Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మీడియాలో మాటల మాంత్రికుడు అని అభివర్ణిస్తుంటారు. ఆయన ఎప్పటికప్పుడు గుప్పించే పదజాలం వెనక లోతైన రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. కాకపోతే మాటల మంత్రజాలం తెలుసు గనక వాటిని వేగంగానూ అంతుపట్టకుండానూ మార్చచడంలోనూ ఆయన దిట్ట. టీఆర్ఎస్ను బిఆర్ఎస్గా చేసి భారత దేశమంతటినీ తను తెలంగాణలాగే అభివృద్ధి చేయాల్సిన అవసరముందనే మహదాశయాన్ని తాజాగా జరిగిన తమ పార్టీ 21వ వ్యవస్థాపక ప్లీనరీ సమావేశంలో పునరుద్ఘాటించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందిస్తా నన్నారు. 75 ఏండ్ల స్వాతంత్రం తర్వాత కూడా సమస్త వనరులు, యువశక్తి గల ఈ దేశం ఎందుకు ప్రాథమిక సదుపాయాల విషయంలోనే ఇంతగా కునారిల్లిపోతున్నదని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. వీటిని సరిచేసే ఉద్దేశం ప్రయత్నం లేకపోగా అనర్థదాయకమైన మతతత్వ రాజకీయాలతో కేంద్ర నిరంకుశత్వ పోకడలతో దేశం దారితప్పిపోతున్నదని మోడీ సర్కారుపై విమర్శలు సంధించారు. అంతవరకూ ఆయనతో ఎవరైనా ఏకీభవిస్తారు, హర్షిస్తారు కూడా. అయితే అక్కడే ఆగివుంటే ఆయన ప్రత్యేకత ఏముంటుంది? దేశాన్ని అభివృద్ధి చేయడం తప్ప ఒకరిని ఓడించడం ఒకరిని గెలిపించడం తన లక్ష్యం కాదన్నారు. స్థూలంగా సరైన దిశలోనే ధ్వనించే ఈ మాటలతో పాటు మరో వాక్యం జోడించి ఉండకపోతే సమస్య ఉండేది కాదు. పైగా అందుకు ఆయన కమ్యూనిస్టులను తప్పుపట్టడం, వారితో రానని చెప్పానని వేదికపై ప్రకటించడం ఈ మొత్తం వ్యాఖ్యలకు యాంటీ క్లైమాక్స్గానూ నిగూఢమైన మలుపుగానూ మారింది. కమ్యూనిస్టు నాయకులు తనను కలుసుకున్నప్పుడు మోడీని గద్దెదించడం కోసం కలసి పనిచేద్దామని ప్రతిపాదించారని, అది చెత్త ఎజెండా అందుకోసమైతే మీతో రానని చెప్పానని ఆయన ప్రవచించారు. మొత్తం విమర్శ మోడీ విధానాలపై చేసిన కేసీఆర్‌కు ఆ మోడీని ఓడించడం చెత్త ఎజెండాగా ఎందుకు మారినట్టు? మోడీని గద్దె దించకుండా మోడీత్వను ఓడించడం సాధ్యమా? అనేది ప్రాథమికమైన ప్రశ్న. రేపు తెలంగాణలో జరిగే ఎన్నికలలో గాని లోక్‌సభ ఎన్నికలలో గాని ఆయన బీజేపీని ఓడించడానికి పనిచేయరా? బండిసంజరు వంటివారి దూషణలను బెదిరింపులను ఎదుర్కోరా? ఇదే మాట కమ్యూనిస్టు నాయకులు చెబితే చెత్త ఎజెండా ఎలా అయింది?
