Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిణామ దృక్పథం పురాతనమైంది. గ్రీకు తత్వవేత్త అనాక్జిమాండర్ నిర్జీవ పదార్థం నుండి జీవం పుట్టిందని, జంతువు నుండి మనిషి పరిణమించాడని ప్రతిపాదించారు. ప్రాణుల పరస్పర సంబంధం, పూర్వీక పారంపర్యం ఆమోదించబడ్డాయి. ఆంగ్లేయ ప్రకృతి, భూగర్భ జీవ శాస్త్రాల పండితుడు చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882) ఈ సూత్రాన్ని విస్తృతపరిచారు. నిర్జీవం నుండి జీవం వృద్ధిచెందిం దని, సహజసిద్దంగా ఆదిమ జీవి నుండి నేటి సంతతి రూపాంతరం చెందిందని సిద్ధాంతీకరించారు. పూర్వ ప్రాణుల నుండి సహజంగా కాలానుగుణంగా అతి సంక్లిష్ట జీవులు పరిణామం చెందాయి. ప్రాణుల యాదృచ్చిక జన్యు పరివర్తనల్లో ప్రయోజన పరివర్తనలే సహజ ఎన్నికతో నిలిచిపోయి, తర్వాతి తరాలకు సంక్రమించాయి. ప్రయోజన పరివర్తనలన్నీ పోగుపడి మొదటి ప్రాణికి భిన్నమైన వైవిధ్యత గల కొత్త జీవులు అవతరించాయి.
డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం వందల కోట్ల ఏండ్ల క్రితమే జీవం ఉద్భవించింది. ఈ పరిణామం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. మనిషితో సహా సమస్త జీవరాశి దైవసృష్టి అని మతాలు ఉటంకించాయి. డార్విన్ సిద్ధాంతం దీన్ని తిరస్కరించింది. ప్రపంచ భూత, భవిష్యత్, వర్తమానాలను నిర్వచించింది. వేల కోట్ల ఏండ్ల క్రితమే ఉద్భవించిన ప్రకృతిని, జీవాన్ని కొన్ని వేల ఏండ్ల క్రితం మానవుడు కల్పించిన దేవుడు ఎలా సృష్టించాడని ప్రశ్నించింది. సృష్టి భావన, ఊహాగాథల మత బోధనలను, ప్రచారాలను చావు దెబ్బకొట్టింది. అందుకే మతతాత్వికులు, మతసిద్ధాంతకర్తలు డార్విన్పై ఆయన సిద్ధాంతంపై దాడులు చేశారు. నిరూపణల నేపథ్యంలో కాలక్రమేణా ఇంగ్లండ్ చర్చ్ ఎవరి ప్రమేయమూ లేకుండానే డార్విన్ సిద్ధాంతాన్ని ఆమోదించింది. అమెరికా టెన్నెసీ రాష్ట్రంలో డార్విన్ విమర్శకులు కోర్టుకెళ్ళారు. మత తాత్విక చరిత్రను మింగే డార్విన్ ప్రభావం నుండి విద్యార్థులను రక్షించాలని వీరి వాదన. పరిణామ సిద్ధాంతాన్ని కోర్టు తిరస్కరించలేదు. అలాగని సృష్టి సూత్ర ప్రచారం ఆపమనలేదు. ప్రపంచవ్యాపితంగా మతవాద పాలకుల డార్విన్ వ్యతిరేకత పెరిగింది. రుజువులున్నా మత తీవ్రవాదం శాస్త్రవిజ్ఞాన సిద్ధాంత రూపకల్పనలను మింగజూస్తున్నది. ఉన్నత పాఠశాల సిలబస్ నుండి డార్విన్ సిద్ధాంత సూత్రాలను టర్కీ రద్దుచేసింది. జీవ, వైద్య విజ్ఞానశాస్త్రాలకు ఆధారమైన డార్విన్ సిద్ధాంతాన్ని విరోధించడం విచారకరం. రెసెప్ తయ్యిబ్ ఎర్డోగాన్ అధ్యక్షతన టర్కీ లౌకికత్వానికి దూరమవుతోందని, పరిణామ సూత్రాలు తెలియని విద్యార్థులు విజ్ఞానశాస్త్రాలను అర్థంచేసుకోలేరని విద్యావేత్తలు హెచ్చరించారు. విద్యాలయాల నుంచి పాఠ్యాంశాల నుంచి సైన్సును తొలగించడమంటే జనజీవితం నుండి ఆలోచన ప్రక్రియను మాయం చేసినట్లే. ప్రజలను పశువులుగా మార్చినట్లే. