Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యుల గూర్చి, ద్రావిడుల గూర్చి తెలుసుకోవడం మాత్రమే చరిత్ర కాదు. భారత స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషు పాలన గూర్చి, లేదా అంతకు ముందు మొఘలుల పరిపాలన గూర్చి తెలుసుకోవడమే చరిత్ర కాదు. ఇంకా అంతకు ముందు చంద్ర గుప్తుడి కాలం గూర్చి తెలుసుకున్నా మనకు ఈ గడ్డ మీద విలసిల్లిన తొలి భారతీయులెవరో తెలియదు. అది తెలుసుకోవాలంటే ఇంకా వెనక్కి, అరవైలక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆధునిక చరిత్ర పరిధిని దాటి నరశాస్త్రం వివరాల్లోకి వెళ్ళాలి. మనిషి-మనిషిగా రూపొందడం, ఖండాంతరాలకు వలసలు వెళ్ళడం, వ్యవసాయం - వ్యాపారం చేస్తూ క్రమంగా నాగరికుడు కావడం... ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా జరిగింది. అయినా ఇక్కడ విషయాల్ని మన భారత భూభాగానికి అన్వయించి పరిశీలిద్దాం!
జీవ పరిణామం కొనసాగుతూ, కొనసాగుతూ తూర్పు ఆఫ్రికాలోని లోయ ప్రాంతాల్లో (GREAT VALLEYS) చెట్ల మీద తిరుగాడే ఏప్స్ (APES) తొలిసారి భూమి మీద నివసించడం ఆరంభించాయి. ఆఫ్రికా ఖండంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్ల సంఖ్య తగ్గి, మైదానాలు ఏర్పడడం వల్ల మరో మార్గం లేక ఏప్స్ మైదానాల్లోకి రావల్సి వచ్చింది. APE అంటే మామూలు కోతి / వానరం కాదు. తోకలేని కోతి అని అంటారు. గానీ, వానర - నరులు అంటే బాగుంటుందేమో! అంటే.. నరులుగా మారబోతున్న వానరులు! ఇవి చెట్లపై ఉన్నప్పుడు ఒక కొమ్మ నుండి మరో కొమ్మపైకి సుళువుగా వెళ్ళడానికి పొడవైన ముందు కాళ్ళు ఉపయోగపడేవి. నడవాల్సి వస్తే నాలుగు కాళ్ళతో నడిచేవి. మైదానాల్లోకి వచ్చిన తర్వాత, అవి పైకి లేచి నిటారుగా రెండు వెనక కాళ్ళపై నడవడం ప్రారంభించాయి. అప్పుడు ముందు కాళ్ళు చేతులయిపోయ్యాయి. చేతులు ఖాళీగా ఉండటం వల్ల వాటితో ఇతర పనులు చేయడం మొదలయ్యింది. అలా నాలుగు కాళ్ళ నడక మానేసి, రెండు కాళ్ళపై నడవగలగడం జీవ పరిణామ క్రమంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. జంతువు మనిషిగా పరిణతి చెందే క్రమంలో అదొక తొలిమెట్టు. రెండు కాళ్ళపై నడిచే ఈ ప్రాణుల్ని (BIPEDAL) హౌమినిన్స్ (HOMININS) అని అన్నారు. తర్వాత కాలంలో ఏర్పడ్డ అనేక మానవజాతులు ఈ హౌమినిన్స్ నుండే పుట్టుకొచ్చాయి. ముందు కాళ్ళు రెండూ చేతులైపోవడం వల్ల ఈ వానర నరులు (ఏప్స్)-రాళ్ళతో రాళ్ళను పగలగొట్టడం, క్రమంగా మొనతేలిన ఆయుధాలు చేయడం నేర్చుకున్నాయి. ఇది ఇరవై అయిదు లక్షల క్రితం జరిగిన పరిణామం.
మానవ జాతులకు మూలాధారమైన ఈ హొమినిన్స్ నుండి మొదట మూడు జాతులు ఉద్భవించాయి. 1. హౌమో ఎర్గాస్టర్ 2. హౌమో ఎరక్టస్ 3. హౌమో హబిలస్ (HOMO ERGASTER/ H.ERECTUS/ H.HABILUS) వానర నరులు చెట్లను వదలి మైదానాలకు (GRASS LAND) రావడం ఒక మార్పయితే, వాటి జనాభా పెరగడం, ఆహారపు కొరత ఏర్పడటం మరొక మార్పు. ఫలితంగా హొమినెన్స్ జాతులు మెల్లగా ఆఫ్రికా ఖండాన్ని వదిలి, దూర ప్రాంతాలకు వలస పోవడం ప్రారంభించాయి. అదెప్పుడూ? పది లక్షల సంవత్సరాలకు పూర్వం! వలసలు వెళుతూ వెళుతూ మానవ జాతులన్నీ ప్రపంచంలోని అన్ని దేశాలకు చేరుకున్నాయి. 70వేల సంవత్సరాలకు పూర్వమే మానవ జాతులు ప్రపంచ వ్యాప్తమైనట్టు ఆధారాలున్నాయి.
