Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ కిలారి ఆనంద పాల్.. ప్రపంచ శాంతి దూత.. అమెరికా గ్లోబల్ పీస్ సంస్థ ప్రతినిధి... ఇలా చెబితే ఆయన్ను ఎవరూ గుర్తు పట్టరేమో. కానీ కేఏ పాల్ అంటే మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. క్రైస్తవ మత బోధకుడిగా స్వస్థత ప్రార్థనలతోపాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలు, ఓట్లు, సీట్లకు సంబంధించి అప్పుడప్పుడూ ఆయన అకస్మాత్తుగా, గమ్మత్తుగా చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతూ ఉంటాయి. అంతకు మించి జనాలకు మస్తు వినోదాన్ని పంచుతూ ఉంటాయి. తాజాగా ఆయన తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చేసిన కామెంట్లు ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి 72 స్థానాలు దక్కుతాయంటూ పాల్ సెలవిచ్చారు. ఇక ఆంధ్రా శాసనసభకు ఎలక్షన్లు జరిగితే అక్కడ 102 సీట్లు ఖాయమంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. దీంతో ఇరు రాష్రాల్లోని ప్రజలకు మైండ్ బ్లాకయింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి వారు తేరుకోకముందే త్వరలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో... ఆ పదవిని తనకు ఇస్తామనే ఆఫర్లు వస్తున్నాయంటూ మరోసారి పాల్ సార్ ఆటంబాంబు పేల్చారు. ఇక్కడ గమ్మత్తయిన విషయమేమంటే... ఓ పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా అప్పటి ఎన్నికల కమిషనర్ ఐవీ సుబ్బారావును కలిశారు. తాను, తన పార్టీ విధానాలు, ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామనే విషయాలను ఆయన కమిషనర్‌కు చెప్పారు. 'ఇంతకీ మీ పార్టీని ఈసీ వద్ద రిజిస్ట్రర్ చేశారా...?' అని ఆయన అడగ్గా... అవాక్కయిన పాల్, అదేంటి పొలిటికల్ పార్టీని కూడా రిజిస్ట్రర్ చేయాలా..? నాకు తెలీదే... అంటూ అమాయకంగా ప్రశ్నించారు. దానికి సుబ్బారావు నింపాదిగా... 'ముందు ఢిల్లీ వెళ్లి, ఆ పని చేసుకుని రండి సార్, ఆ తర్వాత ఎన్నికలు, సీట్లు, ఓట్లు గురించి ఆలోచిద్దురు గానీ...' అంటూ వెనక్కి పంపించారు. గట్లుంటది మన పాల్ సామి యవ్వారం...
-బి.వి.యన్.పద్మరాజు