Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మక్రాన్ గెలిచినందుకు సంతోషం
వెలువడినా లీపెన్‌కు ఆ స్దాయిలో
ఓట్లు రావటం ఆందోళన కలిగించే
పరిణామంగా కూడా అభిప్రాయాలు
వచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి
ఉచ్చు బిగుస్తున్నదని కమ్యూనిస్టు
పార్టీ పేర్కొన్నది.
ఆదివారం (ఏప్రిల్ 24) జరిగిన తుది విడత ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ విజయం సాధించాడు. ప్రత్యర్ధి పచ్చిమితవాది లేదా ఫాసిస్టుగా పిలుస్తున్న మారినే లీపెన్ 41.5శాతం ఓట్లు తెచ్చుకోగా మక్రాన్‌కు 58.5శాతం వచ్చాయి.గత (2017) ఎన్నికల్లో పదకొండు మంది తొలి దఫా ఎన్నిక పోటీ పడగా తొలి నలుగురికి 24.01 నుంచి 19.58శాతం మధ్య రాగా మిగిలిన వారెవరికీ ఒక అంకెకు మించి ఓట్లు రాలేదు. తాజా ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ పడగా మక్రాన్‌కు 27.85, మారినే లీపెన్‌కు 23.15, వామపక్ష మెలాంచన్‌కు 21.95శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన వారందరూ ఒక అంకెతోనే సరి పెట్టుకున్నారు. ఫ్రెంచి నిబంధనల ప్రకారం తొలి రెండు స్దానాల్లో ఉన్న వారు తుదివిడతలో పోటీ పడాల్సి ఉంది. అర్హత కోల్పోయిన పార్టీల మద్దతు దారులు తుది విడత ఎవరో ఒకరిని ఎంచుకొని ఓటు వేస్తారు. 2022 ఎన్నికల్లో, అంతకు ముందు కూడా మక్రాన్, లీపెన్‌లే తుది విడత పోటీ పడ్డారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఉన్నంతలో తక్కువ హాని చేసే వారిని ఎన్నుకుందామనే వైఖరిని ఇతర పార్టీలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా పోటీ చేసిన ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష , హరిత పార్టీలు కూడా మక్రాన్‌కు మద్దతు ప్రకటించాయి. లీపెన్‌కు మితవాదశక్తులు బాసటగా నిలిచాయి.
తొలి విడత కమ్యూనిస్టు పార్టీ పోటీకి దిగకుండా దానికి వచ్చిన 2.28శాతం ఓట్లను మెలాంచన్‌కు బదలాయించి ఉంటే 24,13 శాతంతో రెండవ స్దానంలో ఉండి తుది విడత మక్రాన్‌తో పోటీ జరిగేదని, మితవాద-వామపక్ష శక్తుల పోటీగా నిలిచేదని కొందరు పేర్కొన్నారు.ఇదే సూత్రం పచ్చి మితవాద పార్టీలకూ వర్తిస్తుంది. ఎరిక్ జుమౌర్ అనే పచ్చి మితవాదికి 7.07శాతం వచ్చాయి, ఆ రెండు పార్టీలు కలిసినా వారే మొదటి స్ధానంలో ఉండేవారు. గ్రీన్స్, మరో వామపక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లను కూడా కలుపు కుంటే మొత్తం 30శాతం వరకు ఉన్నాయి. వామపక్షశక్తుల మధ్యరాజకీయ విబేధాల కారణంగానే ఎవరికి వారు తమ వైఖరిని ఓటర్ల ముందుంచి పోటీ చేశాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే పోటీ మక్రాన్-వామపక్ష అభ్యర్ధి మధ్య జరిగినా గెలుపు మక్రాన్‌దే అన్నది స్పష్టం. మితవాద, పచ్చిమితవాద శక్తులు అధికారం కోసం కుమ్ము లాడుకోవటం తప్ప వారి విధానాల్లో పెద్ద తేడాలేమీ లేవు. మక్రాన్ ఐరోపా సమాఖ్యలో ఉండాలనే వైఖరి, లీపెన్ దానికి భిన్నమైన విధానం కలిగి ఉన్నారు తప్ప దేశ ఆర్ధిక విధానాల్లో వారి మధ్యపెద్ద తేడాలేమీ లేవు.
