Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూతుపరంబలో జరిగిన క్రూరమైన పోలీసు కాల్పులు కేరళ రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. ఐదుగురు యువకులు
ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుగా కెకె రాజీవ్, జిల్లా సహాయ కార్యదర్శి రోషన్, కార్యకర్తలు మధు,
శిబులాల్, కుందుచిర బాబు ఉన్నారు. మరో ఆరుగురు డివైఎఫ్ఐ కార్యకర్తలకు బులెట్ గాయాలయ్యాయి. లాఠీచార్జిలో వందలాది మంది
గాయపడ్డారు. కన్నూర్‌లో మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్గా మార్చి, పేదలకు, మెరిట్ విద్యార్థులకు ఉచితంగా
అందుబాటులో ఉన్న ప్రభుత్వ సీట్లును మేనేజ్మెంట్ సీట్లుగా మార్చడాన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా విద్యను
ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కేరళలో విద్యార్థి, యువజన సంఘాలు
కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఉదయం ఎనిమిది గంటలకే మాప్రయాణం మొదలైంది. కయ్యూర్, కరివెల్లూరు, చీమేని అమరుల త్యాగాలను, వారు ప్రదర్శించిన దైర్యం, సాహసాలను మిత్రులతో చర్చించుకుంటూ కూతుపరంబ వెళ్ళుతున్నాము. ఆ రోజే మా తిరుగు ప్రయాణం కూడా. సమయం ఎక్కువ లేదు. మద్య మద్యలో వర్షం అడ్డంకి. కన్నూర్ నుండి వంద కిలోమీటర్లు ప్రయాణించి ట్రైన్ ఎక్కాలి. ఆలోపు 1938లో ఇఎంఎస్, కృష్ణ పిళ్ళై, ఏకే గోపాలన్ తదితర నాయకులు మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరిపిన తలసెరి చూడాలి, పినరయి విజయన్ స్వంత గ్రామమైన 'పినరరు' ని చూడాలి. ఏకే గోపాలన్ స్మారక స్థూపం వద్దకు వెళ్ళి శ్రద్దాంజలి ఘటించాలి, అక్కడి నుండి కూతుపరంబ వెళ్లి అక్కడ నుండి కోజికోడ్ వెళ్లి రైలు అందుకోవాలి. ఇది మా ప్రయాణం షెడ్యూల్. విద్యార్థి సంఘం మాజీ నాయకుడు బిపిన్ మాకు గైడ్ కమ్ టాక్సీ డ్రైవర్ గా మంచి సహకారం అందించాడు. నాతోపాటు పోరాట కేంద్రాలు సందర్శిస్తున్న డిజి నర్సింహారావు, జాన్ వెస్లీలు కూడా పోరాట కేంద్రాల్లో జరిగిన సంఘటనలు, అమరుల వివరాలు చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనుకున్న ప్రదేశాలు తిరగడం పూర్తి చేసుకుని చివరగా కూతుపరంబ చేరుకున్నాము.
సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో జరిగిన సమరశీల పోరాటాలలో కూతుపరంబ పోరాటం స్ఫూర్తిదాయక మైనది. 1991లో పి.వి నర్సింహారావు ప్రధానమంత్రి అయిన తరువాత దేశంలో నయా ఉదారవాద విధానాల అమలు ప్రారంభం అయింది. అన్ని సమస్యలకూ పరిష్కారం ప్రైవేటీకరణే అనే సిద్ధాంతం పాలక వర్గాలు బలంగా ముందుకు తెచ్చినకాలం. విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన పై కాంగ్రెస్ నేతృేేేత్వంలో యూడిఎఫ్ ప్రభుత్వం అత్యంత దారుణంగా కాల్పులు జరిపి రక్తపుటేరులు పారించింది. ఐదుగురు యువకులను బలితీసుకుంది. అనేక మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో అమరుల స్మారకంగా నిర్మించిన స్మృతి కేంద్రం ఉంది.
