Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజకీయాలలో భిన్న ధృవాలుగా తలపడాల్సిన బీజేపీ కాంగ్రెస్‌లు తెలంగాణకు వచ్చేసరికి దూకుడు మొత్తం టీఆర్ఎస్పై చూపించడం ఒక విచిత్ర పరిణామంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కాంగ్రెస్ బీజేపీలు సమదూరం అంటుంటే కేటీఆర్‌తో సహా టీఆర్ఎస్ నేతలు ఆ రెండు పార్టీలపైన విరుచుకు పడుతున్నారు. ఒకవైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజరు పాదయాత్ర నేపథ్యంలో జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా రాక, మరోవైపున వరంగల్ రైతు డిక్లరేషన్ విడుదల పేరిట కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఇందుకు పరాకాష్ట. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నేతలరాకలూ సభలూ సంరంభాలు కొత్తేమీ కాదు. అందులోనూ మరో ఏడాదిలో ఎలాగూ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగానే వస్తాయా అన్న ఊహాగానాలు కూడా నిరంతరంగా నడుస్తున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు మీడియా సమావేశాల ద్వారానూ బహిరంగ సభల ద్వారానూ ఇందుకు రంగం సిద్దం చేసుకోవడం కనిపిస్తూనేవుంది. అలాంటప్పుడు పోటాపోటీగా మేమంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బీజేపీలు కూడా వేగం పెంచడంలో ఆశ్చర్యం ఏముంది? అందులోనూ బీజేపీ కేంద్రంలో పాలిస్తున్న పార్టీగా దక్షిణాది ఆవకాశాలలో తెలంగాణను లెక్క చూపిస్తున్నది. ఇక కాంగ్రెస్ గతంలో ఇక్కడ రెండవ పార్టీగా ఉండగా ఈ మధ్య వూపుతగ్గి అనైక్యతలో చిక్కింది. రేవంత్‌రెడ్డి అధ్యక్షుడైనాక హడావుడి పెంచినా షరామామూలుగా భిన్న స్వరాలు వినిపిస్తూనే వస్తున్నాయి. జాతీయంగానూ బలహీనమైన కాంగ్రెస్ కాస్తోకూస్తో పునాది ఉన్న ఈ రాష్ట్రాన్నయినా కాపాడుకోవాలని తాపత్రయ పడటం సహజం. అందుకే నాలుగేండ్ల తర్వాత రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఈపర్యటనకు ముందూ వెనకా కూడా బోలెడు హంగామా సాగింది. పర్యటనలో ఆయన ప్రసంగాలలోనూ అది ప్రతిబింబించింది. ప్రజలతో ఉన్నవారికే టికెట్టు ఇస్తామనీ, బీజేపీ, టీఆర్ఎస్లతో లాలూచీ పడేవారు ఎంతవారైనా ఉపేక్షించబోమని ఆయన పదేపదే చెప్పారు. అంటే అలాటి వారు ఉన్నారనేది బలమైన అంశంగా భావిస్తున్నారన్నమాట. మరోవైపున ఆరునెలల ముందు టికెట్ ఇచ్చేస్తే సరిపోదని మాజీ మంత్రి కోమటిరెడ్డి రాహుల్ సభలోనే చెప్పడం విశేషం. అంటే ఇప్పుడు చెప్పేయాలని అర్థం.
