Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ ప్రభుత్వ పాలనలో ముస్లింలు, దళితుల దుస్థితికి అద్దం పట్టే ఉదంతాలు దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకకు కూడా పాకాయి. హిజాబ్, హలాల్ ఉదంతాలు బహిరంగంగా చర్చకు వస్తే చాప కింద నీరులా 2021 నుంచి అమల్లోకి తెచ్చిన 'ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కేటిల్ యాక్ట్ -2020' (రాష్ట్రంలో అన్ని రకాల పశువులు ఆవులు, ఎద్దులు, దున్నలను రవాణా చేయడం, వధించడం, వ్యాపారం చేయడం చట్ట విరుద్ధం) తన పని తాను చేసుకుపోతోంది.
'చట్టం రాగానే నాకు ఫోను కాల్స్ రావడం మానేశాయి. పశువుల కళేబరాల చర్మం తీయకుండా బహిరంగ ప్రదేశంలో అలాగే వదిలివేయమని నాకు ఆదేశాలు వచ్చాయి' అంటాడు నంజయ్య అనే చర్మకారుడు. నంజయ్య (53) మైసూరు జిల్లా సింధువల్లి గ్రామ నివాసి. చనిపోయిన పశువుల చర్మం ఒలవడంలో నేర్పరి. నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేయగలడు. పంచాయతి కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా ఉన్న అతని ఇంటి అవసరాలకు ఈ ఆదాయం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. గ్రామ చుట్టుపక్కల ఎక్కడైనా పశువు చనిపోతే పంచాయతీ పెద్దలు నంజయ్యకే ఫోను చేసేవారు. కాని ఏడాది కాలంగా అతను ఒక్క పశువుకు కూడా చర్మం తీయలేదు.
నంజయ్య పూర్వీకులంతా కొన్ని తరాలుగా ఇదే పనిలో ఉన్నారు. 'గ్రామంలో అగ్రకులాల వారు ఈ పనిని అపవ్రితమైనదిగా భావించినా అదే మాకు తిండి పెడుతుంది. కాని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల దెబ్బతిన్న వారిలో ఇప్పుడు నా కుటుంబం కూడా ఉంది' అంటాడు నంజయ్య.
'గొడ్డు మాంస నిషేధ' చట్టం అమలుతో పశువుల చర్మంపై, వాటి మాంసంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా చిన్న రైతులు, చర్మకారులు, మాంస పరిశ్రమలలో పనిచేసే కార్మికులలో అధిక సంఖ్యాకులైన దళితులు, ముస్లింలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
మైసూరు జిల్లా టి నర్సిపురకు చెందిన పేద రైతు రామ బసవయ్య తనకు భారంగా మిగిలిన వట్టిపోయిన ఆవులను ఏడాది కాలంగా అమ్మలేకపోతున్నాడు. గ్రామంలో పశువుల సంతకు తరచూ వెళ్తున్నాడు. 'ఉత్పాదకత లేని, వ్యవసాయానికి పనికిరాని, వట్టిపోయిన పశువులను కొనేందుకు యజమానులు ఈ సంతకు వచ్చేవారు. కాని ఇప్పుడు అటువంటి వారెవరూ రావడం లేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి' అని బసవయ్య దిగాలు పడిపోతున్నాడు.
కర్నాటక వ్యాప్తంగా రెండు వేల పశువుల సంతలు జరుగుతున్నాయని కర్నాటక రాజ్య రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెఎం వీర సంగయ్య అంటున్నాడు. 'రైతులకు ఉపయోగపడని పశువులను ఈ సంతల్లో అమ్ముతుంటారు. వట్టిపోయిన తరువాత వాటిని పోషించడమంటే చాలా కష్టం. పేద రైతు ఇంత నష్టాన్ని ఎలా భరించగలడు?' అంటాడు వీర సంగయ్య. 'మా దొడ్లో నాలుగు ఆవులు ఉన్నాయి. వాటి సంరక్షణకు రోజుకు రూ.600 ఖర్చు అవుతుంది. వాటి పోషణ, నిర్వహణ మాలాంటి పేద రైతులకు చాలా భారంగా ఉంది. సంతకు తీసుకెళ్లినా అమ్మకాలు లేక వెనుదిరుగుతున్నాం. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు' అంటాడు రవిచంద్ర అనే యువ రైతు.
'చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ధరలో పతనం మొదలైంది' అంటాడు ఓ ముస్లిం వ్యాపారి. మైసూరులో నిర్వహించే పలు సంతల్లో అతను పశువులను కొనుగోలు చేసేవారు. ఇక్కడ పశువులను కొనుక్కొనే వారంతా కబేళాలకు, మాంసం దుకాణాలకు వాటిని చేరవేసేవారు. రైతులకు ఎంతోకొంత ఆదాయమార్గంగా ఉండే ఈ పని వల్ల వాళ్లు ఏ రోజూ నష్టపోలేదు. నేను కొనుక్కున్న పశువులను అలాగే చేసేవాడిని. కాని చట్టం వచ్చాక ఈ వ్యాపారాన్ని మానేశాను. యూపీలో హిందూత్వ గ్రూపులు పశువులను రవాణా చేస్తున్న ముస్లింలపై దాడులు చేయడం నాకు తెలుసు. వ్యవసాయ అవసరాల కోసం ఆవులను తరలిస్తున్న మా మీద కూడా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి' అంటాడు ఆ వ్యాపారి.
