Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్క్స్ పుట్టి రెండు శతాబ్దాలు గడచిపోయింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారీ ఆయన జీవితాన్ని గురించి, మేథోఫలితాల గురించీ మాట్లాడుకుంటున్నాం. ఇదేదో రొటీన్‌గా చేసేపనికాదు. ఎందుకంటే... ఆ రోజుల్లో మార్క్స్ ఏదైతే ఆలోచించి, పరిశోధించి మనకు ఒక నూతన దృక్పధాన్ని అందించాడో, అప్పటి కంటే ఎంతో సామాజిక మార్పులతో కూడిన మన యుగంలో ఉన్నంత 'ఆధునికంగా' మార్క్సిజం మరెప్పుడూ లేదనిపిస్తుంది. మార్క్స్ ఎంత సుదూర భవిష్యత్తులోకి చూశాడనేది ఈ రోజు మరింత స్పష్టంగా వెల్లడవుతోంది. మార్క్స్ విప్లవాత్మక తత్వశాస్త్రం రూపుదిద్దుకొని అభివృద్ధి చెందేక్రమంలో మార్క్స్ వ్యక్తిత్వం ఏర్పడింది. ఎలాంటి ఆచరణలో ఈ ప్రపంచానికి ఒక కొత్త చూపును అందించాడో, సామాజిక, రాజకీయ, ఆర్థిక సత్యాలను ఎలా బయటికి తీసాడో తెలుసుకోవడం యువతకు మరీ అవసరం. మార్క్స్ మార్క్స్లా ఎదగటానికి ఏఏ అంశాలు దోహదం చేశాయో ఆయన చరిత్ర చదివితే అవగతమవుతుంది. మార్క్సిజం పిడిసూత్రం కాదు. కార్యాచరణకు మార్గదర్శి.
కారల్‌మార్క్స్ జన్మించినప్పుడు జర్మన్ సమాజంలో పచ్చి అభివృద్ధి నిరోధకత్వం (ఫిలిస్టినిజం) బలంగా ఉండింది. యువకుడైన మార్క్స్‌ను స్వేచ్ఛాకాముక కళా ప్రపంచం అతని గట్టినమ్మకాలకు తొలిపాఠశాల. ఆయన వాస్తవం పట్ల విమర్శనాత్మక ధోరణి అవలంభించి, ఆత్మసంతృప్తితో కూడిన తుచ్ఛమైన ఫిలిస్టినిజాన్ని ఖండించేట్లు చేసింది కళే. మానవ మేథస్సు సృష్టించిన ప్రతిదాన్ని మార్క్స్ స్వయంగా పునరాలోచన చేసి, విమర్శకు గురిచేసి కార్మికోద్యమంతో సరిచూశాడు. అప్పటి వరకూ వ్యవస్థలో ఉన్న అన్ని దుర్భ్రమలను తొలగించి నిర్ధారణలు చేశాడు. ఆ విధంగా అభివృద్ధి నిరోధక శక్తులు విజృంభిస్తున్న తరుణంలో కార్లే పుట్టాడు. అతనికి కలిసొచ్చిన అంశాలేవంటే తండ్రి అందించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఎంగెల్స్ స్నేహం, వారి ప్రక్కనే ఉన్న వెస్ట్ ఫాలెన్, అతని కొడుకు ఎడ్గార్, ఇక ఎడ్గార్ సోదరి జెన్నీ. ఈ పరిసర సాంస్కృతిక సంబంధాలలోంచి మార్క్స్ శ్రామిక విముక్తి మేథస్సు రూపుదిద్దుకుంది.
