Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాల అల కేరళ
కేరళ... ప్రజా పోరాటాలకు పెట్టింది పేరు. ప్రతీ ఊరుకో
పోరాట చరిత్ర ఉంది. పోరుగడ్డ మీద సీపీఐ(ఎం) అఖిల
భారత మహాసభలు ఇటీవల జరిగాయి. ఈ మహాసభల
సందర్భంగా అక్కడకు వెళ్ళి.. పోరుగడ్డపై చారిత్రక ప్రాంతాల్లో
పర్యటించిన మహమ్మద్ అబ్బాస్ రాసిన కథనాలను నేటి
నుంచి ప్రచురిస్తున్నాం
- ఎడిటర్
సముద్రంలో అలలు నిరంతరం పోటెత్తినట్లే, కేరళలో ప్రజా పోరాటాలకు అలుపు సొలుపు లేదు. సముద్రంలో అలల హోరులాగే, అమరుల త్యాగాల జోరు ఉంటుంది. ఎడతెరిపిలేని పెనుగులాట, బ్రతుకంటేనే పోరాటం కదా, త్యాగాలు లేని పోరాటం ఉంటుందా! అందుకే ఆ త్యాగాలతోనె కేరళ నేల ఎర్రబారింది. ప్రతీ ఊరుకో పోరాట చరిత్ర ఉంది.
'కయ్యూరు' ఒక ప్రత్యేక పోరాట కేంద్రం. సీపీఐ(ఎం) అఖిల భారత 23వ మహాసభలకు వెళ్ళిన సందర్భంగా కయ్యూరు చూడాలని అనుకున్నాము. కయ్యూర్ అమరులు పట్టుబడిన ప్రాంతానికి స్థానికలు మిమ్మల్ని తీసుకెళ్ళారు. కయ్యూర్ ఊరు అడవిలానే ఉంది. ఇండ్లల్లో చెట్లు మొలిచాయా? లేక చెట్ల మధ్య ఇండ్లను ఇరికించారా? అనేది చెప్పడం కష్టం. రోడ్డంతా పచ్చటి దుప్పటితో ముసుగేసినట్టు కొబ్బరి, పోక, పనస ఇలా అనేకరకాల చెట్లతో కప్పబడి ఉంది. ఆకుపచ్చని సోరంగంలోకి వెళుతున్నట్టుంది మా ప్రయాణం. దారి పొడవునా ఆయా ప్రదేశాల విశిష్టత గురించి చెబుతూనే ఉన్నాడు మాతో వస్తున్న స్థానిక కామ్రేడ్.
మమ్మల్ని కలిసిన వారంతా ఎనభై ఏండ్ల క్రితం జరిగిన పోరాటాన్ని నిన్న మొన్న జరిగిన సంఘటన లాగా చెబుతుంటే ఆశ్చర్యంవేసింది. కయ్యూరులో నిరంతరం ప్రవహించే తేజస్విని నది ప్రవాహంలా ఆనాటి పోరాట చరిత్ర ఆ గ్రామ ప్రజల హృదయాల్లో మెదులుతూనే ఉంది. ఎప్పుడైనా పోరాటాల చరిత్ర ఘనీభవించి పోకూడదు, తరాలగుండా ప్రవహించి భవిష్యత్తుకు బాటలు వేయాలి. తేజస్విని నదిలోయలో నుంచి పైకి వెల్తూంటే ఒడ్డున కయ్యూరు అమరవీరుల స్మారక స్థూపం ఎర్రగా దగదగ మెరిసిపోతూ మనల్ని పలకరించింది. దానిని చూడగానే మనసు పులకరించింది. పిడికిలి బిగుసుకుంది. స్థూపం పక్కనే రెండు గదుల మ్యూజియం కమ్ ఆఫీసు ఉంది. మ్యూజియం హాలులో కయ్యూరు పోరాటం వివరాలు, అమరవీరుల చరిత్రను కండ్లకు కట్టినట్టు చూపించే ఫోటో గ్యాలరీ, ఆనాటి పేపర్ కటింగ్స్, కేసు విచారణ, జడ్జిమెంట్ పత్రాలు గోడల నిండా ఉన్నాయి. ఎనభై ఏండ్ల క్రితం జరిగిన పోరాటం ఇప్పుడు మన కండ్ల ముందే జరుగుతున్నట్లే అనిపిస్తుంది.
