Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కయ్యూర్ అమరులను స్మరించుకుంటూ, ఆ పోరాటం గురించి సహచరులతో చర్చించుకుంటూ కరివెల్లూరులోని 'కరివెల్లూరు అమరుల స్మారక కేంద్రం' ప్రాంగణంలోకి అడుగు పెట్టాం. ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించిన ఏ.వి. కుంహంబును ఈ ప్రాంగణంలోనే సమాధి చేశారు. ఏ.వి. కుంహంబు కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ సహచరుడు. పోరాటంలో అమరులైన తిడిల్ కన్నన్, కీనేరి కుంహంబుల స్మారక స్థూపం తో పాటు, పోరాటం జరిగిన తీరును వివరించే చిత్రాలు, పోరాట కాలం నాటి వార్తాపత్రికలు అక్కడ సందర్శకుల కోసం ఉంచారు. ఈ ప్రాంగణంలో పార్టీ ఆఫీసు తో పాటు, ఓ లైబ్రరీ కూడా నడపబడుతోంది.
కరివెల్లూరు ఊరు బయట కాల్పులు జరిగిన ప్రదేశానికి స్థానిక కామ్రేడ్ మమ్మల్ని తీసుకెళ్ళారు. ఏ స్థలంలో అమరులు రక్తం చిందించారో ఆ భూమిని పార్టీ కొనుగోలు చేసింది. అందులో అమరవీరుల స్మారక స్థూపం నిర్మించి, దానిని విప్లవ పర్యాటక కేంద్రంగా మలిచింది.
రైతాంగ పోరాట నెత్తుటి నేల కరివెల్లూరు. ఈ రైతాంగ పోరాటాలు సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేక పోరాటాల సమ్మేళనం. కరివెల్లూరును కమ్యూనిస్టు చిత్రపటంలో గీసిన రైతాంగ పోరాటాల మూలాలు భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేకతలో ఉన్నాయి.
పయ్యనూర్, కరివెల్లూర్ పరిసర ప్రాంతాలు కోలాతిరి దేవాలయం కింద ఉన్న చిరక్కల్ రాజవంశానికి చెందినవి. చిరక్కల్ కోవిలకం కరివెల్లూర్లోని భూమిని స్వాధీనం చేసుకుని, స్థానిక అధికారులను లొంగదీసుకుని ఆలయ యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వ్యవసాయ భూములు, స్థానిక భూస్వాములు చిరక్కల్ రాజు చేతుల్లోకి వెళ్లాయి. రాజు, అతని గవర్నర్ల చేత సాధారణ రైతులు, కౌలుదారులు తీవ్రంగా ఆర్థిక దోపిడీకి గురయ్యారు.భూమిపై రకరకాల కౌలు వసూలు చేసేవారు. భూమికి, వ్యక్తికి మధ్య సంబంధాన్ని భూమికి చెల్లించే కౌలు ఆధారంగా నిర్వచించారు. తవ్వకం కౌలు, మేత కౌలు లీజు, వ్యవసాయ కౌలు వంటి రకరకాల రూపాల్లో దోపిడీ ఉండేది.
ఒక వైపు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బెదిరింపులు, పన్నుల చట్టాలు. మరోవైపు కోవిలకం కార్యనిర్వహకుల దోపిడీ, వేధింపులు భరించలేనంతగా ఉండేవి. ఈ దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా 1934లో తొలి యువజన సంఘమైన అభినవ భారత యువ సంఘం, 1935లో మొదటి రైతు సంఘమైన కర్షక సంఘం కరివెల్లూరులో ఆవిర్భవించాయి.కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కరివెల్లూర్కు గొప్ప పాత్ర ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛ కోసం మలబార్ ప్రాంతంలో రైతులు చేసిన తొలి పెద్ద తిరుగుబాటు కరివెల్లూర్ రైతాంగ పోరాటం. కన్నూరు జిల్లా, పయ్యన్నూరు తాలూకా లోని కరివెల్లూర్ వీరోచిత పోరాటానికి కేంద్రమైంది. భూస్వాములు, దొరలు, బ్రిటిష్ పాలనపై సాధారణ ప్రజలు చేసిన తిరుగుబాటే కరివెల్లూరు పోరాటం.
