Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గతవారం తర్వాత)
తొలి భారతీయులు 'నర్మదా మ్యాన్' (హౌమో ఎరక్టస్) అనీ, ఆఫ్రికా నుండి సుమారు రెండున్నర లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ దేశానికి వచ్చారనీ తెలుసుకున్నాం. అంటే అది పురాతన శిలాయుగం నాటి కాలం. దాని గూర్చి చెప్పుకున్నాం గనక, ఇక ఇప్పుడు మధ్య శిలాయుగపు వివరాల్లోకి పోదాం! మధ్య శిలా యుగానికి వస్తే (MESOLITHIC AGE) ఈ కాలంలో తయారైన ఆయుధాలు, పాతరాతి యుగం వాటి కన్నా మెరుగైనవి. పరిమాణంలో చిన్నవి, మొనతేలినవి (SHARP). వేటలో అద్భుతంగా పనిచేయగలవి. వీటిని మైక్రోలిథ్ (MICROLITH) అని అన్నారు. ఈ మైక్రోలిథ్ ఆయుధాలు (26,000ఏండ్ల క్రితంవి) ఎక్కువగా శ్రీలంకలో లభించాయి. అంతే కాదు, భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతదేశంలోని అనేక చోట్ల లభించాయి. ఈ కాలపు మానవ జాతి జీవన విధానంలో కొన్ని మార్పులు కనిపించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది జంతువుల్ని పెంచుకోవడం. ఇది ఎలా తెలిసిందంటే... ఆ కాలం నాటి మానవుల అస్థిపంజరాలతో పాటు గొర్రె, మేక, గేదె, ఎద్దు వంటి జంతువుల ఎముకలు లభించాయి. పురాతన శిలాయుగంలోను, మధ్య శిలా యుగంలోను మనుషులు నదీ పరివాహకప్రాంతాల్లో నివసించేవారు. నదుల్లో దొరికే గులక రాళ్ళతో ఆయుధాలు చేసుకునేవారు. అయితే, అవి గట్టిగా ఉండి, కావల్సిన రీతిలో పగిలేవి కావు. అందుకని నవీన శిలాయుగం (NEOLITHIC) నాటి మానవులు నదీ ప్రాంతాల్ని వదిలి అడవుల్లోకి, కొండలపైకి ప్రయాణించేవారు. అక్కడ దొరికిన రాళ్ళు పెళుసు. వాటితో తమకు కావల్సిన అతి చిన్న ఆయుధాలు కూడా చేసుకోగలిగేవారు. రాళ్ళను పెచ్చలు పెచ్చలుగా పగులగొట్టి, వాటితో సుళువుగా వేటాడేవారు. వారున్న చోట చెరువులు, నదులు కలుషితమైపోతే, ఆ ప్రాంతం వదిలి సమూహాలు మరో చోటికి వెళ్ళిపోవడం కూడా జరిగేది.
ఆవాసాల మార్పు ఈ యుగంలోనే జరిగి, అది నియోలిథిక్ విప్లవానికి దారితీసింది. పదివేల ఏండ్ల క్రితం - చివరి మంచుయుగం ముగిసింది. వాతావరణం వేడెక్కసాగింది. అప్పటినుండి నవీన శిలాయుగం ప్రారంభమైంది. దీన్ని NEOLITHIC AGE అని అన్నారు. మధ్య శిలాయుగంలో తయారు చేసుకున్న ఆనాటి కొత్తరకం ఆయుధాల కంటే, ఈ కాలంలో మరింత నైపుణ్యంతో చేసుకున్నారు. వాటితో పాటు దైనందిన జీవితానికి అవసరమైన ఇతర వస్తువులు కూడా తయారు చేసుకున్నారు. రాళ్ళు మాత్రమే కాదు, జంతువుల ఎముకలను కూడా అందుకు ఉపయోగించుకున్నారు. తమ అవసరాలకు అనుగుణంగా జంతువుల్ని, పక్షుల్ని, మొక్కల్ని పెంచుకున్నారు. అప్పుడు వాతావరణం ఒకే విధంగా ఉండేది కాదు. కొంత కాలం వేడిగా, మరికొంత కాలం చల్లగా ఉండేది. ఇప్పుడు మనకు ఉన్నట్లు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంటూ స్పష్టమైన విభజన లేకపోయినా, ఉష్ణ - శీతల వాతావరణాలు క్రమం తప్పక మారుతూ ఉండేవి. పెంపుడు జంతువులు, పక్షులు, మొక్కలు, వృక్షాలు పెంచడం వల్ల వారు నివసించే ప్రాంతాలు పచ్చదనంతో నిండి ఉండేవి.
సంచార జీవితాలు స్థిర నివాసాలుగా మారిన ఫలితంగా వ్యవసాయానికి బీజాలు పడ్డాయి. పాడి-పంటలు- వ్యవసాయం ప్రారంభం కావడంతో పూర్తి కాలం వేటాడటం తగ్గిపోయింది. నవీన శిలా యుగం నాటి తొలి వ్యవసాయ స్థావరాలు భారత దేశానికి ఉత్తరాన పశ్చిమ దిశలో బయటపడ్డాయి. ఇవి పదివేల సంవత్సరాల క్రితంవి అని పరిశోధకులు తేల్చారు.