ఈ వివరాలన్నీ పురాణాల్లోని కట్టుకథల్లాంటివి కావు. ఎందరో శాస్త్రవేత్తలు భూగర్భంలోంచి తవ్వి తీసిన ఆధారాలను అనుసరించి నమోదు చేసిన అంశాలు. మన భారత దేశానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవలసి వస్తే, ఇక్కడ ఐదు లక్షల సంవత్సరాల నాటి శిలాయుధాలు దొరికాయి. అంటే ఈ నేల మీద ఐదు లక్షల సంవత్సరాలకు పూర్వమే శిలలతో ఆయుధాలు, పరికరాలు చేసిన హౌమినిన్స్ ఉండేవని అర్థమవుతూ ఉంది. పైగా ఇవి హౌమో ఎరక్టస్ జాతివని నిర్ధారణ అయ్యింది. ఈ విషయానికి 1982లో అరుణ్ సోనాకియా అనే భూగర్భ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలు రుజువులు చూపాయి. నర్మదా వ్యాలీలోని హత్నోరా గ్రామంలో దొరికిన శిలాజం - మానవుడి పుర్రె - రెండున్నర లక్షల సంవత్సరాల నాటిదనీ, అది హౌమో ఎరక్టస్దనీ ఆ శాస్త్రవేత్త గుర్తించారు. హౌమో ఎరక్టస్ అనేది శాస్త్రీయ నామమైతే ఆయన దానికి ఒక సాధారణ నామం కూడా పెట్టాడు. నర్మదా వ్యాలీలో దొరికింది గనుక, ఆ శిలాజాన్ని 'నర్మదా మ్యాన్' అని అన్నాడు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం - ఈ నేల మీద నడయాడిన తొలి భారతీయులెవరంటే హౌమో ఎరక్టస్ జాతికి చెందిన నర్మదా మ్యాన్ - సంతతి వారు. అయితే ఆ జాతి ఇప్పుడు లేదు. ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క మానవజాతి - అది హౌమో సేపియన్! ఇది నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రూపొందింది. 70వేలఏండ్ల క్రితం ఈ భూమి మీద ఏడు మానవ జాతులు వర్థిల్లుతూ ఉండేవనీ, పదివేల సంవత్సరాల క్రితం నాటికి ఒకే ఒక్క మానవజాతి హౌమో సేపియన్ మిగిలిందనీ తెలుస్తూ ఉంది.
అంటే ఇప్పుడు ప్రపంచంలో మనిషి అనేవాడు ఎక్కడున్నా - అతడు / ఆమె హౌమో సేపియనులే నన్నమాట! స్వతహాగా వీరిలో అప్పుడు జాతి, మత, వర్ణ, వర్గ ప్రాంతీయ భేదాలు లేవు. అంతా ఒక్కటే. ఇప్పుడు జీవించి ఉన్న మనుషులంతా ఆ మహా మానవ మిశ్రమ జాతిలోంచి పుట్టుకొచ్చిన వారే. తారతమ్యాలు లేవు. అవన్నీ తర్వాత కాలంలో మనుషులు తమ కుత్సిత బుద్ధితో ఏర్పరుచుకున్నవి. దీనితో మనకు అర్థమయ్యేదేమంటే... ఒక అరవై వేల ఏండ్ల పాటు ఈ మానవ జాతులన్నీ కలిసి తిరిగాయి, కలిసి బతికాయి, కలిసి ఆహారం పంచుకున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం పోట్లాడుకున్నాయి కూడా! అంతే కాదు, ఒకే జాతికి చెందినవి కాబట్టి కొన్నిటి మధ్య లైంగిక సంపర్కం కూడా జరిగింది. హౌమో సేపియన్, హౌమో నియాండర్తల్స్ మధ్య శారీరక సంబంధాలుండేవన్న విషయం ధృవపడింది కూడా! ఫలితంగా జన్యు మార్పిడి జరిగింది. మనుషులంతా ఒకటే అయినా వివిధ ప్రాంతాల మనుషుల ముఖ కవళికలు వేరువేరుగా ఉన్నాయి. ఇవి మనం గమనిస్తున్న తేడాలు. ఆ కాలంలో గుహల కోసం, ఆహారం కోసం జరిగే కొట్లాటల్లో తెలివైన హౌమో సేపియనులే నెగ్గుకొచ్చేవారు. తెలివైన వాడికి, బలవంతుడికీ మాత్రమే రాజ్యాధికారం దక్కుతుందనేది ఆనాటి ఆది మానవుల పోరు కూడా తేల్చి చెప్పింది. అందుకే హౌమో సేపియన్ జాతి బలపడుతున్న కొద్దీ, మిగతా జాతులు క్రమంగా నశించిపొయ్యాయి. దీన్ని వైజ్ఞానికులు 'రిప్లేస్మెంట్ థియరీ' (REPLACEMENT THEORY)గా వర్ణించారు. అంటే మిగతా జాతులన్నింటి స్థానాన్ని హౌమో సేపియన్ జాతి ఆక్రమించింది (రిప్లేస్ చేసింది) అని అర్థం!
