Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల వ్యూహకర్త లేదా మార్కెటింగ్ నిపుణుడు ప్రశాంత కిశోర్(పికె) ఇటీవలి కాలంలో వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు విమిర్శలు విశ్లేషణలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ఆయన కాంగ్రెస్‌పైన, గాంధీ కుటుంబంపైన చేసిన ట్వీట్ల తర్వాత ఆ పార్టీ ఆయనపై తీవ్రంగానే దాడి చేస్తున్నది. మొన్న ఆగష్టులోనే పికె కాంగ్రెస్‌లో చేరతాడని హడావుడి చూశాం. దాన్ని ఆయన ఖండించ లేదు కూడా. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తరపున ఆయన జాతీయ స్థాయిలో వివిధ ప్రతిపక్షాల ఇష్టాగోష్టి సమావేశాలు వెనకవుండి ఏర్పాటు చేయడం కూడా ఇంచుమించు ఈ దశలోనే జరిగింది. ప్రతిపక్షంలో కాంగ్రెస్‌కు ముఖ్యపాత్ర వుంటుంది కాని 90శాతం ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించాలనుకోవడం అవాస్తవికత అనీ, ఆ పార్టీకి ఒకరే నాయకులుగా ఉండాలనడం దైవదత్తమైన హక్కేమీ కాదని ఆయన చేసినవ్యాఖ్య లోతుపాతులు అర్థమవుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మమతా బెనర్జీ కూడా ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో సమావేశమై ఆయన సమక్షంలోనే యూపీఏ అసలు లేనేలేదని తీసిపారేయడం యాదృచ్చికం కాదు. దీన్ని పవార్ కూడా ఖండించలేదు.
ఎప్పుడూ మోడీ ఘనతలే!
ఈ మధ్యనే ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోడీని కలుసుకున్న మమత ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సోనియా గాంధీని కలుసుకోవడం రాజ్యాంగ విహిత కర్తవ్యమేమీ కాదని అపహాస్యం చేశారు. ప్రశాంత కిశోర్ మొన్నటి బెంగాల్ ఎన్నికలలో మమత గెలుపునకు మొత్తం బాధ్యత నెత్తిన వేసుకుని పనిచేశాడనీ, పార్టీపై పెత్తనం కూడా ఆయనకే అప్పగించారని ఇక్కడ గుర్తు చేయాలి. కనుక వీరిద్దరి మాటలొకేలా ఉండటం యాదృచ్చికం కాదు. కొద్ది రోజుల కిందట గోవా మాజీ ముఖ్యమంత్రి లిలిజ్ ఫెలిరోను, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో పాటు కాంగ్రెస్ ఎంఎల్ఎలు పదకొండుమందిని తృణమూల్ వైపు తేవడంలో పికె ప్రధాన సూత్రధారి. గోవాలో ఆయన ఆంతరంగిక సంభాషణ అంటూ మాట్లాడుతూ బీజేపీ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాలలో ప్రధాన పాత్రధారిగా ఉండబోతున్నదని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పోషించిన పాత్రను ఇప్పుడు బీజేపీ చేజిక్కించుకుందని, ఈ దేశంలో ముప్పైశాతం ఓట్లు వచ్చిన వారెవరైనా చక్రం తిప్పగలరని వాకృచ్చాడు. బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా క్లబ్‌హౌస్ సంభాషణలనే పేరిట పికె ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుంచుకోవాలి. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి మమత ఒకే విధమైన జనాకర్షణ కలిగివున్నారని ఆయనన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే తాను ఇకపైన వేరే పాత్రలోకి మారిపోతున్నట్టు పికె మీడియాకు చెప్పారు. అదేంటంటే వివరించలేదు.
ఆయన మొదట గుజరాత్లో మోడీ తిరిగి అధికారానికి రావడానికి సహకరించారు. 2014లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత పికె ఐప్యాక్ ఏర్పాటు చేశారు. 2016లో పంజాబ్‌లో కాంగ్రెస్, బీహార్‌లో నితిష్‌కుమార్ విజయాలకు దోహదం చేశారు. 2017లో యూపీలో కాంగ్రెస్ ఆయన సేవలు వినియోగించుకోవడమే గాక సమాజ్వాదిపార్టీతో పొత్తు పెట్టుకున్నా 450లో ఏడు స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఒక దశలో బీహార్‌లో జేడీయూలో చేరి బయిటకు వచ్చారు. 2019లో ఏపీలో వైసీపీకి, తర్వాత తమిళనాడులో స్టాలిన్‌కు కూడా పికె సేవలందించారు. మొత్తంపైన ఆయన వ్యూహం విజయాలు తెచ్చిపెడు తుందనే అభిప్రాయం ఏర్పడింది.