1. బొలోన్ నది ఒడ్డున బెలూచిస్థాన్ - మెహర్గడ్
2. కశ్మీర్ వ్యాలీ - పాకిస్థాన్ స్వాట్ వ్యాలీ - బుర్జహౌమ్ - గుఫ్కురాల్
3. గంగా పరివాహక ప్రాంతం, కోల్డిహవా, చిరాండ్
4. దక్షిణ భారత దేశం, ఉట్నూర్.
ఈ వ్యవసాయ స్థావరాల్లో బార్లీ, గోధుమ, పప్పులు, తృణధాన్యాలు (మిల్లెట్స్) పండించేవారు. పంట పొలాలకు సమీపంలో మట్టితో నివాసాలు కట్టుకునే వారు. ఇది జీవన శైలిలో మరొక విప్లవాత్మకమైన పరిణామం. దీన్ని పరిశోధకులు నియోలిథిక్ విప్లవం (NEOLI THIC REVOLUTION) అని అన్నారు.
నిరంతరం వేటాడుతూ, పశువుల్ని మెపుతూ గడిపే సంచార జీవితానికి స్వస్తి చెప్పి, స్థిరమైన ఆవాసాలు ఏర్పరుచుకుని వ్యవసాయం ప్రారంభించడంతో ఆనాటి మానవుల జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ఒక పంట పండించాలంటే నెలల కొద్దీ శ్రమించాలి. పాడి పశువుల్ని పెంచాలంటే ఎంతో ఓపిక కావాలి. ఇలా నిరంతర శ్రమ నిరంతర ఉత్పత్తికి దారులు వేసింది. దానివల్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. మొత్తం సమాజానికి ఆహారం అందుతూ వచ్చింది. వేటాడే కాలంలో ఎవరి ఆహారం వారే వేటాడి సంపాదించుకోవాల్సి వచ్చేది. ఇతర వృత్తులేవీ ఉండేవి కావు. వ్యవసాయ వృత్తిలో లేనివారు వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టారు. కొందరు మట్టితో కుండలుచేయడం ప్రారంభిస్తే, మరికొందరు గుడ్డలు నేయడం ప్రారంభించారు. అలా నేత పనివారు, కుండలు చేసేవారు, వడ్రంగం చేసేవారు సమాజానికి అవసరమైన వస్తువులు అందిస్తూ అనేక వృత్తులవారు ఏర్పాడ్డారు. డబ్బూ, మార్కెట్ విధానం వంటివి లేకపోయినా, వ్యవసాయదారులకు, ఇతర వృత్తుల వారికి సత్సంబంధాలు ఉండేవి. నాగళ్ళు చేసేవాడు వ్యవసాయ దారుడికి నాగళ్ళు ఇచ్చి, ధాన్యం తీసుకునేవాడు. గుడ్డలు నేసేవాడు తను నేసిన గుడ్డలు రైతుకిచ్చి ధాన్యం తెచ్చుకునేవాడు. అలా సమాజంలో వస్తుమారకానికి (EXCHANGE OF PRODUCTS) ప్రాధాన్యత పెరిగింది. ఇవేవీ కాకుండా కొంత మంది తమ సృజనాత్మకతతో కొత్త వృత్తులకు రూపకల్పన చేసుకున్నారు. ఒకప్పటి తమ పూర్వీకుల వలె రాళ్ళతో ఆయుధాలు చేయడం కాకుండా రాళ్ళతో శిల్పాలు చెక్కడం ప్రారంభించారు. వారిలో నైపుణ్యం పెరిగే కొద్దీ శిల్పాల సౌందర్యం ఇనుమడించింది. శ్రమ నుంచి పని నుంచి పాట, మాట, ఆట మొదలయ్యాయి.
ఈ వస్తు మార్పిడి పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో అదే వ్యాపారమైంది. వ్యాపారంతో నాగరికత - నాగరికతతో పట్టణీకరణ... ఒక దానిలోంచి మరొకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి. జనాభాకు అనుగుణంగా పల్లెలు, పట్టణాలు కావడంతో - సామాజిక జీవితాన్ని క్రమ పద్ధతిలో అదుపు చేయడానికి సామూహిక నిర్ణయాలు కావల్సి వచ్చాయి. సామూహిక నిర్ణయాలు అనేక రూపాలు మార్చుకుని, రాజకీయ ఆధిపత్యమైంది. చట్టాల రూపకల్పన - అమలు మరొక వైపు కొనసాగింది. వీటన్నిటికీ మూలం వ్యవసాయమే! వ్యవసాయం - వ్యాపారానికి - ఆర్థిక వ్యవస్థకు - చట్టాల రూపకల్పనకు - విద్య ఆరోగ్యరంగాలకు - రాజకీయానికి - నాగరికతకు - మొత్తానికి మొత్తంగా సామాజిక జీవితానికి మూలస్తంభమైంది. ఈ మొత్తం సామాజిక పరివర్తనను నిపుణులు మూడు విభాగాలుగా విభజించారు.
