Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు భారతదేశంలో ఆరెస్సెస్, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన, ఇటలీలో ముస్సోలినీ నాయకత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వ
పాలనను గుర్తు చేస్తుంది. ఆరెస్సెస్, బీజేపీలు హిందూ జాతీయవాదం పేరుతో, హిందూ మత సంస్కతీ సాంప్రదాయాలను, హిందువులను
రక్షించే పేరుతో, గోరక్షక దళాలను ఏర్పాటు చేసి మైనార్టీలు, దళితులపై దాడులకు తెగబడుతున్నాయి.
అనేక దేశాల్లో ఫాసిస్టు ధోరణులు వివిధ రూపాల్లో కొనసాగుతున్న కాలమిది. భారత దేశంలో కూడా హిందూత్వ శక్తులు తమ విద్వేష రాజకీయాలతో విషం చిమ్ముతున్న తరుణమిది. ఇటువంటి సమయంలో మన దేశానికే కాదు, ప్రపం చానికే గొప్ప ఉత్తేజం ఆంటోనియో గ్రాంసీ. ఆయన తన తుదిశ్వాస దాకా ఫాసిజంతో పోరాడి విప్లవ రాజ కీయాలు, సోషలిస్టు వ్యవస్థలపై విశ్వాసం ప్రకటిం చిన మేధావి. ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల తరు వాత అంతటి ప్రాసంగికత కల్గిన వ్యక్తి గ్రాంసీ.
గ్రాంసీ గురించి తెలుసుకోవాలంటే అతని జీవితం, త్యాగాలు, అతని బాల్యంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులు, అతనిపై వాటి ప్రభావాల గురించి తెలుసుకోవాలి. 1891 జనవరి 22న ఓ దిగువ మధ్య తరగతి కుటుం బంలో జన్మించి, 46ఏండ్ల చిరుప్రాయంలోనే మరణించిన గ్రాంసీ, ఏడుగురు అన్నదమ్ముల్లో నాలుగోవాడు. 11 ఏండ్ల వయసులోనే కుటుంబ పోషణకోసం చదువు మానేసి పనిలో చేరాడు. ఒక కిలో రొట్టె కొనుక్కోడానికి సరిపడా 8 లీరాల కోసం రోజుకు 10 గంటలు పనిచేసేవాడు. తనకంటే ఎక్కువ బరువున్న రిజిస్టర్లు మోసే వాడు. ఒంటి నొప్పులతో రాత్రంతా ఏడ్చేవాడు. కొంతకాలం తరువాత పోర్టు కార్మికుడైన తన పెద్దన్న గెనరో గ్రాంసీతో కలిసి ఉంటూ చదువు కొనసాగించాడు. చిన్నతనం నుంచే క్షయ వల్ల వెన్నెముక దెబ్బతిని జీవితాంతం బాధను అనుభవించాడు. గ్రాంసీ. సోద రుడు గెనరో సోషలిజం పట్ల ఆకర్షితుడై, సార్డీనియన్ పోరా టాల పట్ల ఆసక్తి చూపుతాడు. ఇలా అన్న ఆలోచనలే గ్రాంసీపై ప్రభావం చూపాయి. 1910లో సార్డీని యాను వదిలి ఉన్నత చదువుల కోసం తురిన్లోని యూనివర్శిటీకి వెళ్ళాడు. అక్కడ ముందుగా సోషలిస్టు పార్టీ, తరువాత ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అక్కడే పార్టీ ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు స్వీకరించి, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రంగా ఉన్న మాస్కోలో ఇటలీ ప్రతినిధిగా పనిచేసాడు. తరువాత ఇటలీకి తిరిగి వెళ్ళి, దేశ రాజకీయాల్లో పాల్గొంటూ, పార్ల మెంట్లో ప్రతిపక్ష నాయకుడ య్యాడు. తన ప్రభావాన్ని సహించ లేని నియంత ముస్సోలిన్ పాలనలో దాదాపు జీవతమంతా జైలులో మగ్గాడు. అతడి మెదడు పనిచేయ కుండా చేయాలనే తలంపుతోనే అంత నుదీర్ఘకాలం నిర్బంధించా రంటే ఆ మెదడు ఎంత పదునై నదయి ఉండాలి!
