Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో కేరళ రాష్ట్రంలోని కన్ననూర్‌లో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) 23వ జాతీయ మహాసభల సందర్భంగా తమిళ నాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చేసిన ప్రసంగం, రెండు కారణాల రీత్యా రాజకీయ చరిత్రలో లిఖించదగినది. మొదటిది, అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలు, చర్యల్లో కేంద్రంలో ''సమాఖ్య విధానానికి'' భిన్నమైన నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానాన్ని స్టాలిన్ తన ప్రసంగంలో తీవ్రంగా సవాల్ చేశాడు.
రెండవది, వ్యూహాత్మకంగా కాకపోయినా, కనీసం భావజాల పరంగానైనా ద్రవిడవాదం, కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులున్నట్లు ఆయన ప్రసంగం సూచించింది. ప్రభుత్వ విధానంలోని కొన్ని దృష్టి కోణాలను ఆయుధంగా ఉపయోగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను నేరస్థులని శిక్షించినట్లు కనిపించే చేతగాని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాల స్థాయిలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న గొంతుకలన్నీ ఏకమయ్యే విధంగా ఈ పరిణామాలు మరింతగా వేగాన్ని పెంచుతాయి. స్టాలిన్ యొక్క సవాళ్ళలోని దృష్టి కోణాలను మరింత సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు
మొదట, ఏప్రిల్ 9న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) జాతీయ మహాసభల్లో, తమిళనాడు, కేరళ మధ్యనున్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను గురించి స్టాలిన్ హర్షాతిరేకాల మధ్య వివరించాడు. నేడు దేశంలో అమలవుతున్న సమాఖ్య నమూనాను స్టాలిన్ సవాల్ చేసేదేమంటే, ప్రస్తుత రూపంలో ఉన్న సమాఖ్య వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణకు, ప్రస్తుత పరిణామాలకు కారణమా అని ప్రశ్నిస్తున్నాడు. ''అయితే ఏంటి?'' లాంటి వాదనలు, భారత రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలు పొందాల్సిన హక్కులతో కూడిన స్థానాన్ని ఇవ్వకుండా తిరస్కరిస్తున్నాయి. ఈ మార్పులు, వస్తు సేవల పన్నులు(జీఎస్టీ), నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్), ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి లాంటి సంస్థలను రద్దు చేయడంలో స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి.
కేంద్రం కొన్ని రాష్ట్రాల మధ్య ఆదాయాలకు సంబంధించిన భాగస్వామ్యాలు అంత సంతృప్తికరంగా ఉండడం లేదని స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడున్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను లెక్క చేయకుండా, విధానాల అమలు ద్వారా రాష్ట్రాలకు సమకూర్చాల్సిన (రాష్ట్ర పరిపాలనకు జీవ నాధారమైన) నిధులకు కోత విధిస్తున్నారు.
ఇది స్టాలిన్ ప్రసంగంలో మాత్రమే వ్యక్తం చేయడం కాదు. ఈ కోత విధింపుల కారణంగానే, తమిళనాడు ప్రభుత్వ ఖజానాకు ఏర్పడిన లోటుకు సంబంధించిన నష్టపరిహారాన్ని పూడ్చుకొనే ఉద్దేశ్యంతోనే ఇటీవల కాలంలో ఆయన దేశ రాజధాని ఢిల్లీని సందర్శించాడు. 14వ ఫైనాన్స్ కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి 2016-17 నుండి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు రూ.2524.20 కోట్ల నిధులను మంజూరు చేయాలని సిఫార్సులు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కేవలం 2016-17 సంవత్సరానికి మాత్రమే రూ.494.99 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్టాలిన్ స్వయంగా అందించిన విజ్ఞాపన పత్రం ప్రకారం.. ''వినియోగ ధృవీకరణ పత్రాలను సమర్పించినప్పటికీ, 2017-18 సంవత్సరానికి నిధులను మంజూరు చేయలేదు. అదేవిధంగా 2018-19, 2019-20 సంవత్సరా లకు కూడా నిధులు మంజూరు చేయలేదు.''
గవర్నర్లు
ఇటీవల కాలంలో బీజేపీ యేతర ముఖ్య మంత్రులతో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాంటి వారి వలె స్టాలిన్ కూడా, ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగ సాంప్రదాయాలను వదిలి వేస్తున్న భయంకరమైన ధోరణిని గుర్తించారు. పాలనాపరమైన చిన్న చిన్న విషయాల్లో కూడా గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారు. రాష్ట్ర కార్యనిర్వహణలో అన్నింటా తామై, వారి వారి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి, కొన్ని పనుల విషయంలో తాత్సారం చేయడానికి తమ కార్యాలయ జోక్యాన్ని పెంచుతున్నారు.