మార్క్స్ తాను సాధించిన దానిపట్ల నిరంతర అసంతృప్తి, పరిపక్వత కోసం ఎడతెగని శోధన యవ్వనంలో కూడా అతని విశిష్ట లక్షణాలు. అతని ఆలోచన ఇంకా రూపుదిద్దుకొనే లోగానే అది తాను సాధించిన దాన్ని అధిగమించేది. నూతన విజ్ఞాన రంగంలో సాగించిన అధ్యయనం స్వతంత్ర విశ్లేషణలోకి అభివృద్ధి చెందేది. ఒక విద్యార్థి యధాలాప అధ్యయనంలా గాక మార్క్స్ సాహిత్య అధ్యయనం ఎప్పుడూ స్వతంత్ర సృజనాత్మక ఆలోచనకు ఒరవడిగా ప్రేరణగా మాత్రమే ఉండేది. ఈ అధ్యయనం, అవగాహనలోంచే మానవాళి కోసం శ్రమించాలనే దృఢమైన కోర్కెను నింపుకున్నాడు. 'జీవితంలో అన్నింటికీ మించి మానవాళి కోసం శ్రమించగల స్థానం మనం ఎంచుకున్నట్లయితే... ఏ బరువులూ మనల్ని కృంగదీయలేవు' అని చెప్పగలిగాడు. అలాంటి మహౌన్నతుని జీవన ప్రయాణాన్ని అధ్యయనం చేసినట్లయితే, ఆశయ పథంలో మన ఆలోచనలను సరైన మార్గంలో పెట్టగలుగుతాము. ఆచరణ విధానమూ స్పష్టపడుతుంది.
అయితే మనిషి ఆలోచనలను రూపుదిద్దే సాంస్కృతికపరమైన అంశాల గురించి ఆయన చెప్పిన విషయాలను మన నేటి పరిస్థితులకు ఎలా అన్వయించుకోవచ్చు? ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలా ప్రతిఘటించవచ్చు అనే విషయాలు చర్చించడం ముఖ్యమైనవని భావిస్తున్నాను. ఎందుకంటే సాంస్కృతిక రంగంలో మితవాద శక్తుల ప్రాబల్యం పెరిగిపోయింది. విధ్వంసక విధానాలు సవాళ్లు విసురుతున్నాయి. దీనికి మించిన ఉదారవాద ఆర్థిక విధానాల విజృంభణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. వీటిని అర్థం చేసుకుని ప్రతిఘటించాల్సిన శక్తులూ బలహీనపడిన సందర్భంలో మార్క్సిజం ఆలోచనా తేజస్సును మరింత పుణికిపుచ్చుకుని ముందుకుపోవాలి.
సంస్కృతి అనగానే మనం సంగీతం, సాహిత్యం, కళలు అనే ఆలోచనలోకి వస్తాము. కానీ వాటితో పాటుగా మానవుల సామాజిక జీవన లక్షణాలన్నిటినీ భాష, ఉచ్ఛారణ, ఆహారం, ఆహార్యం, అభిరుచులు, సంప్రదాయాలు, మర్యాదలు, ప్రవర్తనలు, ప్రజలదైనందిన అంశాలు కలగలసిన సజీవ జీవనం సంస్కృతిలో భాగాలు. మానవజీవితానికి సంబంధించిన ఎంత స్వల్ప విషయమైనా సాంస్కృతిక విషయానికి పరాయిదికాదు. మనిషి తన జీవితావసరాలు తీర్చుకోవడానికి చేసే సమిష్టి శ్రమ. అలా శ్రమించే క్రమంలో మనుషుల మధ్య ఏర్పడే సంబంధాల వ్యవస్థ చేత మానవ జీవితానికి సంబంధించిన మిగిలిన విషయాలన్నీ పుట్టుకొస్తాయి. లేదా నిర్ణయించబడతాయి అనే స్థూల అవగాహన కలిగి ఉంటుంది మార్క్సిజం. అంటే ఉత్పత్తి విధానము పునాదిగా, దాని నుండే ఏర్పడే సంబంధాలన్ని ఉపరితలంగా భావించవచ్చు. ఉత్పత్తి, ఆర్థికాంశాలు ప్రాథమికమైనప్పటికీ ఉపరితల అంశాలు సైతం పునాదిపై ప్రభావాన్ని చూపగలవని ఎంగెల్స్ వివరిస్తారు. అయితే దోపిడీతో కొనసాగే ఉత్పత్తి విధానం, దోపిడీ, పీడనలు నిండిన ఉత్పత్తి సంబంధాలనే కలిగివుంటాయి. అవే కుటుంబ సంబంధాలలో కుల, మత, కళా సాహిత్యాలలో, సాంస్కృతిక జీవనంలోనూ ప్రతిఫలిస్తాయి. నిరంతర ఘర్షణలో వైరుధ్యాలతో సాగే ఈ ప్రయాణంలో దానికి భిన్నమైన ప్రత్యామ్నాయ ప్రతి సంస్కృతి (కౌంటర్ కల్చర్) పురుడు పోసుకుంటుంది. ఆలోచనా జనిస్తుంది. ఇది పునాదినే ప్రభావితం చేస్తుంది.
