Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంకలో బద్దలైన ఆర్థిక సంక్షోభం గురించి ఇప్పటికిే చాలా సమాచారం వెలుగులోకి వచ్చింది. విదేశీ రుణం భారీగా పేరుకుపోవడం, వ్యాట్‌లో హెచ్చు మోతాదులో ఇచ్చిన రాయితీల ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయి ద్రవ్యలోటు పెరిగిపోవడం, దేశీయంగా చేయవలసిన ఖర్చు నిమిత్తం కూడా విదేశీ రుణం తీసుకోవడం, కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం దెబ్బ తినిపోయి, దాని వలన విదేశీ మారక ద్రవ్యం రాబడి పడిపోవడం, శ్రీలంక కరెన్సీ మారకపు రేటు పతనం కావడం, అందువలన ప్రవాసులుగా ఉన్న శ్రీలంక ప్రజలు అధికారికంగా తమ సంపాదనను స్వదేశానికి పంపే బదులు అనధికారిక మార్గాలను ఎంచుకోవడం, విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం, విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం శ్రీలంక ప్రభుత్వం రసాయన ఎరువుల దిగుమతులను భారీగా తగ్గించడం, దాని ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోవడం-ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.
ఒకానొకప్పుడు ''ఆదర్శవంతమైన'' సంక్షేమ రాజ్య నమూనాగా శ్రీలంక గురించి చెప్పుకునేది కాస్తా పోయి, ఇప్పుడా దేశం దక్షిణాసియా ''రోగిష్టి''గా దిగజారిపోయింది. ఆ దేశపు పరిస్థితి ఇలా తారుమారవడానికి బాధ్యత ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం విషయంలో మాత్రం ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఈ పతనానికి రాజపక్స ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని అందరూ అంగీకరిస్తారు. కాని ఆ ప్రభుత్వం చేసిన తప్పేమిటన్న విషయంలో మాత్రం చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
చైనా దేశంతో ఆర్థిక సంబంధాలు బలంగా పెంచుకుంటున్నందు వల్లనే శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించిందని అమెరికన్ ప్రభుత్వమూ, దాని తరఫున ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న వీరులు ఆరోపిస్తున్నారు (రాబోయే రోజుల్లో ఈ వాదనలు మరింత గట్టిగా వినవస్తాయి). శ్రీలంక విదేశీ రుణం భారీగా పెరిగిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అక్కడి ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని మరికొందరు విమర్శిస్తున్నారు. భారతదేశంలోని కొంతమంది వ్యాఖ్యాతలు మన దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా శ్రీలంక ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నాయని, పద్ధతులను మార్చుకోకపోతే ఆ రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు అదుపు తప్పిపోతాయని హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకలో సంక్షోభం ఈ విధంగా బద్దలవడం వెనుక నయా ఉదారవాదం పోషించిన పాత్రను ఈ వ్యాఖ్యాతలందరూ విస్మరిస్తున్నారు. నయా ఉదారవాదం గురించి ఓ మంత్రం మాదిరిగా మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. మంచి సానుకూల పరిస్థితుల్లో సైతం నయా ఉదారవాదం కారణంగా కార్మికవర్గం పేదరికంలోకి జారిపోతూ ఉంటుంది. ఉత్పత్తి అయిన మిగులులో ఎక్కువ వాటా పెట్టుబడిదారులకు పోవడం వలన ఆర్థిక వ్యవస్థలో అన్ని రకాల ఇబ్బందులూ తలెత్తుతాయి. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. వీటికి తోడు చిన్న సైజు ఆర్థిక వ్యవస్థలు ఉన్న చోట్ల లిప్తపాటు కాలంలో పరిస్థితులు తల్లకిందులవుతాయి. ఇది నయా ఉదారవాదం పుణ్యమా అని తగులుకునే అదనపు సంక్షోభం. వ్యవస్థీకృత సంక్షోభాలకు (కొనుగోలుశక్తి పడిపోవడం, ఉత్పత్తి మందగించడం, నిరుద్యోగం వంటివి) తోడు ఇది అదనంగా వస్తుంది. అయితే ఇది ప్రపంచం మొత్తం మీద వచ్చే పరిణామం కాదు. విస్తారమైన ప్రాంతాలలోనూ ఇటువంటిది సంభవించదు. కొన్ని దేశాలు మాత్రమే ప్రత్యేకంగా ఇందులో ఇరుక్కుంటాయి. ఈ తరహా 'అదనపు సంక్షోభం' ప్రత్యేక లక్షణం ఏమంటే అందులో ఇరుక్కుపోయిన తర్వాత గాని ఆ దేశానికి జ్ఞానోదయం కలగదు.