అయితే ఇటలీలో ఫాసిస్టులు ఎందుకు దూసుకుపోతున్నారు, కమ్యూనిస్టులు ఎందుకు ముందుకు పోవడం లేదనే విషయాలపై గ్రాంసీ జైలులో ఆలోచించడం మొదలు పెట్టాడు. కమ్యూనిస్టులు రాజకీయా ధికారం, ఆర్థిక డిమాండ్లను మాత్రమే సాధిస్తే సరిపోదని, పాలక వర్గాలు నిర్బంధంతో మాత్రమే కాక, ప్రజల ఆమోదంతో కూడా పాలించేందుకు సాధనంగా ఉన్న బావజాలం గురించి కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాల్సి ఉందని అంటాడు. తమ చర్యలు న్యాయసమ్మతమని వారు దేశ ప్రజలను మెప్పిం చాలని అంటాడు. ఫాసిజమనేది పాత పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక కొత్త రాజకీయ రూపమయినప్పటికీ, అనాగరిక ఫాసిజంను ఎదుర్కోడానికి పాత వ్యూహాలు, ఎత్తుగడలు చాలవని గ్రాంసీ అభిప్రాయ పడ్డాడు. ఇటలీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి నపుడు, గ్రాంసీ స్విట్జర్లాండ్ వెళ్ళాలని పార్టీ నిర్ణ యిస్తే, ఇటలీ నుంచి వెళ్ళేందుకు తిరస్కరించాడు.
పదకొండు సంవత్సరాల జైలు నిర్బంధంలో గ్రాంసీ, తన ఆలోచనలను 2848పేజీల్లో (ప్రిజన్ నోట్ బుక్స్) నిక్షిప్తం చేయడం ద్వారా 'రెండు దశాబ్దాల పాటు తన మెదడును పనిచేయకుండా చేసే శిక్ష విధించాలన్న' పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరికను వమ్ము చేసాడు. ముందుగా గ్రాంసీ మేధావుల గురించి వివరిస్తూ రాజకీయ కార్యకర్తలు, నిర్వాహకులు, ఉద్యమనాయకులు కూడా మేధావులేనని అభిప్రాయపడ్డాడు. భౌతిక, బౌద్ధిక కార్యకలాపాల మధ్య తేడాలు లేవని భావించాడు. ఆయన ఆలోచన ప్రకారం, భిన్న వర్గాలకు చెందిన మేధావులను సష్టించే చారి త్రక క్రమాలు భిన్నంగా ఉంటాయి. ప్రతీ సామాజిక సమూహం, తన భిన్న దశలకు చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల మేధా వులను సష్టిస్తుంది. ఈ మేధావులు ఆ సమూహానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఐక్యతను సమ కూర్చుతారు. తన స్వంత మేధావి వర్గం ద్వారానే, ప్రతీ సామాజిక సమూహం సామాజిక, రాజకీయ రంగాల్లో తన పాత్రను అర్థం చేసుకుం టుంది. ఉదాహరణకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన ఎంట్రిప్రెన్యూర్ (స్వేచ్ఛా వాణిజ్యం చేసే మధ్యవర్తి లేదా వర్తకుడు) తనతో పాటే సాంకేతిక నిపుణులను, ఆర్థికవేత్తలను, నూతన సంస్కతి నిర్వాహకులను, న్యాయవ్యవస్థను సష్టిస్తాడు. అతడు ఒక ఉన్నతమైన సామాజిక నిర్మాణానికి ప్రాతినిథ్యం వహిస్తాడు. ఇతనికి ఉన్నత స్థాయి ఉత్పత్తి విధానాన్ని నిర్దేశించే లక్షణంతో పాటు మేధోపరమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. తన రంగంతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా కలిగి ఉంటాడు. ప్రజలను సమీకరించే సామర్థ్యం ఉంటుంది. తన వ్యాపారంలో పెట్టు బడి పెట్టే వారిని సమీపించే సామ ర్థ్యం ఉంటుంది. తాను ఉత్పత్తి చేసే సరుకులను కొనుగోలు చేసే విని యోగదారుల విశ్వాసాన్ని పొందుతాడు. ఇలా ప్రతీ నూతన సామాజిక వర్గం తనతో పాటు తన వర్గ మేధావులను సష్టించుకుం టుంది అంటాడు గ్రాంసీ.
