Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా కాలం నుండీ శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయి ఉంది. అయితే సకాలంలో తగు చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా గొటబాయ రాజపక్స ప్రభుత్వం వ్యవహరించింది. ఆర్నెల్ల క్రితం అప్పుడే మేలుకున్నట్టు హడావుడిగా విదేశీ దిగుమతులపై ఆంక్షలు ప్రకటించింది. తన వద్దనున్న విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం దీనికి కారణం. అయితే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల పర్యవసానాలు ఎంత వినాశకరంగా పరిణమిస్తాయో, ప్రజలు ఎటువంటి కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుందో ఆ ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనలను అత్యంత నిరంకుశంగా అణచివేయడానికి పూనుకుంది. అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
ఒకవైపు సంపన్నులపై విధించిన పన్నులను బాగా తగ్గించినందువలన ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇంకోవైపు చర్చిల్లో వివిధ ప్రాంతాల్లో 2019లో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించాక పర్యాటకులు బాగా తగ్గిపోయారు. శ్రీలంకకు వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా దానితో పడిపోయింది. పులి మీద పుట్రలా కోవిడ్ వచ్చిపడింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇవి తక్షణ కారణాలు. ఆ దేశానికి కావలసిన ఇంధన అవసరాలన్నీ దిగుమతుల ద్వారా మాత్రమే తీరతాయి. అంతే కాక ఎరువులు, ఆహారధాన్యాలు. పప్పులు, ఖాద్యతైలాలు వంటివి కూడా దిగుమతుల ద్వారానే ఆ దేశం పొందుతుంది. ఎప్పుడైతే ఆ దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయిందో ఒక్కసారి ఆ దేశ జన జీవనం ఛిన్నాభిన్నం అయిపోయింది.
పెట్రోలు, గ్యాస్ తగినంతలేవు కనుక పని ప్రదేశాలకు ప్రయాణించడం అసాధ్యం అయిపోయింది. ఇంధనం లేనందున విద్యుత్తు కొరత తీవ్రం అయింది. రోజుకు 13గంటల విద్యుత్తు కోత అమలవుతోంది. వంట గ్యాస్ కొరత వలన ఇళ్ళలో వంటలు వండుకోవడం సాధ్యం కావడం లేదు.
ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది.
''ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్ కట్ ఉంది కదా'' ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ''ఏరోజు వంట ఆరోజే వండుకోవచ్చునని అనుకోలేకుండా ఉన్నాం. గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్ కట్ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు'' అని వాపోయారు. ''ఇంట్లో డబ్బు పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకుందామంటే ఈ అల్లకల్లోలంలో దానిని ఎవరు లాక్కుని పోతారో అన్న భయం ఉంది. పోనీ ఎప్పటికప్పుడు బ్యాంక్ ఎటిఎం నుంచి తీసుకుందామంటే పవర్ కట్‌తో ఆ ఎటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో తెలియకుండా ఉంది'' అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు గోల పెడుతున్నాడు.
శ్రీలంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు బాగా పాపులర్. కాని ఇప్పుడు పవర్ కట్ కారణంగా ఆ సెంటర్లలోని ఓవెన్లు, హీటర్లు పని చేయడం లేదు. మరీ పెద్ద సెంటర్లలోనైతే జనరేటర్లు ఉన్నాయి. కాని వాటికి సరిపడా చమురు లభించడం లేదు. ఇక చిన్న సెంటర్లయితే ఎప్పుడు నడపాలో, ఎప్పుడు మూసేయాలో తెలియని స్థితి ఉంది.
''పోర్టులో మా కంపెనీ ఆర్డరు చేసిన మెటీరియల్ దిగింది. అక్కడే ఉంటే ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది అని ఆ సరుకుని మా గోడౌన్‌లోకి తెచ్చి దింపాం. కాని ఇక్కడి నుంచి మా వర్క్ సైట్‌కి దీనిని రవాణా చేయడానికి డీజిల్ దొరకడం లేదు. మా పని అంతా ఆగిపోయింది'' ఓ బడా కంపెనీ ఎగ్జిక్యూటివ్ బాధ ఇది.