గ్రీస్ దేశంలో ఇటువంటి 'అదనపు సంక్షోభమే' ఏర్పడింది. ఆ దేశంలో కూడా విదేశీ రుణం భారీగా పెరిగిపోతూవచ్చింది. అయితే ఆ భారాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు ఊహించలేదు. చివరికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చేయి దాటిపోయే పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే రుణమాఫీ చేయడం ఒక్కటే మార్గం అన్న స్థితి ఏర్పడింది.
ఈ 'అదనపు సంక్షోభం' అనేది అనుకోకుండా, యాదృచ్ఛికంగా సంభవించేది కాదు. నయా ఉదారవాద వ్యవస్థతో సన్నిహితంగా పెనవేసుకుపోయి, దానితో సజీవంగా సంబంధం కలిగివుండే ధోరణి ఇది. ఎంత మొత్తంలో విదేశీ రుణం తీసుకుంటే అది మోయలేని భారం అవుతుందో ముందుగా తెలుసుకునే అవకాశం లేదు. ఉన్నట్టుండి సంక్షోభంలో పడ్డప్పుడే అది తెలుస్తుంది.
అయితే కొంతమంది ఈ సంక్షోభం వచ్చిపడుతుందని తాము ముందే ఊహించగలిగామని అంటారు. కాని ఒక ప్రభుత్వం సంగతి వేరు. ఎన్నికల ప్రజాస్వామ్యం కొనసాగుతున్న కాలంలో ఒక ప్రభుత్వం, అది ఎంత తిరోగమన స్వభావం కలిగినది అయినప్పటికీ, కొన్ని పరిమితుల్లో వ్యవహరించాల్సి వస్తుంది. సంక్షోభం ముంచుకొస్తోందని కొంతమంది ''తెలివైన వాళ్ళు'' ముందుగానే హెచ్చరించినంత మాత్రాన ప్రభుత్వం తన ఖర్చుల్ని వెంటనే తగ్గించుకోలేదు. సంక్షేమ పథకాలను (అవి ఎంత పరిమితం అయినప్పటికీ) కుదించుకోలేదు. పెన్షన్ చెల్లింపులకు కోత పెట్టలేదు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇతర ప్రభుత్వోద్యోగుల జీతాలను చెల్లించకుండా నిలుపు చేయడం దానికి సాధ్యం కాదు.