చట్టం అమల్లోకి వచ్చిన నెల వ్యవధిలోనే అంటే మార్చి 2021న అబ్దుల్ రెహమాన్, మహ్మద్ ముస్తఫాలు ప్రయాణిస్తున్న వాహనాలను బజరంగ్ దళ్కు చెందిన 25మంది వ్యక్తులు నిలిపివేశారు. దక్షిణ కర్నాటక బెల్తంగడిలో జరిగిందీ ఘటన. 'రెండు వాహనాలూ ఖాళీగా ఉన్నాయని చెబుతూ టార్పాలిన్ పట్టాలను కూడా తొలగించాం. అయినా 'ముస్లింలు.. పశువుల దొంగలు' అని గట్టిగా అరుస్తూ మా మీద దాడి చేశారు' అంటూ ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు ఆ ముస్లిం సోదరులు. అంతకు ముందు జనవరి 2021న 12 ఆవులతో హవేరి జిల్లా రనేబెన్నూర్ నుంచి మంగుళూరుకు ప్రయాణిస్తున్న ట్రక్కును ఆపి డ్రైవరు అబిద్ అలీపై ఒక గుంపు దాడి చేసింది. 'నా దగ్గర వ్యవసాయ అవసరాల కోసం పశువులను రవాణా చేసేందుకు అనుమతి పత్రాలు ఉన్నాయని చెప్పినా వారు వినిపించుకోలేదు. నడిరోడ్డు మీద నాపై దాడి చేశారు' అంటాడు అబిద్. దాడి చేసిన తరువాత స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తరువాత అబిద్ కేసు నమోదుచేశారు. దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తరువాత పశువులను రవాణా చేసినందుకు అబిద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలా 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 500మందిపై పశువుల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కాని పాలకులు ఆ సంఖ్యను తగ్గించి చూపించారు.
'ఈ రకమైన దాడుల వల్ల గో రక్షకుల పేరుతో ఎవరు, ఎటు నుంచి దాడి చేస్తారోనన్న భయాందోళనల్లో పశువులను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది రైతులకు తీవ్ర నష్టం చేకూరిస్తుంది' అంటారు ఈ నిషేధ చట్టం ప్రభావంపై పరిశోధన చేసిన సిద్ధార్థ జోషి, సైల్వియా కర్పంగమ్.
చట్టం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ప్రతి జిల్లాలో గోశాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ 2021 సెప్టెంబరు వరకు వాటి ఏర్పాటు జరగలేదని ఆర్టిఐ స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని 2022 మార్చి నెలలో రాష్ట్ర హైకోర్టు అభిప్రాయ పడింది కూడా. దీంతో ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించే 188 గోశాలలకు పశువులను తరలించాల్సిందిగా రైతులను కోరింది. ప్రస్తుతం ఈ గోశాలలకు కొత్తగా అమలైన చట్టం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న పశువులను తరలిస్తున్నారు. అదనంగా వచ్చి చేరుతున్న వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న ఖర్చులు ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. 'ఒక్కో ఆవుకి రోజుకు రూ.70 నిర్ణయించిన ప్రభుత్వం కేవలం రూ.17.50 చెల్లిస్తోంది. కాని దాణా, గడ్డి, ఇతర పశుపోషణ కోసం మేము రోజుకు రూ.200 ఖర్చు పెడుతున్నాం' అంటున్నాడు ఓ నిర్వాహకుడు. గతంలో ఇక్కడ 4 వేల ఆవులను సంరక్షించేవారు. చట్టం అమలయ్యాక వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం నిధులు చెల్లించకుండా నిర్వహణ చాలా కష్టమంటూ నిర్వాహకులు వాపోతున్నారు.
'మేము పశువులను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉచితంగా గోశాలలకు తరలించడం వల్ల మాకు ప్రయోజనం లేదు. అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది. అది మా అవసరాలకు పనికొస్తుంది. కాని రాను రాను పరిస్థితి దిగజారుతోంది. పశువులను పోషించలేని రోజులు వస్తున్నాయి. చట్టం ఉద్దేశం ఇదేనా? ఎవరిని కాపాడాలని దీన్ని అమలు చేస్తున్నారు?' అంటూ ప్రశ్నిస్తున్నాడు రవిచంద్ర.
ఈ పరిస్థితి ఉత్తరాది నుంచి దక్షిణాదికి శరవేగంగా వ్యాపించడం వెనుక బలమైన ఉద్దేశమే వుంది. క్రమంగా దేశంలో మైనార్టీ ప్రజల జీవితాలను దుర్లభం చేసి వారిని భయభ్రాంతులకు లోనుచేయడమే.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్