Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యతరగతి.. దేశంలోని ఎక్కువశాతం మంది జనాభా తమను తాము ఆ వర్గానికి చెందిన వారుగా అభివర్ణించుకుంటారు. దేశంలో మధ్యతరగతి జనాభే ఎక్కువ అని పాలకులు కూడా ప్రసంగాలు ఇస్తుంటారు. పత్రికలు కూడా అదే చెబుతూ ఉంటాయి. అయితే మనం మధ్యతరగతికి పరిపూర్ణమైన నిర్వచనాన్ని ఇవ్వలేకపోయినా.. కొన్ని సర్వే సంస్థలు, మరికొందరు ఆర్థిక వేత్తలు 'మధ్యతరగతి' అనే పదానికి వేరువేరు నిర్వచనాలు అందించారు. అసలు మధ్య తరగతి ఎవరు..? మధ్యతరగతి కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి? అసలు దేశంలో మధ్యతరగతి జనాభా ఎంత? ప్రభుత్వాలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? దేశ ఆర్థికాభివృద్ధిలో మధ్యతరగతి పాత్ర ఏమిటి? ఈ అంశంపై వివిధ సర్వే సంస్థలు ఏం తేల్చాయి... ఆర్థిక వేత్తల అభిప్రాయాలేమిటో ఒకసారి గమనిద్దాం.
భారతదేశంలో ఇటీవల ఓ సంస్థ వివిధ ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. కుటుంబ ఆదాయమెంత? ఏ ఆదాయ వర్గంలో ఉన్నారో వంటి వివరాలు సేకరించింది. అయితే ఈ సర్వేలో 50శాతం మందికి పైగా తమను తాము మధ్యతరగతి కుటుంబాలుగా చెప్పుకున్నారు. అయితే ఇందులో 90శాతానికి పైగా మధ్యతరగతి వర్గానికి చెందిన వారు కాదు. వారు పేదరికం లేదా తక్కువ ఆదాయవర్గానికి చెందిన వారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశ్వసనీయత కలిగి ఉన్న ప్యూ రీసెర్చ్ సెంటర్ భారతదేశంలో 2015లో ఓ సర్వే నిర్వహించింది. దేశంలో కేవలం రెండంటే రెండుశాతం మంది మాత్రమే మధ్యతరగతికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించింది. దేశంలోని 130 కోట్ల జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే మధ్యతరగతి ఆదాయవర్గంలో ఉన్నట్లు తేల్చింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మధ్యతరగతి అంటే వారి కుటుంబ తలసరి ఆదాయం నెలకు 300 నుంచి 600 డాలర్లు ఉండాలి. అంటే కనీసం నెలకు రూ.23 వేల నుంచి 45వేల రూపాయలు సంపాదించాలి. అప్పుడే వారు మధ్య తరగతి వర్గంలోకి వస్తారు.
మధ్యతరగతి నిర్వచనం ఇలా...
మధ్యతరగతి అనే పదానికి ఒకటే నిర్వచనాన్ని చెప్పడం కష్టం. చాలా మంది వ్యక్తులు, సర్వే సంస్థలు మధ్యతరగతికి వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 111 దేశాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి దేశం జనాభాను ఆదాయాన్ని బట్టి ఐదు గ్రూపులుగా విభజించింది. పేదరికం, తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, ఎగువ మధ్య ఆదాయం, అధిక ఆదాయం ఇలా వేరువేరుగా చేసింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. ప్రతి రోజు 10 నుంచి 20 డాలర్లు సంపాదించే కుటుంబం, అంటే రూ.700 నుంచి రూ.1400 వరకు సంపాదించే కుటుంబాన్ని మధ్యతరగతిగా అభివర్ణించింది. దీని ప్రకారం చూసుకుంటే కేవలం రెండుశాతం కుటుంబాలు మాత్రమే మధ్యతరగతి పరిధిలోకి వస్తాయి.
కానీ ఆర్థిక వేత్తలు సంధ్యకృష్ణన్, నీరజ్ హాటెకర్లు మధ్యతరగతికి వేరే నిర్వచనాన్ని ఇచ్చారు. వీరి ప్రకారం ఒక కుటుంబం రోజువారి ఆదాయం 2 నుంచి 10 డాలర్లు, అంటే రూ.150 నుంచి రూ.700 సంపాదించే వారిని మధ్యతరగతిగా చెప్పారు. దీని ప్రకారం 50శాతం మంది ప్రజలు మధ్య తరగతిలోకి వస్తారు. వీరి నిర్వచనం ప్రకారం పారిశుధ్య కార్మికులు, ఇండ్లల్లో పని చేసే వారు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులు కూడా మధ్యతరగతికి చెందిన వారిగానే పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఏదైనా ఉద్యోగం, లేదా చిన్న పాటి వ్యాపారం ఉండి, సొంత ఇల్లు, సొంత వాహనం, పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చదివిస్తున్న వారినే సమాజం మధ్యతరగతి వారిగా గుర్తిస్తుంది.
'మధ్యతరగతి' పెరుగుతోందా!