''మా పౌల్ట్రీ లోని కోళ్ళు పూర్తిగా పెరిగిపోయాయి. వాటిని కోసి అమ్మేయకుండా ఉంచి మేపాలంటే తడిసి మోపెడవుతోంది. పవర్ కట్ వలన ఫ్రీజర్లు పని చేయడం లేదు. అందుకే అన్నింటినీ చంపి పూడ్చిపెట్టేశాం'' అన్నాడో కోళ్ళఫారం యజమాని. ఇంకోవైపు మార్కెట్లో కోడిమాంసం ధర మాత్రం ఒక్క నెలలోనే రెట్టింపు అయిపోయింది. శ్రీలంకలో మత్స్యకారుల సంఖ్య చాలా ఎక్కువ. కాని వాళ్ళు చేపల వేటకు పోవాలంటే బోట్లు నడవడానికి డీజిల్ గాని, కిరోసిన్ గాని కావాలి. అవి దొరకడం లేదు. ఒకవేళ అతి కష్టం మీద సంపాదించి చేపలు పట్టి తెచ్చినా, వాటిని అమ్మడానికి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. దానికి రవాణా లేదు. అందుచేత చాలామంది మత్స్యకారులు చేపల వేట మానుకున్నారు. దీంతో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఏ పనీ లేకపోయినా సెల్‌ఫోన్ పట్టుకుని కాలక్షేపం చేసేయవచ్చుననుకునేవారి పరిస్థితి ఏమాత్రం బాగులేదు. 13 గంటల పవర్ కట్ వలన ఆ సెల్ ఫోన్లు, సెల్ టవర్లు పని చేయడం లేదు. టీవీల్లో దూరి సమయం గడిపేయ వచ్చుననుకునేవారి పరిస్థితి అలాగే ఉంది. ''మాకు రాజకీయాలు అనవసరం. దేశం ఏమవుతోందో నాకెందుకు? నా పరిస్థితి బ్రహ్మాండంగా సాగిపోతోంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ చల్లగా ఉంటే చాలు'' అనుకునే మధ్యతరగతి ప్రబుద్ధులంతా ఇప్పుడు అందరికన్నా ముందు రోడ్ల మీదకి వస్తున్నారు. అధ్యక్షుడి ఇంటి ఎదురుగా వేలాదిమంది నిరసన తెలపడానికి నిలబడితే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారు. వారిలో ఓ 50మంది మీద కేసులు పెట్టి కోర్టుకి తెచ్చారు. ఆ 50 మంది కోసం వాదించడానికి 300 మంది లాయర్లు తయారైపోయారు.
అయినా గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరుచుకున్నట్టు లేదు. ''ఇదంతా కొంతమంది అరాచక మూకలు విదేశీ శక్తుల ప్రోద్బలంలో సాగిస్తున్న కుట్ర. దేశంలో అరబ్ వసంతం తీసుకొద్దాం అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు'' అంటూ అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి ప్రకటించాడు. కాని ఈ ప్రభుత్వాన్ని శ్రీలంకలో ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలు ఎంత విసిగిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయం గురించీ ఆలోచించడమే లేదు. ఈ గొటబాయ రాజపక్స కుటుంబం. ఈ ప్రభుత్వం దిగిపోతే చాలునని వాళ్ళు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలు అక్కడ ప్రతిపక్షాలనూ నమ్మడం లేదు. ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగించడం వలన ఏ ప్రయోజనమూ ఉండదని వారు భావిస్తున్నారు. ''ఒక చేతకాని ప్రభుత్వం బదులు మరో చేతకాని ప్రభుత్వం వస్తే ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. ఆ దేశానికి సహాయం కోసం భారత ప్రభుత్వం పంపుతున్న వస్తువులను అక్కడి ప్రభుత్వ అధికారులకు అప్పగించడం బదులు భారత ప్రభుత్వమే నేరుగా మాకు అందించడం మంచిది అని ఆ ప్రజలు అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో బాటు శ్రీలంక సైన్యం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది. అయితే ఒకవేళ ఈ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పలే మంటున్నారు రాజకీయ పరిశీలకులు.
గతంలో తమిళుల ఉద్యమానికి భారత దేశం అండదండలివ్వడం వలన శ్రీలంకలో సింహళీయులలో ఎక్కువ మంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం నుండి వచ్చి శ్రీలంకలో భూముల్ని, ఆస్తుల్ని చౌకగా కొనేసి పెత్తనం చేస్తారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలు వేటితోనూ సత్సంబంధాలను నెలకొల్పుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ రకమైన అపనమ్మకాలు కలగడానికి దోహదం చేసింది.
అయితే చైనా గురించి వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ''చైనాని ఎందుకు నిందించాలి? ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులకి మా ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ హైవేని చైనాయే నిర్మించింది. కొలంబోలోకి ప్రవేశించే దగ్గర బ్రహ్మాండమైన జంక్షన్ (ఇంటర్‌ఛేంజ్) నిర్మించింది కూడా చైనా వారే. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన లోటస్ టవర్ కూడా వాళ్ళు నిర్మించినదే. నగరంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నింటినో వాళ్ళు కట్టారు'' అని చైనా గురించి అనుకూలంగానే అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. 2009 వరకూ శ్రీలంకలో తమిళ ఉద్యమమే అన్ని ఇబ్బందులకూ కారణమని పాలకులు సాకు చూపించుకున్నారు. ఆ తర్వాత కూడా కొంతకాలం అదే సాకుని చూపారు. 2019లో చర్చిల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఇప్పుడు ముస్లింల నుండి ప్రమాదం అని చెపుతున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో పాలకులు ఎన్ని సాకులు చెప్పినా, ఎవరిమీద నెపం మోపాలని చూసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. నిరంకుశంగా అణచివేయాలననుకుంటున్న రాజపక్స ప్రభుత్వానికి... రాజపక్స కుటుంబమూ, ఆ ప్రభుత్వం మాత్రమే సంక్షోభానికి కారణం అంటున్న ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
(పాత్రికేయుడు ఆర్.కె.రాధాకష్ణన్ ఇటీవల
శ్రీలంక పర్యటించిన ప్రత్యక్ష కథనం ఆధారంగా)
ఆర్.కె. రాధాకృష్ణన్