Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు, ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. అలానే ఇప్పుడు ఔషధా(మందు)ల ధర వంతు వచ్చింది. మనిషి అనారోగ్యానికి గురైతే రకరకాల వ్యాధు(జబ్బు)లకు వాడే ఔషధాలకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 10శాతం వరకూ పెంచుటకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని వలన సుమారు 800 రకాలైన మందుల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం వినియోగదారుల జీవితాల్లో శరాఘాతంగా మారింది. ఇప్పటికీ ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా వైద్య ఖర్చులు సామాన్యుడికి పెనుభారంగా మారుతున్న వేళ పెరుగుతున్న ఔషధ ధరలతో ప్రజల బతుకులు ''పెనం నుండి పొయ్యిలో పడ్డ'' చందంగా మారింది. బ్రాండెడ్ కంపెనీలు (ఫార్మా సంస్థలు) వారి ఔషధ విక్రయాలు పెంచుకునేందుకు వైద్యులకు ఉచితాలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మరోవైపు జనరిక్ మందుల్లో నాణ్యత లోపమనే అపోహలకు తెరలేపుచున్నారు. జనరిక్ బ్రాండెడ్ మందులకు మధ్య ధరల్లో వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. దీనితో ప్రజలు జనరిక్ వైపు మల్లకుండా కంపెనీలు అడ్డదారుల్లో వైద్యులకు ప్రోత్సాహకాలతో పాటు జనరిక్పై అపోహలు సృష్టిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాల ఉదాసీనత తోడవ్వడంతో బ్రాండెడ్ కంపెనీ(ఫార్మాసంస్థ)లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాలకు చౌకతో నాణ్యమైన మందులు సరఫరా చేస్తున్న భారతదేశం, సొంత ప్రజానీకంలో అత్యధికులకు వాటిని ఎందుకు అందించలేకపోతుంది? సరసమైన ధరలకు లభించే జనరిక్ మందులపై ఉద్ధేశపూర్వక దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేక పోవడం ప్రభుత్వాల వైఫల్యం కాదా! మనదేశంలో వైద్య చికిత్స కయ్యే ఖర్చులో మూడొంతుల దాకా జనమే సొంతంగా భరిస్తున్నారు. మరోవైపు 2014-16లో వచ్చిన ''జాతీయ ఔషధ సర్వే'' ప్రకారం మనదేశంలో 3.16శాతం, తెలంగాణలో 2.91శాతం ఔషదాలు నాసిరకానివని తేలింది. ఇదే క్రమంలో సర్కారు వైద్యంలో అయితే 12.57శాతం మందులు నాణ్యత ప్రమాణాలు కొరవడినట్లు తేల్చింది. అంతేకాదు ఈ సర్వే కొన్ని స్పష్టమైన సిఫార్సులు చేసింది. ఔషధాల కొనుగోలుకు ముందే ఉత్పత్తి సంస్థల్లో నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు చేయాలని సూచించింది. ఔషధాలను ఎప్పటికప్పుడు జాతీయ గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షీంచాలంది. ఫార్మాసిస్టులకు ఔషధాలను నిల్వ చేయడంపై శిక్షణ ఇప్పించాలని చెప్పింది. అతి ముఖ్యంగా నాణ్యత ప్రమాణాల తనిఖీ వ్యవస్థను పటిష్టం చేయాలని స్పష్టం చేసింది.
