Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రజెండా పుట్టి 136ఏండ్లు అయింది. హే మార్కెట్ వీధుల్లో పనిగంటల తగ్గింపు కోసం కార్మికులు రక్తం చిందించారు. అప్పటినుంచి మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా కార్మికవర్గం నిర్వహిస్తున్నది. క్రమంగా 8గంటల పనిదినమే కాదు, పరిమితుల్లోనైనా అనేక కార్మిక చట్టాలు కూడా సాధించుకున్నది. ఇప్పుడు మరోసారి మన దేశంలో పాలకవర్గాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. కార్మిక చట్టాలు రద్దయినాయి. బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం పనిచేసే మతోన్మాద పాలకుల విధానాల ఫలితమే ఇది. లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక చట్టాల కోరలు పీకి నీరుగార్చింది మోడీ ప్రభుత్వం. భారత కార్మిక వర్గానికి ఇది సవాలు. ఇంత అన్యాయం జరుగుతుంటే కార్మికవర్గం చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? చికాగో కార్మికుల పోరాటానికి 24 సంవత్సరాల ముందే 1862లోనే హౌరా రైల్వే కార్మికులు 8గంటల పనిదినం కోసం పోరాడిన చరిత్ర మనది. అలాంటిది పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తుంటే కార్మికవర్గం అచేతనంగా తలవంచుతుందను కుంటే అది పాలకవర్గాల భ్రమ. పనిగంటల తగ్గింపు కోసం హే మార్కెట్ వీధుల్లో పోరాడిన కార్మికులపై ఆనాడు పాలకవర్గాల ఏజెంట్లు బరితెగించి దాడులు చేసారు. పైగా కార్మిక నాయకులమీదనే తప్పుడు కేసులు బనాయించారు. న్యాయవ్యవస్థ కూడా యాజమాన్యాల వైపే నిలిచింది. కార్మిక నాయకులకు ఉరిశిక్ష విధించింది. అంతమాత్రాన కార్మికవర్గం భయపడిపోలేదు. కార్మికుల రక్తంలో తడిచిన గుడ్డనే ఎర్రజెండాగా ఎగరేసింది. పోరాటం కొనసాగించాలని దీక్షపూనింది. చికాగో హద్దులే కాదు, అమెరికా సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్ఫూర్తితో కార్మికహక్కుల పోరాటదినం ''మేడే''గా ప్రజ్వరిల్లింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేడే ఉత్సవాలు నిర్వహించాలి.
బహుళజాతి సంస్థల పెట్టుబడులకోసం, బడా పెట్టుబడిదారుల దోపిడీని సులభతరం చేయడంకోసం మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది. దేశభక్తి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు అంతర్జాతీయ పెట్టుబడి కోసం చట్టాలను నీరుగార్చడం దేశద్రోహమే. అంతర్జాతీయ స్ఫూర్తితోటే ఈ కుట్రలను ఎదుర్కోవాలి. హే మార్కెట్ అమరవీరుల చిహ్నం ప్రతిష్టించాలి. అమరవీరులను స్మరించుకుంటూ పూలదండలు వేయాలి. శ్రద్ధాంజలి ఘటించాలి. ఆ సన్నిధిలోనే, ఆ పోరాటస్ఫూర్తితోనే మరోసారి పిడికిలి బిగించాలి. వారం రోజులపాటు కార్మికవర్గాన్ని, ముఖ్యంగా యువతీ యువకులను పెద్దఎత్తున సమీకరించి ఆట పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.
