Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు కార్మికులు, రైతుల పాలిట కల్పవక్షం. సకల వసతులతో ఆధునిక సౌకర్యాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ఒక వెలుగు వెలిగింది. పాలకుల పుణ్యమా అని ప్రస్తుతం పతనావస్థకు చేరింది. 1938లో నిజాం పాలకులు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ కొన్ని దశాబ్దాలుగా రైతులకు కార్మికులకు ఉపాధి కల్పించింది. 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జెయింట్ వెంచర్ పేరట ప్రయివేటీకరణ చేయడంతో ఫ్యాక్టరీ పతనం ప్రారంభమైంది. లేబర్ కోర్టు, ఆ తర్వాత నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ వద్ద విచారణ కొనసాగుతున్న ఈ ఫ్యాక్టరీ కథ అనేక మలుపులు తిరుగుతూ ఎడతెగక సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ నడిపేందుకు ముందుకు వచ్చి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యకు ముగింపు లభిస్తుంది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ గతమెంతో ఘనం
1931లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మించబడి ప్రారంభమైంది. ఈ ఫ్యాక్టరీ సముదాయం కింద జగిత్యాల జిల్లాలో ముత్యంపేట వద్ద, మెదక్ జిల్లాలో ముంబోజిపల్లి వద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. బోధన్ ఫ్యాక్టరీ అధీనంలో కోటగిరి ఎడపల్లి రేంజల్ మండలాల పరిధిలో పదహారు వేల ఎకరాల భూములు ఉండేవి. రైతులు చెరుకు సాగు చేస్తూ ఫ్యాక్టరీ లాభాల బాటలో నడవడానికి ఎంతో కృషి చేశారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉండేవారు. కార్మికుల కోసం ఫ్యాక్టరీ పరిసరాల్లో 150 పడకల ఆసుపత్రి ఉండేది. కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేది. కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఉండేది. సహకార బ్యాంకు, నిత్యావసరాల స్టోర్ కూడా ఉండేవి. కార్మికులకు ఉచిత విద్యుత్, నీటి సరఫరా, ఉచిత గృహ వసతి కల్పించేవారు. సకల వసతులు సౌకర్యాలతో కార్మికులకు, రైతులకు కల్పతరువుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ విలసిల్లుతుండేది.
ప్రయివేటీకరణతో మసకబారిన ప్రతిష్ట
బోధన్, ముత్యంపల్లి, మంబోజిపల్లి ఫ్యాక్టరీలను 2002లో జాయింట్ వెంచర్ పేరట ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటీకరించింది. టేకోవర్ చేసుకున్న డెల్టా పేపర్ కంపెనీ 51శాతం, ప్రభుత్వం 49శాతంతో జాయింట్ వెంచర్లో ఫ్యాక్టరీని నడిపించారు. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని ప్రయివేట్ వ్యవహారమై 2006లో శాసనసభ సంఘాన్ని నియమించింది. ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ వ్యవహారంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు. తర్వాత ఫ్యాక్టరీ తిరిగి ప్రభుత్వపరం చేసే విషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014లో ఎన్నికల ప్రచారంలో సైతం కేసీఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ హామీ అమలు కాలేదు. ఆ తరువాత 2015 డిసెంబర్ 23న చెరుకు, నీటి లభ్యత లేదంటూ ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2015లో రైతులు, కార్మికులు సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడంతో సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడిపించాలని ప్రభుత్వం భావించింది. కానీ కార్మికులు, రైతులు ఒప్పుకోకపోవడంతో అది అంతటితో ఆగిపోయింది. 2016లో కార్మిక సంఘాలు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. 2017 ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం కేసును లేబర్ కోర్టుకు అప్పగించింది. 2019 జూన్ 3న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్సీఎల్టీని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నది. అప్పటినుంచి ఈ ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతోంది.
అధోగతి పాలైన కార్మికుల జీవితాలు...
2002లో జాయింట్ వెంచర్ పేరట నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రయివేటుపరం అయిన తర్వాత అందులో పనిచేస్తున్న 1400మంది కార్మికులలో 1200మంది కార్మికులకు బలవంతంగా విఆర్ఎస్ సీఆర్ఎస్ ఇచ్చారు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కేవలం 200మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీ టేకోవర్ చేసుకున్నారు. ప్రయివేటు యాజమాన్యం వచ్చాక ఫ్యాక్టరీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చెరుకురైతు ప్రయోజనాలు ప్రయివేటు యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాయి. ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఇంతవరకు దాదాపుగా 70 మంది ఉద్యోగులు మానసిక క్షోభతో మరణించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన 16 వేల ఎకరాల భూములను వేలం ద్వారా ప్రభుత్వ కార్పొరేషన్లకు నిర్ణీత ధరకు విక్రయించారు. కొన్ని భూములను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న పరిశ్రమ కార్మికులకు పరిహారంగా పంపిణీ చేశారు. నిజాం షుగర్స్ పరిధిలో ప్రస్తుతం సుమారు 600ఎకరాల భూములు ఉండగా రక్షణ కరువై కబ్జాల పర్వం కొనసాగుతున్నది. నిజాం షుగర్స్ భూములను పర్యవేక్షించేందుకు, వాటిని కాపాడేందుకు కోర్ కమిటీ అధికారులు పనిచేస్తున్నా భూముల రక్షణ మాత్రం ''ఖాళీ జాగా వేసేయి పాగా'' అన్నట్టుగా తయారైంది.
ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
2018 జూన్ 11న ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కి లేఖ ద్వారా తెలియజేసింది. కార్మికులకు, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలి. మూడు షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చెరుకు రైతులను ప్రోత్సహించాలి. ఆసియా ఖండంలో అతిపెద్దదైనా ఈ షుగర్ ఫ్యాక్టరీకి గతవైభవం తీసుకు రావాలి. అధోగతి పాలయిన కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి. రక్షణ కరువై అన్యాక్రాంతం అయిన ఫ్యాక్టరీ భూములను సంరక్షించి పేద రైతులకు పంచాలి.
- అంకం నరేష్
సెల్: 6301650324