్యే హిందూ ప్రధాన దేశంగా రూపొం దించాలనేది ప్రణాళికలో ప్రధానాంశం.. వినడానికి కొంత సమంజంగా కనిపించే ఈ వాదం నిజానికి ప్రజాస్వామ్య మూల సూత్రాలనే పరిహసిస్తుంది. అల్పసంఖ్యాకుల అభిప్రాయాలను, స్వేచ్చను కూడా గౌరవించ డమే ప్రజాస్వామ్యం. పైగా ప్రభుత్వాల మెజార్టీ మైనార్టి అనేది ఓటింగును బట్టి నిర్నయం కావాలి తప్ప మత విశ్వాసాలను బట్టి కాదు. భారత రాజ్యాంగం 25,26,27,29 అధికరణలు అన్ని మతాలవారికి సమానత్వం కల్పించడమే గాక మైనార్టీలకు కొన్ని ప్రత్యేక రక్షణలిచ్చాయి. ఈ విషయమై ఎప్పటికప్పుడు అనేక తీర్పులు కూడా వచ్చాయి. అలాగే ఏ మతం వారైనా ఇతర మతాలలోకి మారేందుకు రాజ్యాంగం అవకాశమిస్తున్నా అదేదో దేశ ద్రోహమైనట్టు చిత్రించడం, ప్రజలను నమ్మించడం మరో దుర్నీతి.మత మార్పిడి ఐచ్చికంగా జరగాలి తప్ప ప్రలోభాలతో కాదని చెప్పొచ్చు. కాని ప్రతీ మత మార్పిడి కుట్రగా చిత్రించడం ఎలా చెల్లుబాటవుతుంది? ఆ మాటకొస్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్వయంగా బౌద్ధమతం స్వీకరించగలిగేవారా? వైదిక మతాలను బలంగా సవాలు చేసిన బౌద్ధ, జైనాల వైపు వెళ్లిన దిగువ తరగుతుల వారిని భక్తి ఉద్మమంతోనూ పైపై సమానతా సూక్తులతోనూ రాబట్టుకుని వుండకపోతే హిందూమతం ఇంతగా విస్తరించేదా? ముస్లిం క్రైస్తవ మతాలను అనుసరించేవారంతా ఈ దేశం బిడ్డలు కాదా? ఏ మతమూ లేని అడవిబిడ్డల మాటేమిటి?
భిన్నత్వంలో ఏకత్వం
కనుక దేశాన్ని హిందూమతానికి మాత్రమే పరిమితమైనట్టు చూపించడం రాజ్యాంగ ఉల్లంఘనే గాక ఈ దేశ చారిత్రక వారసత్వానికి, వైవిద్య సంసృతికి కూడా వ్యతిరేకమైన వ్యవహారం. భారతీయుల విశ్వాసాలు ఏనాడూ ఏకశిలా సదృశంగా లేవు. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ దేశ విశిష్టతగనకే జాతీయపతాకంపైనా మూడురంగులూ అశోకధర్మచక్రం అలంకరించబడ్డాయి. ఆరెస్సెస్పరివార్ ఈవైవిధ్యాన్ని ఏనాడూ అంగీకరించింది లేదు. ''అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోరు'' అన్న గురజాడ సూక్తి వారికి కంటకప్రాయం. హిందూత్వ పేరుతో ఓట్లు రాబట్టడమే వారి పథకం. సమత, సామాజిక న్యాయం ఊసేలేని నాటి వర్ణవ్యవస్థ దొంతరలు, నేటి సంపదల అంతరాలు వారికి అవసరం. అందుకే హిందూత్వ అనేది ఆచరణలో కార్పొరేట్ కాషాయ కాక్‌టైల్‌గా తయారైంది. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో దాని దుష్ఫలితాలను దేశం చూసింది. మిగిలిన వారికి లేని విధంగా ఈయనకు స్వంత మెజార్టి వుంది గనక, స్వయంగా ప్రచారక్‌గా వుండి ప్రధాని పీఠమెక్కారు గనక మోడీ హయాంలో పరివార్ దూకుడు మరీ హద్దుమీరింది. దేశ సరిహద్దులు కూడా దాటేస్తానంటున్నది.
ఆరెస్సెస్ అధినేత నోటనే...