మే దినోత్సవాన్ని పాలకవర్గాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తూనేవస్తున్నాయి. మేడేను కొంతకాలం సెలవుదినంగా ప్రకటించారు. పోరాటస్ఫూర్తి పొందవలసిన రోజును విశ్రాంతికి, వినోదానికి కేటాయించే విధంగా పక్కదారులు పట్టించే ప్రయత్నం చేసారు. కానీ త్వరలోనే అది తమ ఉత్పత్తిని, లాభాలను కూడా తగ్గిస్తుందని గమనించి సెలవుదినం ఎత్తేసారు. దీక్షా దినాన్ని సాధారణ పండుగగా మార్చే ప్రయత్నమూ చేసారు. కార్మిక నాయకులకు అవార్డులు, రివార్డుల పేరుతో ఎరవేస్తూనే ఉన్నారు. సమాజంలో ఉన్న వెనకబాటుతనం ఫలితంగా వస్తున్న ఆరాధనా సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. జెండావిష్కరణ సందర్భంగా కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తీలు వెలిగించడం ఇలాంటి వెనకబాటుతనంతో చేసేవే. కొబ్బరికాయ కొట్టడం, అగరబత్తీలు వెలిగించడం మతపరమైన సంప్రదాయం. లౌకిక విలువలు పాటించవలసిన సందర్భం ఇది. ఐక్య పోరాట దిశలో కార్మికవర్గాన్ని పోరుబాటలో నడపవలసిన సందర్భం. కులమతాలకు అతీతంగా నిర్వహించవలసిన ఉత్సవం మేడే. మతపరమైన సంప్రదాయాలు వ్యక్తిగతం. ఇలాంటి క్రతువులు మనిషి నిస్సహాయతను సూచిస్తాయి. ఆదుకోవాలని వేడుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి. శ్రమ సంస్కృతి ఇందుకు భిన్నం. పనిచేయటం, చేసిన పనికి తగిన ఫలితాన్ని హక్కుగా పొందటం శ్రామిక వర్గ సంస్కృతి. అడుక్కోవటం కాదు, కొట్లాడి సాధించటం కార్మికవర్గ లక్షణం. ఇందుకు స్ఫూర్తినిచ్చేదే మేడే. అందుకే అది పెట్టుబడిదారులకు గిట్టదు. పాలకులకు నచ్చదు. మూఢనమ్మకాలనే ప్రోత్సహిస్తారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంమీద పనిచేసే కార్మికవర్గం ఆధునిక భావజాలాన్ని అందిపుచ్చుకోవాలి. శ్రామికవర్గ సంస్కృతిని ముందుకు తేవాలి. భూస్వామ్య, పెట్టుబడిదారీ సంస్కృతిని తిరస్కరించాలి.
రసమాజంలో సగభాగం మాత్రమే కాదు, శ్రామికులలో కూడా సగభాగం మహిళలు. పోరాటాలలో అగ్రభాగాన నిలిచేది మహిళలు. ఉత్పత్తిలోనూ, ఉద్యమాలలోనూ ముందుంటున్న మహిళలు నాయకత్వ స్థానాల్లో మాత్రం పరిమితం. కార్మికోద్యమంలో కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. అది మేడే సందర్భంగా కూడా కనిపిస్తుంది. పతాకావిష్కరణ చేస్తున్నవారిలో మహిళలు ఎంతమంది? ఈ దృష్టితో ఆలోచించాలి కదా! యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులలో ఎవరో ఒకరు పతాకావిష్కరణ చేయటం ఆనవాయితీగా వస్తున్నది. ఆ స్థానాలలో మహిళలు అరుదు. కొన్ని సందర్భాలలో సీనియర్ కార్మికులతో పతాకావిష్కరణ జరుగుతుంది. అప్పుడుకూడా మహిళలను విస్మరించడం గమనార్హం. పురుషాధిక్యత భూస్వామ్య ధోరణి. వెనుకబడిన సమాజపు లక్షణం. కార్మికవర్గం ఆధునికవర్గం. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న వర్గం. ఫ్యూడల్ భావాలు దరిచేరనీయరాదు. కంపెనీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న కార్మికులే ఇంటిదగ్గర జీవిత భాగస్వామి మీద ఆధిపత్యం చెలాయిస్తారు. అదే ధోరణి తోటి శ్రామిక మహిళలమీద కూడా వ్యక్తమవుతున్నది. ఈ ధోరణిని అధిగమించడంలో చైతన్యం ప్రదర్శించాలి. మహిళను సరుకుగా పరిగణించడం పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ లక్షణం. అందుకే వ్యాపార ప్రకటనలకు మహిళలను ఒక సరుకుగానే వాడుతుంటారు. పెట్టుబడిదారీ దోపిడీకి ఇది అవసరం. కానీ ఇది కార్మికవర్గ లక్షణం కాదు. ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకోవటం, ఆధిపత్యం చెలాయించడాన్ని కార్మికవర్గం అంగీకరించకూడదు. వలసకూలీల బతుకులు మరో సమస్య. వందలాది కిలోమీటర్లు దాటి పొట్టచేతపట్టుకుని వచ్చిన వీరికి స్థానబలం లేదు. అభద్రత వెంటాడుతున్నది. సరిగ్గా ఈ బలహీనతనే శ్రమదోపిడీకి వాడుకుంటున్నది పెట్టుబడిదారీ వర్గం. ఈ వలస కూలీలకు స్థానిక కార్మికవర్గం అండగా నిలవాలి. వలసకూలీల హక్కుల కోసం కొట్లాడకుండా స్థానిక కార్మికులకు హక్కులు సాధ్యంకాదు. శ్రామికులంతా ఒక్కటే. కుల, మత, ప్రాంతీయ బేధాలకు తావులేదు. లింగ వివక్షకు స్థానం లేదు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్యతా భావాన్ని చాటాలి.