ఒక విశాలమైన పార్క్ మధ్యలో బావి ఉంది, దాని చుట్టూ లాన్‌తో స్టేడియంలా అందంగా తీర్చిదిద్దారు. అందులో ఓపెన్ థియేటర్ నిర్మించారు. అక్కడ ముఖ్యమైన సందర్భాలలో సమాజాన్ని చైతన్య పరిచే చిత్రాలు ప్రదర్శిస్తారు. పార్క్ లో సుమారు వంద అడుగుల ఎత్తైన స్తూపం నిర్మించారు. స్థూపం అడుగు భాగంలో మ్యూజియం ఉంది. అందులో పోరాటం జరిగిన తీరును, అమరవీరుల వివరాలు తెలియజేసే విధంగా పేపర్ కటింగ్స్, ఫోటోలు ఉన్నాయి.
పోలీసు కాల్పుల ఘటన కన్నూర్ జిల్లాలోని తెలిచెరి రోడ్డులో 25 నవంబర్ 1994న జరిగింది. తరువాత ఈ సంఘటన జరిగిన ప్రాంతం కూతుపరంబ పట్టణంగా పేరు మారింది. కూతుపరంబలో జరిగిన క్రూరమైన పోలీసు కాల్పులు కేరళ రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుగా కెకె రాజీవ్, జిల్లా సహాయ కార్యదర్శి రోషన్, కార్యకర్తలు మధు, శిబులాల్, కుందుచిర బాబు ఉన్నారు. మరో ఆరుగురు డివైఎఫ్ఐ కార్యకర్తలకు బులెట్ గాయాలయ్యాయి. లాఠీచార్జిలో వందలాది మంది గాయపడ్డారు.
కన్నూర్‌లో మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్గా మార్చి, పేదలకు, మెరిట్ విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ సీట్లును మేనేజ్మెంట్ సీట్లుగా మార్చడాన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా విద్యను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కేరళలో విద్యార్థి, యువజన సంఘాలు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆ రోజు కేరళ సహకార మరియు ఓడరేవుల మంత్రి ఎం.విజయరాఘవన్ ఒక కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాయంత్రం బ్రాంచ్ ను ప్రారంభించడానికి వస్తున్నాడని తెలుసుకొని శాంతియుతంగా నిరసన తెలిపాలని యువజన సంఘం నిర్ణయించింది. ప్రత్యక్షంగా పాల్గొన్న కామ్రేడ్ ఇలా చెప్పాడు ''సమయం ఉదయం 9 గంటలు, కూతుపరంబ పట్టణానికి చేరుకున్నాను. కామ్రేడ్స్ అప్పుడే నిరసన వేదిక వద్దకు చేరుకున్నారు. జిల్లా నాయకులు వచ్చి అందరూ ఒకే చోట నిలబడి ఉండాలని సూచించారు, మంత్రి రాగానే నల్లజెండాలు ఊపుతూ నిరసన తెలపాలని అందరికీ చెప్పారు. ఇది గాంధేయ నిరసన విధానం, ఈ విషయాన్ని నిరసనకారులందరికీ తెలియజేసారు. అందుకే ప్రతి ఒక్కరు నల్లజెండ తీసుకుని వచ్చారు'' కూతుపరంబ పట్టణం యువకులతో నిండి పోయింది. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి వచ్చారు. దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన, కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య వెనుతిరిగారు. నిరసనకారులతో రోడ్లు నిండిపోయాయి. మంత్రి కాన్వారు కదిలే పరిస్థితి లేదు. మెడికల్ సీట్ల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ మారుమోగు తోంది. సమాధానం చెప్పి ఒప్పించాల్సిన మంత్రి అసహనం చెందాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు, లాఠీఛార్జ్ మొదలైంది, టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. పోలీస్ ఆదేశాల మేరకు టౌన్ హాల్ సమీపంలో మొదట కాల్పులు జరిగాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు కూతుపరంబ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో రెండోసారి కాల్పులు జరిగాయి. చేతిలో నల్లజెండాలు తప్ప ఏమీ లేని సాధారణ యువకులపై సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గాంధేయ పద్దతిలో జరుగుతున్న యువకుల నిరసనను హత్య చేసింది. నిరాయుధులైన తన రాష్ట్ర యువకులపై మారణాయుధాలతో ప్రభుత్వం విరుచుకుపడింది. కూతుపరంబ యుద్ధక్షేత్రంగా మారింది. ఐదుగురు యువకులు పోలీసుల తూటాలకు బలై, వీర మరణం పొందారు. ఆరుగురు యువకులకు బుల్లెట్స్ తగిిిలి క్షతగాత్రులై రక్తం మడుగులో పడిపోయారు. వంద మందికి పైగా లాఠీఛార్జ్ లో గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన ప్రభుత్వమే ఆందోళనకారులపై కేసులు బనాయించడం దుర్మార్గానికి పరాకాష్ఠ. విద్యా వ్యాపార మయంం కాకూడదని అలా జరిగితే పేదలకు అందుబాటులో లేకుండా పోతుందని, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కూతుపరంబ యువజన పోరాటం సాగింది. విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలో జరిగిన పోరాటాల్లో తలమానికమైనది. అందులో అమరులైన వీరులు చిరస్మరణీయులు.