రవీంద్రపూరి అనే స్వామీజీ ఈ మధ్యనే మాట్లాడుతూ 2015 నాటికి అఖండభారత్ సిద్ధిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుందని చెప్పారట. ఆ తర్వాత అక్కడే మరో ఆలయ కార్యక్రమంలో పాల్గొన్న ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ ఆయనను పూర్తిగా బలపర్చారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆయనచెప్పారు గానీ దేశంలో పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా వున్నాయని సెలవిచ్చారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని మరో 20-25ఏళ్లలో అఖండభారత్ సాధ్యమవుతుందని అన్నారు. మనం వేగంగా పనిచేస్తే అది 15ఏండ్లకే నిజమైనా ఆశ్చర్యం లేదన్నారు. భారత్‌ది అహింసా సిద్ధాంతమైనా ఈ పనిచేయడం కోసం అస్త్రాలు కూడా ఉన్నాయని ఆయుధభాషలో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి వెయ్యేళ్లుగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనారనీ ఇక రాబోయే రోజుల్లో అదే రాజ్యమేలుతుందనీ తిరోగమనరాగాలాలపించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగం, లౌకికతత్వం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ జయంతి సందర్భంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడటం దేశంలో నెలకొన్న తలకిందుల పరిస్థితికి ప్రతిబింబం.
అనర్థదాయక నినాదం
అఖండభారత్ ఆరెస్సెస్ మూలసిద్ధాంతం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, మైన్మార్, టిబెట్, భూటాన్ వంటివన్నీ బారతదేశంలో భాగం కావాలని చెప్పే వివాదాస్పద విస్తరణ నినాదం. అఫ్ఘనిస్తాన్ ఉపఘనాధన్, దాని రాజధాని కాబూల్ కుజానగర్, పాకిస్తాన్‌లోని పెషావర్ పురుష్‌పూర్, ముల్తాన్ అంటే మూలస్థాన్, టిబెట్ త్రివిష్టపం, మైన్మార్గా మారిన ఒకప్పటి బర్మాపేరు బ్రహ్మదేశం....! శ్రీలంక సరే సింహళం. ఇవన్నీ భారతీయుల వేనట. సముద్రాల పేర్లు కూడా మార్చేశారు. అరేబియా సముద్రం అంటే సింధూసాగర్, ఇండియన్ఓషన్ హిందూమహాసాగర్, బంగాళాఖాతం గంగాసాగర్..!! ఆరెస్సెస్ అనుబంధ సంస్థల ప్రచురణల్లో ఈ పేర్లు మాత్రమే గాక మ్యాపులు కూడా వేశారు. ఉదాహరణకు విద్యాభారతి సంసృతి శిక్షసంస్తాన్ నడిపే12,828 పాఠశాలల్లో 34లక్షల మంది టీచర్లు ఇదే చెబుతుంటారు. సురుచిప్రకాశన్ ప్రచురించిన పుణ్యభూమి భారత్‌లోనూ ఇదే తీరు.
ఇన్ని దేశాలను కలుపుకోవాలనడం, అంతర్జాతీయంగా ఎలాటిప్రభావం చూపుతుందో వారికి తెలియదని కాదు. అది జరిగేపని కాదనీ వారికి తెలుసు. దేశాలు, సరిహద్దులు, జాతుల ప్రస్థానం అనేక మార్పులకు లోనైంది. మలుపులు తిరిగింది.19,20 శతాబ్దాలలో ఇవి చాలావరకూ స్థిరపడ్డాయి. ఆప్ఘనిస్తాన్‌లో ఖాందహార్ ఒకప్పటి గాంధార దేశమనీ, కాంబోడియా అంటే కాంభోజ దేశమని చెబుతుంటారు. అయితే ఏవో పురాణాల ఆధారంగానో లేక పాతకాలపు కథలను బట్టో అవన్నీ మావేనని చెప్పుకోవడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కుదిరేపని కాదు, అనర్థదాయకమైన ఆ ఆలోచన అవసరం అంతకన్నా లేదు.
మోహన్‌భగవత్ తన మాటలకు మద్దతుగా అరవింద యోగిని, వివేకానందుడిని తీసుకోవడం మరీ విడ్డూరం. ఆరెస్సెస్ మార్కు హిందూత్వ సృష్టికర్త సావర్కార్ తప్ప అరవిందుడో వివేకానందుడో కాదు. హిందూత్వ పదం భావన సావర్కార్దే. ఆయన శిష్యుడైన గాడ్సే గాంధీని కాల్చిచంపడం చూస్తే దాని తత్వం తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో లౌకికవాదులపైన మేధావులపైన ఆ దాడి కొనసాగుతూనే వుంది. అయితే తమ మత రాజకీయాలతో పదే పదే ప్రజలను రెచ్చగొట్టడం అంత సులభం కాదు గనకే అఖండభారత రాగం అవసరమైంది. మోహన్ భగవత్ అంటున్నట్టు... వారు వేగం పెంచేలోగా లౌకిక ప్రజాస్వామిక శక్తుల వేగం పెరగడం మరింత అవసరం.
- తెలకపల్లి రవి