Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుర్గాదేవి సుదీర్ఘ జీవన యానంలో శ్రామిక జనాభ్యుదయం కోసం, ఉద్యమించి, అలసి, ఆరోగ్యం క్షీణించి, కన్నబిడ్డల వద్ద ఆఖరి మజిలీగడుపుతూ అస్తమించారు. దుర్గాదేవికి కాలు విరిగి, తుంటి విరిగి రెండు సార్లు ఆపరేషన్లు అయ్యాయి. గుండె ఆపరేషన్ కూడా అయ్యింది. శారీరక బాధలు ఆమెను చుట్టుముట్టాయి. నాకు దూరంలో ఉన్నా, నాతో ఎప్పుడూ ప్రజా ఉద్యమాల గురించి, మాట్లాడుతూనే ఉండేవారు. మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలకు విజయవాడ వచ్చినప్పుడు, మాకు ఎన్నో అను భవాలు, చెప్పేవారు. మహానేత సుందరయ్యగారికి ఆరోగ్యం పాడయి, రెండుసార్లు పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు ఆయనకు ప్రత్యేక ఆహారం తయారుచేయటంలో, కోడలు వినీత (కొడుకు పవన్ భార్య) సహాయంతో దుర్గాదేవి కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.
అవి దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జన్సీని (అత్యవసరపరిస్థితిని) విధించిన చీకటిరోజులు. దేశ వ్యాపితంగా ఎక్కడి వారిని అక్కడే అరెస్టులు చేసి, ప్రభుత్వం జైళ్లపాలు చేస్తోంది. కమ్యూనిస్టుపార్టీ నాయకులంతా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అంతటి భయంకర పరీక్షా సమయంలో కూడా కా|| కె.ఎల్ నర్సింహా రహస్యంగా విజయవాడ వచ్చి, ప్రజాసంఘాలకు రాష్ట్ర పార్టీ ఆదేశాలు, రహస్యంగా అందిస్తూ, ఎంత నేర్పు ఓర్పుతో, అద్భుతమైన సేవలు అందించారంటే అందులో దుర్గాదేవి పాత్ర మరువలేనిది.
ప్రజాతంత్ర ఉద్యమాలలో, పార్టీ నిర్మా ణంలో దుర్గాదేవి, కెఎల్ దంపతుల పాత్రను విడదీసి వేరు, వేరుగా చూడలేం. ఆ అపురూప దంపతుల ప్రజాసేవ అటువంటిది. అది విజయ వాడలోని ప్రజావైద్యశాల... డా|| భాస్కరావు, డా|| రామారావు, డా|| ఉషా, సుధాకర్లు, వైద్యసేవలు అందిస్తున్నారు. హాస్పిటల్ పైన ఉన్న అంతస్థులో ఒక చిన్న గది. ఆ గదిలో చిన్న టేబుల్, ఒక కుర్చీ, ఆ కుర్చీలో బక్కగా ఉన్న కా|| కెఎల్ను నేను మొదటి సారి చూశాను. ఆయన నాతో ఏమీ మాట్లాడకుండా నా చేతిలో చిన్న కాగితం పొట్లం పెట్టారు. అది విప్పి చూస్తే అందులో పార్టీ ఆదేశం రాసి ఉంది. అది ఆయుర్వేదం మందు పొట్లం వలె ఉంది. నేను వెనుదిరుగుతుంటే, దుర్గాదేవిగారు వచ్చారు. నన్ను చూసి విప్పారిన మొఖంతో చూడు అమ్మాజీ ఈ కెఎల్కి కాఫీ కలుపుకోవటం కూడా రాదు. ఇక్కడ ఏం తింటున్నాడో ఏమో? అని బాధగా అన్నారు. ఆయన టేబుల్ దగ్గరలోనే ఒక కిరసనాయిల్ స్టవ్, రెండో, మూడో గిన్నెలు వగైరా అత్యవసరమైనవి ఉన్నాయి. ఆయనే గదిని శుభ్రం చేసుకుంటూ గిన్నెలు తోముకుని, బట్టలు ఉతుక్కుని, వంటచేసుకుంటూ... అత్యంత మెలకువతో అంతటి భయంకర పరీక్షా సమయంలోనూ పార్టీకి అద్భుతమైన సేవచేశారు కేఎల్. అమోఘమైన నిశ్శబ్ద సేవకులు ఆయన. ఆయనకు భిన్నంగా దుర్గాదేవి మంచి వాగ్దాటితో, అందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ అనేక విషయాలను చెప్పేవారు.