భారతదేశంలో మధ్యతరగతి వర్గం రోజురోజుకు పెరుగుతున్నట్లు ఎంతో ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ అవాస్తవాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. ప్యూ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు పేద ప్రజలు తక్కువ ఆదాయమున్న వర్గానికి మారారు తప్ప.. మధ్యతరగతి వర్గంలోకి రాలేదు. కానీ తక్కువ ఆదాయ వర్గంలోని చాలా తక్కువ మంది మాత్రమే మధ్య ఆదాయ వర్గంలోకి మారారు. అదే 2001 నుంచి 2011 మధ్య మనం చైనా అభివృద్ధిని పరిశీలిస్తే.. మధ్య ఆదాయ వర్గం 3శాతం నుంచి 18శాతానికి ఎగబాకింది.
పరిశ్రమల తప్పుడు అంచనాలు...
భారతదేశంలో మధ్య ఆదాయ వర్గం చాలా ఎక్కువగా ఉందని చాలా పరిశ్రమలు తప్పుడు అంచనాలు వేసి, అనుకున్న లక్ష్యాలను సాధించక నిరాశకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఉదాహరణకు స్టార్ బక్స్ భారతదేశంలో ఎన్నో పెద్ద ప్రణాళికలు వేసి తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ రెండేండ్ల డేటాను మనం పరిశీలిస్తే స్టార్బక్స్ దేశంలో ప్రతి నెలలో కేవలం ఒక కొత్త షాపును మాత్రమే తెరవగలిగింది. ఎందుకంటే ప్రతి రోజు రూ.150 నుంచి 300లు సంపాదించే వ్యక్తి కేవలం కాఫీ కోసం రూ.200 ఖర్చు చేస్తాడని మనం భావించడం తప్పే అవు తుంది. అదే చైనాలో కేవలం 15 గంటలకు ఒక స్టార్ బక్స్ నూతన దుకాణం తెరుచుకుంటోంది.
నగరాలే టార్గెట్...
భారతదేశంలో ఎన్నో పెద్దపెద్ద కంపెనీలు అందించే సేవలు దేశంలోని అతి కొద్ది శాతం ప్రజలు మాత్రమే వినియోగించు కోగలుగు తున్నారు. ఉదాహరణకు ఓలా కంపెనీ దేశంలోని సుమారు దాదాపు 100నగరాల్లో తన సేవలను అందిస్తోంది. అయితే 80శాతానికి పైగా కంపెనీ వ్యాపారం కొద్ది మెట్రో సిటీల నుంచి మాత్రమే వస్తున్నది. ఇంకా అనేక కంపెనీల ప్రధాన డిమాండ్ అతి కొద్ది నగరాల నుంచి మాత్రమే వస్తున్నది. 2015లో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎఫ్ఎస్ ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించింది. టీవీ, ఏసీ, కూలర్, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ వంటి వి ఉన్నాయా అని ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఈ సర్వేలో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. దేశంలో ఉన్న వాషింగ్ మెషీన్లలో 33శాతం ఢిల్లీ, ముంబై, పూనె, చెన్నై, హైదరాబాద్, కలకత్తా, బెంగుళూర్ వంటి నగరాల్లోనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఏసీల్లో 15శాతం కేవలం దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనే ఉన్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు తమ దృష్టిని ప్రధానంగా నగరాలపై కేంద్రీకరించి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ మనం నగరాల నుంచి దృష్టి మరల్చి పల్లెల వైపు చూస్తే అసలైన భారతదేశం మనకు కనిపిస్తుంది. పేదరికంలో మగ్గుతున్న జనం అనే వాస్తవం తెలిసొస్తుంది. కొన్ని విషయాలను మనం తెలుసుకుంటే భారతదేశంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతాయి. 2020 ఆక్స్ఫామ్ రికార్డుల ప్రకారం.. దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 42.5 దేశ సంపద పోగుబడి ఉంది. 50శాతం ప్రజల వద్ద కేవలం 2.8శాతం మాత్రమే సంపద ఉంది.
మధ్యతరగతి ఎందుకు ముఖ్యం!
మధ్యతరగతి దేశ ఆర్థికాభివృద్ధిలో ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. చిన్న తరహా వ్యాపారాలను సృష్టించడంతోపాటు వివిధ వ్యాపారాల మనుగడలో మధ్యతరగతి భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. అమెరికా లాంటి దేశాలు ఇంతటి అభివృద్ధి చెందడానికి మధ్య తరగతియే కీలకపాత్ర పోషించింది. మధ్యతరగతి ప్రజలు దేశ ఆర్థిక రంగం వృద్ధి చెందేలా వివిధ వస్తువుల కొనుగోలు, సేవల్లో కీలక భాగస్వామిగా ఉంటారు. కార్లు, బైక్లు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా తయారీరంగానికి ఊతమిస్తారు. కొవిడ్ మహమ్మారి తర్వాత లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలో లేదా తక్కువ ఆదాయ వర్గంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు సరైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసి, నిరుద్యోగాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచే మార్గాలను అమలుచేస్తేనే మధ్యతరగతి వర్గం సంఖ్య పెరిగే అవకాశ ముంటుంది. తద్వారా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464