Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లడ్డూ కావాలా నాయనా... తియ్యని వేడుకు చేసుకుందాం' అంటూ డెయిరీ మిల్క్ చాక్లెట్ ప్రకటన వినియోగదారులను బాగా ఆకర్షించింది. అది చూడగానే వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ నోరూరిస్తుంది. దాన్ని కొంచెం మార్చి రాహుల్‌గాంధీ ''లడ్డుకావాలా నాయకా...'' అంటూ కాంగ్రెస్ శ్రేణులను అడిగి ఆశ్చర్యపరిచారు. ఏంటీ రాహుల్ ఇలా అడుగుతున్నారంటూ ఒక్కసారిగా అందరూ నోరెల్లబెట్టారు. రాహుల్ ఉద్దేశం ఇక్కడ లడ్డూ అంటే బిఫామ్. అది కావాలా? అని అడిగారు. అయితే అది అంత ఈజీ కాదు. హైదరాబాద్ బిర్యానీకి, ఇరానీ ఛారుకి పెట్టింది పేరు. అది నాకు తెలుసు. కానీ తప్పదు హైదరాబాద్‌ను వదిలి మీరు గ్రామాలకు వెళ్లండి... ప్రజల్లో ఉండండి. అప్పుడే మీకు లడ్డూలాంటి బిఫామ్ వస్తుంది. అప్పుడే మీరు తియ్యటి వేడుక చేసుకోవచ్చు అని చెప్పడంతో నోట్లో వెలక్కాయపడినట్టైయింది. ఢిల్లీకి వచ్చి ఫైరవీలు చేసుకుంటేనో, హైదరాబాద్‌లో ఉంటేనో టికెట్లు ఇవ్వడం కుదరదు. బిఫామ్ అందదు. ముందే చెబుతున్నా... తర్వాత నన్ను అనకూడదు అని రాహుల్ అనడంతో సభా ప్రాంగణం ఒక్కసారి నిశ్శబ్ధం రాజ్యమేలింది. కారణం చాలా మంది ఆ నియోజకవర్గాలకు రాజులే. టికెట్లు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనతోనే ఉంటారు. ఢిల్లీ ఆశీస్సులుంటే టికెట్లు వస్తాయనే బలమైన నమ్మకంవారిది. పాతకాలపు సంప్రదాయానికి రాహుల్ చెక్ పెట్టే సరికి దిమ్మతిరిగినట్లైంది. దశాబ్దాలుగా తిష్ట వేసిన వారి పీడ ఇప్పటికైనా విరగడవుతుందన్న రాహుల్ భరోసాతో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం వేడుక చేసుకుంటున్నారు. స్థానికంగా కష్టపడుతున్న నాయకులకు నోరు తీపైయింది. రాహుల్ చెప్పిన దాని ప్రకారం ఇలాంటి వ్యక్తులను నిజంగా దూరం పెట్టి, కష్టపడివారికి నోరు తీపి చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
- గుడిగ రఘు