1. 7000 నుండి 4500 BCE బెలూచిస్థాన్ నాగరికత
2. 4500 నుండి 3500 BCE పరివర్తనలకు గురైన నాగరికత
3.. 3500 నుండి 2600 BCE ఈ తొలినాళ్ళ హరప్పా నాగరికత
ఇందులో తొలి హరప్పన్ నాగరికతకు ఆనవాళ్ళు 1. బెలూచిస్థాన్ - మెహర్గడ్లోను 2. సింధ్ - అమ్రి, కోట్ డిజిలోను 3. రాజస్థాన్లోని కాలీబంగన్లోనూ గుర్తించారు. 1920లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు (ARCHAEOLOGISTS) ఈ స్థావరాల్ని పరిశీలించి విశ్లేషించి చెప్పిందేమంటే - మొసపటోమియా నాగరికతకు కొనసాగింపే - హరప్పా మొహంజోదారో నాగరికత అని! ఆ అభిప్రాయం కొంత కాలం ఉండిపోయింది. కానీ, పరిశోధనలు మరింత లోతుగా, విస్తృతంగా జరిగే కొద్ది ఆ అభిప్రాయం మారిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) తర్వాత - హరప్పా, మొహంజాదారోలలోనే కాకుండా కాలీబంగన్, మెహర్గడ్, ఆమ్రి, కోట్డిజి వంటి స్థావరాల్లో కూడా ఎన్నో ఆధారాలు లభించాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉండటంతో పాటు, మొసపటోమియా ఆధారాలకు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల సింధూ నాగరికతకు మొసపటోమియా నాగరికతకు సంబంధం లేదని తేలిపోయింది. పైగా సింధూ నాగరికత (హరప్పా - మొహంజాదారో) స్వతంత్రంగా విలసిల్లిన నాగరికత అని ధృవపడింది. ఈ పరిశోధనల వల్ల మరొక విషయం స్పష్టమైంది. నాగరికత వేరు - సంస్కృతి వేరు అన్నది తెలిసింది.
పరిశోధనల కోసం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన మనుషుల అస్థిపంజరాలు, జంతువుల ఎముకలు, వస్తువులు, ఆభరణాలు, విత్తనాలు, గింజలు వంటి ఆధారాలు ఎన్నో విషయాలు విశదపరిచాయి. ఆనాటి సామాజిక స్థితిగతులు బేరీజు వేసుకునేందుకు దోహదపడ్డాయి. సంగ్రహించిన డి.ఎన్.ఎ. వివరాలు విషయాల్ని మరింత బలపరిచాయి.
శ్రమలోంచి, వ్యవసాయంలోంచి సామాజిక జీవితంలోని అన్ని విభాగాలూ ఆవిష్కృతమవుతూ వచ్చాయనీ మనం విశ్లేషించుకున్నాం! దీనికి భిన్నంగా ఒక వర్గం వారు దేవుడు, దయ్యం, పాపం, పుణ్యం, పునర్జన్మ, పైలోకాలు, కింది లోకాలు వంటి భావనల్ని ప్రచారం చేశారు. ఒళ్ళు వంచి పనిచేయలేని వీరు, అన్నీ తమకే తెలుసునన్నట్లు, తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి కట్టుకథలతో మతాలకు రూపకల్పన చేశారు. దీనికి ఆధారామేమిటీ? ఈ విషయం ఎలా చెప్పగలుగుతున్నారూ? అంటే... దానికీ ఆధారాలు దొరికాయి. మనుషుల అస్థిపంజరాలతో పాటు, వారు వాడిన వస్తువులు, వారి ఆభరణాలు వగైరా తవ్వకాల్లో బయటపడ్డాయి. అంటే... పునరన్జన్మ ఉంటుందని, చనిపోయిన వారు పైలోకాలకు వెళ్ళినా, వారి వస్తువులు వారి ఆభరణాలు వారు మళ్ళీ వాడుకుంటారని ఒక విశ్వాసానికి బీజం పడింది. భారతదేశంలోనే కాదు, ఇలాంటి విశ్వాసాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఈజిప్టులో పిరమిడ్ నిర్మాణాల సంప్రదాయం ఇలాంటి విశ్వాసంలోంచి వచ్చిందే! ఈ అర్థం పర్థం లేని విశ్వాసాలే సమాజంలో కొంత కాలానికి సంప్రదాయాలయ్యాయి. (ఎప్పుడో చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర, ఇప్పుడు అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి రావడం ఇంకా కొనసాగుతూనే ఉంది). ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆచారాలు, సంప్రదాయాలు క్షుణ్ణంగా విశ్లేషించి చూడండి. అందులో అధిక భాగం మత విశ్వాసాలకు దగ్గరగా ఉంటాయి. అంతేగాని, వివేకవంతంగా ఏ మాత్రం ఉండవు. అందుకే చెప్పేది, ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆధునిక, వైజ్ఞానిక మా'నవ'వాద కోణంలో పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది! మనిషి చరిత్రను సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది!!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత,
బయాలజీ ప్రొఫెసర్.