Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పాలకుల చర్యలను ప్రతిఘటించకపోతే కార్మికుల ఉనికిని ప్రశ్నార్థకం చేయడంలో వారు సఫలీకృతులౌతారు. 'మేడే' ఉత్సవాలు భారత మూలాలకు సంబంధించినది కాదని అది పరదేశి భావన అంటూ దురుద్దేశంతో కించపరిచే ప్రయత్నాలు చేశారు. దేవతల ఆయుధాల సృష్టికర్తగా చెప్పబడుతున్న విశ్వకర్మను కార్మికవర్గానికి చిహ్నంగా చిత్రీకరించి ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17ను ''మేడే''కు బదులుగా భారతీయ కార్మికులు జరుపుకోవాలని సూచిస్తున్నారు. (గమ్మత్తేమంటే సెప్టెంబరు 17 మోడీ జన్మదినం కూడా). ఈ ప్రయత్నాలన్నీ కార్మికులకు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం లేకుండా చేయడానికి, వారు తమను తాము ఐక్యపరుచుకుని సంఘాలు గా ఏర్పడకుండా నిరోధించడానికి జరుగుతున్న కుట్రలు. కొంతమంది అమాయక కార్మికులు ఇప్పటికే ఈ కల్పిత, కపటమైన కథనాన్ని నమ్మడం ప్రారంభించారు. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. నయా ఉదారవాద సంస్కతి వచ్చిన తరువాత మేడే తగ్గించబడుతోంది. రోజుకు ఎనిమిది గంటల పని, సూర్యాస్తమయం తరువాత పని చేయకూడదన్న నిబంధన, ముందుగానే అంగీకరించిన వేతనాలు, నిబంధనలూ వంటివన్నీ నయా ఉదారవాదం తోసిరాజన్న అంశాలు. ప్రయివేటు సెక్టార్లో ఇవేవీ అమలు కావడం లేదు. అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. ఇలాంటి దోపిడీని ఎదుర్కొనడానికి మే డే గొప్ప స్పూర్తిని ఇస్తుంది.
''కార్మికులు సంపద సృష్టికర్తలు'' అన్న సంగతి ప్రపంచమంతా అంగీకరించిన సిద్ధాంతం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 ఆగస్టు 15న ఎర్ర కోట నుండి ప్రసంగిస్తూ... ఈ ప్రాపంచిక ధృక్పధాన్ని పెట్టుబడిదారులు, వ్యాపార వేత్తలకు ఆపాదించి, వారు కేవలం సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, వారే దేశ సంపద అని ప్రశంసించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక సందర్భాల్లో ప్రధాన మంత్రి ప్రకటనను సమర్థించారు. ఈ విధంగా కార్మికుల పాత్రను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. పెట్టుబడిదారీ సమాజాన్ని ప్రధానమంత్రి, ఆయన బృందం ప్రసన్నం చేసుకుంటున్నారు. భూమి, పెట్టుబడి, శ్రమ సంపద సృష్టిలో భాగమన్నది జగమెరిగిన సత్యం. మిగిలిన రెండింటిని వినియోగిస్తూ సంపదను రెట్టింపు చేయడంలో శ్రమే కీలక పాత్ర పోషిస్తుంది. అందుచేత కార్మికులను దోపిడీ చేసి అదనపు విలువను పోగేసుకుంటున్న పెట్టుబడి దారుడు సృష్టికర్త కాజాలడు.
యాజమాన్యాలు, పాలక ప్రభుత్వాల మధ్య ఉన్న రాజకీయ బంధాన్ని అర్థం చేసుకోవడంలో కార్మికవర్గం విఫలమవుతున్నది. కార్మిక సంఘాలు కార్మికుల ఆర్థిక ప్రమాణాలను పెంపొందిం చగలిగాయి, కాని ఎంత ప్రయత్నించినప్పటికీ, కార్మికుల రాజకీయ చైతన్యాన్ని అనుకున్నంత పెంపొందించలేకపోయాయి. ఇది విచారకరం. శాసనసభలకు, పార్లమెంటరీ నియోజకవర్గాలకు జరిగిన అనేక ఎన్నికలలో కార్మికుల ఓటింగ్ సరళిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని కార్మిక చట్టాలను కలిపి, కఠినమైన నాలుగు కార్మిక కోడ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో పార్లమెంటు రూపొందించి ఆమోదించింది. వారు ఏ సమయంలోనైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక డిమాండ్లను సాధించడానికి, ఐక్యత యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, కార్మికులు పోరాటాలలో చేరుతున్నారు కానీ, వారు పని ప్రదేశాలను విడిచిపెట్టిన వెంటనే తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే రాజకీయ సమూహాలను బలపరుస్తునారు.
నియామకాలు తగినంతగా జరగక పోవడం వల్ల సంఘటిత రంగంలో రోజురోజుకూ కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ఈ రంగంలోనే ధీర్ఘ కాలం పాటు ఉపాధి కొనసాగడం వల్ల కార్మికులను ఐక్య పరచడం సాధ్యమవుతుంది. గత రెండు దశాబ్దాలుగా, సేవా రంగంలో సాఫ్ట్వేర్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. సాఫ్ట్ వేర్ రంగంలోని ఉద్యోగాలు ఇతర రంగాల కంటే అత్యంత అనిశ్చితితో కూడుకున్నవి. ఒకే ఆఫీసులో ఒకే విధమైన పని నిర్వహిస్తున్న వారి జీతభత్యాల్లో, పని వేళల్లో, నిర్ణీత పని వ్యవధిలో తేడాలుంటాయి. సదరు ఏకరూపత లేనందున ఈ కార్మికులను సంఘటిత పర్చడం అంత సులభమైంది కాదు. కొన్ని చోట్ల కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి కాని వాటి కొనసాగింపు కష్టంగా ఉంది. కొత్త తరానికి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మే డే కాన్సెప్ట్‌తో తమను తాము గుర్తించుకోరు, ఎందుకంటే వారికి దాని గురించి అంతగా అవగాహన లేదు. వారిలో చాలా మంది మే డే, అసంఘటిత, క్రింది స్థాయి కార్మికుల పండుగ అని భావిస్తున్నారు. అధిక వేతనం పొందుతున్న కొంతమంది ఉద్యోగులు యూనియన్లలో చేరడానికి, వర్కర్స్ డే వేడుకలకు తాము అతీతులమని భావిస్తారు.
