Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం మొత్తం మీద గోధుమ ఎగుమతుల్లో 30శాతం రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే జరుగుతుంది. తమ ఆహార అవసరాల కోసం చాలా ఆఫ్రికన్ దేశాలు ఈ రెండు దేశాల మీదే ఆధారపడతాయి. ఇప్పుడు ఆ రెండు దేశాల నడుమ సాగుతున్న యుద్ధం కారణంగా ఆఫ్రికన్ దేశాల ఆహార సరఫరాలు దెబ్బతిన్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ విషయంలో మామూలు పరిస్థితి తిరిగి వెంటనే రాకపోవచ్చు. ఆ రెండు దేశాల్లో పంట సాగు విస్తీర్ణం యుద్ధం కారణంగా తగ్గిపోయింది. ప్రపంచ మొక్కజొన్న ఎగుమతుల్లో 20శాతం ఒక్క ఉక్రెయిన్ నుంచే జరుగుతాయి. ఈ మొక్కజొన్న సరఫరా కూడా దెబ్బ తింటోంది. చాలా బలహీన దేశాల ఆహార లభ్యత ఇందువలన దెబ్బ తింటోంది. అంతే కాదు, చాలా దేశాలకు ఎరువులను సరఫరా చేసేది రష్యానే. ఇప్పుడు వాటి సరఫరా కూడా దెబ్బ తింటోంది. వెరసి ప్రపంచం మొత్తం మీద ఆహార వస్తువుల ధరలు బాగా పెరగడానికి, ఆహార లభ్యత దెబ్బ తినడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందరి నెల ఫిబ్రవరి నాటి ధరలతో పోల్చితే ఏప్రిల్ 8 నాటి ముఖ్య ఆహార ధాన్యాల ధరలు 17శాతం పెరిగాయి. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొనే వాతావరణం ఏర్పడింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా తయారవుతాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలు-యెమెన్, ఇథియోపియా, సోమాలియా, సూడాన్, దక్షిణ సూడాన్, నైజీరియా, కాంగో రిపబ్లిక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఈ ముప్పుకు ఎక్కువగా లోనయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదురవవచ్చునని నిపుణులు ముందు నుండే హెచ్చరిస్తున్నారు. యుద్ధ రంగంలో పోతున్న ప్రాణాల గురించే ఎక్కువ మంది పట్టించుకుంటున్నారు కాని తిండి దొరకని పరిస్థితులు ఏర్పడినందువలన, ఈ యుద్ధంతో ఏ మాత్రమూ సంబంధంలేని దేశాల్లో, యుద్ధం జరుగుతున్న చోటికి చాలా దూరాన ఉన్న దేశాల్లో ఎన్ని ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయో వారికి పట్టడం లేదు. ముఖ్యంగా పశ్చిమ, సంపన్న దేశాల వారికి ఈ సమస్య అస్సలు పట్టడం లేదు.
అయితే, ఈ చర్చలో కేంద్ర స్థానంలో ఉన్న ప్రశ్న వేరు. దానినెవరూ అడగడమే లేదు. ''ప్రపంచంలో కొన్ని దేశాలు కరువు ముంగిట ఎందుకు నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది? ఎక్కడ ఆహార ధాన్యాల సరఫరాలో తేడా వచ్చినా, ఈ దేశాలలోనే ఎందుకు భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది? అసలు కరువు ప్రమాదానికి లోనయ్యే పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఎందుకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది?''
ఈ ప్రశ్నకు వెంటనే వచ్చే సమాధానం ఈ విధంగా ఉంటుంది. ఈ కరువు దేశాలు స్వయంగా యుద్ధం కారణంగా దెబ్బతిన్న దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కాని, సూడాన్ కాని, పశ్చిమ ఆఫ్రికా దేశాలు కాని యుద్ధాల చరిత్ర కలిగివున్నాయి. కొన్ని దేశాలలో ఆ యుద్ధాలు ఇటీవలిదాకా సాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాల కారణంగా ఆహార సరఫరా దెబ్బ తిన్నది. దాని ప్రభావం వలన ఆ దేశాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ వివరణ ఏ మాత్రమూ సరతృప్తినివ్వదు. ఇక్కడ మనం యుద్ధం అంటే రెండు దేశాల మధ్య జరిగేదానినే కాకుండా, ఒక దేశంలో జరిగే ఆంతరంగిక తిరుగుబాటును - దీనినే మనం ఉగ్రవాదం అంటున్నాం - కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఈ తిరుగుబాట్లు అనేవి వెలుపలి నుండి రుద్దేవి కావు. ఆ దేశంలోని పేదరికంలో, ఆహారం సైతం దొరకని పరిస్థితులలో ఈ తిరుగుబాట్ల మూలాలు ఉంటాయి. అందుచేత తిరుగుబాట్ల వలన ఆహార లభ్యత దెబ్బ తిన్నదనే వివరణ చెల్లదు. ఇక రెండో విషయం: ఈ యుద్ధాలు, లేక తిరుగుబాట్లు దాదాపు మూడో ప్రపంచ దేశాలన్నింటా జరిగాయి. కాని కొన్ని దేశాలు మాత్రమే కరువు ముంగిట నిలవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది?