గత జనవరిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి. బీజేపీని ఓడించేందుకుగాను ఆయా రాష్ట్రాల రాజకీయ పొందికను బట్టి సరైన వ్యూహాన్ని నిర్ణయించుకోనున్నట్టు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యం గమనంలో ఉంచుకొని అడుగులు వేస్తామన్నారు. నిరంకుశ మతతత్వ విధానాలు, విశృంఖల కార్పొరేటీకరణ, ప్రజావ్యతిరేక పోకడలు, రాష్ట్రాలపై దాడులకు ప్రతిరూపంగా మారిన బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్ష అని సీపీఐ(ఎం) భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో కేరళలో జయప్రదంగా ముగిసిన సీపీఐ(ఎం) 23వ మహాసభ కూడా ఇదే విధమైన పిలుపునిచ్చింది. ఈ మహాసభ సందర్బంలోనూ హైదరాబాద్ సమావేశాల సమయంలోనూ కూడా ఏచూరి ఎన్నికల ఫలితాల తర్వాతనే ఏ సంఘటనైనా సాద్యమని సోదాహరణంగా చెప్పారు. 1977లో జనతాపార్టీ కూడా ఎన్నికల తర్వాతనే ఏర్పడిందనీ, 1989, 1996, 1998, 2004 ఎన్నికల తర్వాతనే కూటముల నామకరణం రూపకల్పన జరిగాయని గుర్తు చేశారు.
కేసీఆర్ చెప్పిందేమిటి?
కేంద్రకమిటీ సమావేశాలకు వచ్చినప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సీతారాం ఏచూరి తదితరులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చలు జరపడంపై బీజేపీ చాలా ప్రచారాలు చేసింది. బీజేపీ ముఖ్యమంత్రులు వరుసకట్టి దిగిపోయి కేసీఆర్‌ను అరెస్టు చేసి ఈడ్చుకుపోతామని నోరుపారేసుకుంటున్న సమయంలో పినరాయి విజయన్ సందర్శన ప్రత్యేకత సంతరించుకుంది. వాస్తవానికి కేరళ ప్రభుత్వ అధికారుల సంప్రదించిన తర్వాత విజయన్ కేంద్ర కమిటీ సమావేశాలకు వస్తున్నారని తెలుసుకున్న కేసీఆరే స్వయంగా విజయన్‌తో పాటు, సీపీఐ(ఎం) జాతీయ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించారు. దేశ రాజకీయ పరిస్థితులు, బీజేపీని ఓడించవలసిన అవసరం ఉందని ఉభయులూ అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. వివరంగా రాజకీయ చర్చలు జరిపినట్టు అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా నోట్ విడుదల చేసింది. ఇదే సమయంలో హైదరాబాదు పర్యటనలో ఉన్న సీపీఐ కార్యదర్శి రాజా కూడా తెలంగాణ నాయకులతో కేసీఆర్‌ను కలిశారు. (సీపీఐ(ఎం)కు సంబంధించి తెలుగు రాష్ట్రాల నేతలు కేసీఆర్‌ను కలిసినవారిలో లేరు.) తాము మౌలికంగా బీజేపీని ఓడించేందుకు కృషి జరగాలనే విషయం మాట్లాడామని, తెలంగాణలో నిర్దిష్టంగా ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంటుందని మీడియాకు ఏచూరి చెప్పారు. దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు ఎత్తుగడలు నిర్ణయమవుతాయి తప్ప ముందస్తుగా వాటిగురించి నిర్ణయాలు ఉండబోవని వివరించారు. కనుక మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను, మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించాలనే దిశలో తప్ప పొత్తులు కూటముల కోసం రావలసిందిగా ఆహ్వానించిందే లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని, బీజేపీ విషయంలో కేసీఆర్ మరింత దృఢంగా పోరాడాలని తాము భావిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అప్పట్లో వ్యాఖ్యానించారు. కాబట్టి కమ్యూనిస్టులు పిలిచినట్టు తాను రానని చెప్పినట్టు చిత్రించడం వాస్తవాలతో పొసగదు. అలాంటి కదలికలూ కథనాలు, నిరసనోద్యమాలు నిప్పులు కక్కే మాటలూ టీఆర్ఎస్ నుంచే వచ్చాయి.