ఈ హౌమో సేపియన్ జాతి భారతదేశానికి ఎలా చేరుకుంది? అనే దానికి రెండు వాదనలున్నాయి. 1. యాభై వేల ఏండ్ల క్రితం పశ్చిమ ఆసియా (MIDDLE EAST) నుండి ఒక సమూహం భారత్లోకి ప్రవేశించింది. 2. అలాగే ముప్పయివేల ఏండ్ల క్రితం ఈ జాతికి చెందిన మరొక సమూహం అరేబియా సముద్ర మార్గంగా, దక్షిణ భారతదేశానికి చేరింది. దొరికిన ఆధారాల ప్రకారం పరిశోధకులు వెల్లడించిన విషయాలు ఇవి! అయితే 2005లో నేషనల్ జియో గ్రాఫిక్, ఐ.బి.యం.లు సంయుక్తంగా చేపట్టిన (GENOGRAPHIC PROJECT) జీనో గ్రాఫిక్ ప్రాజెక్ట్ - అనేక విషయాలు స్పష్టం చేసింది. మానవుల వలసలు అతి పురాతన కాలంలో ఎక్కడి నుండి ఎలా జరిగాయో? తెలుసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది! దీనిలో ప్రపంచ ప్రఖ్యాత జన్యుశాస్త్రవేత్త స్పెన్సర్ విల్స్, భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ రామసామి పిచ్చప్పన్లు కలిసి పనిచేశారు. రామసామి పిచ్చప్పన్ తమిళనాడులోని కల్లార్ గ్రామంలో విరుమండి అనే వ్యక్తి డిఎన్ఏలో M1-30 అనే ఒక ప్రత్యేకమైన జన్యువు ఉన్నట్లు గుర్తించాడు. ఇదే జన్యువు 70-60వేల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన వారిలో కూడా లభించింది. అంటే ఇప్పటి పౌరుల పూర్వీకులు తప్పకుండా ఆఫ్రికా నుండి వచ్చినవారేనని నిర్ధారణ అయ్యింది. ఇక్కడ ఒకే ఒక్క ఉదాహరణ చెప్పుకున్నాం. నిజానికి వారు చాలా మంది డి.ఎన్.ఏ.లు సేకరించి పరిశీలించారు. మనకు ఇక్కడ సారాంశం ముఖ్యం! ఆ ప్రాజెక్ట్ వెల్లడించిన వివరాలన్నీ కాదు... తరతఇకపోతే, మనిషి రాళ్ళతో ఆయుధాలు తయారు చేసుకున్న ఆ కాలానికి సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం! ఆ కాలాన్ని వైజ్ఞానికులు శిలా యుగంగా పరిగణించారు. కాలక్రమంలో జరిగిన పరిణామాల్ని అనుసరించి, ఆ శిలాయుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించారు. 1. పురాతన శిలాయుగం (PALEOLITHIC AGE) 2. మధ్య శిలాయుగం (MESOLITHIC AGE) 3. నవీన శిలాయుగం (NEOLITHIC AGE). ఈ మూడు యుగాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది పురాతన శిలాయుగమే - ఈ యుగంలో మనుషులు చెట్ల నుండి పండ్లు, కూరగాయలు, భూమి నుండ కంద మూలాలు, దుంపలు వగైరా సేకరించుకునే వారు. వారు తయారుచేసుకున్న పెద్ద ఆయుధాలతో పెద్ద జంతువుల్ని వేటాడి తినేవారు. విశాలమైన మైదానాల్లో ఉండటానికి ఇష్టపడేవారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కోసారి గుహల్లోకి వెళ్ళేవారు. విషయాల్ని వివరంగా చర్చించుకోవడానికి అనువుగా పరిశోధకులు పేలియోలిధిక్ యుగాన్ని మళ్ళీ మూడుగా విభజించారు. 1. కింది (LOWER) పేలియోలిధిక్, 2.మధ్య (MIDDLE) పేలియోలిధిక్ 3. పై (UPPER) పేలియోలిధిక్. కింది పేలియోలిధిక్కు సంబంధించిన ఆధారాలు పాకిస్థాన్ సోన్ వ్యాలీ(SOAN VALLY)లోను, తమిళనాడు - చెన్నై పరిసర ప్రాంతా ల్లోనూ లభించాయి. మధ్య పేలియోలిధిక్కు సంబంధించిన రుజువులు మహారాష్ట్రలోని నివాస (NEVASA)లోను పట్నే (PATNE) లోనూ లభించాయి. అలాగే పై పేలియోలిధిక్కు సంబంధించిన ఆధారాలు మధ్యప్రదేశ్లోని భీంబెట్కా (BHEEM BHETKA)లో లభించాయి. ఇక్కడి గుహల్లో ఆకాలపు మనుషులు గీసిన రాతి చిత్రలేఖనాలు (STONE PAINTINGS)లభించాయి.
(వచ్చేవారం-మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది)
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, బయాలజీ ప్రొఫెసర్.