ఒకానొక దేశ ఆర్థిక వ్యవస్థ విదేశీ చెల్లింపులలో లోటు సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో ఆ ఇబ్బంది తాత్కాలికమైనదిగా కనిపిస్తున్నప్పుడు ఆ దేశ ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించడానికి విదేశీ రుణాలకోసం పోతుంది. అప్పటివరకూ ఎటువంటి సంక్షోభమూ లేనందువలన ఆ విధంగా విదేశీ రుణాన్ని తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ వ్యయంలో కోతలు పెట్టడం, దాని పర్యవసానంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, దానికి తోడు ఆర్థిక మాంద్యం ఏర్పడే వాతావరణం నెలకొనడం-వీటన్నింటికన్నా విదేశీ రుణాన్ని తీసుకోవడమే మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. కాని, ఒకవేళ ఈ విదేశీ చెల్లింపులలో లోటు అనుకున్నదానికన్నా ఎక్కువ కాలంపాటు కొనసాగిందనుకోండి. అప్పుడు విదేశీ రుణాలను పదే పదే తీసుకోవలసి వస్తుంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు విధించే షరతులు అంతకంతకూ విషమంగా తయారవుతాయి. కొద్ది కాలంలోనే ఆ దేశం ఆర్థిక సంక్షోభాన్ని చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా చెప్తున్నానంటే దానర్థం శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని కాదు. ఆ ప్రభుత్వం పరోక్ష పన్నులను భారీగా తగ్గించింది. దాని ఫలితంగా తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని పూడ్చుకోడానికి సంపన్నులపై ప్రత్యక్ష పన్నులను విధించివుం డాల్సింది. కాని ఆ విధంగా చేయకపోవడంతో అక్కడ ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత సంపద పన్ను కొద్ది మేరకు పెంచినా, ద్రవ్యలోటును పూడ్చుకోడానికి అది ఏ మాత్రమూ సరిపోలేదు. అక్కడ పాలనా నిర్వహణలో జరిగిన లోపాలూ చాలా ఉన్నాయి. కాని ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్లను మాత్రమే చూసి, నయా ఉదారవాద చట్రంలో ఆ వ్యవస్థ ఉన్న వాస్తవాన్ని చూడకపోతే అది పొరపాటు అవుతుంది. ఆ నయా ఉదారవాద విధానాల అమలు యొక్క ఫలితాలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడి ప్రజానీకం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు.
శ్రీలంక సంక్షోభం అనుభవాల నుండి రెండు స్పష్టమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక దేశంలో ఒకపక్క సంక్షేమ విధానాలను అమలు చేయడం, మరోవైపు నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం-ఈ రెండింటికీ పొంతన కుదరదు. మూడవ ప్రపంచ దేశాలలోకెల్లా ఎక్కువ స్థాయిలో సంక్షేమ విధానాలను గతంలో అమలు చేసిన దేశం శ్రీలంక. నయా ఉదారవాద విధానాల జోలికి పోకుండా సంక్షేమ విధానాలను అమలు చేస్తున్న దేశం గనుక ఉన్నట్టుండి విదేశీ మారక లోటును ఎదుర్కొంటే దానిని తట్టుకోగలుగుతుంది. విదేశీ రుణం తీసుకోకుండానే, అప్రధానమైన సరుకుల దిగుమతులను తగ్గించుకోడం ద్వారా విదేశీ చెల్లింపు సమస్యను అది ఎదుర్కోగలుగుతుంది. కాని నయా ఉదారవాద విధానాలను అమలు చేసినప్పుడు దిగుమతుల మీద ప్రభుత్వ నియంత్రణలు ఉండవు. అందువలన అప్రధానమైన దిగుమతులను తగ్గించగల శక్తి ఆ ప్రభుత్వానికి ఉండదు. అప్పుడు ఆ ప్రభుత్వానికి రెండే దారులు ఉంటాయి. సంక్షేమ పథకాలను కుదించి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడమో, లేక విదేశీ రుణాన్ని తీసుకోవడమో - ఈ రెండింట్లో ఏదో ఒకటి చెయ్యాలి. అలా తీసుకున్నాక ఏ కారణం వల్లనైనా ఆ దేశపు విదేశీ మారక ఆదాయం తగ్గిందనుకోండి. ఆ ఇబ్బందిని అధిగమించడానికి మళ్ళీ రుణం తీసుకోవలసి వస్తుంది. అప్పుడు విధించే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. దాని వలన ఆ దేశం రుణ ఉచ్చులో చిక్కుకుపోతుంది. ఒకసారి అలా చిక్కుకుపోయాక ఆ తర్వాత సంక్షేమ విధానాలను కొనసాగించడం అసంభవం అవుతుంది. మొదట్లో అటు సంక్షేమ విధానాలను, ఇటు నయా ఉదారవాద విధానాలను ఏకకాలంలో అమలు చేయ వచ్చునని అనిపించినప్పటికీ, పోను పోను ఆ రెండింటికీ పొంతన కుదరక దేశం ఆర్థిక చిక్కుల్లో పడి హఠాత్తుగా అనుకోని షాక్‌లకు గురి కావలసివస్తుంది. అటువంటి షాక్‌లు ఎదురవగానే నయా ఉదారవాద విధానాలకు, సంక్షేమ విధానాలకు పొంతన కుదరదన్న వాస్తవం బైట పడుతుంది. ఇక దానిని కప్పిపుచ్చడం సాధ్యం కాదు.