బీజేపీ బెదిరింపులు
రాహుల్ కన్నా ముందే తమ పార్టీ సభలో పాల్గొన్న నడ్డా, ఇతర బీజేపీ నాయకులు షరామామూలుగా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా కేసీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం అవినీతికి అడ్రసుగా మారిందని అందుకే కేసీఆర్ అంతగా భయపడుతున్నారని గేళి చేశారు. చాలా కాలంగా వారు కేసీఆర్‌ను జైలుకు పంపుతామని ఊతపదంలా వాడుతున్న మాట అందరికీతెలుసు. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న తెలంగాణలో తమకు అలవాటైన మతతత్వ భాషలో కవ్వింపు మాటలు మాట్లాడ్డమే గాక, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రసమితిగా గాక రజాకార్ల సమితిగా మారిందని పాత గాయాలు కెలికే ప్రయత్నం చేశారు. కేంద్రం నిధులు గుమ్మరిస్తుంటే ఇక్కడేదో అంతా దుర్వినియోగమైపోతోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ మాత్రమే గాక దేశమంతటా రాష్ట్రాలకు నిధులు అధికారాలు కూడా కోతకోసిన మోడీ సర్కారు ఏకపక్షపాలన అందరికి తెలుసు గనక ఎవరూ దీనికి ఆశ్చర్యపోరు. గవర్నర్ తమిళిసై కూడా ఈ విషయంలో వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలిగించిన తీరు కూడా చూస్తున్నదే. ఇందులో ఏ విషయంలోనూ సానుకూల సూచన చేయని బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో తమ పాలన రావడం తథ్యమనే భావన కలిగించేందుకు తంటాలు పడ్డారు. పైగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఆరోపించివెళ్లారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ముస్లిం యువతిని పెళ్లాడిన దళితయువకుడిని అమ్మాయి బంధువులు ఘోరంగా హత్య చేశారు. బడా ఇంగ్లీషు పత్రికలు దీన్ని హిందూయువకుడి హత్య అంటూ మతం రంగు పులిమేందుకు ప్రయాసపడ్డాయి. పరువు హత్యలపేరిట జరిగే ఈ అమానుషాలను సీపీఐ(ఎం), కేవీపీఎస్ ప్రజాసంఘాలు ఎప్పుడూ గట్టిగా వ్యతిరేకించి పోరాడుతున్నాయి. పాలకపార్టీలే అవకాశవాదంతో ఇలాంటి విషయాలలో అంటీముట్టనట్టు వ్యవహరించడం కద్దు. అయితే ఇక్కడ మతాల ప్రసక్తి వచ్చే సరికి బీజేపీకి ఎక్కడలేని ఆసక్తి పుట్టింది. లౌకిక పార్టీలు ఇప్పుడు ఏం చెబుతాయో చూడాలని బండి సంజరు క్షణాల మీద సవాళ్లు చేశారు. గవర్నర్ కూడా ఎన్నడూ లేనంత వేగంగా రంగంలోకి దిగి నివేదిక కోరారు. వాస్తవానికి వీరందరికన్నా ముందే కేవీపీఎస్, ఐద్వా ఈ హత్యపై తీవ్రంగా స్పందించడం పాఠకులకు తెలుసు. ఆసక్తికరమైన విషయమేమంటే బీజేపీ అనుసరిస్తున్న ఈ మత రాజకీయాలతోనే గద్దెక్కేస్తామంటున్న బీజేపీ నాయకత్వ తీరు ఆ పార్టీలోనే చాలామంది నాయకులు ఒప్పుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో అసమ్మతి స్వరాలు కూడా పెరగడానికి ఒక కారణమదే. కాంగ్రెస్ స్థాయిలో కాకున్నా బీజేపీలోనూ అనైక్యత పెరిగిన ఉదాహరణలు వస్తున్నాయి.
రైతు డిక్లరేషన్సరే, బీజేపీ మాట?
ఈ పూర్వరంగంలో వచ్చిన రాహుల్‌గాంధీ పర్యటన కూడా రాష్ట్రంలో అధికారం, రాజకీయ ప్రయోజనాల చుట్టూనే తిరిగింది. రైతుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు తప్పులపై పోరాడవలసిందే. ఎన్నికల కోణంలో హామీలు ఇవ్వడం కూడా పొరబాటు కాదు. రాహుల్ పర్యటనకు ముందునుంచే టీఆర్ఎస్ నాయకులు మీడియా కూడా కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితులు వాగ్దాన భంగాలవంటి వాటిని భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలుసుకోవడానికి అనుమతి లభించలేదు. చంచల్‌గూడ జైలులో తమ కార్యకర్తలను కలుసుకోవడానికి కూడా ఆలస్యంగా అవకాశం ఇచ్చారు. రాజకీయ తేడాలూ వైరాలూ ఉన్నప్పటికీ ఈ విధంగా అడ్డుపడటం ప్రజాస్వామ్యమనిపించుకోదు.
