Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాడిగె కాలం అంటే అదేదో కాలం బాడిగెకు దొరుకుతుందని అనుకునేరు. అది ఎలాగూ కాదు. ఇరవైనాలుగు గంటలే అందరికి. అయితే ఆ ఛబ్బీస్ గంటల్లో మనం ఎలా గడుపుతున్నాము, ఎంతమందిని బాడిగెకు తీసుకుంటున్నాము, ఎంతమందిని బాడిగెకు అమ్ముడుపోతున్నాము ఇలాంటి ప్రశ్నలు అందరూ కాదు కాని ఈమధ్య చాలామంది తమకు తాము వేసుకోవలసినవి తయారైనాయి. ఎవరి పనులు వాళ్ళకున్నాయి అలాంటిది ఇంకొకరి దగ్గర బాడిగెకు ఎందుకు పోతారు అనుకునే అవకాశమూ ఉంది. తన పనే చూసుకోవాలా లేదా ఇతరుల పనికి పోవాలా అన్న విషయం చేతికి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అదే అందరినీ, అన్నింటినీ నడిపిస్తుంది. దానికి లొంగని వాళ్ళూ కొందరుంటారు, అది వేరే సంగతి. డబ్బు, కాలం అన్న అంశాలు ఒక్కో కాలంలో ఒక్కో విధంగా చూడబడుతుంటాయని తెలుసుకోవాలి. చిన్నప్పుడు లెక్కల్లో కాలము, పని అనే అధ్యాయం ఉండేది, అక్కడ పని అంటే డబ్బు అని వేరే చెప్పే పనేలేదు. అస్సలు బాడిగె, జీతం ఏమీ తీసుకోకుండా ఒకరి పొలాల్లో ఒకరు పనిచేసిన రైతన్నల కాలం దాటి మనం చాలా దూరం వచ్చేశాం.
మనిషికి ఏ బాడిగె లేకుండా అడవుల్లోకి పోయి నీగ్రోలను పట్టుకొచ్చి వాళ్ళకింత తిండి పెట్టి పని చేయించుక్కున్నవాళ్ళని కూడా చరిత్ర చూసింది. తరువాత దొంగ లెక్కలు వేసి వెట్టికి పని చేయించుకున్న కాలమూ పోయింది. ఇప్పుడు అలా పట్టుకొచ్చె అవసరం లేకుండా, వెట్టి కాకుండా తామే సొంతంగా బాడిగెకు వచ్చే మనుషులు దొరుకుతున్న మంచి కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచంలో ఇప్పుడు ఫలానా చోటికి పోయి వ్యాపారం చేయాలన్న రూలేమీ లేదు. సెల్లులో ఒక్క బటన్ నొక్కితే చాలు మన డబ్బు గాల్లో ప్రయాణించి షేర్... మార్కెట్లతో పాటు అన్నింటి ధరలనూ పెంచొచ్చు, తగ్గించనూ వచ్చు. డబ్బు కాల మంటే బాడిగె కాలమే అని మీరు అను కున్నారంటే కరెక్టుగా ఆలోచిస్తున్నారనే లెక్క.
కొన్ని ఆటలున్నాయి. దేశదేశాలకూ ఆ ఆటల్లో ఎవరి జట్లు వాళ్ళకున్నాయి. వాటిల్లోని ఆటగాళ్ళను కొని తమకు అనుకూలంగా ఆడమని బయట పంద్యాలు వేసుకునే వాళ్ళు ఇంతకు ముందు బేరాలు పెట్టేవాళ్ళు. అది కాస్తా బయటకు పొక్కి అంతా గందరగోళం అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ సర్దుకున్నారు. ఇక లాభం లేదు, ఇలా ఒక జట్టులోని వాళ్ళను కొనడం వల్ల టైం వేస్టు, డబ్బు వేస్టు అని కనుక్కున్నారేమో, వివిధ దేశాల జట్లనుండి బాగా అడేవాళ్ళను వేలంలో కొనేస్తున్నారు. ఇదేదో వేలమని నేను వాడడంలేదు, వాళ్ళే బిడ్లు వేసి ఒక్కొక్కరినీ ఇంతకు కొన్నామని గర్వంగా ప్రకటిస్తున్నారు. ఫలానా ఆటగాడు ఇన్ని కోట్లకు అమ్ముడుబోయాడు, ఫలానా టీము కొనుక్కుంది అని వాళ్ళే రాస్తున్నారు, చెబుతున్నారు. ఇక కరోన లెక్కలో లేదు, ఎండలు అస్సలు అడ్డురావు, పెట్రోలు, డీజిలు, గ్యాసు, మందులు ఇంకా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, మనుషుల మధ్య అంతరాలను పెంచే రాజకీయాలు చేస్తున్నారు అనే విషయాలు ఆలోచించకుండా, ఆలోచించనీయకుండా మ్యాచులు పెట్టి, ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ, టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ బాడిగె ఆట చుట్టూ డబ్బు స్వేఛ్ఛగా విహరిస్తోంది.