కాని ఈ వాస్తవాన్ని నయా ఉదారవాద సమర్ధకులు అంగీకరించరు. నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం వలన ''పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం'' ఏర్పడుతుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలగడమే గాక, దేశీయ పెట్టుబడులు కూడా ఊపందుకుంటాయని వారంటారు. దాని ఫలితంగా స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల వేగవంతం అవుతుందని, అప్పుడు ప్రజా సంక్షేమ విధానాలను అమలు చేయగల సామర్థ్యం పెరుగుతుందని వాళ్ళు చెప్తారు. ఈ వాదనలో రెండు లోపాలు ఉన్నాయి.
మొదటిది : కేవలం జీడీపీ వృద్ధి సాధించినంత మాత్రాన సంక్షేమ విధానాలను అమలు చేయగల శక్తి ప్రభుత్వానికి వచ్చేయదు. అలా రావాలంటే సంపన్నులపై అదనపు పన్నులు విధించాలి. కాని ''పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం'' ఉండాలంటే సంపన్నులమీద పన్నులు తగ్గించాలే తప్ప పెంచకూడదు. అందువలన జీడీపీ వృద్ధి ఉన్నా, ప్రభుత్వాదాయం పెరగదు. సంక్షేమ పథకాలను అమలు చేయగల శక్తీ పెరగదు. నయా ఉదారవాద విధానాలను చేపట్టకమునుపు ఆ దేశంలో సంక్షేమ విధానాలు అమలులో ఉంటే, నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాక ఒకానొక సమయంలో ఆ దేశం ''షాక్''లకు గురి కావలసి వస్తుంది. ఇక ఆ తర్వాత నయా ఉదారవాద విధానాలను విడనాడి సంక్షేమ విధానాలను కొనసాగించడమా లేక నయా ఉదారవాద విధానాలను కొనసాగిస్తూ సంక్షేమ విధానాలను విడనాడడమా అన్నది తేల్చుకోవలసి వస్తుంది.
ఇక రెండో గుణపాఠం: నయా ఉదారవాద వ్యవస్థలో ప్రతీ దేశమూ ఇటువంటి ''అదనపు సంక్షోభానికి'' గురయ్యే ప్రమాదం ఉంది. శ్రీలంకలో జరిగినట్టే వేరే ఏ దేశంలోనైనా (నయా ఉదారవాద విధానాలను అమలు చేసే ఏ దేశంలోనైనా) జరగవచ్చు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సంక్షేమ పథకాల మీద వ్యయాన్ని తగ్గించుకోవడం, ప్రభుత్వ వ్యయాన్ని కుదించడం వంటి చర్యలు అనివార్యం అని కొందరు భారతదేశ వ్యాఖ్యాతలు ప్రకటిస్తున్నారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు. కాని అది పరిష్కారం కాజాలదు. నయా ఉదారవాద విధానాల ఉచ్చు నుండి బైట పడడమే అసలైన పరిష్కారం ఔతుంది. ఇది అంత తేలికేమీ కాకపోవచ్చు. కాని మరో మార్గం లేదు. శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదం అల్లా ఆ దేశాన్ని నయా ఉదారవాద ఉచ్చు లోకి నెట్టడమే. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రతీ దేశాన్నీ నయా ఉదారవాద ఉచ్చులోకి లాగడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. బలవంతంగానైనా ఆ ఉచ్చులోకి నెడుతుంది. శ్రీలంక విషయంలోనూ అదే జరిగింది.
ప్రభాత్ పట్నాయక్
-స్వేచ్ఛానుసరణ