Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రజల వద్ద ఉన్న కొనుగోలు శక్తి పడిపోతుంటే ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం కలగలసి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలను ఈ భారాల నుంచి ఆదుకోవలసిందిపోయి ప్రభుత్వాలే ప్రజలపై భారాలు మోపుతున్నాయి. గత 12 నెలలుగా టోకు ధరల సూచిక వరుసగా 10శాతానికి మించి పెరుగుదలను నమోదు చేసింది. తాజాగా 2022 ఫిబ్రవరిలో 13.1శాతం నమోదు కాగా, మార్చి 2022లో 14.55శాతానికి ఎగిసిపడింది.
ప్రధానంగా విద్యుత్తు, చమురు ధరలతోపాటు, ప్రజలు నిత్యం ఉపయోగించే సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణం. ఫిబ్రవరిలో విద్యుత్తు, చమురు ధరలు 2.7శాతం పెరిగితే మార్చి నెల వచ్చే సరికి అది రెండింతలకు మించి 5.68శాతం పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు ఫిబ్రవరిలో 13.39శాతం పెరిగితే మార్చిలో 15.54శాతం పెరిగాయి. మార్చి 2021లో టోకు ధరల సూచిక 7.89శాతం పెరుగుదల నమోదు చేస్తే మార్చి 2022 నాటికి 14.55శాతం- అంటే దాదాపు రెట్టింపు పెరిగింది.
ఇంకోపక్క సామాన్య కార్మికులు, వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్న ఆదాయాలతో తక్కిన తరగతుల ప్రజలకన్నా ఎక్కువ నలిగిపోతున్నారు. ఉపాధి కూలీల దినసరి వేతనం అమాంతం సగటున రూ.160కి పడిపోయింది. అంటే దాదాపు 25శాతం తగ్గింది!
దేశ ఆర్థిక వృద్ధి రేటు 9శాతం పైనే ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధులు నిన్న మొన్నటి దాకా చెప్తూ వచ్చారు. ఐఎంఎఫ్ కూడా జనవరి 2022లో 9శాతం వృద్ధి రేటును మన దేశం సాధించగలుగుతుందని జోస్యం చెప్పింది. కాని తాజాగా దానిని 8.2శాతానికి కుదించింది. అయితే ఇది 8శాతం మాత్రమే ఉంటుందని ప్రపంచ బ్యాంకు, 7.5శాతమేనని ఏషియన్ అభివృద్ధి బ్యాంకు, 7.2శాతమే అని రిజర్వు బ్యాంకు అంచనాలు ప్రకటించాయి. పైగా 2023-24 సంవత్సరానికి ఇది ఇంకా తగ్గి 6.9శాతం మాత్రమే ఉండబోతున్నదని ఐఎంఎఫ్ ప్రకటించింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా 3.6శాతం మాత్రమే ఉంటుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 4.4శాతంగా ఉండవచ్చునని వేసిన ముందస్తు అంచనాలు తప్పాయని ఐఎంఎఫ్ ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని సరుకుల పంపిణీ వ్యవస్థ దెబ్బతినడం ఒక కారణం. తాజాగా చైనా మరోసారి కోవిడ్ ముప్పుని ఎదుర్కొనే పోరాటంలో లాక్డౌన్లు విధించడం వలన ఆ దేశంలో ఉత్పత్తి రంగం, వాణిజ్యం కుంటుపడ్డాయి. కోవిడ్ సంక్షోభం వచ్చి పడడంతో అప్పటికే చిక్కుల్లో ఉన్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత సంక్షోభంలో పడింది. 2022లో తిరిగి కోలుకో వచ్చునన్న అంచనాలు ఉక్రెయిన్ సంక్షోభంతో మళ్లీ తప్పాయి.
కోవిడ్ అనంతరం ప్రపంచ వాణిజ్యంలో కొంత వేగం పెరిగింది. ముఖ్యంగా 42,000 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు పెరుగుదల నమోదు చేశాయి. అయితే ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ 2021తో పోల్చితే 2022లో ఈ ఎగుమతుల వృద్ధి పడిపోతుందని భావిస్తోంది. ముందు అంచనా వేసినట్టు 4.7శాతం వృద్ధి కాకుండా కేవలం 3 శాతమే ఉంటుందని తాజాగా ప్రకటించింది.
కోవిడ్ పూర్వ స్థితికి ఉపాధి లభ్యత చేరాలంటే అందుకు ఇంకో నాలుగేండ్లు ఆగాలని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2019 నాటికి ఉన్న ఉపాధి అవకాశాలు 2026 నాటికి కాని మళ్లీ రావు. మరి ఈ ఏడేండ్ల కాలంలో పెరిగిన నిరుద్యోగం మాటేమిటి? అంటే 2023 తర్వాత కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు. 'ఇది సంక్షోభం మీద వచ్చి పడిన మరో సంక్షోభం' అని ఐఎంఎఫ్ అభివర్ణించింది.
'సామాన్య కుటుంబాలు ఈ సంక్షోభ భారాలను ఇంకెంత మాత్రమూ తట్టుకోగలిగిన పరిస్థితిలో లేవు' అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. ఈ సంక్షోభ పర్యవసానంగా సాంఘిక అశాంతి పెరుగుతుంది. అది ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతుంది. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని తక్షణమే అదుపు చేసే ద్రవ్య విధానాలను చేపట్టాలని, మూడో ప్రపంచ దేశాల రుణ భారాన్ని తగ్గించే విధంగా నిర్ణయాలను తీసుకోవడానికి సంపన్న దేశాలు ముందుకు రావాలని క్రిస్టాలినా సూచించారు. తక్షణమే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోవడం అత్యవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కాని 'ఎద్దు పుండు కాకికి రుచి' అన్న చందాన సంపన్న దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇక మన దేశంలో మోడీ ప్రభుత్వ వైఖరి కూడా ఇందుకు భిన్నంగా లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ పోతూనే ఉన్నారు. దానికి తోడు విద్యుత్ చార్జీల భారాన్ని సైతం మోపుతున్నారు. ఉపాధి హామీ కేటాయింపులు తగ్గాయి. తాజాగా జీఎస్టీ రేట్లను సవరించి మరింత ఆదాయాన్ని సమీకరించే యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సంక్షోభ భారాలతో ప్రజలు నలిగిపోతుంటే బీజేపీ-హిందూత్వ శక్తులు మాత్రం విద్వేష జ్వాలలను ఎగదోస్తూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం లక్ష్య పెట్టకుండా దేశ రాజధానిలోనే బుల్డోజర్లతో జహంగీర్‌పురిలో ఇళ్లను కూల్చివేయడానికి పూనుకోవడం యథాలాపంగా జరిగినది కాదు. ఈ ధోరణి వెనక మోడీ-షా ద్వయం ఇస్తున్న దన్ను ప్రధాన కారణం.
అటు సంక్షోభ భారాలు, ఇటు విద్వేషపూరిత దాడులతో నలిగిపోతున్న ప్రజానీకాన్ని సంఘటితం చేసి, వారికి ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యత వామపక్షాల మీదే ఉంది. జహంగీర్‌పురిలో బృందాకరత్ ప్రజలకు అండగా నిలిచిన తీరు అభినందనీయమే కాదు. మనమంతా ఆచరించాల్సిన విధానం.
- సుబ్రహ్మణ్యం