ఆ కాలంలోనే అమరుల కుటుంబాలను పరామర్శించడానికి కమ్యూనిస్టు పార్టీ తరపున పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ పిళ్ళైతో కలిసి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మారుమూల గ్రామానికి వచ్చాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పోరాటం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అయిందో, కమ్యూనిస్టు పార్టీ కయ్యూరు అమరుల త్యాగాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది. ఇ.కె నాయనార్ ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. ఇ.ఎం.ఎస్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్ళై లాంటి ఎందరో మహానుభావులు కయ్యూరు నేలపై తమ అడుగుజాడలను వదిలారు, పోరాట విత్తనాలు చల్లారు.
కయ్యూరులో 1941లో జరిగిన వీరోచిత పోరాటంలో 61 మందిపై కేసులు బనాయించి, నలుగురు వీరులను ఉరితీసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. కయ్యూరు అమరుల వీరోచిత గాథ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో భాగం. కయ్యూరు గ్రామం ఉత్తర కేరళ ప్రాంతంలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. రైతు ఉద్యమానికి పుట్టినిల్లు. గ్రామంలోని కూలీ-పేద రైతులు నంబియార్, నాయనార్ అనే ఇద్దరు భూస్వాముల ఉక్కు పిడికిలిలో పురుగుల వలె నలిగిపోతు జీవిస్తున్నారు. 1938-41లో ఆ జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. కౌలుదారులకు ఎలాంటి హక్కులూ లేవు. ఇక్కడ భూస్వాములను జెన్మీస్ అని పిలిచేవారు. వాశీ, నూరీ, ముక్కల్ తదితర పేర్లతో పన్నుల విధానం ఉండేది. పన్నులు విపరీతంగా పెంచి రైతుల వద్ద ధాన్యం గింజకూడా మిగలకుండా భూస్వాముల మనుషులు బలవంతంగా లాక్కు పోయేవారు. మలబార్ పోలీసులు భూస్వాములకు అండగా నిలబడి రైతులను, ప్రజలను తీవ్రంగా వేధించేవారు.
పెండ్లి చేసుకోవాలన్నా భూస్వాముల అనుమతి ఉండాల్సిందే. అనుమతి కోసం వెళ్ళినప్పుడు ఇంటి యజమానికి అనుమతితో పాటు పెండ్లి ఖర్చుల కోసం రూ. పది లేదా పదిహేను అప్పుగా ఇస్తారు. ఆ రుణంపై వడ్డీని భూస్వాములకు చెల్లించాలి. అలాగే, అప్పు తీసుకున్న వారు తాము పండించిన వరి, కూరగాయలు, పండ్లు భూస్వామికి ఇవ్వాలి. కొన్నేళ్లలో అప్పు తీర్చలేకపోతే తమ భూమిని వడ్డీ కోసం భూస్వాములకు అప్పగించి వారు తయారు చేసిన పత్రాలపై వేలిముద్రలు వేయాలి. ఆ రైతు భూస్వామి వద్ద వ్యవసాయ బానిసగా చేరాలి. భూస్వామిని రైతు సంతోష పెడితే, అతను రైతుకు భూమిని లీజుకు ఇస్తాడు. ఆ భూమిలో రైతు పండించిన పంట మొత్తం కౌలుగా చెల్లించాలి. జమీందారు దయతలిచి ఎంతో కొంత మోతాదులో వడ్లు తిరిగి ఇస్తాడు. కాళ్లపై పడి ఆ కృపను స్వీకరించాలి. నాయనార్, నంబియార్ ముందు కాళ్ళకు చెప్పులు ధరించడానికి వీలులేదు. భుజాలపై వరకు బట్టలు వేసుకోవడానికి లేదు. ఇంతటి దుర్భరమైన స్థితిలో ప్రజలు జీవిస్తున్న క్రమంలోనే కమ్యూనిస్టులు ఆ గ్రామానికి పరిచయం అయ్యారు. కూలీ-పేద రైతులచే సంఘం నిర్మించారు. అది దున్నుకునేవాడికి భూమిని, కౌలు రైతులకే పంట దక్కెలా చేసింది. భుజాల మీదుగా బట్టలు కట్టుకునేలా, పాదాలకు చెప్పులు ధరించి నయనార్, నంబియార్ ముందు నడిచేలా చేశారు. వివాహం నుంచి మరణం వరకు భూస్వాములకు ఆధీనంలో ఉండే స్థితిని సంఘం రద్దు చేసింది. భూస్వాముల దోపిడీని దాదాపుగా నిర్మూలించారు. దీంతో రైతు సంఘాలను రద్దు చేయాలని భూస్వాములు బ్రిటిష్ వారిని కోరారు.
ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పెరుగుతుందని గ్రహించిన బ్రిటిష్ పాలకులు మలబార్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఈ ఏరియాలో ఏర్పాటుచేశారు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆసరా చేసుకొని రైతులపై పోలీసు వేధింపులుపెరిగాయి. అకారణంగా అరెస్టుచేసి విచారణ పేరుతో కొట్టడం, సోదాల పేరుతో ఇండ్లను లూటీ చేయడం, ప్రశ్నించిన వారిపై హింసా, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. దీనిని నిరసిస్తూ 1941, మార్చి 28న కయ్యూరు గ్రామంలో శాంతియుత నిరసన ప్రదర్శన జరిగింది. మలబార్ ప్రత్యేక పోలీసు దళం ఓ పోలీసుకు అక్కడ డ్యూటీ వేసింది. ఆ పోలీసు ప్రదర్శనకు అడ్డువచ్చి ఒక మహిళా రైతుతో అనుచితంగా ప్రవర్తించడంతో ప్రదర్శనలో ఉన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పోలీసుపై రాళ్ళు విసురుతూ వెంబడించారు. తప్పించుకు పారిపోయే క్రమంలో ఆ పోలీసు తేజస్విని నదిలో పడి చనిపోయాడు. ఈ వార్త తెలిసిన మలబార్ ప్రత్యేక పోలీసు దళం కయ్యూరును రణక్షేత్రంగా మార్చింది. పిల్లలను, స్త్రీలను, వృద్ధులను కూడా వదలకుండా దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఇండ్లకు నిప్పుపెట్టి రైతుల తలలు పగులగొట్టారు. మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారు. ఇండ్లన్ని లూటీ చేశారు. 61 మందిపై కేసులు బనాయించి దొరికిన వారిని జైలుకు పంపారు. దొంగ సాక్ష్యాలు సృష్టించి, సాక్షులకు శిక్షణ ఇచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించిన నలుగురు యువకులకు మరణ శిక్ష విధించేలా చేశారు. ఆ నలుగురు యువకులను ఉరితీస్తే కమ్యూనిస్ట్ ఉద్యమం ఆగిపోతుందని భ్రమపడ్డారు.
1) మఠంలో అప్పు (రైతు సంఘం అధ్యక్షుడు), 2) కోయిర్లట్టన్ సిరుకందన్ (రైతు సంఘం సెక్రెటరీ), 3) బోడవర కుంజంబు (రైతు సంఘం వాలంటీర్), 4) స్కూల్ అబూ బకర్ (రైతు సంఘం వాలంటీర్ ఫోర్స్ లీడర్), 5) సూరికందన్ కృష్ణన్ (పాఠశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు)
ఈ ఐదుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. సూరికందన్ కృష్ణన్ మైనర్ కాబట్టి అతని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. మిగతా నలుగురిని బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 29, 1943న కన్నూర్ జైలులో ఉరితీసింది.
కయ్యూర్ వీరులకు సంఘీభావంగా దేశ నలుమూలల నుండి బస్తాల కొద్దీ ఉత్తరాలు వచ్చాయి. వారి ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ దేశంలో అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయినా బ్రిటిష్ ప్రభుత్వం వినలేదు.
నలుగురు కయ్యూరు అమరుల రాజకీయ పరిపక్వత, ధైర్యసాహసాలు చెప్పుకోదగినవి. తమకు ఉరిశిక్ష పడిందని ఏనాడూ వారు ఢలాీ పడలేదు. పార్టీకి, దేశ స్వాతంత్య్రం కోసం చేస్తున్న పోరాటానికి తమ అచంచలమైన విధేయతను ప్రకటిస్తూ పార్టీకి అనేక లేఖలు రాశారు. వారిని ఉరి తీయడానికి రెండ్రోజుల ముందు దేశ ప్రజలనుద్దేశించి కలచివేసే లేఖ రాశారు.