కార్మికులు వార్తా పత్రికను ఎంచుకోవడం గురించి గ్రాంసీ కొన్ని హెచ్చరికలు చేశాడు. ''ఏ విషయం లోనైనా పెట్టుబడిదారీ పత్రికలతో ఏకాభిప్రాయంతో ఉండ టాన్ని కార్మికులు తక్షణమే విడనా డాలి. పెట్టుబడిదారీ పత్రికలు కార్మికవర్గ ప్రయోజ నాలకు, భావాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించే సాధనాలని కార్మికులు గ్రహించాలి. ఆ పత్రికల్లో ప్రచురించే ప్రతీ విషయం ఒకే అభిప్రాయంతో ప్రభావితమై ఉంటుంది. ఆధిపత్యవర్గాలకు అనివార్యంగా సేవ చేసేలా మన ఆలోచనలను నిర్మిస్తాయి. పెట్టుబడిదారీ పత్రికల్లో మొదటి నుంచి చివరి వాక్యం దాకా ఈ లక్ష్యాలనే నెరవేర్చేట్టు ఉంటాయి'' అంటాడు.
ఇటలీలో ఫాసిజం ఆవిర్భావానికి తోడ్పడిన రోమన్ సాంస్కతిక భావజాలం గ్రాంసీని ఆలోచింపచేసింది. ఫాసిజం పేరుతో తీవ్ర జాతీయభావం ఏర్పాటులో ముస్సోలినీ ప్రేరేపించిన రోమన్ సంస్కతి పోషించిన పాత్రను గ్రాంసీ గ్రహించాడు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఇటలీలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరత, శ్రామికోద్యమాల వైఫల్యాల నేపథ్యంలో సాంస్కతిక ఆధిపత్యం నిర్వహించే పాత్రను అంచనా వేశాడు. రాజకీయ రంగంలో ఆధిపత్య వర్గాలు ఆధిపత్యాన్ని బలప్రయోగంతో సాధించగలి గితే, సాంస్కతికరంగంలో పౌర సమాజం అంగీకారంతో సాధించగలుగుతా యని సూత్రీకరణ చేశాడు. పాలకవర్గాల సాంస్కతిక భావజాలమే అనుసరణీ యమని, అదే తమ భావజాలం కూడా అని పౌరస మాజం చేత అంగీకరింపచేయడాన్ని 'సాంస్కతిక ఆధిపత్యం'గా (కల్చరల్ హెజిమోని) గ్రాంసీ నిర్వచించాడు. సోషలిస్ట్ వ్యవస్థలో కూడా శ్రామిక వర్గాలు తమ సాంస్కతిక ఆధిపత్యాన్ని నెలకొల్పుకో గలగాలని సూచించాడు. ఈ క్రమంలో కలుపుకొని పోవాల్సిన ఉపశ్రేణుల్ని ప్రస్తావిస్తూ వారిని 'సబ్ ఆల్టర్న్' వర్గాలుగా పేర్కొన్నాడు. ఈ వర్గాల ఐక్యత రాజ్యాధికార స్థాపనను సుగమం చేస్తుందని చెప్పాడు. ఇలాంటి సమయంలోనే సమాజంలోని మౌలిక వర్గమైన కార్మికవర్గం, సామాజిక ఉపశ్రేణులను సమీకరించడం ద్వారా సాంస్కతిక ఆధిపత్యాన్ని నెలకొల్పవచ్చుననీ, అందు కోసం కార్మికవర్గం స్వప్రయోజనాలకే పరిమితం కాక, ఉపశ్రేణులందరి ప్రయోజనాలకు గొంతుక ఇవ్వడానికి వీలుగా తన ప్రయోజనాలను కొన్నిం టిని వదులుకోవాలని, అది మొత్తం జాతి ప్రయోజ నాలను ప్రతిబింబించే శక్తిగా రూపొం దాలని ప్రకటించాడు. ఆ క్రమంలోనే వారి భాష, సంగీత సాహిత్యాలు, కళలూ, జానపద సాంప్రదా యాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని అన్నాడు.
