Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: ఏమిటండీ ఈ ఘోరం గురువుగారు... పాలకపార్టీ నేతలు, అధికార యంత్రాంగం, పోలీసులు కలిసి వేధింపులతో రెండు నిండు ప్రాణాలు బలిగొన్నారు కదండి. రామాయంపేటలో తల్లీ కొడుకులు గంగం పద్మ (65) సంతోష్ (41)లు. పైవాళ్ళు పెట్టే వేధింపులు తాళలేక తాము ఆత్మహుతి అవుతున్నట్టు మెసేజ్‌లు పెట్టి మరీ కాల్చుకు చనిపోయారు. అరెరె... ఎంత దారుణం?
గురువు: తొండ ముదిరి ఊసరవెల్లి అవుతున్నట్టు పెట్టుబడిదారీ వ్యవస్థ ముదురుతున్న కొద్దీ ఇలాంటి అవాంఛనీయ వికృత ఘటనలు ముందు ముందు మరీ ఎక్కువ అవుతాయి శిష్యా.
శిష్యుడు: కొంత అర్థమయ్యేటట్లు చెప్పండి గురువుగారూ...
గురువు: ప్రకృతి వైపరీత్యాలు, ఉత్పాతాలు (నేచురల్ డిజాస్టర్స్) అంటే భూకంపాలు, వరదలు, తుఫానులు, కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి సంభవించినప్పుడు ఆ విధ్వంసానికి మానవాళి ప్రాణాలు ఆస్తులు కోల్పోవడం, నష్టపోవడం సహజం. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో, ప్రకృతి విధ్వంసాల కన్నా మానవ కల్పిత విధ్వంసాలు (మ్యాన్ మేడ్ డిజాస్టర్స్) ఎక్కువ జరుగుతాయి. అందులో భాగంగానే యుద్ధాలు, ఉగ్రవాద ఘాతుకాలు, కృత్రిమ కరువులు మొదలైనవి సంభవిస్తాయి. స్థూల రూపంలో దేశ దేశాల్లో పైకి అవి అలా కమ్ముకుంటూ ఉంటే, సూక్ష్మరూపంలో సమాజంలోనూ, కుటుంబాల్లోనూ ఇక్కడ ఇలా హత్యలుగానూ, ఆత్మహత్యలుగానూ పొడసూపుతాయి. అంతటికీ మూలకారణం క్రూరమైన దోపిడీ, స్వార్థం, ఆధిపత్యమే సుమా...
శిష్యుడు: అవునవును పోలీసులు వేధిస్తున్నారనే కారణంగానే సాయిగణేష్ అనే పాతికేండ్ల కుర్రోడు కూడా ఖమ్మంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గురువు: ఈ వేధింపు హత్యలు మన తెలంగాణకే పరిమితం కాలేదు. కర్నాటకలో బీజేపీ వారికి ఇలాంటి ఘటన ఒకటి పెద్ద తలనొప్పిగా మారింది.
శిష్యుడు: నిజమా! ఏదేది కొద్దిగా వివరించండి....
గురువు: కర్నాటకలో ఒక యువ కాంట్రాక్టరు సంతోష్‌పాటిల్ తన ఆత్మహత్యకు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఈశ్వరప్ప కారణమని తెలిపాడు. తను పూర్తి చేసిన పనిలో నలభైశాతం కమిషన్ అడిగాడట. అది సహించలేక సదరు కాంట్రాక్టరు ఆ విషయాన్ని బయటపెట్టాడు. అలా బయటపెట్టినందుకు మంత్రి 4 కోట్ల రూపాయలు బిల్లులు నిలిపివేశాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తన అనుచరగణం చేత వేధింపులు, సాధింపులు పెట్టాడు. అవి తాళలేక పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విశేషం ఏమంటే ఆ కాంట్రాక్టరు కూడా బీజేపీ కార్యకర్తేనట. చూశావా శిష్యా కమిషన్లకు, దోపిడీకి, సుపారీకి తరతమ బేధమేమీ ఉండదు.
శిష్యుడు: అలాగా... మరి తరువాత ఏమైంది?
గురువు: ఈశ్వరప్ప 40శాతం కమిషన్ అడిగినట్టు, అది చెల్లించలేక పాటిల్ ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో చేర్చాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేసాయి. రాహుల్‌గాంధీ ఓ అడుగు ముందుకువేసి దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్నాటక బీజేపీ ప్రభుత్వం అని విమర్శించాడు. పత్రికలు, మీడియా వత్తిడిపెరిగింది.
ఇంకేముంది? ముందే రాసుకొచ్చిన సినిమా స్క్రిప్ట్ మాదిరి 'ఇదంతా రాజకీయ కుట్ర అని, దీని వెనుక ఎవరు ఉన్నారో తర్వాత తేలుస్తానని మంత్రిగా ఉంటే విచారణకు ఆటంకం కనుక తనకు తానుగా స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నానని, త్వరలో ''కడిగిన ముత్యం''లా బయటకు వచ్చి మరల పీఠం అధిష్టించడం ఖాయమని' మంత్రి ఈశ్వరప్ప బల్లగుద్దాడు.
