Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్రిల్ 30, 1948 కేరళ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో రక్తాక్షారాలతో రాయబడిన రోజు. ఆ వీరోచిత చరిత్ర రూపుదిద్దు కున్న గ్రామం ఒంచియమ్. దానికి నిలువెత్తు నిదర్శనం రక్త సాక్షి మందిరం.1948లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు పోలీసు కాల్పుల్లో 10 మంది ఒంచియమ్ గ్రామస్తులు అమరులయ్యారు. ఉత్తర కేరళలోని ఒంచియమ్ గ్రామం కేరళ కమ్యూనిస్టు చరిత్రలో రక్తాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిఉంది.
కమ్యూనిస్టు ఉద్యమం అనేది ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా పూల బాట కాదు, అది అమరుల త్యాగాల తోట. ఎందరో అమరులు తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి నిర్మిస్తున్న కోట. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తీర్చే వెలుగు బాట.
కేరళలో అనేక గ్రామాలు కమ్యూనిస్టు పార్టీ వెనక నిలబడి భూమికోసం, భుక్తి కోసం, భూస్వాముల నుండి విముక్తి కోసం, దేశానికి స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేశాయి. స్వాతంత్రం వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సర్వస్వాన్నీ త్యాగం చేసి పోరాడారు. 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ దాస్య శంఖలాల నుండి దేశం విముక్తి చెందింది. పాలకులు మారారు, కాని పాలన పద్దతి మారలేదు. దోపిడీ, పీడన పోలేదు. స్వాతంత్రం అనంతరం ప్రజా పోరాటాల పై ఉక్కుపాదం మోపారు నూతన పాలకులు. కమ్యూనిస్టు పార్టీ పైన బ్రిటిష్ ప్రభుత్వం క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించింది, కనబడిన వారిని పిట్టల్లా కాల్చేశారు, ఉరికొయ్యలకు వేలాడదీస్తారు, రక్తపుటేరులు పారించారు. స్వాతంత్రం తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకున్న భారత పాలకవర్గం కూడా కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధాన్ని అలాగే ప్రయోగించింది. కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం కొనసాగించింది.
స్వతంత్ర భారత దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ స్వేచ్ఛగా పని చేసే అవకాశం లేకుండాపోయింది. కేరళలో బలపడుతున్న కమ్యూనిస్టు పార్టీని లేకుండా చేయాలని మలబార్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై కూడా అదే రీతిలో నిర్భంధం ప్రయోగించిన విషయం మనకు తెలిసిందే.
అరేబియా సముద్రపు ఒడ్డున కోజికోడ్ జిల్లా వడకర తాలూ కాలో ఒక గ్రామం ఒంచియమ్. గ్రామం చిన్నదే కానీ చరిత్ర చాలా పెద్దది. నాది ఒంచియమ్ అని ప్రతి గ్రామస్తుడు రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకోదగిన చరిత్ర. కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టనికోట, అమరుల రక్తపు ధారలతో పెంచిన ఎర్రపూలతోట.
కమ్యూనిస్టు పార్టీ ఆ గ్రామంలో అడుగు పెట్టక ముందు జెన్మీలు(భూస్వాములు), బ్రిటిష్ పాలకులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తుండేవారు.
1939లో మండోటి కన్నన్ నాయకత్వంలో ఒంచియమ్ కమ్యూనిస్టు పార్టీ మొదటి శాఖ ఏర్పడింది. 1940లో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. భూస్వాముల ఏజెంట్లు, బ్రిటిష్ అధికారులపై రైతుసంఘం ఆధ్వర్యంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం మండోటి కన్నన్ నాయకత్వంలో జరిగింది. కౌలు రైతులు భూస్వాముల భూముల్లో పండించిన ధాన్యాన్ని భూస్వాములకు ఇవ్వకుండా రైతు సంఘం స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేసారు. కలరా, డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు, వ్యాధి బారిన పడి ఒంటరిగా ఉన్నవారికి కమ్యూనిస్టు పార్టీ సేవ చేసింది. వారికి వైద్య చికిత్సలు అందించారు. మూఢనమ్మకాలకు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేసింది. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై జరిగే కషిలో కమ్యూనిస్టులు ముందున్నారు. 1940లనాటికే కమ్యూనిస్టుల వేట మొదలైంది. తుటార్చ్ ఐలాండ్, ఉత్తర కేరళలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతా లను దష్టిలో ఉంచుకుని బ్రిటిష్ పోలీసులు, మలబార్ పోలీసు లను కమ్యూనిస్టు వ్యతిరేకత నూరిపోసి కమ్యూనిస్టు వ్యతిరేకు లుగా మార్చారు. కమ్యూనిస్టుల నిర్మూలనే వారి లక్ష్యం ఉండేది.
