Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన చాలా సేపటి నుండి హార్మోనియం పెట్టెను శృతి చేస్తున్నాడు. కొత్తదనం కోసం నిరంతరం పరితపించే ఆయనకు పాత రాగాలు నచ్చటం లేదు. దాదాపు 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా ఆయన సంగీత దాహం తీరనిది.
ఈ మధ్య ఆయనకు అసిస్టెంట్‌గా పని చేయటానికి వచ్చిన ఒక యువకుడు ''గురువుగారు, మీ సంగీతంలో వచ్చిన పాటలు తిరగేసి పాడినట్లు ఉన్నాయి. ఎందుకూ?'' అని అడిగిన పుణ్యానికి గుర్రున చూశాడు! 'ఇసై జ్ఞానినే ప్రశ్నిస్తావా? అజ్ఞానీ!' అన్నట్లు చూసిన ఆ చూపునకు జడిసి, ఆ యువకుడు సంగీతం జోలికెళ్ళడమే మానేసాడు!
ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినా, మరిన్ని కొత్త అవార్డుల కోసం వెంపర్లా డటం వెన్నతో పెట్టిన విద్య! ఆ విధంగా వెంపర్లా డగా దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారం అందింది. రెండవది అందితే ఎలా మొదటిది కూడా అందుకోవాలన్న వెంపర్లాట మొదలైంది. ఇక ఆ వెంపర్లాట ఆయనను కూర్చోన్విటం లేదు! నిలవనివ్వటం లేదు! అలాగని పడుకోనివ్వటమూ లేదు! సర్వకాల సర్వావస్థల యందు ఒకే ఒక్క ధ్యాస ఆశ! మొదటిది ఎలాగైనా సరే అందుకోవాలని! అందుకే హార్మోనియం మెట్ల మీద కొత్త రాగాలు పలకటం లేదు!
ఇక లాభం లేదనుకుని హార్మోనియం పక్కన పెట్టి సుధీర్ఘంగా ఆలోచించాడు. ఆయన అలా ఆలోచించటం మానివేసి చాలా కాలమైంది. అందుకే ఈ మధ్య ఆయన పాటలు హిట్ కావటం లేదు. క్రమంగా సంగీతాభిమానులు ఆయనను మర్చిపోయే పరిస్థితి కమ్ముకొస్తోంది. తన సంగీతంలో సగం వయస్సు లేని కుర్రకుంకలు, దుమ్ము లేపుతుంటే, తన సంగీత పరికరాలు అన్నీ బూజు పట్టిపోతున్నాయి!
ఆయన ఆలోచనలు ఎంతకీ ఓ కొలిక్కి రావటం లేదు! తనను జనం పూర్తిగా మర్చిపోకముందే ఆ ఒక్కటి అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పాటలు వింటే ఏదైనా ఆలోచన తడుతుందని టివి పెట్టాడు ''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'' అంటూ పాట వచ్చే సరికి కోపం వచ్చి చానల్ మార్చాడు!' 'కొమురం భీముడో !' అంటూ మరో పాట వచ్చింది. ! ఆయనకు కోపం పెరిగింది. మళ్ళీ ఛానల్ మార్చాడు! ''భీమ్లా నాయక్!'' అంటూ ఇంకో పాట వచ్చింది! ఈ ఛానళ్ళకు తన పాట ఒక్కటైనా దొరకలేదా! అనుకుంటూ, కసిగా మళ్ళీ ఛానల్ మార్చాడు.
ఈసారి ఫర్వాలేదు! గాయకులు పాటలు పాడే షో ఒకటి వస్తోంది. ఇందులో ఖచ్చితంగా తన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడటం మొదలెట్టాడు. ఒక గాయకురాలు పాట పూర్తి చేసింది! వెంటనే జడ్జి 'ఛీ ఛీ' ఇదేం పాట! ఇలాగేనా పాట పాడేది!' అన్నాడు మొహం అదోలా పెట్టి!
పాట సరిగ్గానే పాడాను కదా ! గురువుగారు! అన్నది ఆమె అమాయకంగా!
''మేము ఎక్కడికో తీసుకెళదామని అనుకుంటాము! కాని మీరు అక్కడికి రారు! అందుకే మీరు ఇక్కడే ఉంటారు!'' అంటున్నాడు జడ్జి. టీవి చూస్తున్న ఆయన కళ్ళు నులుముకుని చూశాడు. ఛానల్లో మాట్లాడుతున్నది జడ్జి కాదు బ్రహ్మానందం! ఇది చూసిన తర్వాత ఆయనకు జ్ఞానోదయ మయ్యింది. మొదటిది ఇంత వరకు ఎందుకు దక్కలేదో బోధపడింది! దాంతోపాటే కర్తవ్యమూ అర్థమైంది. దాంతో మంచి నిద్ర పట్టింది ఆయనకు.
కట్ చేస్తే, ఒక పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిధి. ఆయనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆ తర్వాత ఉపన్యాసం ప్రారంభించాడు.
''మన దేశంలో మహానాయకులు ఇద్దరే ... ఒకరు అంబేద్కర్, రెండవది మన ప్రధాని! ఇంకా చెప్పాలంటే అంబేద్కర్‌కి, మన ప్రధాని ఎందులోనూ తక్కువ కాదు. అంబేద్కర్‌కి 34 డిగ్రీలున్నాయంట! ప్రధానికి అన్ని డిగ్రీలు లేకపోవచ్చు! కాని జ్ఞానంలో అంబేద్కర్ అంతటి వాడు! మన దేశం నేడు ఎంతో అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మన ప్రధానే. ఆయన రాజకీయాల్లోకి రావటం భారత దేశపు అదృష్టమే కాదు! నా అదృష్టం కూడా! ఆయన సంగీత సామ్రాజ్యంలోకి వచ్చి ఉంటే నా లాంటి వారు ఆయనకు వింజామరులు వీయటానికి కూడా సరితూగే వారము కాదు! మొన్న పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఆయన సంగీత జ్ఞానం ఎంతటిది, సోషల్ మీడియాలో కళ్ళారా చూసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను! అంబేద్కర్, ప్రధాని ఇద్దరూ భారతదేశానికి రెండు కళ్ళు....'' అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుని తన ఉపన్యాసాన్ని ఆయన కొనసాగించాడు.
అలా ఎంత సేపు కొనసాగిందో తెలియదు. కాని ఆయన ఉపన్యాసం ముంగించి కళ్ళు తెరిచి చూసేసరికి, టమాటలు, కోడిగుడ్లూ తన మీద, వేదిక మీద కుప్పలుగా పడి ఉన్నాయి! వేదిక మీదగాని, ముందుగాని ఎవ్వరూ లేరు!
- ఉషాకిరణ్, 9490403545