Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది'' అంటారు ప్రముఖ విద్యావేత్త డిఎస్ కొఠారి. స్వాతంత్రానంతరం 70వ దశకంలో విద్యా రంగానికి దిశా నిర్దేశం చేయడం కోసం మొట్టమొదటగా నియమించబడిన కమిషన్‌కి నాయకత్వం వహించారు ఆయన. విద్యారంగం అభివృద్ధి కోసం కొఠారి కమిషన్ చేసిన సూచనలు ఆదర్శప్రాయమైనవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదులు నాణ్యమైన విద్యను అందించాలంటే.. ప్రభుత్వాలు తమ బడ్జెట్లో సరైన నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు వారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం తన జీడీపీలో 10శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని విలువైన సిఫారసు చేసారు. అయితే ఆనాటి నుండి నేటి వరకు కూడా నిధుల కేటాయింపులో వివక్ష కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తన జీడీపీలో 3శాతానికి అటూ ఇటూ గా మాత్రమే నిధులు కేటాయిస్తూ కొఠారి కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేస్తూనే ఉంది. 10శాతానికి మించి విద్యారంగానికి కేటాయింపులు చేస్తున్న రాష్ట్రాలను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఈ గణాంకాలు విద్యా రంగం పట్ల మన పాలకుల చిన్న చూపుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అయితే... ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు విద్యా రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పుల దిశగా సాగుతుండడం శుభపరిణామం. కేరళ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా తన వార్షిక బడ్జెట్లో ఇంచుమించుగా 15శాతం వరకు నిధులు విద్యా రంగానికి కేటాయిస్తూ.. ప్రభుత్వ విద్యా రంగం పట్ల తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ వస్తోంది. కోవిడ్ కాలంలో పాఠశాలలు మూతబడి, విద్యా వ్యవస్థ అతలాకుతలమైన తరుణంలో కూడా పాఠశాలలకై ఆధునాతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి సైతం ఆన్లైన్ విద్య అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు పిల్లల చదువుల పట్ల ఆ ప్రభుత్వ దార్శనికతను తెలియ జేస్తోంది. ఇదే దారిలో పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి పరిచి, విద్యార్థులందరికీ ఉచితమైన, సమానమైన విద్యను అందించే లక్ష్యంతో వినూత్నమైనా మార్పులు తీసుకువచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. కలెక్టర్ పిల్లలైనా, కూలీల సంతానమైన ఒకే చోట చదివేలా తమ పాఠశాలలను తీర్చిదిద్దామని సగర్వంగా ప్రకటించుకున్నారు వారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యారంగం దశ మారుతుందని భావించింది మేధావి వర్గం. కానీ అందుకు భిన్నంగా గత ఏడు సంవత్సరాలుగా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలలేమితో బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది. అయితే కోవిడ్ రెండవ వేవ్ అనంతరం విద్యార్థుల సంరక్షణ పట్ల, చదువుల పట్ల చిత్తశుద్ధిని, తెగువను చూపి పేద విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగింది. క్రమంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటించేలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం, నూతనంగా చేరిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి బడుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ఆవశ్యకమైనది. ఈ అంశాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి పేరుతో బడులను బాగుపర్చడం కోసం ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషదాయకం.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ఆహ్వానించదగినదే అయినప్పటికీ కార్యక్రమ మార్గదర్శకాలలో కొన్ని లోపాలున్నాయి. కేవలం శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో మాత్రమే నూతన భవనాలు మంజూరు చేసే అవకాశం ఉండటం వల్ల చాలా పాఠశాలలకు నూతన భవనాలు మంజూరయ్యే అవకాశం లేకుండాపోతున్నది. సొంత భవనాలు లేని, అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించడానికి మార్గదర్శకాలు ఒప్పుకోవడంలేదని అధికారులు వాపోతున్నారు. ఇక నూతన భవనాల కేటాయింపునకు గత విద్యా సంవత్సరపు డైస్ గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం మరో తప్పిదం అవుతుంది. అలాగే మొదటి విడతలో ఎంపికచేసిన పాఠశాలల్లో అధిక భాగం పాఠశాలలు ఉపయోగ యోగ్యంలేని తరగతి గదులను కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు నూతన భవనాల నిర్మాణం చేపట్టకుండా వాటికే మరమ్మతులు చేయడం అంటే ఈ కార్యక్రమం పాఠశాలల 'పాత భవనాలకు పూత పూసే' తంతుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇక రెండవ, మూడవ విడతల్లో ఎంపిక చేయబోయే పాఠశాలల్లో కేవలం ఒకటి, రెండు తరగతి గదులు మాత్రమే కలిగిన పాఠశాలలు అధికంగా ఉంటాయి. మరి ఈ పాఠశాలలకు నూతన భవనాల కేటాయింపుకు అవకాశం ఉండకపోవడం వల్ల ఆ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన అంతంత మాత్రమే అవుతుంది. ఇక పాఠశాలల్లో విద్యుదీకరణ కోసం అవసరమయ్యే సామాగ్రి, ఫర్నిచర్ కొనుగోలు, పెయింటింగ్, గ్రీన్ బోర్డులు, డిజిటల్ సౌకర్యాలకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు అన్నీ కూడా కాంట్రాక్టు విధానం ద్వారా సమకూర్చడం అంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లేనని మన గత అనుభవం తెలియజేస్తున్నది.
ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమం వల్ల ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన సంపూర్ణంగా జరగాలి. కాంట్రాక్టు ద్వారా పాఠశాలలకు సరఫరా చేసే వస్తువులు, కొనుగోలు చేసే సరుకుల నాణ్యతను పాఠశాల యాజమాన్యం ధృవీకరించిన తరువాతనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అధునాతనమైన సౌకర్యాలు కలిగిన తరగతి గదుల నిర్మాణం చేపట్టి, ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం సమకూర్చాలి. పరిశుభ్రమైన పరిసరాలతో, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడేలా సదుపాయాలు కల్పించి బడుల సడుల్లో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారి, మన ఊరిలోని పిల్లలందరినీ మన బడిలోనే చేర్పిద్దామనే నిర్ణయానికి వచ్చేలా పాఠశాలలు వారిని ఆకర్షించాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తోపాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఉపాధ్యాయ నియామకాలు వెంటనే చేపట్టాలి. ప్రతీ సంవత్సరం వార్షిక బడ్జెట్లో తగిన నిధులు కేటాయిస్తూ.. విద్యారంగమే తమ మొదటి ప్రాధాన్యతా అంశమని ప్రభుత్వం తన చేతల ద్వారా ప్రకటించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా విద్యావిధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ''జ్ఞానతెలంగాణ'' నిర్మాణదిశగా అడుగులు పడాలి.
- వరగంటి అశోక్
సెల్: 9493001171