తనకు వామపక్ష అభిమానులు ఓటు వేశారని తెలుసునని, వారు లీపెన్‌న్ను అడ్డుకున్నారని ఫలితాల అనంతరం చెప్పిన మక్రాన్ తనకు ఓటు వేసిన వారందరూ తన మద్దతుదారులు కాదని కూడా చెప్పారు. తాను ప్రకటించిన విధానాలకే కట్టుబడి ఉంటాను తప్ప వామపక్ష అభిమానులు తనకు ఓటేసినంత మాత్రాన ఆ శక్తులు ముందుకు తెచ్చిన విధానాలను తాను అమలు జరపాల్సిన అవసరం లేదనే సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. మక్రాన్‌కు ఓటు వేసినంత మాత్రాన అతగాడి విధానాల మీద భ్రమలుండి కాదని, ఇద్దరు శత్రువులలో ఉన్నంతలో తక్కువ హాని చేసే వారినే ఎంచుకొని వేశామని, తమ ఉద్యమాలకు ఎలాంటి విరామం ఉండదని కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాల మక్రాన్ ఏలుబడిని చూసినపుడు ఒకశాతం ధనికులకు మాత్రమే తగిన ప్రతినిధిగా, 99శాతం మందిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన పెద్దమనిషిగా దర్శనమిచ్చాడు. కొత్తగా ఉపాధి లేకపోగా ఉన్న కార్మికులను సులభంగా వదిలించుకొనేందుకు యజమానులకు వీలు కల్పించాడు. ఫలితంగా తక్కువ వేతనాలకు పని చేస్తారా ఉద్యోగాల నుంచి ఊడగొట్ట మంటారా అంటూ ఓనర్లు ఉన్నవారికి, కొత్తగా తీసుకున్న వారికి వేతనాలను తగ్గించారు. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులను తగ్గించాడు, ఆ మేరకు సామాన్యుల సంక్షేమ పథకాలకు కోత పెట్టాడు. దానికి తోడు మిలిటరీ ఖర్చును కూడా పెంచాడు.దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు 35శాతం మంది దివాలా తీసినట్టు అంచనా.ప్రస్తుతం 1,07,000 దివాలా కేసులు నడుస్తున్నాయి. ఈ పరిణామాలను చూసిన తరువాత మక్రాన్ విధానాల మీద అనేక మందికి భ్రమలు తొలిగి అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు, లేదా ఖాళీ బాలట్ పత్రాలను వేశారు.
గతంలో నేషనల్ ఫ్రంట్ పేరుతో ఉన్న పార్టీ ప్రస్తుతం నేషనల్ రాలీ పార్టీగా పేరు మార్చుకుంది. తాజా అభ్యర్ధి మారినే లీపెన్ తండ్రి జీన్ మారీ లీపెన్ తొలిసారిగా 2002 ఎన్నికల్లో పోటీ చేసి 18శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో కూతురు మారినే లీపెన్ 33.9శాతానికి, తాజాగా 41.5శాతానికి పెంచుకుంది.ఈ పరిణామాన్ని తన గెలుపుగా భావిస్తున్నాను తప్ప ఓడినట్టు భావించటం లేదని, జనానికి ఒక ఆశాభావం కల్పించినట్టు ఆమె అన్నారు. ఫ్రాన్స్‌లోకి వలస కార్మికులను అను మతించరాదని, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతూ నేషనల్ పార్టీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. మక్రాన్‌తో పోలిస్తే ఈ పార్టీ కార్పొరేట్లకు మరింతగా అనుకూలమని, అయితే ఈ సారి ఎన్నికల్లో దేశంలో పెరిగిన ద్రవ్యోణం, ధరలు, జీవన వ్యయం, పన్నుల అంశాలను కూడా ప్రచార అంశం చేసింది. ఇది కూడా ఓట్లు పెరిగేందుకు దోహదం చేసిందని చెబుతు న్నారు. పెన్షన్ చెల్లింపులను తప్పించు కొనేందుకు ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతానని మాక్రాన్ చెబితే 62 సంవత్సరాలకు మించకూడదని నేషనల్ పార్టీ పేర్కొన్నది. అంతే కాదు, దిగజారిన ఆర్ధిక పరిస్ధితులను గమనంలో ఉంచుకొని తాము వస్తే చమురు మీద పన్నులు తగ్గిస్తామని, ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల కోసం కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. తాము విస్మరణకు గురైనట్లు భావిస్తున్న వారు ఈ నినాదాలకు ఆకర్షితులైనట్టు భావిస్తున్నారు. పలు చోట్ల స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేసినప్పటికీ జాతీయంగా అధికారానికి వచ్చే స్ధితి లేనందున వారు కూడా మక్రాన్ లేదా నేషనల్ పార్టీలవైపు మొగ్గుతున్నారు.