కేసీఆర్ అంతకు ముందు తమిళనాడు వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. వామపక్ష నాయకులతో చర్చల తర్వాత రెండు రోజులకు బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రగతిభవన్ వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్థాక్రేను కలిశారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం ఆయన పనిచేస్తున్నారనే వార్తను అనేక పత్రికలు చానళ్లు ప్రముఖంగా ఇచ్చాయి. మోడీని ఓడించడం చెత్త ఎజెండా అయివుంటే వీటన్నిటికీ ఆస్కారం లేదు. వాటిపై ఖండన కాదు కదా వివరణ కూడా ఇచ్చింది లేదు. ప్రత్యామ్నాయం విధానపరంగా ఉండాలనేది నిజమే అయినా అది బ్రహ్మపదార్థం కాదు. కేంద్రంలో మోడీ మరోసారి వస్తే ఆయన ఎజెండా అమలవుతుందే గాని కేసీఆర్ బీఆర్ఎస్ ఎక్కడుంటుంది? చెత్త వంటి పదాలు వాడేప్పుడు ఇంత చిన్న లాజిక్ కేసీఆర్ ఎలా మిస్సయ్యారు? ఒకసారి ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రసంగాలు చూస్తే మోడీని ఇంటికి పంపుతామని ఎన్ని సార్లు చెప్పారో తెలుస్తుంది.
బీజేపీని ఓడించనవసరం లేదా?
దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణలలో బీజేపీకి బలం లేదు. కర్నాటకలో కూడా కాంగ్రెస్ జేడీఎస్‌ల పోటీ ఉంటుంది. ఏపీ, తెలంగాణలలోని వైసీపీ టిఆర్ఎస్ పార్టీలు పార్లమెంటులో చాలాసార్లు మోడీ విధానాలకు మద్దతునిచ్చినా బీజేపీనేతలు మతతత్వ రాజకీయాలు అంతకంతకూ పెంచుతూనే వస్తున్నారు. గుంటూరులో జిన్నా టవర్ వివాదం, తెలంగాణలో హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలనే పిలుపు ఇందులో భాగాలే. ఏపీ క్రైస్తవ రాష్ట్రంగా తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయాయని ఆ పార్టీ నేతలు అంటుంటారు. ఇప్పుడు బండిసంజరు పాదయాత్రలోనూ కేసీఆర్‌పై బెదిరింపులకు తోడు హిందూత్వ భాషణలు జోరుగా సాగిస్తున్నారు. ఈ పరిస్థితులలో కేసీఆర్ వంటివారు బీజేపీ, విధానాలను విమర్శిస్తూనే మోడీని ఓడించాలనే పిలుపును ఎలా తప్పు పడతారు? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్ బీజేపీలకు సమదూరంలో ఉంటానని కేసీఆర్ సూచించినట్టు మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. తాజాగా మజ్లిస్ నాయకుడు అసదుద్డీన్వొవైసీతో కలసి పాల్గొన్న ఇప్తార్ విందులోనూ ఆయన కేంద్రానికి జబ్బు చేసిందని, చికిత్స అవసరమని అన్యాపదేశంగా మాట్లాడారు. మాటల మాంత్రిక బిరుదాంకితుడైన ముఖ్యమంత్రి పలుకుల్లో ఏదైనా పరమార్థం ఉన్నదా? ఫ్రంట్లు అప్పుడే కుదరవని ఏచూరి వంటివారు చెప్పినప్పుడు హడావుడి పడిందీ, నాయకత్వం పై ఊహాగానాలకు తెరలేపిందీ, మమతాబెనర్జీ కేసీఆర్ వంటి నాయకులే. ఇప్పుడు ఓడించడం గెలిపించడం ముఖ్యం కాదంటున్నదీ ఆయనే. ఎవరి ఉద్దేశాలు ఏమైనా, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా మతతత్వ రాజకీయాలను ఓడించాలంటే వాటికి మూల విరాట్టుగా ఉన్న మోడీని గద్దెదించకుండా జరిగేపని కాదు. ఈ విషయంలో టీఆర్ఎస్ తదుపరి అడుగులు ఎలా ఉండేది భవిష్యత్తు చెప్పాలి. తమతో బీజేపీపై కలసి పోరాడదామని చెప్పిన కేసీఆర్ ఎందుకు ప్లేటు మార్చారో ఆయనే చెప్పాలని సీతారాం ఏచూరి తాజాగా అన్నమాటపై ఎలా స్పందిస్తారో చూద్దాం. బీజేపీపైన మోడీపైన కేసీఆర్ విమర్శల విశ్వసనీయత ఆచరణలో మోడీత్వ ఓటమికి పోరాడటంపైనే ఆధారపడి ఉంటుంది.
- తెలకపల్లి రవి