1946 డిసెంబర్ 20న కరివెల్లూర్ తిరుగుబాటు జరిగిన రోజు. ప్రజలు తీవ్రమైన ఆకలితో అలమటిస్తుంటే పండిన వడ్లను గ్రామం నుంచి అక్రమంగా తరలించాలని భూస్వాములు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం కుంహంబుకు, అతని సహచరులకు తెలిసింది, దానిని అడ్డుకొనేందుకు వారు వెంటనే ఊరు ఊరంతా కదిలించారు. కర్షక సంఘం, యువ సంఘం ఆధ్వర్యంలో తరలిపోతున్న వరి ధాన్యం బండ్లను అడ్డగించారు. వరి ధాన్యం తరలింపుకు వ్యతిరేకంగా పోరాడటంతో తిరుగుబాటు ప్రారంభమైంది. బండ్లను కదలనీయలేదు. ప్రజా ఉద్యమాన్ని చూసి భూస్వాములకు వణుకు పుట్టింది. దీంతో భూస్వాములకు రక్షణగా వచ్చిన మలబార్ ప్రత్యేక పోలీసు ప్లాటూన్ రంగంలోకి దిగింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిరాయుదులైన ప్రజలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపింది, కాల్పుల్లో తిడిల్ కన్నన్, కీనేరి కుంహంబులు నేలకొరిగారు. కినేరి కుంహంబు వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే.
పోరాటానికి నాయకత్వం వహించిన ఎం.వి కుంహంబు పోరాటంలో ముందున్నప్పటికీ, మలబార్ స్పెషల్ పోలీసుల దాడి నుంచి గాయాలతో బయటపడ్డారు. మొదటి రౌండ్లో బులెట్ దెబ్బకు కుంహంబు రక్తం మడుగులో పడిపోయాడు. చనిపోయాడనుకుని వదిలేసారు. ఈ వీరోచిత పోరాటంలో అనేక మంది గాయపడ్డారు. ఆ నేలంతా నెత్తుటితో తడిచిపోయింది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లకు తగిలిన బుల్లెట్ దెబ్బ మరకలు నేటికీ ఉన్నాయి. తాము పండించిన పంట తమకు తినడానికి లేకుండా చేసి తరలించుక పోవడాన్ని ప్రజలు సహించలేక పోయారు. రైతుల చేతిలో భూములు లేక పోవడం వలన వారు పండించిన పంటలపై వారికి హక్కు లేదు. ఆ పంటను తామే వాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేయవలసి వచ్చింది.
భూస్వామ్య వ్యవస్థలో భూమిపై హక్కే సంపదకు, ఆహార సంపాధనకు ఆధారం. ఈ అవసరమే భూమి లేని నిరుపేదలను, కౌలుదారులను బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబెట్టి, సామాజిక తిరుగుబాటుకు నేలను సిద్ధం చేసింది. కరివెల్లూరు పోరాటానికి ముందు కొంతమంది భూస్వాములకు మాత్రమే భూమి ఉండేది, కానీ కరివెల్లూరు పోరాటం ఫలితంగా రైతులకు భూమి దక్కింది. వారి పోరాటం, త్యాగాలు వదా కాలేదు. భూములపై హక్కులు పొందారు. భూస్వాముల పీడ విరగడైంది. కరివెల్లూర్ వీరుల అమరత్వం అక్కడి ప్రజల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది. పార్టీ నిర్వహించే సంస్మరణ సభకు నేటికీ వేలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో అమరులు చిందించిన రక్తం ఆ ప్రాంత ప్రజల మనోభావాలలో ఇంకా తడి ఆరిపోలేదు. ఇంకా వారిని ఉత్సాహ పరుస్తూ ఉద్యమాలకు పురికొల్పుతూనే ఉంది.
కయ్యూరు, ఉన ృపురవాయిలారు, కరివెల్లూరు ఇవి కేవలం ప్రాంతాల పేర్లో, గ్రామాల పేర్లో కాదు విప్లవ స్ఫూర్తిని రగిలించే అమరవీరులను కన్నపొత్తిల్లు. పోరాట వేగుచుక్కలు. ఉత్తేజాన్ని వెదజల్లే విప్లవ ఫౌంటెన్లు. కేరళ తీరంలో జరిగిన చిన్నా, పెద్దా లెక్కలేనన్ని, సామాజిక, వ్యవసాయ పోరాటాలు కేరళలో బలమైన వామపక్ష రాజకీయాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కరివెల్లూరు ప్రజలు నాలుగు మెతుకుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు హ దయాన్ని బరువెక్కించింది. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా ఆకలి తో అలమటించే వారు 14 కోట్లమంది ఉన్నారంటే ఆనాడు కరివెల్లూరు పోరాటం ముందుకు తెచ్చిన ఆకలి సమస్య, భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అందుకే ఆ నెత్తుటి తడి ఆరిపోలేదు. అసంపూర్తిగా మిగిలిన వారి లక్ష్యాన్ని సాధించడానికి అంకితం అవడం తప్ప వారి త్యాగాలకు మనమేం ఇవ్వగలం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ గూండాలు నలుగురు కామ్రేడ్స్ ను సజీవ దహనం చేసి, ఒక కామ్రేడ్ ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యచేసిన చీమేని వైపు బయలుదేరాము.
- మహమ్మద్ అబ్బాస్