1947 ఆగస్టు 15న కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చింది . సంపన్నవర్గాల, భూస్వాములు కాంగ్రెస్ పంచన చేరి పాత పద్ధతిలో సాధారణ ప్రజలను వేధించడం మొదలుపెట్టారు. బలవంతంగా భూస్వాముల ఆహార ధాన్యాలను కౌలు రైతులనుండి లాక్కెళ్లారు. ఆహార కొరత తీవ్రమైంది. ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం భూస్వాములకే అండగా నిలబడి రైతులను అణిచి వేసేందుకు పూనుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాగుతున్నాయి. జన్మిత్వానికి(భూస్వామ్యానికి),అధిపత్యానికి వ్యతిరేకంగా గ్రామగ్రామాన కమ్యూనిస్టులు ప్రజలకు రక్షణ కవచంగా నిలబడ్డారు.
ఒంచియమ్ గ్రామంలో స్థానిక భూస్వాములు, వారి తాబేదార్లు రైతుల నుండి ధాన్యం సేకరించకుండ కమ్యూనిస్టుపార్టీ నిలువరించింది. వారు కొలిపట్టి మాధవమీనన్ ఫిర్యాదు చేశారు. ఆయన కమ్యూనిస్టులను అరెస్టు చేయాలని ఆదేశించారు. 30 ఏప్రిల్, 1948న, కమ్యూనిస్ట్ కార్యకర్తలను అరెస్టు చేయడానికి ఒక పోలీసు బెటాలియన్ గ్రామంపై దాడి చేయడానికి వచ్చింది. గ్రామాన్ని చుట్టుముట్టింది. తమ నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులను కాపాడుకోవడానికి ఊరు ఊరంతా కదిలింది. పోలీసులను గ్రామంలోకి ప్రవేశించకుండా ఊరు బయట అడ్డంగా కోటలా నిలబడ్డారు. ఒకవైపు ప్రజలు, మరోవైపు సాయుధులైన పోలీసులు యుద్ధంలో సైన్యాలు మోహరించినట్లు ఎదురెదురుగా నిలబడ్డారు. తమ నాయకులను ముట్టుకుంటే సహించేది లేదని ప్రజలు ఎదురుతిరిగారు.
ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తుంటే , పోలీసులు నిరాయుధులైన నిరసనకారులపై కాల్పులు ప్రారంభించారు. తుపాకీ తూటాల వర్షమే కురిసింది. లి1) కామ్రేడ్స్ మీనన్ కనరన్, 2) అలవక్కల్ కష్ణన్, 3) పురైల్ కనరన్, 4) పరోల్లతిల్ కనరన్, 5) వి.కె. చతు, 6) కె.పి. రావుట్టి, 7) కె.ఎం. శంకరన్, 8) %V.ూ%. గోపాలన్ ఈ ఎనిమిది మంది తూటాలు తగిలి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిచనిపోయారు.లి లికామ్రేడ్లు మండోటి కన్నన్, కొల్లనిచేరి కుమరన్ లను అరెస్టు చేసారు. తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలకు గాయపడి ఇద్దరు కామ్రేడ్స్ ఆసుపత్రిలో మరణించారు.లి
స్వాతంత్రం వచ్చిన 8 నెలలుకూడా గొడవకు ముందే స్వదేశీ పాలకులు సాగించిన నరమేధం ఒంచియమ్. ప్రభుత్వం బలప్రయోగంతో చేసిన అణచివేత, సాగించిన హింసాకాండ ఒంచియం స్ఫూర్తిని అణ చివేయలేకపోయింది, అప్పటి నుండి ఈ గ్రామం కమ్యూనిస్టుల కంచు కోటగా మిగిలిపోయింది. ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఎర్రజెండా సగర్వంగా తలెత్తుకుని నిలబడుతూ వస్తోంది.
పది మంది అమరులు రక్తం చిందించిన స్థలంలో నిర్మించిన స్మతి చిహ్నం 'రక్త సాక్షి మందిరం' (అక్కడ అందరూ దానిని అలాగే పిలుస్తారు) ఎర్రగా దగదగ మెరుస్తూ ఉత్తేజాన్ని వెదజల్లుతోంది. భవనంపై కొడవలి చేతపట్టి దోపిడీ వర్గాలను ఎదిరించిన వీరుని విగ్రహం అమరుల స్ఫూర్తికి ప్రతీకగా నిలిచి భవిష్యత్తు పోరాటాలకు దారి చూపుతున్నట్లుగా ఉంటుంది.
తమకోసం పోరాడిన వారిని కాపాడుకోవడానికి ప్రజలు ఎంతటి త్యాగాలకైనా వెనుకడుగువేయరు అనే సత్యానికి నిరూపణ ఒంచియమ్.
- మహమ్మద్ అబ్బాస్