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగిన వర్గమే మానసిక ఉత్పత్తి సాధనాలపై కూడా నియంత్రణ కలిగివుంటుంది. మానసిక ఉత్పత్తి సాధనాలంటే భావజాలానికి సంబంధించినవి. పాలకవర్గ భావాలే ప్రజల భావాలుగా చెలామణి అవుతాయి. ఉత్పత్తి సాధనాలు కలిగిలేని సామాన్య ప్రజల భావాలు పాలకవర్గ భావాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంస్కృతి ఆధిపత్య భావజాలంగా పనిచేస్తుంది అంటారు మార్క్స్. వాటి లక్షణాలేమంటే... ఆధిపత్య భావజాలం పెట్టుబడిదారీ పాలకవర్గ దృక్పథాన్ని ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది. వారి ఆధిపత్యాన్ని న్యాయసమ్మతం చేస్తుంది. ఈ ఆధిపత్య భావజాలం దానికి పునాదిగా ఉన్న ఉత్పత్తి సంబంధాల నుండి పుట్టివాటినే వ్యక్తం చేస్తుంది. ''మీ భావాలు మీ బూర్జువా ఉత్పత్తి పరిస్థితులనుండి, బూర్జువా ఆస్తి నుండి పుట్టుకొచ్చినవే కాని మరేవీ కావు'' అని కమ్యూనిస్టు మేనిఫెస్టోలో చెప్పారు. ఆధిపత్య భావజాలం ఈ వ్యవస్థ సంప్రదాయ సామాజిక నిర్మాతలైన 'వేతన శ్రమ' 'సరుకు రూపాల'ను సహజమైనవిగా, తప్పనిసరైనవిగా కనిపించేలా చేస్తుంది. అంటే దోపిడీతో కూడుకున్న ఉత్పత్తి విధానాన్ని సహేతుకమైన ప్రకృతి సిద్ధమైన నియమంగా చెబుతుంది. ఆధిపత్య భావజాలం వాస్తవికతను గురించి తప్పుడు, వక్రీకరించిన దృశ్యాన్ని పుట్టిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో వస్తువుల ఉత్పత్తి మాత్రమే జరగదు. ఆ వస్తువులను వినియోగించుకొనే మనుషులనూ తయారుచేస్తుంది. ఆ మనుషులను తమకనుగుణంగా మలచుకోవడంలోనే ఆధిపత్య సంస్కృతి పనిచేస్తుంది.
