Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పరిపాలన సజావుగా సాగాలంటే ప్రజలలో ఎప్పుడూ రాగద్వేషాల నిప్పు రాజేస్తూ ఉండాలి..'' అన్నది చాణక్యనీతి అంటారు. దీనిని వంట పట్టించుకున్న పాలకులు ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి భాషా, ప్రాంతీయత, మతం, జాతీయతా అంశాలను లైమ్‌లైట్‌లోకి తెస్తుంటారు. ప్రస్తుతం రిజర్వేషన్ల చుట్టూ చర్చ నడుస్తుంది. దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే తటస్థ వైఖరి తీసుకుని ఆలోచించాలి.
రిజర్వేషన్లపై ఎల్లప్పుడూ రాద్దాంతం జరుగుతూ ఉంటుంది. కొన్ని మీటింగుల్లో విద్యార్థులు నిరుద్యోగులు ఒకరిని ఒకరు దూశించుకోవడం గమనిస్తుంటాం. వ్యక్తిగత చర్చల్లోనూ రిజర్వేషన్లుపై జరిగే చర్చ తీవ్ర వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. నిజానికి దేశంలో రిజర్వేషన్ల ద్వారా లభించే ఉపాధి నామమాత్రమే. రోజు రోజుకూ ఆ సంఖ్య కూడా తగ్గిపోతూ ఉన్నది. అలాంటప్పుడు వాటిపై రాద్దాంతపు చర్చ నిరుపయోగం. కానీ దీనిని పాలకులే పెంచి పోషిస్తూ ఉంటారు. అందువల్ల రిజర్వేషన్లు పొందని వారి నుంచే కాకుండా వాటికి అర్హులైన వారి నుండి కూడా రిజర్వేషన్లపై పెదవి విరుపు మాటలు వినిపిస్తుంటాయి. ఇదంతా అవగాహన లోపం వల్ల, రాజకీయ ప్రేరేపితాల వల్ల జరుగుతుంది. సంఘటిత ఉపాధి కల్పనను పూర్తిగా స్తంభింప చేసిన పాలకులు దానిని విధ్యార్థిలూ నిరుద్యోగులూ ప్రశ్నించకుండా రిజర్వేషన్ల గొడవలకు ఆజ్యం పోస్తుంటారు.
మొత్తం జనాభాలో రిజర్వేషన్లకు అర్హత కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా అన్ని రాష్ట్రాలలో సగటున 90 శాతానికి పైగా ఉన్నది (తెలంగాణాలో 92.5శాతం). మొత్తం రిజర్వేషన్లు 50శాతం లోపే ఉండాలని సుప్రీం కోర్టు నిర్థారించింది. ప్రతి రాష్ట్రానికి సగటున మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అన్ని రాష్ట్రాలకు కలిపి దాదాపు 90లక్షల మంది దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నమాట. దీనికితోడు కేంద్ర సర్వీసులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పోస్టుల్, టెలికాం, రైల్వే, డిఫెన్స్ తదితర డిపార్ట్మెంట్లలో కలిపి మరో అరవై లక్షలు ఉన్నారనుకుందాం. వెరసి కోటిన్నర. అందులో 50శాతం రిజర్వేషన్లు అమలు జరిగినా 75లక్షల మంది రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా 75లక్షల మంది జనరల్ కేటగిరిలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్నది. పని చేయగలిగిన 100కోట్ల జనాభాలో రిజర్వేషన్లకు అర్హత కలిగిన ఉద్యోగాలు కోటిన్నర మాత్రమే. ఈ 140 కోట్ల జనాభా లో దాదాపు 125కోట్ల మంది రిజర్వేషన్‌కు అర్హులై నప్పుడు 75లక్షలు ఉద్యోగాలు వస్తున్నా యన్నమాట! అందులోనూ నేడు ప్రభుత్వ రంగాలన్నింటిలో, ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో దాదాపు 60శాతం ఉద్యోగాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ చేయబడినవి. ఇందులో ఎక్కడాకూడా రిజర్వేషన్ల అమలు లేదు. దేశంలో మొత్తం ఉపాధిలో 96శాతం ప్రయి వేటు సెక్టార్ ఉపాధి ఉన్నది. కేవలం నాలుగు శాతం మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉపాధి కల్పించబడు తున్నది. మరి 96శాతం ఉన్న ప్రయివేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఎక్కడా లేవు, సరికదా, చదువుల్లో వెనకబడిన దళితు లకు ప్రయివేట్ సెక్టార్లో ఉపాధి లభించే పరిస్థితే లేదు.
ఇలా రిజర్వేషన్ల అమలు నామరూపాలు లేకుండా చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను నియమించకుండా అవుట్సోర్సింగ్ చేస్తున్నది. ప్రతి రంగాన్నీ ప్రయివేటు పరం చేస్తున్నది. ఇంతటి దారుణ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా రిజర్వేషన్ల వల్ల తమ భవిష్యత్తు పాడవుతుందని వాపోవడం, వాదులాడుకోవడం అవగాహనా లోపమే అవుతుంది. భారతదేశంలో నిరక్షరాస్యత ఇప్పటికీ 37శాతం ఉన్నది అందులో 98శాతం అణగారిన వర్గాలదే. ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు బీసీలు తప్ప మిగతా వారు నామమాత్రమే.