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞానశాస్త్ర అవగాహన క్షీణిస్తాయి. విచక్షణ, ప్రశ్న, సృజనాత్మకత, జిజ్ఞాస, జ్ఞాన తపన లోపిస్తాయి. భౌతికవాదం నశించి భావవాదం పుంజుకుంటుంది. విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం నమ్మకాల మీద ఆధారపడదు. సిద్ధాంత తిరస్కరణకు, అబద్దీకరణకు, తారుమారుకు సాక్ష్యాధార వివరణ, వాదన, విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం, సూత్రబద్దత ఉండాలి.
మన ప్రథమ ప్రధాని నెహ్రూ ఆనకట్టలు ఆధునిక దేవాలయాలన్నారు. ఆనకట్టలు, కళాశాలలు, పరిశ్రమలు, శాస్త్రసాంకేతికతలను నమ్మారు. భారత్ కవల పాకిస్థాన్ మతాన్ని నమ్మింది. నాశనమైంది. స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాల తరబడి మన శాస్త్రజ్ఞులు చేసిన పరిణామ సిద్ధాంత అన్వయం వల్లనే అనేక పరిశోధనలు, ఆహార స్వయంసమృద్ధి, వైద్యశాస్త్రాభివృద్ధి, రోగనిరోధక టీకాలు సాధ్యమయ్యాయని హైదరాబాద్ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్స్ అధ్యక్షులు రామకృష్ణ రామస్వామి అన్నారు. భారత శాస్త్రజ్ఞులు అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. దేశాన్ని ప్రగతి బాటలో పయనింప జేస్తున్నారు.
పరిణామ సిద్ధాంతంతో సహా ఏ శాస్త్రీయ ఆవిష్కరణనూ తిరస్కరించలేమని ప్రఖ్యాత శాస్త్రవేత్త వై.ఎస్. రాజన్ అన్నారు. నేటి భారతంలో ఇది నిత్య సత్యం. ''జీవ సంబంధ డార్విన్ సిద్ధాంత వైభవాన్ని మూర్ఖ, అమాయక భద్రతా కవచరక్షణలో మగ్గుతున్నవారు అడ్డుకోలేరు. అవగాహనల పరంపరల్లో ఈ సిద్ధాంత నిత్యనూతనత అందుతూనే ఉంటుంది.'' ఆంగ్లేయ మానవ ప్రవర్తనా నీతిశాస్త్రవేత్త, పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, రచయిత క్లింటన్ రిచర్డ్ డాకిన్స్, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొంటూ వ్యాఖ్యానించారు.
విజ్ఞానశాస్త్రం ఆదిమ మానవున్ని ఆధునిక, అత్యాధునిక మానవునిగా మలిచింది, మార్చింది. ఇంకా అత్యంత ఆధునిక మానవునిగా మార్చబోతోంది. జ్ఞానం లేకున్నా ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. ఇంగిత జ్ఞానంతో పాటు మనం మంచి భావజాలాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఇటలీ మార్క్సిస్టు తత్వవేత్త, రాజకీయ పండితుడు ఆంటోనియొ గ్రాంసి బోధించారు.
- ఎస్. హనుమంతరెడ్డి
సెల్:9490204545