Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూఢ నమ్మకాలనగానే చేతబళ్ళు, బాణామతి, క్షుద్ర పూజలు, ఆ పేరుతో జరుగుతున్న దారుణ హింసలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఆ అంశాన్ని ప్రస్తావించే ముందు, గొప్ప గొప్ప మేధావులనబడే వారిలో వున్న మూఢభక్తి, మూఢ విశ్వాసాలను గురించి కొంత తెలుసుకోవటం అవసరం. ఎవరి సంగతేమోగాని, కొంత మంది ప్రముఖ డాక్టర్లలో కూడా మూఢ భక్తి వుండటం ఆశ్చర్యాన్ని, ఒకింత ఆందోళనను కలిగిస్తుంది. ఒక టెలివిజన్ లైవ్‌షోలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్ వీక్షకుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. ''డాక్టరు గారూ! నా కిడ్నీ ఒకటి పూర్తిగా చెడిపోయింది. మందులతో నయంగాని పరిస్థితి ఏర్పడినందున, ఆపరేషన్ చేసి, ఆ కిడ్నీని తొలగించటమే ఏకైక మార్గమని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క కిడ్నీతో నా మిగిలిన జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడపగలనా?'' అన్నది ఓ వీక్షకుడి ప్రశ్న. అందుకు డాక్టరు గారు, ''ఒక కిడ్నీ లేకపోయినా ఇబ్బందేమీ లేదు. మిగిలిన ఒక్క కిడ్నీతో మీ జీవితాన్ని చాల సజావుగా గడపొచ్చు. అందుకనే దేవుడు మనకు రెండు కిడ్నీలిచ్చాడు''. అని సమాధానమిచ్చారు. ఆ సమాధానం విన్నవాళ్ళకు దేవుడు మనకు రెండు గుండెలెందుకియ్యలేదా? అనే సందేహం కలుగుతుంది. మన సందేహం ఎట్లా వున్నా, ''అత్యద్భుత నిర్మాణంతో, ఆశ్చర్యం కలిగించే అమరికలతో మన శరీరాన్ని ప్రకృతి ప్రసాదించిందని అని వుంటే, డాక్టరు వృత్తికి, ఆయన చదువుకి తగ్గట్టుగా వుండేది. ఇంత ఎబ్బెట్టుగా వుండేది కాదు. అమెరికాలో చాలా కాలం వైద్య వృత్తిలో వుండి గొప్ప పేరు, డబ్బు సంపాదించుకున్న ఒక డాక్టరు ఇండియా వచ్చి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు. ఆయన కృష్ణ భక్తుడే కాక ఒక స్వామీజీకి శిష్యుడు కూడ. అప్పుడప్పుడు ఆ స్వామిజీని తన హాస్పిటల్‌కు పిలిపించి, ప్రవచనాలిప్పించి, తన ఆసుపత్రిని పాక్షిక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చటం వైద్య విజ్ఞాన ప్రాభవాన్ని మసకబారుస్తుంది. కొంతమంది డాక్టర్లు హాస్పిటల్‌లోని వారి గదిలో తమ కుర్చీ పక్కన దేవుడి విగ్రహాన్నో, ఫోటోనో పెట్టుకుంటారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రవేశ ద్వారం దగ్గర దేవుడి మందిరాన్ని ఏర్పాటుచేసి పూజారిచేత నిత్య పూజాదికాలు నిర్వహింపజేయటం సర్వ సాధారణంగా కనబడుతున్నది. కొన్నిచోట్ల క్యాత్ ల్యాబ్‌లలోనే, దసరా నాడు ఆయుధ పూజ, దేవీపూజ జరిపించి, అందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు. కొంత మంది డాక్టర్లు నుదుట బొట్టును, చేతికి రంగు దారాన్ని ధరించి హాస్పిటల్‌కు వస్తుంటారు. ఇకముందు మెళ్ళో స్టెతస్కోప్‌తో పాటు, రుద్రాక్షమాలను కూడ చూస్తామేమో..! మరింత ఆశ్చర్యకరమైన విషయమేమంటే, పెద్ద