ఈ దేశంలో కులం ఒక ప్రివిలేజ్, కులం ఒక హౌదా, కులం ఒక అర్హత... కులం అనేది ఒక కలం పోటు శిలా శాసనంలా మనిషి ఎదుగుదలకు ప్రతిభంధకమై వెంటాడుతూ ఉంది. విద్యను, ఉపాధిని, ఉనికిని సైతం నిర్ణయించేది కులమే. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి యూట్యూబ్ వార్తా ఛానల్‌ను నడిపే ధృవ్ రాఠీ అనే వ్యాఖ్యాత ఆసక్తికరమైన అంశాలు చెప్తాడు. బిల్‌గేట్స్ ఒక తెల్ల జాతీయుడు కాకపోయి ఉంటే... సదరు దేశం అంతగా ప్రోత్సహించి ఉండేదా? నల్ల జాతీయుడు అయితే ఆయన స్థితి ఎలా ఉండేది? ఒక సంపన్న కుటుంబంలో జన్మించకుండా ఉంటే ఆయనకు బాల్యంలోనే, అనగా 1960వ దశకం ప్రారంభంలోనే, కంప్యూటర్‌తో ఆడుకునే అవకాశం లభించేదా? అదే బిల్‌గేట్స్ ఒక మహిళ అయితే సమాజం ఎలా ప్రోత్సహించేది (ఎందుకంటే 1960లో మహిళలకు అమెరికాలోనూ సమాన ప్రతిపత్తి లేదు). ఇలా ఒక మనిషి పుట్టుపూర్వోత్తరాలు, ఆదాయ స్థోమతలు తన భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నది వాస్తవం. భారతదేశ సమాజ కూర్పు కులాల ఆధారంగా ఉన్నది, ఆర్థిక స్థాయిలన్నీ కూడా ఈ కులాల ఆధారంగానే ఉన్నవి. అలాంటప్పుడు కులాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలనడం సబబే. ఒక మిత్రుడంటాడు, మాల మాదిగల వెతలు తెలియాలంటే... మహానగరాల్లో తమ కులాన్ని ప్రస్తావిస్తూ అద్దె ఇల్లు వెతుక్కుంటే తెలుస్తుందీ అని. ఇంకో మిత్రుడంటాడు, సఫాయి కర్మచారి పనులు మొదలు కొని ఖర్మకాండల వరకు ఎవరు చేస్తున్నారు? అవన్నీ గౌరవ ప్రదమైన పనులనా? లేక ఆదాయమార్గాలెక్కువనా? వీటికి సమాధానాలు చెప్పకపోయినా వారి వెనుక బాటు తనానినికి కులం పేర పాతుకున్న సమాజపు కట్టుబాట్లేనని విధితమవుతుంది.
అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లు పొందియైనా లేకా స్వతహాగానైనా దళితబహుజనుల్లోనూ కొంతమంది ధనికులున్నారు. పేదలైన అగ్రకులాలకూ ఫలితాలు దక్కాలి, ధనికులైన నిమ్న కులాలూ తమకున్న ప్రివిలేజీని వదులుకోవాలి. ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలి. పై చదువులకు రిజర్వేషన్లు ఎందుకు అన్నది కూడా ఒక వాదనగా వినిపిస్తూ ఉంటుంది. పాఠశాల డ్రాపవుట్లలో 80శాతం మంది దళిత బహుజనులు, కళాశాల డ్రాప్ అవుట్లలో 90శాతం మంది దళిత బహుజనులే. వీరిలో విశ్వవిద్యాలయాలకు వెళ్ళినవారిలో కూడా సఫలీకృతం అవుతున్నది కేవలం 25శాతమే. విశ్వవిద్యాలయం వరకు చేరినా కాంపిటీషన్లో నిలువలేక పోవడానికి కారణం వారి ఆర్థిక, సామాజిక సమస్యలే. మరి ఇలాంటి వారందరికీ కనీస రిజర్వేషన్లు విద్యావకాశాల్లో ఇవ్వకపోతే సమానత్వం సాధించడం ఎలా?
పెరుగుతున్న దాడిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి
కార్మిక చట్టాల సవరణ ద్వారా పర్మినెంట్ ఉద్యోగాలు, అనగా 60ఏండ్ల వయసు వరకు పనిచేసే అవకాశం ఉన్న నియామకాలు చేపట్టరాదని ప్రభుత్వం వేతన కోడ్ అనే చట్టాన్ని తెస్తున్నది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, అనగా నిర్ణీత కాల వ్యవధితో కూడిన నియామకాలు జరుపుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, పర్మినెంటు విధానాలకు స్వస్తి చెప్పి ప్రయివేటు, కాంట్రాక్టు అనే అనిశ్చితి ఉన్న పద్ధతికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. సంఘటిత రంగాలలో ఉద్యోగాలు పొంది కాస్త విద్యావంతులైన వారందరూ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా సంఘాలు ఏర్పరుచుకున్నారు, కానీ కీలకమైన ఇలాంటి మార్పులు సంభవిస్తున్నప్పుడు సమ్మెలో పాల్గొనకుండా ప్రభుత్వ విధానాలపై స్పందించకుండా ఉంటున్నారు. ప్రభుత్వ విధానాల సారాన్ని, పర్యవసానాన్ని అర్థం చేసుకోక పోవడం, దాన్ని ప్రతిఘటించక పోవడం నిజంగా జాతికి ద్రోహం తలపెట్టడమే. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీ కరిస్తూ నిర్మలాసీతారామన్ పార్లమెంటులో ప్రకటిస్తూ ఉంటే బలపరిచిన వాళ్ళంతా తమ జాతికి అన్యాయం జరగడానికి తామే ఆజ్యం పోసినట్లు కాదా? కుల మూలాల వల్లనే భారత సమ్మిళిత వృద్ధి విచ్చిన్నమైందని మేధావులు కూడా గుర్తించకపోతే బూర్జువా నాయకులకు ఆ నైతికత ఎలా వస్తుంది?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016