Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిజన రిజర్వేషన్ పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి బిల్లు వచ్చిందా అని పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్లమెంటులో ప్రశ్న అడిగారు. కేంద్రానికి ఎటువంటి బిల్లు రాలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. మరుసటి రోజు రాష్ట్ర ఆర్థిక, గిరిజన శాఖామంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ విలేకరుల సమావేశంలో రాష్ట్రం పంపిన బిల్లు అందినట్లు కేంద్ర హోంశాఖ, గిరిజన వ్యవహారాల శాఖలు ఇచ్చిన లేఖలను ఆధారాలతో సహా విడుదల చేశారు. దీనితో రెండు పార్టీల బండారం బట్టబయలు అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించి రాజకీయ లబ్దిపొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన హక్కు ద్వారా పెంచాల్సిన రిజర్వేషన్ ప్రక్రియను రాజకీయ క్రీడగా మారుస్తున్నాయి. గిరిజన సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
ముఖ్యమంత్రి వాగ్దానం.. ఎనిమిదేండ్ల మౌనం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంపు ఫైలుపై తొలి సంతకం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. రిజర్వేషన్ పెంచుకునేందుకు రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగ హక్కుపై సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎలా వాగ్దానం ఇవ్వగలిగారు. 2017లో అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. నాటి నుండి నేటి వరకు బిల్లును సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పోరాటం చేయలేదు. ఒక్కరోజు కూడా పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని గానీ, బిల్లు బాగోలేదని గానీ, మాకు సంబంధం లేదని గానీ చెప్పకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వైఖరి వల్ల గత ఎనిమిదేళ్ళకాలంలో గిరిజనులు విద్య, ఉద్యోగ, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తీవ్రంగా నష్టం పోయారు.
రాష్ట్ర ప్రభుత్వమే
జీఓ జారీ చేయవచ్చు కదా?
భారత రాజ్యాంగం ఆర్టికల్ 16 (4) ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15శాతం, గిరిజనులకు 6శాతం, బలహీన వర్గాలకు 29శాతం మొత్తర 50శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నది. ఇంతకు మించి పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం లేదని సుంప్రీంకోర్టు సీలింగ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు సీలింగును దాటి పెంచుకోవడానికి పార్లమెంటుకే అధికారం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనినొక సాకుగా చూపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడు తున్నాయి. మరి తమిళనాడు, మహారాష్ట్రలలో 50శాతానికి మించి పెంచుకోవడం ఎలా సాధ్యపడింది? ఆ రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై కేంద్రంతో పోరాడి మెడలు వంచి సుంప్రీంకోర్టులో సైతం కొట్టివేయడానికి వీలు లేకుండా పార్లమెంటులో చట్టసవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకున్నారు.
రాష్ట్రం పంపిన బిల్లుపై కేంద్రం వైఖరి ఏమిటి?
సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న నేపథ్యంలో మాకు పెంచుకునే అధికారం లేనందున కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలని 2017 మే 29న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లునుపంపింది. బిల్లు ఆమోదం పొందినప్పుడు ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగారు అసెంబ్లీలో శాసన సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రం పంపిన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నది, ఇందులో ముస్లిం మతంతో ముడిపడిన బిసి(ఇ) గ్రూపును కలిపి పంపారు అంటున్న కేంద్రం దీనిని మేము తిరస్కరిస్తున్నామని ఆనాడే ఎందుకు తిప్పి పంపలేదు. బిల్లు ఆమోదయోగ్యంగా లేనప్పుడు కేంద్ర హోంశాఖ బిల్లును పరిశీలించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు ఎందుకు పంపింది? బిల్లును పరిశీలించిన గిరిజన వ్యవహారాల శాఖ బిల్లులో ఉన్న ఇతర అంశాలు మాకు సంబంధం లేదు, గిరిజన రిజర్వేషన్ అంశం వరకు బిల్లును సపోర్టు చేస్తున్నామని ఎందుకు చెప్పిందో, 2011 జనాభా లెక్కల ప్రకారం తగ్గకుండా 9.08శాతానికి పెంచుకోవాలని చెప్పే అధికారం కేంద్ర హోం శాఖకు మాత్రమే ఉందని, వారే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఎందుకు చెప్పిందో కేంద్రం సమాధానం చెప్పాలి. ఈ బిల్లును 2017 డిసెంబర్ 18న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ (ఫైల్ నెం.42018/24/2017) కేంద్ర హోంశాఖకు పంపింది. రాష్ట్రం పంపిన బిల్లు ఏమైందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ 2022 ఫిబ్రవరి1న కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. వారు తిరిగి 2022 మార్చి 7న సమాధానం ఇస్తూ పంపిన (లెటర్ నెం.2295610/పిఎఫ్/2022) రాతపూర్వక వివరణలో ఇలా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిసి (ఇ) గ్రూపులో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు పెంచింది. ఈకేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు క్లియర్స్ ఇవ్వలేమని చెప్పింది. అంటే ఈ సమస్యను కేంద్రమే మరింత జఠిలం చేసింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుకు గిరిజన రిజర్వేషన్ల పెంపుకు ముడిపెట్టి మాట్లాడటం సరైందికాదు. వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్రం నుండి ఎటువంటి బిల్లు రాలేదని గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఎలా చెపుతారు? పార్లమెంటునే తప్పుదోవ పట్టించిన మంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి?
పరిష్కారమా.. రాజకీయామా?
రాష్ట్ర విభజనలో భాగంగా గిరిజన జనాభా నిష్పత్తిలో మార్పు వచ్చింది. 2011 లెక్కల ప్రకారం 6 నుండి 9శాతానికి పెరిగింది. 2021 జనాభా లెక్కలు తీస్తే 11 శాతానికి పెరిగింది. విభజన చట్టం కూడా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం పెంచుకోవచ్చని చెప్పింది. అయితే ఓవరాల్ రిజర్వేషన్ 50శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే జీఓకు భద్రత ఉంటుందా? ఇదే ఇప్పుడు అందరిలో అనుమానాలకు, అభద్రతకు కారణం. దీనిని నివృత్తి చేయాలంటే రాజ్యాంగ అమలుకు అధిపతిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం పెంచుకుంటే పెంచుకోండి, మేము అడ్డుపడమనే ధోరణి కాకుండా రాతపూర్వకమైన హామీఇవ్వాలి. న్యాయస్థానంలో నిలబడాలంటే ఇది తప్పని సరి. 2019 పార్లమెంటు ఎన్నికల ముందు రాజకీయ అవసరాలకోసం ఎవరూ అడగకుండానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన పేదల (ఇడబ్ల్యుఎస్)పేరుతో ఆగమేఘాలపై 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేశారు. పైగా ఇప్పుడున్న 50శాతం సామాజిక రిజర్వేషన్ల కోటాకు సంబంధం లేదని ఇది అదనంగా ఇస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. అగ్రవర్ణాల విషయంలో ఇంతటి సాహాసం చేసిన కేంద్రం దళితులు, గిరిజనుల విషయంలో ఎందుకు చేయడంలేదు. 1981 తరువాత అనేక రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి గణనీయంగా పెరిగింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లను పెంచడంలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకానికి తెరదించాలి. సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టాలి.
- ఆర్. శ్రీరాం నాయక్
సెల్ : 9440532410