మన తెలంగాణ రాష్ట్రంలో ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) కొరత తీవ్రంగా ఉంది. దీని మూలంగా తనిఖీలే లేక ప్రమాదంలో పండింది ప్రజారోగ్యం. ఇదే అదునుగా చేసుకొని వెల్లువలా విపణిలోకి నాసిరకం మందులు రావడంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. ఔషధ నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) కొరతే వీరి వ్యాపారానికి వరంగా మారింది. మన రాష్ట్రం మొత్తంమీద ప్రస్తుతం సుమారు 36 వేల ఔషధ దుకాణాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన ''హాతీ'' కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రతి 100 ఔషద దుకాణాలకు ఒక నియంత్రణాధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ మాదిరిగా చూస్తే, రాష్ట్రంలో సుమారు 360మంది అధికారులు అవసరం ఉన్నారు. అలా రాష్ట్రంలోని సుమారు 560 ఔషద ఉత్పత్తి సంస్థల తనిఖీకి మరో 25మంది అధికారులు కావాలి. మొత్తంగా 385 మంది నియంత్రణాధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగా(పోస్టు)లు కేవలం 71మంది మాత్రమే. ఇందులోనూ 18పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔషద దుకాణాలకు అనుగుణంగా అదే నిష్పత్తిలో నియంత్రణాధికారుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఆ వైపుగా వైద్య ఆరోగ్య శాఖ నియామకాలు చేపట్టాలి. అరకొర పర్యవేక్షణ వల్ల నాసిరకం మందులు విపణిలోకి ప్రవేశించి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుందనేది కాదనలేని నిజం. మన దేశంలోనే ఫార్మా రంగానికి తెలంగాణ కీలక కేంద్రంగా గుర్తింపు పొందినది. అంతే కాదు పలు దేశాలకు ఇక్కడి నుంచే ఔషదాలు ఎగుమతి, ముడిసరుకు ఉత్పత్తి చేసే ఔషద సంస్థలున్నాయి. నియంత్రణాధికారు (డ్రగ్ ఇన్స్పెక్టర్)లే.. ఉత్పత్తిలో మరోవైపు విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలను వారే పర్యవేక్షించాల్సి ఉన్నందున వెంటనే ప్రభుత్వం నియంత్రణాధికార్లు (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) భర్తీ చేపట్టాలి. ఏడాది కోమారు హడావిడిగా తనిఖీలు కాకుండా ప్రజారోగ్యం పరిరక్షణార్థం నిత్యం పర్యవేక్షణలు పెంచుతూ, వైద్యులు బ్రాండెడ్ కంపెనీల సిఫార్సులతో ఖరీదైన ఔషదాలను అర్థంకాని గొలుసుకట్టురాతలను నివారించాలి. దీని వెనక ఉన్న ఔషద మాఫియాను కట్టడి చేయాలి. ఇలా కొన్ని ఔషద ఉత్పత్తులను రాయడంగాను కొందరు వైద్యులకు ఆ అమ్మకాల్లో కొంత శాతం కమిషన్, విదేశీ ప్రమాణాల ఖర్చులు, ఖరీదైన బహుమతుల రూపంలో ముడుతుందనే బహిరంగ విమర్శే ఉంది. దీన్ని తనిఖీలు, పర్యవేక్షణలతో నియంత్రించాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజలందరికి పేద, మధ్య తరగతుల జీవితాలకు నాణ్యమైన మందుల సరఫరాతో పాటు జనరిక్ ఔషదాలకు ప్రచారం, చైతన్యం కల్పించి వాటిని వినియోగంలోకి తెస్తూ వైద్య ఖర్చుల భారాన్ని ప్రజలకు తగ్గించాలి. జన శ్రేయస్సు కోసం సరైన ఔషదాలు అందించాలి, నాసిరకాల మందులను కట్టడి చేయాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 2300 మంది జనాభాకు ఒక ఫార్మసిస్టు ఉండాలి. ఆ లెక్కన చూస్తే మన రాష్ట్ర జనాభాకు సుమారు 17 వేల మంది అవసరం ఉంది. మన రాష్ట్రంలో 62 వేల మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఉన్నారు. అంటే అవసరానికంటే మూడింతలు ఉన్నారు. సమన్వయం ప్రణాళిక లేమితో వీరి సేవలు వినియోగించుకోలేక పోతున్నారు. నిబంధనల మేరు ఫార్మాసిస్టులు ఉండేలా నియంత్రణ, పర్యవేక్షణ చర్యలు తీసుకొని ఔషద దుకాణాల్లో వారి సేవలను వినియోగించుకోవాలి. ఔషద దుకాణాల్లోనైనా ఉత్పత్తి సంస్థల్లో నైనా, విక్రయాల్లోనైనా ప్రధాన పాత్ర దొరలైన నియంత్రణాధికారుల (డ్రగ్ ఇన్స్పెక్టర్ల) కొరతను ప్రభుత్వం తీర్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి. ప్రజల్లో ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదమే కాదు, అది పాలకుల విధానం అవ్వాలి, దానికి పరిపుష్టి నింపాలి. ఔషధ ధరలను నియంత్రిస్తూ ఉత్పత్తి సంస్థలు అంతేస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వాలు ఉదాసీనత వీడి ప్రజారోగ్యానికి దన్నుగా నిలవాలి.
- మెకిరి దామోదర్
సెల్:9573666650