కాంగ్రెస్‌లో సందేహాలు
బెంగాల్లో మమత ఘనవిజయం తర్వాత పికె తాను వేరేపాత్రలోకి మారతానని చెప్పడం ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంగానే భావించారు. బహుశా ప్రాంతీయ పార్టీలలో ఏకనాయకత్వం కారణంగా తనకు అవకాశం ఉండదనుకున్న ఆయన కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వచ్చిన కథనాలను ఉభయులలో ఎవరూ ఖండించకపోగా పరోక్షంగా బలపర్చారు. పికెను వర్కింగ్ ప్రెసిడెంటుగా చేర్చుకుంటారనీ, కాదు వ్యూహకర్తగానే అధికారాలు అప్పగిస్తారని రకరకాల కథనాలొచ్చాయి, ఈ లోగా పంజాబ్‌లో అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తరపున ప్రచార బాధ్యతలు స్వీకరించడమే గాక క్యాబినెట్ హోదాలో సలహాదారుగా చేరారు. దానిపై కోర్టులో వివాదం రావడంతో రాజీనామా చేసి ప్రచార బాధ్యత నుంచీ తప్పుకున్నారు. అమరీందర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వెళ్లిపోయారు. పికె చేరిక విషయం చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆంటోనీ, అంబికాసోనీ, కెసివేణుగోపాల్లతో కూడిన ఒక కమిటీని నియమించింది. తన ఐప్యాక్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్‌లో చేరతానని పికె పెట్టిన షరతు. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికలు వస్తాయి. అయితే తాను ఆ ఎన్నికలకు పనిచేయనని, ఏడాది చివరలో గుజరాత్ ఎన్నికలతోనే మొదలుపెట్టి లోక్‌సభ ఎన్నికల వరకూ పనిచేస్తానని పికె ప్రతిపాదన. ఇలా షరతుల బిగింపుతో చేర్చుకోవడం మొదలెడితే రేపు సమస్యలు వస్తాయని ఆ కమిటీ భావించింది. ప్రతిపక్ష ఐక్యతను ఎలా పెంపొందించాలనే దానిపైనా కాంగ్రెస్‌కూ ఆయనకూ తేడాలొచ్చాయంటారు. పార్టీ తరపున ఆయనతో చర్చలు జరిపిన ఆనంద్శర్మే ఇప్పుడు పికెపై విమర్శలో ముందుండటం గమనించదగ్గది. శరద్‌పవార్‌ను ముందుపెట్టి ఒక స్వచ్చంద సంస్థ వేదికపై గతంలో పికె నడిపించిన ప్రతిపక్ష చర్చలు కూడా ఈ కారణంతోనే కాంగ్రెస్ లేకుండా నడిచాయి. తర్వాత మమత ఒక పర్యాయం సోనియాగాంధీని కలుసుకున్నా ఇటీవల పార్లమెంటు సమన్వయం కోసం జరిగిన చర్చలలో పాల్గొనలేదు. ఈ విధంగా చూస్తే తఋణమూల్ అధినేత్రి తనే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని కోరుకోవడానికీ, పికె మాటలూ చేతలకూ సంబంధం కనిపిస్తుంది. అసలు ఆయనే కాంగ్రెస్ తరపున ముందుండాలని ఆశపడ్డారని కూడా చాలామంది భావిస్తున్నారు. ఈ రెంటికీ కాంగ్రెస్ సిద్ధంగా లేదు.
అసలు ఆంతర్యం
200స్థానాలలో బీజేపీని ఎదుర్కొనేది తామేగనక తమకే కీలకస్థానమని వారింకా వాదిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే 200స్థానాల్లో పట్టుకలిగి ఉండగా కాంగ్రెస్‌ను అంగీకరించబోవని మరో వాదన. కాంగ్రెస్ అనగానే రాహుల్‌గాంధీ పేరు వస్తుందనీ, మోడీ వర్సెస్ రాహుల్ అంటే మొగ్గు మోడీదే అవుతుందని ఈ వాదన చేసేవారు అంటున్నమాట. అయితే అదే సమయంలో మమతను ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఒప్పుకుంటాయని అవతలివారి ప్రశ్న. మమతతో మంతనాలు జరుపుతూ తనను తాను ప్రమోట్ చేసుకోవచ్చని శరద్‌పవార్ వంటివారు కోరుకుంటున్నారని కూడా చెబుతున్నారు. ఈ మొత్తం గజిబిజిలో తననే ముందుకు తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ ప్రయత్నం.
ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు. మొదట్లో రాజులు జమీందారుల ప్రోద్బలంతో రాజకీయ నేతలు పోటీచేసి పెత్తనం చేసేవారు. తర్వాత వారే ఆ స్థానం తీసుకున్నారు. ఆ తర్వాత సినీనటులు ప్రచారానికి పనికివస్తారనుకుంటే కొన్నిచోట్ల వారే పీఠాలపైకి ఎక్కేశారు. నేరస్త శక్తులను ఉపయోగించుకుంటే వారూ ప్రత్యక్షంగా ముందుకొచ్చారు. కార్పొరేట్ అధిపతులు కూడా పార్లమెంటుకు ఎన్నికవడం, ముఖ్యమంత్రులు కావడం జరిగింది. బీజేపీ హిందూత్వ ప్రచారకులుగా వచ్చిన స్వాములూ సాధుసంతులూ ముఖ్యమంత్రులైపోయారు. ఇదే రీతిలో ఈ మార్కెట్ యుగంలో రాజకీయాల మార్కెటింగ్ చేసే ప్రశాంత కిశోర్ వంటివారు కూడా తామే పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరడం ఈ పరిణామం కొనసాగింపే అనుకోవాలి. 1980లో ఇందిరాగాంధీ మొదటిసారి ఈ ఎన్నికల మార్కెటింగ్ ప్రవేశపెడితే తర్వాత రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయి, మోడీ, సోనియాగాంధీ వంటివారు, రాష్ట్రాలలో ప్రాంతీయ నాయకులు కొనసాగించారు. అయితే అనేక వైవిధ్యాలతో భిన్నత్వంతో బహుళ పక్షాలతో కూడిన భారత రాజకీయాలలో పికె చిట్కాలకూ పరిమితులుంటాయి. ఆయా ఎన్నికల నాటి పరిస్థితులలో కాస్త మెరుగైన ప్రచార పద్ధతులను రాజకీయ వ్యూహాలను ఆయన చెప్పివుండొచ్చు గాని, వాస్తవ పరిస్థితులే ఫలితాలకు మూలకారణం. పైగా బీజేపీకీ కాంగ్రెస్‌కూ ప్రాంతీయ పార్టీలకూ వాటివాటి విధానాలు సిద్ధాంతాలతో ప్రమేయం లేకుండా ప్రచారం వ్యూహం చెప్పే మార్కెట్ మంత్రజాలం ప్రజాస్వామికమెలా అవుతుంది? దీర్ఘకాలంలో పెరిగిన పాలకవర్గ రాజకీయ పక్షాలు ఆయన సేవలను వినియోగించుకుంటాయి గాని మొత్తం ఆయనకే నాయకత్వం అప్పగించడానికి సిద్ధమవుతాయా? ఈ ప్రశ్నలన్నీ అటుంచి పరస్పర విరుద్ధ పక్షాలకు సేవలందించిన ఆయనను ఏ మేరకు విశ్వసించడమనే ప్రశ్న కూడా వెంటాడుతుంటుంది. విజయం కోసం పికె ప్రజలను లేదా ఓటర్లను కుల మత ప్రాతిపదికన లెక్కలు కట్టి మార్కెట్ వినియోగదారులుగా మార్చేస్తారనే విమర్శ కూడా బలంగా ఉంది. అందువల్ల తనే దేశానికి నాయకుడు కావాలనే ఆయన ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరేది కాదు.
ఎందుకంటే ప్రత్యామ్నాయాలనేవి ప్రజల చైతన్యంలోంచి ప్రజానుకూల విధానాలకై పోరాటంలోంచి ప్రభవిస్తాయి. పోరాట ఐక్యత పాలకుల మెడలు వంచుతుందని తాజాగా రైతుపోరాటం నిరూపించింది. అలాంటి ప్రసక్తి ప్రయత్నం లేకుండా విగ్రహాలను బట్టి మారిపోతుందని మమత, రాహుల్, పికె ఎవరు అనుకున్నా పొరపాటే.
- తెలకపల్లి రవి