Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ తెలుగు తెరపై పండించిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. హాస్యానికే హీరోయిజాన్ని తెచ్చి పెట్టిన ఘనత ఆయనది. ఆ నవ్వుల రేడుతో కలిసి 'స్వీట్' దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సినిమా కొబ్బరిబోండాం. ఆ సినిమాలో అచ్చం కొబ్బరిబోండాంలాగా ఉండే రాజేంద్రుడు చేసే అల్లరి, ఊబకాయస్తుడిగా ఆయన పడే ఆపసోపాలు చూసి జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వచ్చిందంటే చాలు... ఆయన అభిమానులు అట్టే అతుక్కుపోవటం పరిపాటి. సీన్ కట్ చేస్తే... ఈ మధ్య సూరయ్య (అదేనండి మన సూర్య భగవానుడు) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఎండ వేడిమికి తట్టుకోలేక వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలు, తీవ్రమైన ఉక్కపోత, వెరసి... 'ఆ సూరిగాడికి చెప్పండ్రా బాబూ... తట్టుకోలేక పోతున్నాం... ఏం ఎండిలా బాబూ...' అనుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ఓ రోజు మిట్టమధ్యాహ్నం హైదరాబాద్లోని రోడ్డుపై కొబ్బరిబోండాం తాగుదామని భావించి, ఆ షాపు వద్దకు వెళితే... అక్కడ బోండాలు అమ్మేవాడు చెప్పిన రేటు విని ఖంగుతినాల్సి వచ్చింది. 'కేరళ కాయ అయితే ఒక్కోటి రూ.50, అదే బెంగళూరు కాయైతే రూ.40, ఏలూరు కాయైతే రూ.35... మీకు ఏది కావాలో చెప్పండి సార్...' అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చాడు. అదేంటి...? మొన్నటిదాకా ఒక్కో బోండా రూ.25, రూ.30కే అమ్మావు కదా..? అని అడగ్గా... 'మీరు పేపరోళ్లు, మీకు తెలియదా సార్... రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నారు.. దాంతో బోండాలను తీసుకొచ్చే లారీలు, వ్యాన్ల కిరాయిలు విపరీతంగా పెరిగిపోతున్నారు... దానికితోడు ఎండాకాలం బోండాలకి విపరీతమైన గిరాకీ ఉంటది గదా సార్...?' అంటూ ముక్తాయింపునిచ్చాడు ఆ షాపువాడు. సో... అప్పట్లో కొబ్బరిబోండాం సినిమా మనకు నవ్వులు పంచితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దెబ్బకు కొబ్బరిబోండాం తాగే వారి జేబుకు కూడా చిల్లులు పడుతున్నాయన్నమాట.
-బి.వి.యన్.పద్మరాజు