Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తిండైనా పెట్టండి, పనైనా చూపండి''ని వ్యవసాయ కార్మికులు చేసిన అనేక పోరాటాల ఫలితంగా వామపక్షాల వత్తిడి మేరకు ప్రతి కుటుంబానికి 100రోజుల పనిని గ్యారంటీ చేస్తూ నాటి కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం తెచ్చిన ''గ్రామీణ ఉపాధి హామీ'' చట్టాన్ని నేటి బీజేపీ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధపడటం లేదు. ఈ చట్టం ప్రకారం, యంత్ర పరికరాలతో చేసే పని నిషేధం. ఆన్‌స్కిల్డ్ సెమీస్కిల్డ్ కూలీలతో మాత్రమే పని చేయించాలి. చేసిన పనికి వారంరోజుల్లో చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలి. వికలాంగులు, ఆదివాసీ గిరిజనులు, దళితులు, ఇతర పేదలకు ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం పనిని చూపాలి. పదిహేను రోజులలో ప్రభుత్వం పని చూపని క్రమంలో దరఖాస్తుదారులు చట్ట ప్రకారం నిరుద్యోగభృతిని పొందే హక్కు ఉంది. 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉపాధిహామీ జాబ్ కార్డు, పని పొందే హక్కు ఉంది. 90శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 10శాతం నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. పని కోసం గ్రామీణ పేదల వలసల నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థిర ఆస్తుల కల్పన లక్ష్యాలుగా ఈ చట్టాన్ని అమలు చేయాలి.
కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 716జిల్లాల్లోని 7,168 బ్లాకులు, 2, 69,453 గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం ఈ పనిని అమలు చేస్తున్నది. ఆరు కోట్ల 77 లక్షల కుటుంబాలు 15కోట్ల 78లక్షల జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. వీటిల్లో 31,60,00,619 మంది కూలీలు తమపేర్లును నమోదు చేసుకున్నారు. మన రాష్ట్రంలో 57.17 లక్షల జాబ్ కార్డులున్నాయి. వీటిల్లో 1,20,91,233 మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకొని ఉన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పనికోసం వెళ్ళే వలసలు తగ్గాయి. ఆడ మగ కూలీలకు సమాన వేతనాలు అమలు అయ్యాయి. కూలీల్లో సంఘటిత శక్తి పెరిగింది. రైతాంగంతో కూలి రేట్ల పెంపు కోసం బార్గెయినింగ్ కెపాసిటీ పెరిగింది. కూలిరేట్లు పెరుగుతున్న ధరల కనుగుణంగా పెంచుకోవడం ద్వారా తమ అవసరాలకు గ్రామీణ పెత్తందారులపై ఆధారపడే పరిస్థితి నుండి బయట పడ్డారు. కానీ ఓర్వలేని గ్రామీణ పెత్తందారులు ఈ చట్టం అమలుకు మోకాలడ్డుతున్నారు. ఉపాధి హామీ బడ్జెట్ నిధులలో తమకూ వాటా కావాలి అనే వాదనలు తెస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా గ్రామీణ పేదలపై తమకున్న పట్టు సడలిపోవడానికి కారణమైన ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీయడం కోసం పాలకులపై ఒత్తిడిని పెంచుతున్నారు. దీనికనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంలో మార్పులకు పూనుకుంటున్నాయి.
ఆన్లైన్ మస్టర్ పేరుతో కూలీలను పనికి దూరం చేసే కుట్ర
పారదర్శకత, ఎకౌంటబులిటీ పేరుతో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ - (ఎన్ఎంఎంఎస్)యాప్ ఆన్లైన్ మస్టర్ విధానం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. యధావిధిగా అమలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ నెంబర్ 333ని విడుదల చేసింది. దీని ప్రకారం ఉదయం 11గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 2 - 5గంటల మధ్య మరోసారి పని ప్రదేశంలో కూలీల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రతి మేట్ 20 మందికి బాధ్యత వహించాలి. అందులో 50శాతం మహిళలు ఖచ్చితంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ మస్టర్‌కు 10వర్షన్ ఏండ్రాయడ్ ఫోన్, 4జి లేదా 5జి సిమ్ ఉంటేనే ఈ యాప్ సపోర్టు చేస్తుందని పేర్కొన్నారు. ఈ మస్టర్ ఆధారంగా ఫొటోలు అఫ్లోడ్ అయిన కూలీలకు మాత్రమే వేతనాలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. ఉపాధి జాబ్ కార్డుకు, బ్యాంకు ఎకౌంట్, ఆధార్ కార్డు లింకు తప్పనిసరి చేశారు. ఫలితంగా ఇవి లేనివారు ఉపాధి పనికి దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. మారుమూల ప్రాంతాల్లో బ్యాంకు లేనివారు, పని ప్రదేశంలో స్మార్ట్ ఫోన్స్, నెట్ బ్యాలెన్స్, సిగల్స్లేని దగ్గర పేదలు పని చేసినా వేతనాలు పొందే అవకాశం లేదు. అల్ఫాబేటికల్ అర్డర్‌లో పని ఇవ్వడం వలన రోజుకోక గ్రూపులో జాబ్కార్డుదారుడు పని పొందాల్సిన పరిస్థితి నెలకొన్నది. జాబ్‌కార్డు ఆధార్‌కార్డు బ్యాంకు అకౌంట్లలో వేరు వేరు పేర్లున్న వారిని ఈ యాప్ ఈ మస్టర్ అంగీకరించడంలేదు. ఇప్పటికే చేసిన పనికి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడం వలన, కూలీలు ఈ పని చేయ్యడానికి సిద్దపడటం లేదు. కూలీలకు సులువైన పద్ధతుల్లో పనుల కల్పన కంటే కార్పొరేట్ బహుళ జాతి సంస్థల ఉత్పత్తులైన సెల్‌ఫోన్స్, సిమ్‌కార్డులు ప్రమోట్ చేసే పద్ధతిలో ఉన్న ఈ సర్క్యులర్‌ను తక్షణం రద్దు చేయాలి. సమ్మర్ అలవెన్సు పునరుద్దరించాలి.