సజీవ అమరుడు పుష్పన్ కేరళ యువతకు ఐకాన్ పుష్పన్, ఆ పేరు యువకుల్లో వైబ్రేషన్ కలిగిస్తుంది. ఆయన సినిమా హీరోనో, క్రీడాకారుడో కాదు, ఓ సాధారణ యువకుడు. కూతుపరంబ యువజన పోరాటంలో ముందు వరుసలో ఉండి తుపాకీ తూటాలకు ఎదురు నిలిచిన యోధుడు. వెన్నుపూసలో బుల్లెట్ దిగి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పక్షవాతం వచ్చి మూడు దశాబ్దాలుగా బెడ్ మీద నుంచి కదలలేని స్థితిలో జీవిస్తున్నాడు. ఆయన యువకుడుగా చేసిన పోరాటమే ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
పుష్పన్ పోరాడే యువతరానికి స్ఫూర్తి నిచ్చే పేరు. ఆయన్ని చూడటానికి విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. మేము చోక్లికి పుష్పన్ ను చూడటానికి వెళ్ళాము. పుష్పన్ బయట తిరగక 28సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ ప్రాంతంలో పుష్పన్ గురించి తెలియనివారు గాని, అతని ఇళ్ళు తెలియని వారు గాని లేరు. దారి ఆడుకుంటూ వెళ్ళాం, ఇంటి ముందు గది నిండా అనేక మెమోంటోలు, వివిధ దేశాల వారు ఇచ్చిన జ్ఞాపికలు ఉన్నాయి. పుష్పన్ ను కలిసాం, రెండు కాళ్ళు, రెండు చేతులు కదల్చలేని స్థితిలో ఉన్నా ఆయనలో చిరునవ్వు, పట్టుదల చెదరలేదు. అంత కష్టంలో కూడా పార్టీ పై అచంచల విశ్వాసంతో ఉన్నాడు. అందుకే ఆయన సజీవ అమరుడు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో లేడు, బెడ్ కే పరిమితం కాని ప్రజల జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాడు.
కూతుపరంబ యువజన పోరాటం గురించి అక్కడి టాక్సీ డ్రైవర్ చెప్పినట్లు '' ఆరోజు కూతుపరంబ పట్టణం యువకుల సముద్రంలా మారింది. నిరసనను ముందుగానే ప్రకటించడం వల్ల కావచ్చు అంత మంది యువకులు వచ్చారు. పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. యుద్ద మేఘాలు కమ్మినట్లు ఉండె. నినాదాల హోరు ను చీల్చుకుంటూ తుపాకీ కాల్పుల మోత, చెల్లాచెదురుగా పడిఉన్న శవాలు, క్షతగాత్రులు, రక్తపు మరకలు.... నిన్న జరిగినట్లుగానే ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి''
అక్కడ ప్రజలు చెబుతుంటే, మ్యూజియం చూస్తుంటే మాకు అలాగే అనిపించింది. కూతుపరంబ అమరులకు మరోసారి జోహార్లు అర్పించి అక్కడ నుండి బయలుదేరాము. కన్నూరులో నాలుగు పోరాట కేంద్రాల సందర్శించి, అమరుల గురించి తెలుసుకోని ఎంతో స్ఫూర్తి పొందాము.
- మహమ్మద్ అబ్బాస్