Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి స్వతంత్రంగా వ్యవహరించే రాజ్యాంగ సంస్థలన్నిటినీ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. తన మాట వినని అధికారుల, రాష్ట్రాల, రాజకీయ నాయకులపైకి వాటిని ప్రయోగించి తాము చెప్పినట్టు నడుచుకోకపోతే ఖబర్దార్ అన్నట్లు వ్యవహరిస్తున్నది. ఆ రకంగానే న్యాయ వ్యవస్థనూ ఆసాంతం ఆక్రమించి, తమ అదుపాజ్ఞల్లో నడపాలని బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారన్న కథనాలొస్తున్నాయి. అదే జరిగితే మన దేశానికి పెను ప్రమాదమే. పాలకులు, అధికారులు ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, కోర్టుల ద్వారా న్యాయం పొందగలమనేది ఓ నమ్మకం. ఎంతో కొంత మిగిలి ఉన్న ఆ నమ్మకానికి కూడా బీజేపీ పాలకులు సమాధి కడుతున్నారు. కోర్టుల స్వతంత్రత వలనే ప్రజాస్వామ్య సమతుల్యత ఈ మాత్రమైనా కాపాడబడుతున్నది. ఇప్పుడు దాన్ని కూడా దెబ్బతీయడమంటే నియంతృత్వానికి రహాదారులు నిర్మించడమే. సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తే ''న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి'' అన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎనిమిదేండ్లలో న్యాయదేవత ఎన్నిసార్లు అధికారంతో బుసలు కొడుతున్న నాగుపాము గాట్లకు బలైందో! న్యాయవ్యవస్థ స్వతంత్రతపై వస్తున్న కామెంట్లను, రాజకీయమనో, ఆరోపణలనో ఆషామాషీగా కొట్టిపారేయలేం. న్యాయమూర్తుల నియామాకం లో కొలిజియంపై ప్రభుత్వం పెత్తనం చేస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మెన్ మార్కండేయ కట్జూ వెల్లడించిన విషయమూ మనకు తెలిసిందే. అయినప్పటికీ అలాంటి కామెంట్స్ రాకుండా సరిదిద్దుకున్న పరిస్థితి లేదు. పైగా అవి మితిమీరుతున్నాయి. కనుకనే భారత న్యాయ వ్యవస్థలో తొలిసారిగా న్యాయమూర్తుల బృందం నోరువిప్పి సుప్రీం కోర్టు నిర్వహణ సరిగా లేదని ప్రకటించింది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టనే దెబ్బతీస్తుంది. న్యాయ వ్యవస్థ పతనం మొత్తం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని 2018 జనవరి 11న మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ప్రకటించిన విషయం మరిచిపోలేం.
''న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి. అన్ని స్థాయిల్లో న్యాయ వ్యవస్థ సమగ్రత, స్వతంత్రతను మించిన ముఖ్యమైన అంశం మరొకటి లేదని గుర్తించాలి''... భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ 2021 నవంబర్ 14న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నేషనల్ లెవెల్ లీగల్ అవేర్నెస్ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో చెప్పిన మాటలివి. భారత న్యాయ వ్యవస్థ ఎంతగా స్వతంత్రతను కోల్పోయిందో, ఇంకా ఎంత స్వతంత్రతను కోల్పోయే ప్రమాదం ఉందో సిజేఐ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. జడ్జీల నియామాకం నుంచి తీర్పుల వరకు రాజకీయాలు కలుగజేసు కుంటున్నాయి. మోడీకి సంబంధం ఉన్న రాఫెల్ కేసును డిస్మిస్ చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సవాలు చేస్తోందనీ, దాని వలన ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని 2021 డిసెంబర్ 13న కేరళ సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో లెక్కలతో సహా వివరించారు. ఈ పరంపరలో ఇంతమంది పెద్దల అభిప్రాయాలు చూస్తే ఈ ఎనిమిదేండ్ల కాలంలో న్యాయవ్యవస్థ మరింత స్వతంత్రతను కోల్పోయిందని అర్థమవుతోంది. 2014లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే కొలిజియం పంపిన ప్రతిపాదనల్లోని గోపాల సుబ్రమణ్యం పేరును మోడీ ప్రభుత్వం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లోధాతో చర్చించకుండానే నిరాకరించింది. ఎందుకంటే సొహ్రబుద్ధీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో అప్పటి గుజరాత్ హౌం మంత్రి అమిత్ షాపై హత్యాభియోగాల నమోదుకు కారణమయ్యాడని గోపాల సుబ్రమణ్యంను జడ్జీ కాకుండా కక్ష సాధించారని వార్తలొచ్చాయి. ఆ హత్య కేసును ముంబై కోర్టులో విచారిస్తున్న జస్టిస్ లోయా వంటినిండా రక్తపు మరకలున్నా నాగపూర్‌లో గుండె పోటు కథతో శవమైనాడు. ఆయన హతమైన తర్వాతే అప్పటి సిజేఐ నియమించిన ధర్మాసనం అమిత్ షాకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2021 ఆగస్టులో