'మా క్షమాభిక్ష పిటిషన్‌ను భారతదేశ వైస్రారు తిరస్కరించారనీ, మేము మునుపటి కంటే ఉరిశిక్షకు దగ్గరగా ఉన్నామనీ, ఈ సమయానికి మీకు తెలిసి ఉండవచ్చని మేము నమ్ముతున్నాము. ఈ తిరస్కరణ వార్తను వినడానికి మేము చాలా సంతోషిస్తున్నాం, అప్పీల్ యొక్క తుది ఫలితం గురించి మేము చింతించం. మేం దాని ఫలితాల గురించి పట్టించుకోం. మేం మాకు స్వంతం కాదు, ఎందుకంటే మేం ప్రజలకు చెందినవారమని నమ్ముతున్నాం. మన దేశం కోసం చనిపోవడం గర్వంగా భావిస్తున్నాం. మేము పిరికివాళ్లమని అనుకోకండి. నిజమైన దేశభక్తులు, అమరవీరుల వలె మృత్యువును ధైర్యంగా ఎదుర్కొనేందుకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఇప్పుడు ఉరితీసినట్లయితే, ఈ త్యాగం భావితరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మేం దీనిని మా ప్రత్యేక హక్కుగా పరిగణిస్తాం. దేశ స్వాతంత్య్రం కోసం మరణాన్ని ఎదుర్కొనే అవకాశం లభించినందుకు గర్విస్తున్నాము. భగత్‌సింగ్ వంటి దేశభక్తుల వీరోచిత అమరత్వం మాకు స్ఫూర్తినిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ మా ప్రాణాలను కాపాడుకోవడానికిి సాధ్యమైనంత కృషిచేస్తున్నది. ఆ విషయం పార్టీ రాసిన ఉత్తరం ద్వారా, మా వద్దకు ఇంటర్వ్యూల కోసం వచ్చే వారి నుంచి కూడా వింటున్నాము. చెరశాల ఇనుప చువ్వల వెనుక నుంచి సహచరులకు మా హృదయపూర్వక అభ్యర్థన ఏమిటంటే, మీరు కష్టపడి, చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలబడండి, ప్రజలు పోరాటాలలో ముందుకు రావడానికి, సర్వస్వాన్ని త్యాగం చేయడానికి వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపండి. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నందుకు మేము చింతించండలేదు, నిరుత్సాహపడటంలేదు. మన దేశంలోని ఎందరో అమరవీరుల చరిత్రలు మాకు మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోనే స్ఫూర్తిని, ఓదార్పునిస్తున్నాయి'' అని రాసారు.
ఉరిశిక్ష అమలుకు కొన్నిరోజుల ముందు కొందరు సహచరులు వారిని జైలులో కలిసినప్పుడు వారు ప్రత్యక్షంగా చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు.
'ప్రజల కోసం నేను చేసినవన్నీ పార్టీ నాకు నేర్పింది. నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని పార్టీ భావిస్తే, అది నాకు సరిపోతుంది' అని యూనియన్ కార్యకర్త కామ్రేడ్ కుంజంబు అన్నారు. 'మా అమరవీరుల జీవితాల నుండి మేము ప్రేరణ పొందాము. వాళ్లలో చేరే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మేము చనిపోవడానికి భయపడబోమని సహచరులకు చెప్పండి. మా అమ్మ చాలా వృద్ధురాలు. నా సోదరులు చాలా చిన్నవారు. పార్టీ కోసం పని చేయమని చెప్పండి' అని వాలంటీర్ ఫోర్స్ నాయకుడు కామ్రేడ్ అబూ బకర్ అన్నారు.
''మీరు మన పార్టీ అభివృద్ధి చెందుతుందనే శుభవార్తతో వచ్చారు. అదనపు బలంతో మేం ఉరికొయ్యను అధిరోహిస్తాం. ఈ దేశ ప్రజల విముక్తి కోసం పని చేయడానికి, చనిపోవడానికి మేం పార్టీలో చేరాం' అని కామ్రేడ్ అప్పు అన్నారు.
'మేం సాధారణ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలం. మా నలుగురినీ ఉరి తీయవచ్చు. కానీ దేశంలో లక్షలాది మంది రైతులు ఉన్నారు. వారిని నాశనం చేయలేరు. వారి జీవనోపాధి, స్వేచ్ఛ కోసం మేం పని చేయలేకపోతున్నామనేది మాత్రమే మా ఆందోళన' అని అసోసియేషన్ కార్యదర్శి కామ్రేడ్ సిరుకందన్ అన్నారు. నలుగురు అమరుల త్యాగం కేరళలో మరిన్ని పోరాటాలకు ఊపిరి పోసింది. నేటికీ వారి పోరాట గాథలు కన్నూరు, కాసరగోడు జిల్లాల్లో మాత్రమే కాదు కేరళ రాష్ట్ర మంతా వినపడుతూనే ఉన్నాయి. కయ్యూర్ వీరుల త్యాగా లతో రెపరెపలాడుతున్న ఎర్రజెండా కేరళ ప్రజల గుండెల్లో, పశ్చిమ కొండల్లో ఎగురుతూనే ఉంది. ఉద్యమాల భాస్వరం కయ్యూర్ వీరుల స్ఫూర్తిని గుండెనిండా నింపుకుని మరో పోరాటకేంద్రమైన కరివెళ్ళూరు వైపు బయలుదేరాము.
- మహమ్మద్ అబ్బాస్