ఉద్యోగాల కాంట్రాక్టీకరణ పెరుగుతున్న కొద్దీ కార్మికులను ఐక్యం చేసే అవకాశాలు తగ్గి పోతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పరంపర మొదలైన రోజుల్లో, దీర్ఘకాలికంగా కాకపోయినా, ఓ మోస్తరు కాలానికి ఉపాధి కొనసాగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా కనిష్ట కాలపరిమితితో నియామకాలు జరుగుతున్నాయి. తిరిగి కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించిన తరువాత ప్రస్తుత వేతనం కన్నా తక్కువ వేతనాన్ని నిర్ణయించడానికి ఇది కాంట్రాక్టర్‌కు వెసులుబాటు నిస్తుంది. ఉదాహరణకు 2015లో ఒక వ్యక్తికి నెలకు రూ.10,000 చొప్పున ఔట్ సోర్సింగ్ చేసి, సంవత్సరానికి రూ.1000 చొప్పున ఐదు సంవత్సరాల పాటు కొనసాగితే, అది ఐదేండ్ల కాలవ్యవధి ముగిసే సరికి 15000 అవుతుంది. కాంట్రాక్ట్ ముగిసిన తరువాత, కాంట్రాక్టర్ అదే వ్యక్తిని తిరిగి నియమించవచ్చు లేదా కొత్త రిక్రూట్ మెంట్‌కు వెళ్లవచ్చు. కొత్త అభ్యర్థిని నియమించే టప్పుడు రూ.10,000 లేదా 11,000 వేతనం ఇవ్వబడుతుంది, అదివరకటి 15000ల కంటే ఇది తక్కువ. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో దోపిడీ ఈ విధంగా జరుగుతోంది. ఉద్యోగంపై, వేతనాల కొనసాగింపుపై గ్యారంటీ లేనప్పుడు, మే డే గురించి ఆలోచించడానికి ఈ రకమైన కార్మికులకు అవకాశం తక్కువ.
బూర్జువా రాజకీయ పార్టీల వెనుక సంఘటితమవుతున్న కార్మిక సంఘాలు కార్మికుల ఐక్యతకు ముప్పుగా పరిణమించాయి. ఇది యూనియన్లపై కార్మికుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కార్మికుల ఐక్యత ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లో రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలపై ఆధారపడేవి. కానీ ఈ రోజుల్లో పరిస్థితి రివర్స్‌లో ఉంది. ఏదైనా ఉద్యమంలో భాగం కాని కార్మిక సంఘాలు, వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా, ఆందోళన చేస్తున్న కార్మికులు, యూనియన్లకు సంఘీభావం ప్రకటించేవి. కానీ భారతీయ మజ్దూర్ సంఫ్‌ు వంటి కార్మిక సంఘాలు, అనేక కుల ఆధారిత సంక్షేమ సంఘాలు తోటి కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళన పిలుపులలో పాల్గొనవద్దని కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నాయి. ఈ సంస్కృతి కార్మిక వర్గ ఐక్యతకు పెద్ద సవాలు.
నిరుద్యోగ సంక్షోభం
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) భారతదేశంలో అధిక స్థాయి నిరుద్యోగ రేటును నివేదించింది. ఉదాహరణకు 2021 డిసెంబరులో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్ఐఇ) అంచనా ప్రకారం, దాదాపు 53 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులు, వారిలో ఎక్కువ భాగం మహిళలు ఉన్నారు. 2021 డిసెంబర్లో నిరుద్యోగ రేటు 7.91శాతంగా ఉంది. జనవరి 2022లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం గురించి కొంత చర్చ జరిగినప్పటికీ, ఈ సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరమైన 6.57శాతం వద్ద ఉంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో 2020-21లో విధించిన లాక్డౌన్ ద్వారా నిరుద్యోగం యొక్క భయంకరమైన గణాంకాలు పునరావృత మయ్యాయి. మహమ్మారికి చాలా ముందు, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) 6.1శాతం నిరుద్యోగ రేటును నివేదించింది, ఇది నాలుగు దశాబ్దాలలో అత్యంత ఘోరమైనది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన 35,000 పోస్టులకు 1.25 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో గణనీయమైన భాగం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హౌల్డర్లు. కొన్ని తక్కువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెలువడిన ప్రకటనలకు అధిక సంఖ్యలో దరఖాస్తులను రావడంతో, కొన్నిసార్లు అలాంటి ప్రకటనలను ఉపసంహరించు కోవాల్సి వస్తుంది. నిరుద్యోగం పెరిగిపోయి ఉపాధి ప్రశ్నార్థకమైన ఈ పరిస్థితుల్లో మే డే స్ఫూర్తిని నిలబెట్టడానికి కృషి చేయాల్సిందే
- జి. తిరుపతయ్య
సెల్:9951300016