పెద్ద విద్యార్హతలుండి, వృత్తిలో పేరు తెచ్చుకున్న వైద్యులు కూడా (కొద్ది మందే కావచ్చు) జ్యోతిషం చెప్పించుకోవటం...! ఊగిసలాట లుండటానికి డాక్టర్లు సాధారణ వ్యక్తులు కాదు. వైద్య శాస్త్రాన్ని ఔపోసన పట్టినవారు. పరిశోధనలు చేసి కొత్త విధానాలను ఆవిష్కరించేవారు. మృత్యు ముఖం దాకా వెళ్ళిన వారిని తమ శక్తియుక్తుల ద్వారా వెనక్కి తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తున్నవారు. ఇంత గొప్ప డాక్టర్లు క్లిష్ట పరిస్థితిలో వున్న రోగికి వైద్యం చేసి ''నేను చెయ్యాల్సింది చేశా. ఆ తర్వాత భగవంతుడి దయ'' అనే మాట చెప్పటం కూడా సబబు కాదు. ఒకవేళ ఆ రోగి పూర్తి ఆరోగ్యాన్ని పొందితే, అది దేవుడి దయ తోడు కావటం వల్లనే జరిగిందనుకోవాలా? ఏ పనీ దేవుడు చెయ్యడు. అట్లా అని అన్నీ మనుషులు కూడ చెయ్యలేరు. ఖచ్చితంగా కొన్ని పరిమితులుంటరు. ఈ అవగాహన అందరికీ వుండాలి. మేధావులు కల్పించాలి. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఖమ్మం జిల్లాలో, క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్టు వార్త వచ్చింది. అదే నిజమైతే, వైద్య విజ్ఞాన శాస్త్రానికి అవమానం కాదా?
అమ్మ ఎంత నిజమో, సైన్సు అంత నిజం
మన సైంటిస్టులు రాత్రింబవళ్ళు శ్రమించి, కొత్త వ్యాధులకు కొత్త మందులను, టీకాలను కనుగొంటున్నారు. ఉపగ్రాహాలను తయారుచేసి అంతరిక్షంలోకి పంపి ఎన్నో నూతన సిద్ధాంతాలను ఆవిష్కరించి మన దేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. అంతటి మేధావులు కూడ ఏదైనా ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు దాని నమూనాను తిరుమలకు తీసుకొని వచ్చి వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేయటమేమిటో అర్థం కాదు. నలభై, యాభై సంవత్సరాల క్రితం సూరి భగవవంతం అనే ప్రముఖ సైంటిస్టు సత్యసాయిబాబాకు ప్రియ శిష్యుడై ఆయనను భగవంతుని అవతారంగా ప్రచారం చేసి వివాదాస్పదుడైనాడు. అప్పుడైనా, ఇప్పుడైనా అట్లాంటి వారు విజ్ఞానశాస్త్ర ప్రతిష్టను పలచన చేసేవారే కదా! ''నేను సైన్సును నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను'' అనటం గోడమీద పిల్లి వాటం తప్ప నిజాయితీ అనిపించుకోదు.
టన్నుల కొద్ది మూఢ విశ్వాసాలను వండి, వడ్డించే అత్యంత ప్రమాదకరమైన ప్రచార సాధనం టీవీ. ఒకటి, రెండు ఛానళ్ళు తప్ప దాదాపు అన్ని ఛానళ్ళు ఈ మహాత్కార్యాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నరు. కష్టాలందరికీ వస్తరు. మానసిక ధృఢత్వం లేనివారు ఏ కాస్త కష్టమొచ్చినా, తమకు గ్రహదోషాలు చుట్టు ముట్టాయని, ఏ క్షుద్ర దేవతో ఆవహించిందని భయపడి టీవీ మాంత్రికులకు ఫోన్లు చేస్తారు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి శని దోషముందనో, కుజ దోషముందనో చెప్పి వెంటనే శాంతి హౌమం చెయ్యాలనీ, అవసరమైతే తనే స్వయంగా బాధిత వ్యక్తి ఇంటికి వచ్చి, పకడ్బందీగా పూజలు చేసి గట్టెక్కిస్తానని ఆ మాంత్రికుడే హామీ ఇస్తాడు. వారితో లక్షలు ఖర్చు చేయిస్తాడు. అట్లా ఫోన్లు చేసే వాళ్ళందరూ దాదాపు చదువుకున్నవాళ్ళే. అట్లాంటి భయాలున్న వాళ్ళు మూడు విషయాల గురించి మూడు నిమిషాలు ఆలోచించాలి. 