శిష్యుడు: అవ్వవ్వ.. ఎంత డ్రామా..? గురువుగారూ...
గురువు: డ్రామా కాదు, మెలోడ్రామా... మంత్రి మాటలకు ముఖ్యమంత్రి బొమ్మైతో సహా ఇతర మంత్రులు పులకించిపోయి ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికారు.
శిష్యుడు: వారెవ్వా.. నిజంగా సినిమా స్క్రిప్ట్. డ్రామాలాగా ఉందండి సన్నివేశం. ఈశ్వరప్ప నిర్దోషిగా బయటపడేందుకు రంగం సిద్దమయిందిగా...
గురువు: ఆ.. ఆ... రాబోయే సన్నివేశాన్ని ముందుగానే ఊహించే ఆధునిక ప్రేక్షకుడివయ్యావ్. భేష్.. అందుకే ఈశ్వరప్ప విషయంలో ఏంచేయాలన్నది పోలీసులు చూసుకుంటారని ఆ ముఖ్యమంత్రి సెలవిచ్చారు.
శిష్యుడు: అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడమేగా... గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కాలంలో నరమేథం జరిగినప్పుడు నాటి ప్రధాని వాజ్‌పారు కూడా ఇలానే చెప్పారు కదా...
గురువు: నీకు బాగా గుర్తుంది. పాలకుల దుశ్చర్యలకు దుర్మార్గాలకు ఇక్కడ చట్టం ప్రభుత్వం ఎలా కాపు కాస్తుందో తెలిసింది కదా... కానీ కథలో ఓ కొత్త మలుపు తిరిగింది.
శిష్యుడు: మలుపా..? చెప్పండి గురువుగారు.. చెప్పండి. లేకపోతే నిద్రపట్టదు.
గురువు: వస్తున్నా... వస్తున్నా... పాటిల్ ఆత్మహత్యతో కర్నాటక కాంట్రాక్టర్ల సంఘానికి గొంతు పెగిలింది. పాటిల్ చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని రాష్ట్రంలోని చాలామంది మంత్రులు చెప్పనలవి కాని విధంగా తమ నుండి కమీషన్లు దండుకుంటున్నారని, ఎక్కడో ఓ చోట దానికి ఫుల్‌స్టాఫ్ పెట్టకపోతే మేము కూడా పాటిల్ బాటలో క్యూకట్టవలసి వస్తుందని వాపోయారు. ఇదే విషయాన్ని సంఘ అధ్యక్షుడు కెంపన్న విలేకరుల సమావేశంలో కుండబద్దలు కొట్టాడు. ఇంత అవినీతి ప్రభుత్వం ఎప్పుడూలేదని, ప్రభుత్వంలో మార్పు గనక రాకపోతే తమ దగ్గర ఉన్న బలమైన ఆధారాలన్ని బయటపెడతామని తెగేసి చెప్పాడు. అంతేగాక వచ్చేనెల 25 నుండి ప్రభుత్వ పనులు అన్నింటినీ ఆపేస్తామని ఆ కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరించింది.
శిష్యుడు: భలే.. భలే.. ఇప్పుడు ఏమవుద్దండీ గురువుగారు.
గురువు: మరి ఈశ్వరప్ప మామూలు వ్యక్తి కాదు. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినవాడు. అవినీతి కేసుల్లో ప్రత్యర్థి మంత్రులపై సీబీఐ దాడులు చేయించే కేంద్రం ఈ వ్యవహారంలో ఏం చేస్తుందా? అని దేశం ఎదురు చూస్తోంది.
శిష్యుడు: నాకు తెలియక అడుగుతాను గురువుగారు.. కేంద్రానికి తెలియకుండానే ఇంత జరిగిందంటారా..?
గురువు: గట్టిపిండం. బాగానే ఆలోచిస్తున్నావ్.. కేంద్రానికి వాటాలు ముడుతున్నాయి గనుకనే ఈ అంతర్గత లుకలుకలు ఇంతకాలం దాగి ఉన్నాయన్న విమర్శ లేకపోలేదు.
శిష్యుడు: మరి దీనికి భారతవాక్యం లేదా గురువుగారు.
గురువు: పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండదు శిష్యా. ఈ భయంకర వ్యవస్థలో తట్టుకోలేని వత్తిళ్ళతో, సంక్షోభాలతో 'నేను బతకలేకపోతున్నాను. చచ్చిపోవాలను కుంటున్నాను మహాప్రభో' అంటే ''అందుకు ఉరితాళ్ళను నేను సప్లయి చేస్తానోచ్'' అని పెట్టుబడిదారుడు అంటాడు. లాభం వస్తుందంటే శవపేటికల తయారీకి వాడెప్పుడూ ముందే ఉంటాడని మార్క్స్ ఏనాడో చెప్పాడు కదా శిష్యా.
శిష్యుడు: అవునవును. అది ముమ్మాటికి నిజం.
- కె.శాంతారావు
సెల్: 9959745723