బడ్జెట్లో భారీకోత వలన, వేతనాలు - పని కల్పనపై ప్రభావం
కరోనా విపత్కర పరిస్థితుల్లో పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు అసంఘటిత కార్మికుల వలసలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉపాధి హామీ చట్టానికి నిధులను పెంచాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతంలో 4శాతంగా ఉన్న కేటాయింపులను 1.8శాతంకు కోత విధించింది. మొత్తం నిధులలో 49శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద కాంట్రాక్టర్ల పనులకు అనుమతి నిచ్చారు. మొక్కలు నాటడం, సిసిరోడ్లు, బిల్డింగ్లు, బాత్రూమ్ల నిర్మాణాలకు డైవర్టు చేశారు. మరో వైపు వేసవిలో వేతనాలకు అదనంగా కల్పి ఇచ్చే సమ్మర్ అలవెన్సును రద్దు చేసింది. దీనివలన రోజు వారీ వేతనాలు భారీగా తగ్గాయి. పని కోసం జాబ్‌కార్డులలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వలన పని కల్పన లేదు. ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపర్చిన లెక్కల ప్రకారమే దేశంలో 15కోట్ల 78లక్షల జాబ్‌కార్డు దారులు ఉంటే 9.95 కోట్ల జాబ్‌కార్డు దారులకు మాత్రమే పని చూపిస్తున్నారు. పని కోసం 31కోట్ల 60లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే కేవలం 15 కోట్ల 17లక్షల మందికి మాత్రమే పని కల్పించి చేతులు దుల్పుకున్నారు. అంటే దేశంలో కోట్లాది మంది కూలీలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా సగం మందికి కూడా పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. 57.17లక్షల జాబ్‌కార్డులలో 1.20 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే కేవలం 36.73లక్షల జాబ్‌కార్డుల్లోని 64,79,307 మంది కూలీలకు మాత్రమే పని కల్పిస్తున్నారు. మిగతావారు పని కోసం అనివార్యంగా వలసలు వెళ్ళు తున్నారు. మరో వైపు ప్రభుత్వం కొత్త నగర పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటిల్లో 409 పైగా గ్రామాలను కల్పడం వలన సుమారుగా మూడు లక్షల మంది కూలీలు పనికి దూరం అయ్యారు. క్యూబిక్ మీటర్ కొలతలు పెట్టి చట్ట ప్రకారం నిర్ణయించిన రూ.257 వేతనం కూడా కూలీలకు పడకుండా చేస్తున్నారు. వాటర్ బిల్లు, గడ్డపార సాన బిల్లు, లోకల్ ఆటో కిరాయిలు కల్పి ఇచ్చినా రోజు కూలి రూ.125 దాటని పరిస్థితి నెల కొన్నది.
కానరాని కనీస సౌకర్యాలు
తెలంగాణ ఏర్పడిన నాటినుండి గడ్డపార, తట్ట, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వలేదు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడకు టెంటు, మంచినీళ్ల కల్పన లేదు. గ్రామ అభివృద్ధి, సాగు భూముల అభివృద్ధి పనులను నిలిపివేశారు. జంగిల్లో పని పెడుతున్నారు. ప్రయాణ చార్జీలు, గడ్డపార సాన ఖర్చు ధరల కనుగుణంగా ఇవ్వడం లేదు. ప్రమాద బీమా ఉచిత వైద్యం, చనిపోతే ఎక్‌గ్రేషియా వంటివి అమలు కావడంలేదు. కుటుంబం మొత్తానికి ఒకే జాబ్‌కార్డు ఇవ్వడం వలన నలుగురు సభ్యులుంటే 25రోజులకు మించి పని దొరకటం లేదు. జాబ్‌కార్డులు విడగొట్టి ఇవ్వడం, కొత్తపేర్లు చేర్చడం లేదు. పే స్లిప్స్, బ్లూఫామ్ ఇవ్వడం లేదు. నిరుద్యోగభృతి కల్పన మాటే లేదు. కరువు ప్రాంతాలను గుర్తించి అదనపు పని దినాల కల్పన లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. వారం వారం చేసిన పనికి పేమెంట్ ఇవ్వాలని ఉన్నా ఎక్కడా అమలు కావడంలేదు. దీని వలన కూలీలు పనికి దూరమవుతున్నారు. ఉపాధికి ఉరేస్తున్న ఈ పాలన ఇంకెన్నాళ్లు...?
- బి. ప్రసాద్
సెల్: 9490098901