Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్వకాలంలో సింహసనాన్ని దక్కించు కునేందుకు పక్క రాజ్యాలపై రాజులు దండయాత్రలు చేసి రాజ్యాలను స్వాధీనం చేసుకునేవారు. కత్తులు, డాలు, బల్లెం వంటి పదునైన ఆయుధాలతో తలపడేవారు. యుద్దరంగంలో గుర్రాలు, పాదాతిదళాలు కదనరంగంలోకి దూకేవి. మారిన పరిస్థితుల్లో శత్రుసైన్యాలను ఓడించేందుకు సాంకేతిక పరిజ్ఞానం తోడైంది. కర్ర తుపాకులు, పీస్తోళ్లు వచ్చిన తర్వాత యుద్ధాల ముఖచిత్రమే మారిపోయింది. తుపాకీతో శత్రువును సులువుగా చంపేయవచ్చు. గురి చూసి నేలకూల్చవచ్చు అనేది తేలిపోయింది. ఆ తర్వాత అత్యంత సులువైన ఏకే 47, రైఫిల్స్, మిషన్గన్స్ శత్రుసేనలకు దడపుట్టిచ్చాయి. సెకండ్ల వ్యవధిలో వందల గుండ్లు రరుమంటూ దూసుకెళ్లి శత్రువుల గుండెల్లో గునపాలుగా దిగుతున్నాయి. వీటితో శత్రు సంహారం ఈజీగా జరుగుతున్నది. చివరకు మానవ వినాశక అణుబాంబులు సిద్ధమయ్యాయి. హిరోషిమా, నాగసాకి అనుభవం విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికీ అక్కడ కనీసం గడ్డి కూడా మొలవడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లో తమ హక్కుల కోసం ప్రజలు ఉద్యమాలకు దిగారు. రష్యా, చైనా వంటి దేశాల్లో విప్లవాలు విజయం సాధించాయి. ఈ ఉద్యమాల ఫలితంగా అనేక దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు కనుమరుగై...ప్రజాస్వామ్యం, సంక్షేమ రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు రాసుకోవడం తద్వారా ఎన్నికలు జరపడం, ఓటింగ్ ద్వారా తమకు ఇష్టమైన పాలకులను ఎన్నుకునే అవకాశాలొచ్చాయి. సంక్షేమ రాజ్యం పేరిట ప్రజల అవసరాలు తీర్చేలా పాలకులు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాల్సిన అవసరమెచ్చింది. రైల్వేలు, విమానాలు, టెలికమ్యూనికేషన్, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, ఇండ్ల నిర్మాణం, తాగు, సాగునీరు కల్పించకపోతే తమకు పుట్టగతులుండవనే పరిస్ధితి పాలకులకు వచ్చింది. మారిన పరిస్థితుల్లో అధికారం రావాలంటే, కత్తు దూయడాలు, గన్స్ పేల్చడాలు, బాంబులేయడాలు, నరికేయడాలకు కాలం చెల్లించింది. ఈ నేపథ్యంలో ప్రజల దగ్గరకు వెళ్లక తప్పని స్ధితి ఏర్పడింది. భారత దేశంలోనైతే సభలు, భారీబహిరంగసభలు నిర్వహించి ఓట్లు అడుగుతున్నారు. అందుకు భిన్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎర్రటి ఎండలో పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డికీ పాదయాత్ర కలిసొచ్చింది. తాజాగా తెలంగాణలోనూ పాదయాత్రల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వైఎస్ షర్మిల, బీజేపీ అధ్యక్షులు బండి సంజరు పాదయాత్రలు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టే ఆలోచన చేస్తున్నారు. పాదయాత్రలు చేస్తేనే అధికారం కైవసమవుతుందనే నమ్మకమే వారిని నడిపిస్తున్నది.
- గుడిగ రఘు