Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధ్వీ రితంబర... పేరులో ఉన్నట్లు మనసును, శరీరాన్ని, ఆలోచనలను తాను నమ్మిన దైవసేకు అంకితం చేసిన వ్యక్తి అనుకుంటే పొరపాటుపడతాము. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ దుర్గా వాహిని వ్యవస్థాపక నాయకురాలు. పండగలు, పబ్బాలు, ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంగా పూజలు పునస్కారాలకు పరిమితమైన సంస్థ కాదు దుర్గా వాహిని. సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు వ్యవస్థాపక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటానికి కంకణం కట్టుకున్న సంస్థ. పేరుకే మహిళాలోకం. ఆచరణంతా మార్మిక రాజకీయం. ధార్మిక రాజకీయం. ఈ ధార్మిక రాజకీయాలకు కేంద్రం సంఫ్‌ుపరివారం అని సామాజిక రాజకీయ శాస్త్రవేత్తలు పిలిచే ఓ సంఘటనాత్మక నిర్మాణం. ఈ నిర్మాణాన్ని నడిపించేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు. ఆరెస్సెస్‌కు తనకంటూ ఓ లక్ష్యం ఉంది. దాన్ని సాధించేందుకు అవసరమైన సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని అమలు చేయటానికి కావల్సిన కార్యాచరణ ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో పావులుగా మారటానికి సిద్ధంగా ఉన్న కోట్లమంది సభ్యులున్నారు.
ఆరెస్సెస్ సిద్ధాంతం భారతదేశాన్ని హిందూ మతోన్మాద దేశంగా మార్చటం. దీన్ని సాధించటం కోసం ఓ బూచిని చూపించాలి. ఆ బూచి ముస్లింలు. 1991 తర్వాత పశ్చిమాసియా కేంద్రంగా పెచ్చరిల్లిన ఉగ్రవాదం కూడా ముస్లిం వ్యతిరేకతను సార్వత్రికం చేయటంలో కీలక పాత్ర పోషించింది. అమెరికా నుండి మన దేశానికి ప్రపంచీకరణ విధానాలతో పాటు ముస్లిం వ్యతిరేకత కూడా వలస వచ్చింది. దానికి తోడు దేశీయంగా ఉన్న మతోన్మాద శక్తులు ఉండనే ఉన్నాయి.
ఈ మతోన్మాద శక్తుల వాదన ఒకటే. దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతోంది. ముస్లిం సాంప్రదాయంలో ఎంతమంది భార్యలనైనా కలిగి ఉండొచ్చు అన్నది వాదన. నిజంగా స్వాతంత్య్రా నంతరం దేశంలో ముస్లిం కుటుంబాల సంతానోత్పత్తి హిందూ కుటుంబాల్లో సంతానోత్పత్తి కంటే ఎక్కువగా ఉందా? దేశంలో వందకోట్లకు పైగా ఉన్న హిందూ జనాభాను అధిగమించి ముస్లిం జనాభా ఎక్కువ కావాలంటే ముస్లిం కుటుంబాల్లో సంతానోత్పత్తి ఏ స్థాయిలో ఉండాలి? అన్న మౌలిక ప్రశ్నలు కూడా వేసుకోవాలన్న ఇంగితం మరిచి వాదనలు ముందుకు తెస్తున్నారు.
ఆరెస్సెస్ ఏర్పాటు అయినప్పటి నుంచీ ఈ నినాదం ఇస్తూనే ఉన్నారు. అధిక సంఖ్యాకులైన హిందూ జనాభాలో అల్పసంఖ్యాకుల కుండే న్యూనతా భావం ఉన్నట్లుగా కల్పించి, అటువంటి భావననుండి హిందూ జనాభాను విముక్తి చేయటానికి, వారికి కావల్సిన రక్షణలు కల్పించటానికని ఆరెస్సెస్, సంఫ్ుపరివారంలోని వివిధ విభాగాలు పని చేస్తున్నాయి. ముస్లిం వ్యతిరేకత పెంపొందిం చటం ఈ చర్యలన్నింటిలోనూ అంతర్లీనంగా కొనసాగు తున్న అంశం. నాలుగైదేండ్ల వరకూ నేరుగా ఏకంగా ముస్లిం కుటుంబాల కంటే హిందూ కుటుంబాలు ఎక్కువమందిని కనాలన్న వాదన బాహాటంగా ప్రచారంలో పెట్టారు. కానీ ఈ కాలంలో నాజూకుతనం అబ్బిన సంఫ్‌ుపరివారం నగంగా ఉండే భావాలకు నగిషీలు అద్ది ప్రజల ముందుంచుతోంది. అందులో భాగమే తాజాగా సాధ్వి రితంబర ఇచ్చిన పిలుపు.