జార్ఖాండ్‌లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనందను హత్య చేయడం లాంటి ఆందోళనకర పరిస్థితులన్నీ బీజేపీ పాలనలో పరిపాటిగా మారాయి. ఒక వైపు నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ లాంటి ఎందరో మేధావులు, ప్రజాస్వామిక, లౌకికవాదులు హత్యకు గురై ఏండ్లు గడుస్తున్నా దర్యాప్తుల్లో, శిక్షల్లో జాప్యమే కొనసాగుతున్నది. మరో పక్క గుజరాత్ అల్లరలను, మోడీని వ్యతిరేకించిన ఐపిఎస్ ఆఫీసర్ సంజీవ్ బట్‌ను మాత్రం జీవిత ఖైదు చేయడం మన చూశాం. మరోవైపు భీమాకోరేగావ్ కేసులో దేశంలోని ఏంతో మంది మేధావులు జైల్లలో మగ్గుతున్నారు. తోంభై శాతం వికలాంగుడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబను దేశానికి ప్రమాదమనే సాకుతో అండా సెల్లో బంధించిన దుస్థితి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ వచ్చిన పిటీషన్లపై తాత్కాలిక స్టే ఇవ్వడానికి నిరాకరించి, రాఫెల్ కేసులో మోడికి క్లీన్ చిట్ ఇచ్చిన రంజన్ గగోరు రిటైర్డ్ అయిన నాలుగు నెలల్లోనే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడైపోయాడు. తరువాత ఆ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించినా తీర్పును మాత్రం దాచిపెట్టాల్సిన తీర్పుల జాబితాలో చేర్చేశారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్లకు నేటికీ అతిగతీ లేదు. కాశ్మీర్లో ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు విధించడం, ఎల్లప్పుడూ 144 సెక్షన్ విధించడం, న్యాయవాదు లను అదుపులోకి తీసుకోని నిర్భంధించడాన్ని సవాల్ చేస్తూ కాశ్మీర్ టైంస్ ఎడిటర్ అనురాధా బాసిన్ వేసిన పిటీషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కబుర్లను ఫ్రీగా చెప్పి, ఈ కేసును హైకోర్టుల్లో తేల్చుకొమ్మని తిప్పి పంపింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అపెక్స్ కోర్టుకే ధైర్యం చాలనప్పుడు హైకోర్టులు మాట్లాడగలవా? రాజ్యాంగ రక్షణకు ఉద్దేశించిన న్యాయవ్యవస్థ స్వతంత్రతను కోల్పోవడం మూలంగా, రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గడం మూలంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతున్నది. బాబ్రీ మసీదు విషయంలో దాఖలైన 18 రివ్యూ పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంత విలువైన కేసుల్లో రాజ్య పాలన చేస్తున్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, ఇవ్వాల్సిన తీర్పుల్ని మూలకు పడేయడం బీజేపీ పాలనలోనే చూస్తున్నాం. జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన అత్యవసరతను కూడా జాప్యం చేసే కోర్టులు బీజేపీ భావాజాల అనుకూలత కోసం మాత్రం దూకుడు ప్రదర్శిస్తు న్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 జూలై 27న 498ఎ ను మహిళలు దుర్వినియోగ పరుస్తున్నారన్న అభియోగంతో పురుషాధిక్యతకు తోడ్పడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరిచింది. ఇది చాలదన్నట్లు 2018 ఎప్రిల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సవరిస్తూ తీర్పు వెలువరిచారు. ఈ తీర్పులు ఇస్తున్న సమయంలో కూడా ప్రతిరోజు ఏదో మూల వేల సంఖ్యలో మహిళల మీద, దళిత, గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అడవులను ఆక్రమించుకున్నారని 10లక్షల మంది ఆదివాసు లను అడవుల నుంచి ఖాళీ చేయించా లని 16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను 2017 ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. అడవిని ఆదివాసులను వేరు చేసి చూడలేం. కానీ ఈ తీర్పు మైనింగ్ చేసే మల్టినేషనల్ కంపెనీలకు అడవు లను అప్పజెప్పే కేంద్ర ప్రభుత్వ కుట్రకు మద్దతు పలకినట్లున్నదని అటవీ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడు తున్నారు. ఇలా అనేక విషయాల్లో ఎన్నో తీర్పులు బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో వెలువడ్డాయన్న విమర్శలు వెలువడుతున్నాయి.
ఇలా పాలక పార్టీకి అనుకూలంగా తీర్పులిస్తూ పోవడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, న్యాయవ్యవస్థ మనుగడకు మరణశాసనం. ప్రజలకు ప్రజాస్వామ్యంపై ఈ కాస్త నమ్మకం కూడా కనమరుగైతే రాబోయే రోజుల్లో అంతర్యుద్దాలకు, అధికార నియంతృత్వాలకు దారితీస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం గొంతెత్తడం ఇప్పుడు భారతీయుల బాధ్యత.
- ఎం. విప్లవకుమార్
సెల్:9515225658