ఉదాహరణకు ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగిస్తూ... రాష్ట్రాలు త్రిభాషా పథకాన్ని అవలంబించా లని ఒక రాజకీయ దుమారాన్ని లేపాడు. అప్పుడు ద్రవిడ మున్నేత్ర కజగమ్ (డీఎంకే) నాయకత్వం, తమిళభాష గుర్తింపునకు, సంస్కృతికి ఇదొక బహిరంగ అవమానంగా భావించే పరిస్థితికి దారి తీసింది. తమిళనాడులో 2019 నిరసనల సందర్భంగా అవసరానికి మించిన గవర్నర్ జోక్యం వలన పాఠశాలల్లో హిందీ పాఠాలు అవసరం అనిచెప్పే నూతన విద్యా విధానం ముసాయిదాలోని ఒక క్లాజ్‌ను తీసివేయడానికి దారి తీసింది.
మామూలుగా నిర్వహించే రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను దాటి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే, వేలి ముద్ర వేసే వ్యక్తిగా పరిగణించబడే గవర్నర్ జోక్యం చేసుకున్న మరొక సందర్భం... తమిళనాడు నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీ పంపించడంలో చెన్నై రాజ్‌భవన్ మితిమీరిన ఆలస్యం చేసింది. 1976 నుండి విద్య మన రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చబడిందన్న వాస్తవం నుండే స్టాలిన్, అతని అనుచరులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు.
అసమ్మతివాదుల ఐక్యత
కేంద్రం, రాష్ట్రాల మధ్య కొట్లాటలు కొత్తవేమీ కాదు. సర్కారియా కమిషన్ సమర్థించిన 'రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి' కోసం అనేక రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు కొన్ని దశాబ్దాలుగా (ఇంతకు ముందున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా) పోరాటం చేస్తూవస్తున్నారు. అయినా స్టాలిన్, డీఎంకేల దృష్టిలో, విధానాల పైన వివాదాలు చేయడం కంటే, ప్రజల స్వయం నిర్ణయాధికారానికే ఒక లోతైన అర్థం ఉంటుందని భావించారు.
దశాబ్దాల కాలంగా ఉన్నత వర్గంగా, ఉన్నత కుల ఆధిపత్యం గల ఢిల్లీలోని ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో (చొరబడే అవకాశం లేకున్నా) దురాక్రమణ చేసిన ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగానే హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకేలు ప్రతిఘటిస్తున్నాయి. వాస్తవానికి ద్రవిడ ఉద్యమానికి చైతన్యాన్నిచ్చి, 1967లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మధ్య, దిగువ కులాల సమీకరణలు చేసిన ప్రచోదన సారం, ''ఢిల్లీ రాజకీయాల తిరస్కరణ'' నుండి పుట్టిందే. నేడు డీఎంకే చేస్తున్న అదే పోరాటాన్ని మనం చూస్తున్నాం.
1960ల నుండి తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేలతో నిమిత్తం లేకుండా, ఓటర్లతో ద్రవిడ పార్టీల నాయకుల 'సామాజిక ఒడంబడిక' (ముఖ్యంగా సమాజం లోని పేద, బడుగు, బలహీన వర్గాలకు) ప్రజా సంక్షేమ విధానాల చుట్టే తిరుగుతున్నది. ఈ చారిత్రక ధోరణి, మానవాభివృద్ధిలో ముఖ్యంగా ప్రభుత్వ విద్య, ప్రజా వైద్యంలో తమిళనాడు స్థిరంగా ముందున్నట్లు సూచికలు తెలియజేస్తున్నాయి. ఈ విధానాల అమలుకు అవసరమైన నిధుల విషయంలో సమాధానాలులేని ప్రశ్నలనేకం.
పేదల అనుకూల ప్రేరేపణలు
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, పేదల అనుకూల పునఃపంపిణీపై ఆధారపడిన ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్న కేరళను ఇబ్బంది పెడుతున్నట్టుగానే తమిళనాడుకూ మద్దతుగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ పెట్టుబడి ఇబ్బందికరమైన అంశంగా ఎందుకు మారిందో ఇది వివరిస్తుంది. స్టాలిన్, విజయన్ లాంటి నాయకులు, (కరోనా మహమ్మారి అనంతరం నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థ కారణంగా రాష్ట్రాల ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో) తమకు రావాల్సిన ఆదాయాల కోసం పోరాటం చేసే పరిస్థితిని కల్పిస్తుంది.
సామాజిక ఉద్యమం యొక్క అసమానమైన విలువలను ముందుండి తీసుకొని పోయేందుకు, తన తండ్రైన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రను, బాధ్యతలను నెరవేర్చే వారసుడినని స్టాలిన్ చాలా బలంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో, తన పాలనా సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ చెన్నై మేయర్‌గా, తన తండ్రి మార్గదర్శకత్వంలో డిప్యూటీ సీఎంగా స్టాలిన్ తన రాజకీయ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. ఆయన ద్రవిడ రాజకీయ స్ఫూర్తిని వంటపట్టించుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఒకవేళ ఆ స్పూర్తి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ ప్రతిధ్వనిస్తే, కాషాయ రాజకీయ పాలనకు ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
- నారాయణ్ లక్ష్మణ్
(''ద హిందూ'' సౌజన్యంతో)
స్వేచ్ఛనువాదం:బోడపట్ల రవీందర్,
9848412451