వ్యక్తి పూజ, ఆరాధన ఫ్యూడల్ సమాజ లక్షణం. స్వాతంత్రోద్యమ నాయకుడైన గాంధీజీనే దేవుడిని చేసి గుడికట్టిన సమాజం మనది. ఉద్యమ స్ఫూర్తిని మరిపించి ఆరాధన, వేడుకునే సాంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నమే ఇది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండావిష్కరణ సందర్భంగా కూడా గాంధీ ఫొటో పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అగరబత్తీలు వెలిగించడం ఆనవాయితీగా మారింది. మెదక్ జిల్లాలో కష్టజీవుల హక్కులకోసం ఎర్రజెండా నాయకత్వంలో పోరాడిన నేత కేవల్ కిషన్. కాలక్రమంలో ఆయనమీద ఉన్న ప్రేమాభిమానాలతో పేదప్రజలు ప్రతియేటా కేవల్ కిషన్ జాతర నిర్వహిస్తున్నారు. పోరాటస్ఫూర్తి పొందవలసిన స్థానంలో దైవంగా ఆరాధించటం పాలకవర్గాలకు సంతోషమే కదా! మూఢనమ్మకాలు, వెనుకబాటుతనం బలంగా ఉన్న మన సమాజంలో ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం కలిగించవు. వినిమయ సంస్కృతి కూడా పోరాటస్ఫూర్తిని నీరుగార్చుతుంది. వ్యాపారాలు విస్తరించి లాభాలు పెంచుకోవడానికి తోడ్పడుతుంది. పండుగల సందర్భంగా కూడా ఇప్పుడు అదే జరుగుతున్నది. ఒకవైపు సాధారణ ప్రజలు భక్తిభావంతో కొత్త బట్టలు ధరించి పూజలు చేస్తున్నారు. మరోవైపు పాలకవర్గాలు ఛాందసభావాలు విస్తరించడానికి వినియోగిస్తున్నారు. అదే సమయంలో సరుకుల అమ్మకాలు పెంచుకునే వినిమయ సంస్కృతి కూడా విస్తరిస్తున్నది. కానీ ఈ ఉత్సవాల నిర్వహణకు కమిటీలుగా ఏర్పడి విరాళాలు మాత్రం ప్రజలనుంచే వసూలు చేస్తున్నారు. మే దినోత్సవం శ్రామికుల పండుగ. ఇది పోరాటస్ఫూర్తినిచ్చే ఉత్సవంగా జరగాలి. ఎర్రబట్టలు ధరించి, ఎర్రతోరణాలు, ఎర్రజెండాలతో ఎరుపు వెలుగుల మధ్య పోరుగీతాలతో ఉత్సవాలు సాగాలి. చికాగో అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించాలి. మే దినోత్సవ కమిటీలు ఏర్పడి ప్రజలనుంచే విరాళాలు సేకరించాలి. ప్రజల అండతోనే మేడే ఉత్సవాలు ముందుకు సాగాలి. ఏర్పాట్లు ఎవరు చేయాలి? కాంట్రాక్టు కార్మికులు, పర్మినెంటు కార్మికులు, నాయకులన్న తేడా లేదు. అందరూ ఈ ఏర్పాట్లలో భాగస్వాములు కావాలి. ఇదే శ్రమ సంస్కృతి. సమభావన, సమైక్యతా భావన, కార్మికవర్గ ఐక్యతా స్ఫూర్తి ప్రసరించాలి. భవిష్యత్తు పోరాటాలకు దీక్ష పూనాలి.
- ఎస్. వీరయ్య