ఈ బాడిగె రేటు ఎంత కాలం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక సీజనుకు మాట్లాడుకున్నది ఆ సీజనంతా ఇవ్వాల్సిందే, బాగా ఆడినా ఆడక పోయినా. అయితే ఇన్ని సిక్సర్లు బాదితే, ఇన్ని ఫోర్లు కొడితే, ఇన్ని వికెట్లు తీస్తే అదనంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు, బోనసులు ఇవ్వొచ్చు కాని అది గ్యారెంటీ లేనిది. ఈ సీజనులో ఆడే, గెలిచే మ్యాచుల మీద రాబోయే సీజనులో ఇచ్చే బాడిగె రేటు ఆధారపడి ఉంటుంది. అందుకే వొళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతారు. దీపముండగానె ఇల్లు దిద్దుకోర తమ్ముడు అన్నట్టు తాకత్ ఉన్నప్పుడే కమాయించుకోవాలి అన్నది అందరికీ వర్తించే సూత్రం. తనను తాను సంపాదించుకుంటోంది డబ్బు. అలా ఈ డబ్బు సంపదగా మారి తన గురించి మార్క్సు మహనీయుడు, చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తోంది. ఈ భూమి ఒక్కటే కాదు చంద్రమండలాన్ని, గురు గ్రహాన్ని కూడా ఆక్రమించి అక్కడా బాడిగెకు విహార కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో ఉంది డబ్బు.
అంతెందుకు పల్లె బస్సుల్లో ఒక రేటు, ఎక్ప్రెస్, హైటెక్కు, స్లీపరు ఇలా బస్సుల్లో, టూ టైర్, త్రీ టైర్, ఏసీ, స్లీపరు అని రైళ్ళలో ప్రయాణించినప్పుడు బాడిగెల్లో తేడాలుంటాయి. ఇక నగరాల్లో అయితే సిటీ బస్సులు, అందులో రకాలు, ఆటోలు, లోకల్ రైళ్ళు, మెట్రో రైళ్ళు ఇలా రకరకాల వాహనాలు రకరకాల బాడిగెకు దొరుకుతాయి. అది సహజం. అయితే ఇక్కడ సేవలకు రుసుముగా మాత్రమే తీసుకుంటారు. పండుగలప్పుడు ప్రత్యేక బస్సులు వేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం చూస్తుంటాము, ఇవి ఐపీయెల్ మ్యాచులను గుర్తు చేస్తాయి. కాదేదీ మార్కెట్టుకు అతీతం అన్నది ఈ బాడిగెకు బాగా సరిపోతుంది. అద్దె కొంపల్లో విసుగొచ్చేంత కాలం ఉన్నవాళ్ళ నోటి నుండి ఈ బాడిగె బతుకులు ఎప్పుడూ ఇంతే, బాగుపడవు అన్న మాటలు వింటూ ఉంటాము. ఇప్పుడు వాటి పరిధి దాటిపోయింది.
ఆయనెవరో ఉన్నాడంట. కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని అధికారంలోకి రావాలంటే సూచనలు, సలహాలు, ఎత్తుగడలు ఇస్తాడట. అంతే కాదు, ఎవరెవరు ఏ డైలాగులు మాట్లాడాలి, వాట్సాప్ప్, ఫేసుబుక్కు, ట్విట్టర్లలో ఎలాంటి పోస్టులు పెట్టాలి మొదలైనవి అన్నీ రాసిస్తాడట. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అన్నీ తానే దగ్గరుండి మరీ చూసుకుంటాడట. అయితే బాడిగెకే పని చేస్తాడు. ఒకే పార్టీకే పనిచేస్తాడా అన్న అనుమానం వస్తుంది. అదేం లేదు ఏ పార్టీకైనా సరే రాసిస్తాడు. పైసలివ్వాలంతే. రెండువైపుల పార్టీలకూ రాసిస్తాడా? ఎందుకు రాయడు, మస్తు మస్తుగా రాసిస్తాడు, అయితె పైసల్ ముఖ్యం. అవతలివాడి ఫైసల్ అయిపోయినా తనకు అవసరం లేదు. ప్రజల గురించి అస్సలు పట్టదు. అమెరికావాడు రెండుదేశాలకూ ఆయుధాలిచ్చి వాళ్ళకు యుద్ధం వచ్చేలా చేసి బాగుపడుతున్న విషయం మీకు గుర్తొచ్చిందంటే మీ మెదడులో కరెక్టు ఆలోచనలు వస్తున్నట్టే లెక్క. ఇదొక టైపు బాడిగె.
ఈ విధంగానే పోతూ ఉంటే కొద్దికాలానికి బాడిగెకు దొరకని వస్తువులు, సేవలు ఉండవేమో అనిపిస్తుంది. ఇవి ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో కాలమే చెప్పాలి.
- జె. రఘుబాబు
సెల్:9849753298