1. ఈ ప్రపంచంలో ఒకే సమయంలో, అనేక మతాల వాళ్ళు కొన్ని లక్షల మంది పుడతారు. వాళ్ళందరి జీవన స్థితిగతులు ఒకేలాగా ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. 2. మన తల రాతను బట్టే మన జీవితాలుంటాయని నమ్ముతారు కదా! ఈ సిద్ధాంతులు, పండితులు బ్రహ్మ రాతను మారుస్తారా? 3. ఒకే వ్యక్తి, ఒకే సమస్యను నలుగురు సిద్ధాంతులకు విడివిడిగా చెప్పారనుకోండి, ఆ నలుగురూ ఒకే రకమైన పరిష్కారం చెబుతారా? చెప్పరు. ఎందుకని? అది శాస్త్రీయం కాదు గాబట్టి. టీవీలలో జనాన్ని, ముఖ్యంగా మహిళలను దుర్మార్గంగా హింసించేవి తెలుగు సీరియళ్ళు. వాటి నిండా క్షుద్ర పూజలు, కుట్రలు, కుతంత్రాలు, లేడీ విలన్లు, మోసాలు. ఇవన్నీ వీక్షకులను మానసిక అలజడికి గురిచేస్తాయి. అప్పుడు మళ్ళీ టీవీ మాంత్రికుల దగ్గరకో ఇతర సిద్ధాంతుల దగ్గరకో పరిగెత్తి శాంతి పూజలు చేయటం... ఇదంతా ఏమిటి చెప్పండి? కొని తెచ్చుకున్న అనర్ధాలు కావా? ఇంకొక టీవీ సిద్ధాంతి ఏం చెబుతాడంటే, మన పేరులో అక్షరాలను మార్చుకుంటే, మన జీవితాలు శోభాయమానంగా వెలిగిపోతాయట. ఎంత విడ్డూరమో చూడండి! ఇంకొక అసంబద్ధమైన కార్యక్రమం వాస్తు. ఏ ఇద్దరు వాస్తు పండితులు ఒక్క మాట మీద ఉండరు. ఒకరు కట్టించిన ఇంటిని వాస్తు విరుద్ధమనే పేరుతో మరొకరు కూల్చి వేయిస్తారు. వాస్తనేది శాస్త్రీయమైతే హిందువులకి, మహ్మదీయులకి, క్రైస్తవులకు ఒకే విధంగా ఉండాలి కదా! అట్లా ఎందుకు ఉండటం లేదు? గాలి, వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఇల్లు కట్టుకోవటం ముఖ్యం. చాదస్తాలకు పోకూడదు. పక్కా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకున్నవారు, సరిగ్గా గృహ ప్రవేశంనాడే, యజమానో, యజమానురాలో, లేక ఇద్దరూనో ప్రమాదవశాత్తు మరణించిన ఘటనలెన్ని లేవు? అప్పుడు ఎవరిని నిందించాలి? ఇక చాత బళ్ళు, బాణామతి గురించి ఎక్కువగా చర్చించ నవసరం లేదు. తనకు గిట్టని వాడు ఎంత దూరం లో ఉన్నా మంత్ర శక్తితో చంపటమనేది అతి పెద్ద అబద్ధం. అదే నిజమైతే శత్రువు ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా మంత్ర శక్తితో ఇక్కడ నుంచే మట్టుబెట్టవచ్చు. తుపాకులు, కత్తులు, కేసులు, జైలు శిక్షలు ఏమీ వుండవు కదా. కానీ అది జరిగే పనేనా?
వాస్తవంగా వీటన్నిటినీ ప్రభుత్వాలే నిషేధించాలి. కానీ, అవి ఆ పని చెయ్యవ్. ప్రజలెప్పుడూ అజ్ఞానంలో మూఢ విశ్వాసాల మత్తులో మునిగి ఉంటేనే పాలకవర్గాల దోపిడీలు సజావుగా సాగుతుంటరు. అందువల్ల ప్రజలే మేల్కొనాలి. తార్కిక జ్ఞానాన్ని అలవరచుకోవాలి. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంది.
సెల్: 9246901149
కె. శ్రీనివాసులు