గ్రాంసీ తన జైలు రాతల్లో దాదాపు 250 పేజీలు ఫాసిజం గురించే రాశాడు. ఆయన మొదట్లో ఫాసిజాన్ని ఒక రాజకీయ పార్టీగానే చూడడం వల్ల, దానికి ఉన్న ప్రజాపునాది ఏమిటో, దానిని ఏ విధంగా దెబ్బ తీయాలనే దాని పైనే కేంద్రీక రించాడు. కమ్యూనిస్టులు బలపడితే ఫాసిస్టులు బలహీనపడి కనుమరుగవుతారని భావించాడు. కానీ అనతికాలంలోనే ఫాసిజం ఒక రాజకీయ పార్టీ కాదని అర్థమైంది. ఎందుకంటే దానిలో ఇటాలియన్ సమా జానికి ఉండే సహజ లక్షణాలు, సంస్కతి ప్రతిబింబి స్తున్నాయి. ఇది ప్రజల ఆమోదంతో జరుగుతున్న ప్రక్రియ అని గ్రాంసీకి అర్థమైంది. అందుకే ఫాసిస్టులను రాజకీ యంగా కూలదోయడం ఎంత ముఖ్యమో, సంస్క తిని ఫాసిస్టు సాధనంగా ఉపయోగించే పద్ధతిని ఓడించడం కూడా అంతే ముఖ్యమని భావించాడు. ఆర్థిక సంబంధాల పునాదిపై ఆధారపడి మాత్రమే రాజకీయ, సామాజిక వ్యవస్థలు నిర్మితం కావనీ, అవి పరస్పర ఆధారితాలనీ అంటాడు గ్రాంసీ. ఆర్థిక సంబంధాలు, రాజకీయ సామాజిక సంబంధాలను ఒకవైపు రూపొందిస్తూ, మరోవైపు నిర్వహిస్తే, రాజకీయ సామాజిక సంబంధాలు ఒకవైపు ఆర్థిక సంబం ధాలను రూపొందిస్తూ మరోవైపు నిర్వహిస్తాయని అన్నాడు. పాలకవర్గాల భావజాలాన్నే, ప్రజల భావజాలంగా అంగీకరింప చెయ్యడంలో బూర్జువా వర్గం విజయం సాధిస్తుంది కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా శ్రామిక వర్గాలు, ఇతర సామాజిక వర్గాలను కలుపుకుని తామే సాంస్కతిక ఆధిపత్యాన్ని నెల కొల్పాలని గ్రాంసీ అభిప్రాయపడ్డాడు.
అదేవిధంగా గ్రాంసీ, మనుషుల్లో ఉండే నిర్లిప్తత గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పాడు. ''నిర్లిప్తులంటే నాకు నిలువెల్లా అసహ్యం. బతికి ఉండడమంటే, అటోఇటో నిలబడడమే అన్నది నా నమ్మకం. నిజంగా సజీవులుగా ఉన్నవాళ్లు పౌరు లుగా, పక్షపాతులుగా ఉండక తప్పదని నా విశ్వాసం. నిర్లిప్తత, నిరాసక్తతలు పరాన్నభుక్కులుగాను, పెడబుద్దులుగాను మనుగడ సాగించడమే తప్ప అవి జీవలక్షణాలు కాదు. నిర్లిప్తత నమ్మడానికి వీల్లేని దుర్విధి లాంటిది. అది మన కార్యక్రమ ప్రణాళికను నాశనం చేస్తుంది. లోతుగా ఆలోచించి రూపొం దించిన ప్రణాళికను నిర్లిప్తత తలకిందులు చేస్తుంది. అది మనసును శిథిలం చేస్తుంది. జనసమూహాలు, పట్టుదలను వదిలిపెట్టి నిర్లిప్తులుగా వ్యవహరించడం వల్లే మనలో కీడు దాపురిస్తుందని'' ఆయన భావన.
నేడు భారతదేశంలో ఆరెస్సెస్, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన, ఇటలీలో ముస్సోలినీ నాయకత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వ పాలనను గుర్తు చేస్తుంది. ఆరెస్సెస్, బీజేపీలు హిందూ జాతీయవాదం పేరుతో, హిందూ మత సంస్కతీ సాంప్రదాయాలను, హిందువులను రక్షించే పేరుతో, గోరక్షక దళాలను ఏర్పాటు చేసి మైనార్టీలు, దళితులపై దాడులకు తెగబడుతున్నాయి. రాజ్యాం గాన్ని ఉల్లంఘిస్తూ, మనుధర్మ పాలనను సాగిస్తు న్నాయి. ఆరెస్సెస్, బీజేపీ పాలక వర్గాల ప్రజావ్యతి రేక సంస్కతికి, ఒక ప్రత్యామ్నాయ సంస్కతిని ప్రవేశపెట్టే దిశగా ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక, సామాజిక, విప్లవ శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.
- బోడపట్ల రవీందర్