Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాదం, రాగం, లయ, మ్యూజిక్, ఫ్రీక్వెన్సీ, వేవ్‌లెన్త్ అన్నీ సైన్సే! ఇవన్నీ శరీరంలో ఎముకల లాంటివి. లోన ఉన్నవాటిని గమనించం. కండ, చర్మం చూసి అందం బేరీజు వేస్తాం. ఎలక్ట్రిక్ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్ సైన్స్ ప్రిన్సిపల్ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సువల్ల వచ్చిందే. మన వాళ్ళు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని... వారి మహాత్మ్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే పరవశించి పోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాతకథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహౌన్నతంగా చెప్పడమే గానీ మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం... మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బతీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు, తరతరాలకు ఆ జాడ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచనాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతిలోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా?
మన రోజువారీ సంభాషణల్లో 'అంతా దేవుడి దయ' - 'అంతా పైవాడు చూసుకుంటాడు' - 'ఈశ్వరాజ్ఞలేనిది చీమైనా కదలదు' - లాంటి మాటలు వింటూ ఉంటాం. ఏమీ తెలియని పసిపాపలకు 'జేజ కొడతాడు దండం పెట్టు' - 'జేజ తీసుకు పోయాడు' - 'దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది' లాంటి మాటలు ఆ పసితనంలోనే నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు / మరణిస్తాడు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు. చచ్చాడని గౌరవంగా చెప్పడం.. అంతే - జీవశాస్త్ర పరంగా ఏ చావైనా ఒకటే! ఇంతెందుకూ నాస్తిక, హేతువాద సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడిపేర్లే. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలు పెడుతూ, పెడుతూ ఉండగా వచ్చినవి. నా ఇంటిపేరులో కూడా దేవ శబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది కాదు. అంటే నిస్సహాయంగా మనం మనువాదుల కుట్రలో కూరుకుపోయాం. బయటపడే మార్గాలు వెతకాలి! ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా - అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక విషయం చూద్దాం. ఒక ఊళ్ళో ఒక చిన్న బళ్ళో ఒకటో తరగతిలో ఇరవైమంది పిల్లలున్నారనుకుందాం. అందులో కొందరు పదోతరగతి వరకైనా రాకుండానే మానేస్తారు. మరికొందరు పదో తరగతి పబ్లిక్ పరీక్ష పాస్ కాకుండా ఆగిపోతారు. ఇంకొందరు జూనియర్ కాలేజిలో, కొందరు డిగ్రీలో ఆగిపోతారు. అవన్నీ దాటి శాస్త్రవేత్తో, ఇంజనీరో, కంప్యూటర్ నిపుణుడో, డాక్టరో, ప్రొఫెసరో అయ్యేది అందులో ఏ ఇద్దరు ముగ్గురో ఉంటారు. ఇందులో పదోతరగతిలో కూడా ఉత్తీర్ణులు కానివారు ఆచారాల చాటున, పంచాంగాల చాటున, గుళ్ళ చాటున, దేవుళ్ళ చాటున దాక్కుని పొట్టపోసుకుంటున్నారనుకుందాం. వీళ్ళు సంప్రదాయం పేరుతో, విద్యా వంతుల్ని, జ్ఞానవంతుల్ని, సంస్కారుల్ని అందరినీ తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ లాంటి మాటలు చెప్పి భయపెడుతుంటారు. నిరూపణ లేని అనుభవాలు, అనుభూతులు, సెంటిమెంట్లు, దేవుడితో సెటిల్మెంట్లు చెపుతూ, పిట్టకథలతో జనాన్ని రంజింపజేస్తుంటారు. ఇవ్వాళ కాకపోయినా రేపు... జనం నిజం గ్రహిస్తారు. కారణాన్ని అన్వేషిస్తారు. తప్పదు - కొందరు తమ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞానుల మాటలకు విలువనిస్తుంటారు. తమ కన్నా ఆ పంతుళ్ళకు, ముల్లాలకు, పోప్‌లకు, మతాధిపతులకు ఏదో ఎక్కువ తెలుసుననుకుని వారిని అనుసరిస్తుంటారు. వారు చెప్పేవన్నీ మనిషి ఎప్పుడో ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న ఆచారాలు! మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అవి ఎంత వరకు అనుసరణీయం? అన్న ప్రశ్న వేసుకోరు. ఏదో గుడ్డిగా, తాతలు చేశారు, తండ్రుల చేశారు, మనమూ చేసేస్తే పోదా? అని అనుకుంటూ ఉంటారు. భయస్తులు, పిరికివాళ్ళు, తమ శక్తిని తాము తెలుసుకోలేని వాళ్ళు - తమ మెదడును తాము ఉపయోగించని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది.