1986లో కేరళలోని తిరువనంత పురంలో జరిగిన అఖిలభారత ప్రజాతంత్ర (ఐద్వా) మహిళా సంఘం 2వ మహాసభలో దుర్గాదేవి ఉత్సాహం ఆమె చొరవ మరువలేము. దుర్గ మ్మకు భాషరాకపోయినా, అక్కడ వలంటీర్లను అభినందిస్తూ ఆప్యాయంగా పలకరించేవారు. ప్రతినిధులందరినీ ఆప్యాయంగా పలకించే వారు. ఆ మహాసభకు మన ప్రతినిధులందరినీ మోటూరు ఉదయం, విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సు మాట్లాడి తీసుకెళ్ళారు.
ఆ రోజుల్లో ఆమె రోజూ కేఎల్తో కలిసి ఆఫీసుకు వెళ్లేవారు. ఆఫీసుకి వచ్చే యువకులు, పార్టీ కార్యకర్తలు అందరినీ పలకరిస్తూ, వారి యోగక్షేమాలు విచారిస్తూ, వారి కుటుంభాలలోని మహిళల్ని, కార్య క్రమాలకి తీసుకువచ్చే విధంగా ప్రోత్సహించేవారు. ''అందుకనే ఉదయమే కెఎల్తో కలిసి వెళ్ళిపోతాను. ఉదయం వెళ్లకపోతే యువకులు ఎవరూ దొరకరు'' అని చెపుతుండేది. మహిళా ఉద్యమంలోకి ఎక్కువ మంది మహిళలు రావాలనేది ఆమె తపన. దుర్గాదేవి కుమార్తె సుధా హైదరాబాద్లోనే ఉంటూ కేన్సరుతో చనిపోయింది. ఆమె భర్త కూడా చనిపోయారు. సుధకు ఒక కుమారుడు క్రాంతి. తల్లిదండ్రులను కోల్పోయి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, ఆ మనుమడు క్రాంతి కోసం ఎక్కువ కాలం ఆ కూతురి ఇంట్లోనే ఉండిపోయారు దుర్గాదేవి. ఆ స్థితిలోనే నేను, స్వరాజ్యం. పుతుంబాక్క భారాతి, దుర్గమ్మ దగ్గరకు వెళ్ళాం. ఆమె నడవలేని స్థితిలో కుర్చీకే పరిమితమై, అనారోగ్యంతో మందులతో రోజులు గడుపుతున్న దయనీయస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. కానీ ఆ స్థితిలోనూ మహిళా ఉద్యమ స్థితిగతులపై ఎన్నో సంగతులు మాట్లాడారు. నేను ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడుతుంటే సంతోషపడేవారు. ఇటీవల దుర్గాదేవి మంచం పట్టి కొడుకు పవన్ దగ్గర ఉన్నందున దుర్గాదేవిని చూడలేకపోయాననేబాధ నన్ను ఎందుకో బాగా కృంగదీసింది. దుర్గాదేవి, స్వరాజ్యం, సూర్యావతి, ఉదయం, బిక్షావతి, పర్సా భారతి త్యాగాల చరితం ఈనాటి యువ కార్యకర్తలకు మార్గదర్శకం. మనమడు కాంత్రిని నేను మొదటి సారి, మల్లు స్వరాజ్యం ఎన్నికల ప్రచారంలో, తుంగతుర్తి నియోజక వర్గంలో చూశాను. అచ్చంగా తాతాలాగా కెఎల్ వలెనే బక్కగా ఆయన పోలికలతోనే ఉన్నాడు. ఆ నెల రోజులు దీక్షగా ఎన్నిక ప్రచారంలో పని చేసి, అమ్మమ్మ, తాతయ్యల ఆదర్శాలను అనుసరించాడు.
దుర్గాదేవికి తన తండ్రి ఇల్లే చిన్ననాటి గురుకుల పాఠశాల. అనునిత్యం మహానాయకుల రాకపోకల మధ్య ఆ పసితనంలోనే సామాజిక చైతన్యం ఆమెలో బలమైన శక్తిగా నిలిచింది. ఆ చైతన్యంతోనే అలసట తెలియని శక్తివంతమైన సామాజికసేవలో దుర్గాదేవి జీవితం చరితార్థమయింది. ఆమెకు నిజమైన వారసులుగా ఉన్న కుమారుడు పవన్, మనుమలు ధన్యులు, దుర్గాదేవి దంపతులు ఆకలి, అజీర్తి లేని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు తపిస్తూ, శ్రమిస్తూ అస్తమించారు. వారి ఆశయ సాధనే జీవిత లక్ష్యంగా ఈ తరం ఉద్యమించాలి. అందుకు దుర్గాదేవి, కెఎల్ అందించిన శ్రమజీవుల పతాకం మన కళ్లముందు రెపరెపలాడుతూనే ఉంటుంది. సోషలిజం అనివార్యం. కమ్యూనిజం అజేయం. ప్రియమైన సహచరి దుర్గాదేవికి జేజేలు
- అమ్మాజీ, 8331014964