నయా ఉదారవాద విధానంతో దోపిడీ పెరిగి సంపద కొద్దిమంది వద్ద పోగుపడింది. వీళ్లు ప్రపంచ వ్యాపితంగానే సాంస్కృతిక పరిశ్రమను పెంచి పోషిస్తున్నారు. సమాచార, ప్రసారాలు, వినోద ఉత్పత్తికేంద్రాలు, మీడియా మొదలైన సరుకు ఉత్పత్తి, పంపిణీని నియంత్రిస్తున్నారు. ప్రపంచమంతా ప్రజల అభిరుచులు ఒక మూసలో పోసినట్టు ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి స్థానిక సంస్కృతులను కూడా కలుపుతున్నారు. నయా ఉదారవాద విధానాల వల్ల ప్రజల దైనందిన జీవితం దుర్భరమవుతోంది. ఈ తక్షణ జీవన సమస్యల నుండి దారి మళ్లించే పని ఆధిపత్య సంస్కృతి చేపడుతున్నది. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి అని చెబుతున్న హిందూత్వ వాదుల నినాదం వాస్తవంగా భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తుడిచివేస్తుంది. భిన్న మతాలు, తెగలు, ఆచారాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని తుడిచివేస్తుంది. భిన్నమతాలు, తెగలు, ఆచారాలు, సంస్కృతులు గల భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగుతున్న భారతీయతను, మతోన్మాదులు, నయా ఉదారవాదులు కలిసి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాంస్కృతిక పరమైన వ్యత్యాసాలను, అభిరుచులను, ఆహారాన్ని, ఆహార్యాన్ని విభేదంగా మార్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి దోపిడీపై పోరాటాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అదే సందర్భంలో ప్రజా సమ్మతినీ కూడగడుతున్నారు. ఇప్పుడు భాషా విద్వేషాన్ని రగులుస్తున్నారు. ఒకే భాషను దేశం మొత్తం మీద రుద్దాలనే ప్రయత్నాన్ని మొదలేసారు. ఇదొక సాంస్కృతిక ఆధిపత్య నియంతృత్వం.
కాబట్టి శ్రామిక ప్రజల చైతన్యాన్ని, ప్రజాస్వామిక స్పృహను, లౌకికతత్వాన్ని పెంచే పోరాటం దేశంలో నేడు చేయవలసి ఉన్నది. అంటే సాంస్కృతిక భావజాల రంగంలో పనిచేయాలి. 'కౌంటర్ హెజమొనీ' నిర్మించడానికి వాస్తవిక ప్రజా సమస్యలను సాంస్కృతిక జీవనాన్ని ఎజెండాలోకి తీసుకురావలసివుంది. ఈ భావజాల రంగం ప్రాధాన్యతను ప్రపంచ పెట్టుబడి గుర్తించి అత్యంత సమర్థవంతంగా మొత్తం మీడియా, వినోద పరిశ్రమలన్నీ వారి ఆధీనంలో పనిచేయిస్తున్నాయి. పాలకవర్గాలు కేవలం ప్రచారం ద్వారానే కాక అవసరమైనప్పుడు బల ప్రయోగంతో కూడా తమ భావజాల ఆధిపత్యాన్ని కాపాడుకుంటారు. మన దేశంలో కుల, మత, లింగ నేపథ్యంలో జరుగుతున్న హింసాయుత దాడులను గమనించవచ్చు. వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించే మేధావి వర్గాన్ని, మైనారిటీలను, దళితులను, ఆదివాసీలను అంతమొందించే సంఘటనలనూ చూస్తున్నాము.
ఒకవైపు ఆర్థిక దోపిడీ, మరోవైపు సాంస్కృతిక ఆధిపత్య దాడులను ఎదుర్కొనేందుకు చైతన్యయుత పోరాటమే మార్క్స్ మార్గం. ఆర్థిక హక్కుల పోరాటంతో పాటుగా సామాజిక సాంస్కృతిక అంశాలపై పోరాటాన్ని విస్తృతపరచాలి. ప్రాచీన కాలం నుంచీ దేశంలోని కులవ్యవస్థకు వ్యతిరేకంగా, మానవుల మధ్య సృష్టించిన అడ్డు గోడలకు వ్యతిరేకంగా, లింగ వివక్షతకు వ్యతిరేకంగా నిలిచిన, మత సామరస్యాన్ని బోధించి ప్రచారం చేసిన మహనీయులెందరో చరిత్రలో ఉన్నారు. వారి వారసత్వంలో మరింత చైతన్యయుతంగా ముందుకుపోవటమే మార్క్సిస్టు ఆచరణకు గీటురాయి. అత్యంత అభివృద్ధి నిరోధక ఆవరణంలోంచి మార్క్ మేధస్సు ఏవిధంగా విప్లవ పురోగామిశక్తిగా ఎదిగిందో, అదేరకమయిన నేటి మన స్థితిలోంచి ప్రగతిశీల విప్లవశక్తులు ఎదగాలి.
(నేడు మార్క్స్ జయంతి)
- కె. ఆనందాచారి
సెల్:9948787660