ఈ పిచ్చి భ్రమల్ని అర్థం చేసుకున్నవాడు గనుక రచయిత మార్క్ ట్వెయిన్ ఇలా అన్నాడు.. ''జనాన్ని మోసం చేయడం సుళువు. కానీ, వారు మోసపోతున్నారని వారికి చెప్పి, మెప్పించడం కష్టం'' అని. ఆయనే మరోచోట మరో మాట ఇంకా గట్టిగా చెప్పాడు... 'నువ్వు పాపాత్ముడివి కావు! ఈ సృష్టిలో నువ్వొక అద్భుతమైన శక్తివి... ఎవడో కోన్‌కిస్కాగాడు నీకు వేరే విధంగా చెప్పితే నువ్వు అస్సలు నమ్మాల్సిన పనేలేదు'' అని.
మనిషికి రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుడు గనక ఉంటే, మనిషినైనా మనిషిగా చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయలేడూ అంటే... అలాంటి వాడు ఎవడూ లేడు గనక చేయలేడు. మనిషి, మనిషిగా కావాలంటే మనిషి మాత్రమే ప్రయత్నించాలి. దైవ విశ్వాసంతో సమాజంలో రోజూ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. దైవ విశ్వాస రహిత, మానవ నైతిక సమాజానికి రూపకల్పన చేసుకోవాలి. పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసంలో జనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. తమిళనాడు తిరుచ్చి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్ టీచర్ మేరి (75) 2021 అక్టోబర్ మొదటివారంలో మరణించారు. ఆమె కూతుళ్ళు జెసితా (43) జయంతి (40) మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఏడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండా వాళ్ళింటికి బంధువులు వచ్చారు. వారికి రిటైర్డ్ టీచర్ మరణించిన సమాచారం లేదు. తమ తల్లి పునర్జన్మ కోసం బైబిల్‌తో తాము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే, బంధువులు వచ్చి అంతరాయం కలిగించారంటూ ఆ కూతుళ్ళు బంధువుల్ని తరిమికొట్టారు. మృతదేహం పక్కన ప్రార్థనలు చేస్తున్నారని వాళ్ళు ఊళ్ళో వాళ్ళకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి, మృతదేహం స్వాధీనపరుచుకుని, కూతుళ్ళను వైద్య పరీక్షలకు పంపించారు. ఇలాంటి సంచలన సంఘటనలు మనం తరచూ టెలివిజన్ తెర మీద చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లా కదిరియా గ్రామంలో 2021 అక్టోబర్ మొదటివారంలో జరిగిన సంఘటన! కుల వివక్షతో ప్రాణాలు తీయడం ఈ రోజుల్లో ఎంతో సులభమైపోయింది. సోహాన్ రామ్ (31) పిండిమరలో గోధుమలు ఆడించి పిండి తీసుకుపోతుండగా లలిత్ కర్నాటక్ అనే అగ్రకులస్థుడు చూసి అడ్డగించాడు. అతను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. పిండిమర మలినమైందని ఆక్రోషిస్తూ, దళితుడైన సోహాన్‌ని అతని కులాన్ని తీవ్రంగా దూషించాడు. అనవసరంగా ఎందుకు దూషిస్తున్నారని సోహాన్ అడిగినందుకు - పిండిమర అందరూ ఉపయోగించేదేనని గుర్తుచేసినందుకు ఉక్రోషం పట్టలేని అగ్రకుల ఉపాధ్యాయుడు, కొడవలితో నరికి సోహాన్‌ను హత్య చేశాడు. హంతకుణ్ణి పోలీసులు జైలుకు పంపించారు. పిండిమర మలినం కావడం ఏమిటో? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వాడికే సరైన ఆలోచన లేకపోవడమేమిటో? మన పవిత్ర భారతావనిలో ఏదైనాసాధ్యమే! పరువు హత్యలు చూస్తూనే ఉన్నాం గాని, ఇంత నీచాతి నీచంగా జరిగిన పరువు హత్య ఇంతకు ముందు చూసి ఉండం. ఒక అమ్మాయి వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. అది జరిగి 18నెలలయిపోయింది. వారికి ఓ పాప ఉట్టింది. ఆ అమ్మాయి తండ్రి తన పరువు మంటగలిపిందని కూతురిపై పగ పెంచుకున్నాడు. కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. తన పదేళ్ళ కొడుకును పంపి ఎలాగో ఆ అమ్మాయిని నెలల పాపతో సహా రతీబాద్ అడవిలోకి రప్పించాడు. అక్కడ కూతుర్ని తండ్రే రేప్ చేసి చంపేశాడు. పక్కన పసిపాప ఏడుస్తుండగా.. కొద్ది దూరంలో బాలుడైన తన కొడుకు చూస్తుండగా ఆ తండ్రి అలా తన పరువును మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడన్న మాట! ఆ అడవి భోపాల్‌కు 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ సంఘటన 2021 నవంబర్ 5 రాత్రి అంటే దీపావళి మరునాడు జరిగింది. దోషి అయిన తండ్రి (55సంవత్సరాలు), సాక్షిగా నిలిచిన కొడుకు (బాలుడు) పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. కతోటియా ఫారెస్ట్ రేంజ్, సమస్పురాలో ఫారెస్ట్ గార్డ్ రాధేశ్యాం యధావిధిగా తన డ్యూటీ చేసుకుంటూ అడవిలో తిరుగుతున్నప్పుడు, రేప్‌కు గురైన అమ్మాయి శవాన్ని, పక్కన పసిపాప శవాన్ని కనుగొన్నాడు. ఫలితంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఆ శవాలు అక్కడ 10-12 రోజులుగా ఉన్నాయని గుర్తించారు. ఈ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా 'డాడ్ రేప్స్, కిల్స్ గర్ల్ ఫర్ మ్యారీయింగ్ అవుట్ సైడ్ కాస్ట్' శీర్షికతో ప్రముఖంగా ప్రచురించింది. ఒక వైపు సనాతన సంప్రదాయాల్ని మరోవైపును దేశభక్తిని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సరిగానే నిలుపుతున్నారన్న మాట! దేవుడనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకు ఎలా జరిపిస్తున్నాడూ?
ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచిన మన భారతదేశంలో అదేమీటో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇతర సమాజాలు ఇలాంటివి లేకుండా ఏమీ లేవు. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ ఏమన్నారో చూడండి...! ''మసీదులో ప్రార్థన చేస్తుండగా అఫ్ఘానిస్తాన్‌లో షియాలను సున్నీలు చంపుతారు. హజారా సమాజాన్ని తాలిబన్ చంపు తుంది. పాకిస్థాన్‌లో షియాల్ని, అహ్మదియాల్ని, క్రైస్తవుల్ని సున్నీలు చంపుతారు. ఏ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదో.. ఆ సమాజాలు కచ్చితంగా నాగరికం కాదు'' అని!
''నాకు ఈ రోజు అల్లాఉద్దీన్ అద్భుత దీపం దొరికింది'' అన్నాడు భర్త భార్యను ఉడికిస్తూ... ''ఓ డియర్ ఎంత మంచి మాట? మరి ఏమడిగావ్?'' అని అంది భార్య. ''ఏముందీ? నీ తెలివితేటలు పదింతలు పెంచుమని అడిగా!'' అన్నాడు భర్త. ''ఓ ధ్యాంక్యూ! డాళ్లింగ్!! నా గురించి నీకెంత శ్రద్దా?'' అంది భార్య. ''కాని యేం లాభం? సున్నాను ఎన్నింతలు చేస్తే మాత్రం ఏం ఫలితం? సున్నా - సున్నాయే కదా?'' అని చల్లాగా చెప్పాడు భర్త లోలోన తన తెలివికి తానే మురుస్తూ! ఇది జోకే అయినా, ఇందులో ఒక విషయం ఉంది. భార్యా భార్తల మధ్య సరదా మాటలు పక్కనపెట్టి, మనం మతాలు - దేవుడు విషయం ఆలోచిస్తే.. అదీ దాదాపు ఇలాగే ఉంటుంది. దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏంలాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడుకున్నా, ఎన్ని సంప్రదాయ నృత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమి విజేత, జీవశాస్త్రవేత్త.