Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యంలోనే బందూకు అందుకుని భూస్వాములను, నైజాం రజాకారులను తరిమికొట్టిన వీరవనిత, విప్లవతార కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. నాటి నల్లగొండ నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి చుక్కమ్మలకు జన్మించారు. 1931లో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన స్వరాజ్యం... 11ఏండ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. స్వరాజ్యం తల్లి చుక్కమ్మ గొప్ప సామ్యవాది. తన కుటుంబం అంతా విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని కొనసాగుతున్న వేళ... ఇసుకలో ఓనమాలు దిద్దుకొని క్రమంగా 5వ తరగతి వరకు విద్యను అభ్యసించారు స్వరాజ్యం. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొంది. తన సొంత గ్రామంలోనే పటేళ్లు పట్వారీలకు వ్యతిరేకంగా పాలేర్ల సంఘం, కూళీ రేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం ఎనిమిది దశాభ్దాలపాటు ఏనాడూ వెనుదిరగలేదు. మొక్కవోని ధైర్యంతో తన అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్.) అడుగుజాడల్లో పోరాటాల్లోకి వచ్చిన స్వరాజ్యం ఏనాడూ మడమ తిప్పలేదు. అక్క శశికళ కూడ పోరాటంలో మూడేండ్లు జైలు జీవితం గడిపారు.
తెలంగాణలో భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం సాగిన వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె ముఖ్యభూమిక పోషించారు. వెట్టిచాకిరీ రద్దుచేయాలని, దున్నేవానికి భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహాత్తర సాయుధ పోరాటమది. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం. ఆ సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణలో మూడువేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. నాలుగువేల మంది వీరమరణం పొందారు. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయబడింది. వెట్టిచాకిరీ రద్దయింది. అక్రమ బేదఖల్లు నిలిపివేయబడ్డాయి. గ్రామాలను గ్రామరైతు కమిటీలు పరిపాలించాయి. నైజాం రజాకార్లబారి నుండి రైతాంగాన్ని రక్షించుకొనేందుకు పదివేల మందితో గ్రామ రక్షక దళాలు, రెండువేల మందితో గెరిళ్లా సాయుధ దళాలను కమ్యూనిస్టులు నిర్మించారు. ఆ చారిత్రక పోరాటంతో మధ్యయుగాలనాటి నైజాం నవాబు పాలన అంతమొందింది. కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన సాయుధ రైతాంగ పోరాటం అనేక విజయాలు సాధించింది. దేశవ్యాప్తంగా భూసంస్కరణల చట్టం వచ్చింది. కౌలుదారి చట్టం వచ్చింది. పౌరహక్కులు వచ్చాయి. ప్రజలకు స్వేచ్చా స్వాతంత్య్రాలు వచ్చాయి. ఈ చారిత్రక పోరాటంలో స్వరాజ్యం పాత్ర అద్వీతీయం అజరామం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళ కమాండర్‌గా పనిచేసారు. గోదావరి అడవుల్లో సాయుధ దళాధిపతిగా పనిచేసారు. సాయుధపోరాట అనంతరం మార్క్సిస్టు పార్టీ ఉద్యమంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. తుంగతుర్తి శాసనసభ్యురాలిగా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా, మహిళాసంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా అనేక పోరాటల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ఆమె గొంతెత్తితే ప్రజలు కేరింతలే
మార్క్సిస్టు పార్టీ ఉద్యమంపై, కార్యకర్తలపై నాడు పాలకపార్టీ గుండాల హత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో ఆమె మండే కొలిమిలా రగిలింది. శత్రువు వెన్నులో వణుకు పుట్టించింది. కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వడంలో కామ్రేడ్ బి.యన్., కామ్రేడ్ స్వరాజ్యం గార్ల పాత్ర వెలకట్టలేనిది. మిర్యాలగూడెం ప్రాంతంలో రాగిరెడ్డి వీరారెడ్డి, గాదె శ్రీనివాసరెడ్డి, పొనుగోడులో అందె నర్సయ్య, సుందరి బసవయ్య, మల్లారెడ్డిగూడెంలో కందుల గుర్వారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, యాతవాకిల్లలో పున్నంరాజు, సూర్యాపేటలో ధనియాకుల గుర్వయ్య, మునగాలలో ముదిరెడ్డి ఆదిరెడ్డి, హత్యలతోపాటు సూర్యాపేట, తుంగతుర్తి, పుట్టపాక లాంటి అనేక గ్రామాల్లో, ఉద్యమ కేంద్రాలపైన దాడులు జరిగినప్పుడు ఆ కేంద్రాలకు అండనిచ్చి, వారి కుటంబాలకు మనోధైర్యాలను నింపటంలో ఆమె నిర్వహించిన పాత్ర అద్వీతీయం. ఆమె నిర్బంధాలపై గలమెత్తితే పాలకవర్గాలకు, పోలీసులకు లాగు తడిచేది. స్వరాజ్యంగారు ఏ సభలో పాల్గొన్నా, ఆమె ప్రసంగం కోసం ప్రజలు గంటల తరబడి ఎదురుచూసేవారు, కేరింతలు కొట్టేవారు.
జిల్లా అభివృద్ధిలో స్వరాజ్యం పాత్ర కీలకం
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, సాగు, తాగునీరు, ఫ్లోరైడ్ నివారణ కోసం నిరంతరం ఆమె శాసనసభలో - ప్రజాపోరాటాల్లో తన గళాన్ని వినిపించేది. 1978లో, 1983లో రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి తుంగతుర్తితో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికై సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆమెది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కళాశాలతోపాటు, రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు ఆమె కాలంలో అందుబాటులోకి తెచ్చినవే. తుంగతుర్తి ప్రాంతానికి యస్.ఆర్.యస్.పి. ద్వారా సాగు, తాగు నీటి కోసం నిరంతరం పోరాటం చేసి విజయం సాధించిన ఘనత కమ్యూనిస్టులదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శ్రీశైల సొరంగ మార్గం నుండి ఏ.యం.ఆర్.పి. ప్రాజెక్టుద్వారా హైదరాబాద్ తాగునీటికీ, నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం సాధించిన ఘనత కమ్యూనిస్టులదే. కాగా ఆ ప్రజాపోరాటాలన్నింటిలో మల్లు స్వరాజ్యానిది చెరగని ముద్ర.
ఆమె జీవితం అంతా పోరాటాలమయం. భూస్వామ్య వర్గంలో పుట్టినా పీడిత వర్గాలకోసం తుదిశ్వాస వరకు పనిచేసారు. ప్రతినిత్యం పీడితులకోసం గలమెత్తి నినదించారు. అందుకే ఆమె చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లిఖించబడ్డది. తెలంగాణలో ప్రజారాజ్యస్థాపనే ఆమె లక్ష్యం. ప్రజాపోరాటాలను నిర్మిద్దాం - మల్లు స్వరాజ్యం ఆశయాలను సాదిద్దాం. ఇదే ఆమెకు మనమిచ్చే ఘనమైన నివాళి.
(నేడు సూర్యాపేటలో
సంస్మరణసభ సందర్భంగా)
- ములకలపల్లి రాములు
సెల్: 9490098338