ఈ ఎన్నికలను కూడా అమెరికా మీడియా ఉక్రెయిన్ సంక్షోభానికి ముడిపెట్టేందుకు ప్రయ త్నించింది. గతంలోను, ఇటీవల తమ ప్రచారానికి అవసరమైన రుణాలను రష్యన్ బాంకుల నుంచి తీసుకోవటం వంటి ఉదంతాలు, గతంలో పుతిన్‌కు నేషనల్ పార్టీ మద్దతు ప్రకటించిన వాటిని పట్టుకొని ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలు నాటో వ్యతిరేక-పుతిన్ అనుకూల మారినె లీపెన్ వైఖరిపై తీర్పుగా ఉంటాయని చిత్రించింది. అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన అనుభవాలు, ఫలితాలను గమనంలోకి తీసుకున్న వామపక్ష శక్తులు జూన్‌లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు చీలకుండా చూడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాయి. అటువంటి సర్దుబాటు కుదిరితే కొన్ని చోట్ల వాటికి మొత్తంగా 30శాతం ఓట్లు ఉండటం, స్ధానికంగా జరిగే ఎన్నికలు గనుక ఇతర పార్టీలకు ఓటు చేసిన వాటి అభిమానులు తిరిగి వామపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉన్నందున మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. తొలి దఫా ఎన్నికల్లో వామపక్షాలకు వచ్చిన ఓట్లను చెదరకుండా చూస్తే మక్రాన్ - మారినె లీపెన్ ప్రాతినిధ్యం వహించే శక్తులను దెబ్బతీయ గలమని అధ్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఫాబియన్ రౌసెల్ చెప్పాడు. మే దినోత్సవ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా వామపక్ష ఐక్యతాయత్నాలకు శ్రీకారంచు డతామని అన్నాడు. మక్రాన్ గెలిచినంత మాత్రాన అతని విధానాలకు మద్దతు ఇచ్చినట్టు కాదని అలాగే నేషనల్ పార్టీ ఓడినంత మాత్రాన పచ్చి మితవాద శక్తుల ప్రమాదం తప్పినట్టు కాదని అన్నాడు. వామపక్ష నేత మెలాంచన్ కూడా ఐక్యతాయత్నాలను ప్రారంభించాడు. గతంలో అధికారాన్ని చలాయించిన సోషలిస్టులు కూడా సుముఖంగానే ఉన్నట్టు వార్తలు. మితవాద శక్తులు కూడా పెరిగిన ఓట్లశాతంతో పార్లమెంటులో మెజారిటీ సాధించాలని ముందుకు పోతున్నారు. కార్మికవర్గానికి ముప్పు ముంచుకు వస్తున్నదని కార్మిక సంఘం సీజీటీ ముందే హెచ్చరించింది. పార్లమెంటులో ఈ రెండు శక్తులది పై చేయికాకుండా చూడాలని 66శాతం మంది ఓటర్లు పేర్కొన్నట్టు ఒక సర్వే వెల్లడించింది.మరొక సర్వేలో కూడా అదే తేలింది.
ఒక నాటో సభ్యదేశంగా ఫ్రాన్సు కూడా రష్యా మీద ఆంక్షలను సమర్ధించినప్పటికీ అమెరికా, బ్రిటన్ అనుసరించే వైఖరితో పూర్తి ఏకీభావం లేదు. ఆ ప్రభావం తన మీద పడకుండా చూసు కొనేందుకు మక్రాన్ ప్రయత్నించాడు. ఇప్పుడు ఎన్నిక ముగిసింది కనుక అమెరికాతో కలసి శత్రుపూరితంగా ముందుకు పోతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. జూన్‌లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోవటం కూడా అవసరమే కనుక అవి ముగిసే వరకు వైఖరిలో మార్పు ఉండదు. ప్రతిపక్షాలకు మెజారిటీ వస్తే ఇబ్బందుల్లో పడతాడు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ఇప్పటికే ఇతర పశ్చిమ దేశాలతో పాటు ఫ్రాన్సు మీద కూడా పడింది. అది కొనసాగితే కార్మికవర్గ ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. తీవ్ర అసంతృప్తి కారణంగానే తొలి దఫా ఎన్నికల్లో 73.69శాతం మంది ఓట్లు వేయగా తుది దఫా 71.99శాతం మాత్రమే పోలైనట్లు భావిస్తున్నారు. మక్రాన్ గెలిచినందుకు సంతోషం వెలువడినా లీపెన్‌కు ఆ స్దాయిలో ఓట్లు రావటం ఆందోళన కలిగించే పరిణామంగా కూడా అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ఉచ్చు బిగుస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. గత ఐదు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా (72శాతం) పొల్గన్న తొలి ఎన్నిక ఇది. మక్రాన్ కార్మిక వ్యతిరేక వైఖరి, లీపెన్ మితవాద విధానాలు ఎవరికి ఓటు వేసినా ఉపయోగం ఏముందనే నిర్లిప్తత కారణంగా ఓటర్లు ఉత్సాహం చూపటంలేదని ఓటింగ్‌కు ముందే అభిప్రాయ సేకరణ సర్వేల్లో వెల్లడైంది. ఉదారవాదిగా పేరున్న మక్రాన్ మితవాదిగా మారుతుండగా, పచ్చిమితవాది మారినే లీపెన్ ప్రజల మనిషిగా కనిపించేందుకు పూనుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్లు కొందరు వ్యాఖ్యానించారు. గతంలో ఆమెను ఒక దయ్యంగా వర్ణించిన మీడియా ఇప్పుడు ఆమెను ఒక కలుపుగోలు, సాధారణ మహిళగా పేర్కొంటున్నది. మక్రాన్ అనుసరించిన విధానే పచ్చిమితవాద లీపెన్‌కు ఆదరణ పెరిగేందుకు తోడ్పడిందని భావిస్తున్నారు. ఇది ఐరోపాకే కాదు, ప్రపంచ మొత్తానికి ఆందోళన కలిగించే అంశమే.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288