ప్రతి హిందూ మహిళ సగటున నలుగురు పిల్లలను కనాలని, ఇద్దరిని కుటుంబ అవసరాలకు మరో ఇద్దరిని ఆరెస్సెస్ విహెచ్పి అవసరాలకు కేటాయించాలన్నది ఆమె నినాదం. ఇదేదో కొత్తగా ఇప్పుడు రితంబర ఇచ్చిన నినాదం కాదు. గత దశాబ్దకాలంగా బీజేపీ అగ్రనేతలు అనుకున్న వాళ్లు సైతం ఇస్తున్న నినాదమే. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం జనాభా పెరుగుదల లేదా జననాల పెరుగుదల రేటు గత 75 ఏండ్లల్లో ఎలా ఉన్నాయన్న వాస్తవాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్య్రానంతరం దేశంలో మతాల పొందిక (మొత్తం జనాభాలో వివిధ మతస్తుల నిష్పత్తి) దాదాపుగా నిలకడగానే ఉంది. వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే మేధో మదన కేంద్రం ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అంశంపై విస్తృత పరిశోధన చేసింది. 1951 నుంచి పదేండ్లకొకసారి కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనను ఈ పరిశోధనకు ఆధారంగా స్వీకరించింది. ప్రత్యేకించి ఈ గణాంకాల్లో జననాల రేటు, వలసలు, మత మార్పిడులను ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ప్రధానంగా దేశంలో హిందూ జనాభా నిష్పత్తి తగ్గిందా అన్నది ఈ పరిశోధనలో కీలక లక్ష్యంగా ఉంది.
స్వాతంత్య్రం నాటికి ముస్లిం కుటుంబాల్లో జననాల రేటు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. కానీ గత రెండు దశాబ్దాల వివరాలు పరిశీలిస్తే అదే ముస్లిం కుటుంబాల్లో జననాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో పడిపోయిందన్నది కూడా వాస్తవం. 1992 నాటికి ముస్లిం కుటుంబాల్లో జననాల రేటు సగటున 4.4శాతంగా ఉంటే 2015 నాటికి 2.6శాతానికి పడిపోయింది. ఈ కాలంలో హిందూ కుటుంబాల్లో జననాల రేటు 3.3శాతం నుండి 2.1శాతానికి పడిపోయింది. ఈ పతనం రేటు తీవ్రత ముస్లిం కుటుంబాల్లోనే వేగంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
1951 - 1961 మధ్య కాలంలో ముస్లిం కుటుంబాల జననాల రేటు 32.1శాతంగా ఉంటే, 2001 నాటికి 24.1శాతానికి పడిపోయింది. 1951-2011 మధ్యకాలంలో సగటున ముస్లిం కుటుంబల్లో జననాల రేటు 4.4శాతం ఉంటే హిందూ కుటుంబాల్లో జననాల రేటు 4.3శాతం వృద్దిరేటుతో కొనసాగింది. ఈ ఎదుగుదల రేటుతో దేశ జనాభాలో ముస్లింలు 14.2శాతం ఉంటే హిందూ జనాభా 79.8శాతం ఉన్నారు. ఈ స్థాయిలో జననాల రేటు తగ్గుతుందనుకున్నా దేశం జనాభా విషయంలో ప్రపంచంలో రెండో అగ్రరాజ్యంగా మారింది.
ఈ పరిశోధనలో మరో ముఖ్యమైన అంశం వెల్లడైంది. తల్లితండ్రులు పిల్లలకు జన్మనిచ్చే సమయంలో మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వటం వలన 1970-2017 మధ్య కాలంలో సుమారు రెండు కోట్లకు పైగా భ్రూణహత్యలు జరిగాయని ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే మగపిల్లల పట్ల ముస్లింలు, క్రైస్తవుల కంటే హిందూ కుటుంబాల్లోనే ఆసక్తి ఎక్కువగా ఉందని కూడా ఈ నివేదిక తెలిపింది. అంటే ఆడ శిశువుల హత్యలు హందూ కుటుంబాల్లోనే ఎక్కువగా సాగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.
ఈ వాస్తవాల వెలుగులో సాధ్వి రితంబర పిలుపును పరిశీలిస్తే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని మహిళ లకు సంబంధించిన సమస్యలు ఇవి. రితంబర కోరుకున్నట్లు నలుగురు పిల్లలను కని ఇద్దరిని సంఫ్‌ుపరివారానికి దత్తత ఇవ్వాలంటే సహజంగానే వాళ్లు మగపిల్లలై ఉండాలి. దీని కోసం కొన్ని కోట్లమంది ఆడపిల్లలు భ్రూణ దశను కూడా దాటకుండానే కన్నుమూసే ప్రమాదం తలెత్తుతుంది. ఇక రెండో సమస్య. ఈ నలుగురిలో ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారనుకున్నా ఇప్పటి వరకూ పురుషులనే ప్రధానంగా ఆవహిస్తున్న మతోన్మాద మదగజం ఇక మీదట స్త్రీలను కూడా కబళింంచేందుకు కావల్సిన ఏర్పాట్లు చేయాలన్నది ఈ పిలుపు సందేశం. చివరిగా మూడో సమస్య. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వారిని పోషించటానికి కావల్సిన వనరులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల సమస్యలు ఉండనే ఉన్నాయి. 21వ దశాబ్దంలో ఆకాశంలో సగంగా ఉన్న మహిళా లోకానికి అవకాశాల్లో సగం వాటా కావాలన్న నినాదం రెపరెప లాడుతుంటే భారతదేశంలో మాత్రం మహిళలను పడగ్గదికి పరిమితం చేసి పిల్లలు కనే సాధనాలుగా మాత్రమే కాక భావితరం మతోన్మాదులను తయారు చేసే క్రతువులో భాగస్వాములను చేయాలన్నది పాలకపార్టీ భావజాలంగా ఉండటం అభ్యంతరకరం మాత్రమే కాదు. ఆందోళనకరం కూడా.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037