అయితే తనకన్నా ముందు బెదిరింపులు మతతత్వ రాజకీయాలు చేసి వెళ్లిన బీజేపీపై రాహుల్‌గాంధీ కాస్తయినా కేంద్రీకరించకపోవడం ఆశ్చర్యం. జాతీయంగా మోడీపై ట్వీట్లతో ప్రచారం పొందే ఆయన ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ చుట్టూనే తిరిగారు. జాతీయంగా రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ కపటవైఖరిని సరిగానే విమర్శించారు గానీ, ఈ పరిస్థితికి సుదీర్ఘకాలం పాలించిన తమ విధానాలు కూడా కారణమనే వాస్తవం దాటేశారు. పైగా మోడీ సర్కారు రాష్ట్రాలపై చేస్తున్న దాడి, తెలంగాణలో మతతత్వ పాచికలను ఖండించడం అవసరమనుకోలేదు. తెలంగాణ ఇచ్చాము కేసీఆర్ పాలనలో నాశనమైంది అన్న ఆంశం చుట్టూనే తిరిగారు. కేసీఆర్‌పై సిబిఐ దర్యాప్తు జరపడం లేదంటే వారిద్దరికీ లాలూచీ ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తిలేదని రాహుల్ అంటే అసలు ఎవరు అడిగారని కేటీఆర్ ఎదురు దాడి చేశారు. మోడీని ఓడించడం చెత్త ఎజెండా అని కేసీఆర్ అనడంపై గత వారం చర్చించాము. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ బీజేపీని ప్రత్యేకంగా వ్యతిరేకించకపోవడం ఒకరిపై ఒకరు లాలూచీ ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ విశేషం. ఈ రెండు పార్టీల మధ్యన బీజేపీ బలపడిందంటూ మీడియాలో ఒక భాగం పనికట్టుకుని ప్రచారం చేస్తున్నది. టీఆర్ఎస్ బీజేపీని ప్రధాన శక్తిగా చూపించడానికే దాడి చేస్తూ తమను తక్కువ చేస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇదంతా కూడా హాస్యాస్పదమైన రాజకీయ తతంగంగా మారింది. ఈ క్రమంలో ప్రజాసమస్యలు, రాష్ట్రం హక్కుల సాధన వంటివి ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. శాంతిభద్రతల పరంగానూ సామాజిక దాడుల రూపంలోనూ అనేక ఘటనలు సంభవిస్తున్నాయి.హైకోర్టు కూడా అనేకసార్లు అక్షింతలు వేస్తున్నది.
ఆత్మస్తుతిలో టీఆర్ఎస్
అయితే ఎన్ని జరిగినా టీఆర్ఎస్ నేతలు మంత్రులు తమ పాలన మహత్తరమని, ప్రజలంగా తమతోనే ఉన్నారని చెప్పుకోవడం తప్ప పిసరంత ఆత్మవిమర్శకు గానీ, సమీక్షకు గాని సిద్ధమవడం లేదు. ఆత్మస్తుతిలోనే మునిగితేలుతున్నారు. ఉప ఎన్నికలలోనూ కార్పొరేషన్ ఎన్నికలలోనూ బీజేపీ సాధించిన ఫలితాల ప్రభావం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా ఆలయాలు, పూజలు, యాగాల విషయంలో బీజేపీని మించి కనిపించాలని పాకులాడుతున్నారు. ఇదంతా ఒక రాజకీయ ప్రహసనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో కోపాలు హద్దుమీరి బూతులు తిట్టుకోవడం పరిపాటిగా మారుతున్నది. కాంగ్రెస్‌లో అనైక్యత గురించి అనేకసార్లు చెబుతున్నా టీఆర్ఎస్ తగాదాలు కూడా ఈ మధ్య రచ్చకెక్కుతున్నాయి. పలు అక్రమాలు అత్యాచారాలలో కూడా పాలక పార్టీ సంబంధితుల పేర్లు వస్తున్నాయి. ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై దాడికే పరిమితమవుతూ అంతర్గత విషయాలు దిద్దుకోవడంలో వైఫల్యం టీఆర్ఎస్కు నష్టదాయకం. ప్రజావ్యతిరేక అంశాలను మార్చుకోకపోవడం నిరసన తెలిపే అంశం. ఎందుకంటే రాజకీయాలలో ఎవరిపట్లా శాశ్వతమైన మద్దతు ఉండదని ఇటీవలి ఓటములు నిరూపించాయి. కాంగ్రెస్‌తో పొత్తులు, సర్దుబాట్లు, కూటములు ఉండకపోవచ్చు గానీ, కేంద్రంలో ఉండి పెత్తనం చేస్తున్న మతతత్వ శక్తికీ దానికీ సమదూరం ఎలా సాధ్యం? అలాగే కాంగ్రెస్ కూడా అధికారం కోసం ఎంతైనా ప్రయత్నించవచ్చు గానీ బీజేపీకి టీఆర్ఎస్కు తేడా లేదన్నట్టు వ్యవహరించడం ఏం తర్కం? రాష్ట్రాల హక్కుల కోసం, లౌకిక తత్వం కోసం పోరాడవలసిన బాధ్యత ఉండదా? ఇలాంటి పోకడల వల్ల బీజేపీ మరింత రెచ్చిపోతే అందరూ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. గెలుపులు ఓటముల సంగతి అటుంచి దేశ హితం దెబ్బతింటుంది. అది రాష్ట్రాల సరిహద్దులకే పరిమితమై ఉండదు. ఈపాలక పార్టీలన్నీ ఎన్ని విన్యాసాలు చేసినా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలే తగు నిర్ణయం తీసుకోగలరు. ఎవరికి నేర్పాల్సిన పాఠం వారికి నేర్పుతారు.
- తెలకపల్లి రవి