దీనికి సరైన సమాధానం ఒక్కటే. కొన్ని దేశాలు సామ్రాజ్యవాదుల డిమాండ్లకు తలొగ్గి తమ ఆహార భద్రతను బలి చేశాయి. వలస దేశాలుగా ఉన్న కాలంలో చాలా మూడో ప్రపంచ దేశాల్లో తలసరి ఆహార లభ్యత చాలా ఎక్కువగా పడిపోయింది. దాని వలన ఆ దేశాల్లో ఆ కాలంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వలస పాలన నుండి విముక్తి సాధించాక వాటిలో చాలా దేశాలు తమ దేశీయ ఆహార ధాన్య ఉత్పత్తిని పెంచడానికి పూనుకున్నాయి. వలసాధిపత్యం నుండి బైట పడడం అంటే అందులో ఆహార స్వయంసమృద్ధి సాధించడం ఒక ప్రధాన అంశంగా ఉన్నది. కాని ఈ ప్రయత్నాన్ని సామ్రాజ్యవాద దేశాలు అడ్డుకున్నాయి. ఆహార స్వయం సమృద్ధి అన్న భావనే సరైనది కాదని, ప్రపంచం అంతా ఒకటే మార్కెట్‌గా ఉన్నప్పుడు చౌకగా లభించే చోట నుండి ఆహారధాన్యాలను కొనుక్కునే వీలు ఉన్నదని, ఆ అవకాశాన్ని వదులుకుని స్వంతంగా పండించుకోవాలనే తాపత్రయం ఎందుకని సామ్రాజ్యవాదం వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎజెండాలో ఇదొక అంశంగా సామ్రాజ్యవాదం జొప్పించగలిగింది. ఆహార స్వయం సమృద్ధి లక్ష్యంగా ఉండేదానికన్నా ప్రపంచ మార్కెట్లో వేటికి ఎక్కువ గిట్టుబాటు అవుతుందో ఆ పంటలను పండించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని డబ్ల్యుటీఓ చెపుతుంది.
ఇప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలు కొన్ని రకాల ఆహారధాన్యాలను ఎప్పుడూ తమ దేశీయ అవసరాలకు మించి ఎక్కువగా పండిస్తూంటాయి. వాటి వద్ద ఆ ధాన్యాలు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. అయితే ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పండే పంటలు చాలా వరకు ఈ సంపన్న దేశాల్లో పండవు. తాజా కూరగాయలు, పళ్ళు, జనుము, పత్తి వంటి పీచు పంటలు, చెరకు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు వంటివి అక్కడ పండవు. మూడో ప్రపంచ దేశాల్లో అధిక భాగం ఈ ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాలలో ఉన్నాయి. ఆ దేశాల్లో భూ వినియోగాన్ని తమకు అనుకూలంగా మార్చగలిగితే, అది రెండు విధాలుగా సంపన్న పశ్చిమ దేశాలకు లాభదాయకం అవుతుంది. తమ వద్దనున్న మిగులు ధాన్యపు నిల్వలను ఆ మూడో ప్రపంచ దేశాలకు అంటగట్టవచ్చు. తమకు అవసరమైన పంటలను ఆ మూడో ప్రపంచ దేశాల్లో పండించేటట్టు చేయడం ద్వారా తమ అవసరాలను తీర్చుకోవచ్చు (ఆ పంటల్లో బయో ఇంధనానికి ఉపయోగించే మొక్కజొన్న వంటివి కూడా ఉన్నాయి).
తక్కిన మూడో ప్రపంచ దేశాల కన్నా ఆఫ్రికా దేశాలు సామ్రాజ్యవాదుల వత్తిడికి ముందుగా తలొగ్గాయి. అందుకనే తక్కిన ప్రపంచంలో కన్నా ఆఫ్రికాలోనే ఎక్కువ దేశాలు కరువు ముంగిట్లో ఉండే దేశాల జాబితాలోకి చేరాయి. వాటిలో నుంచి కేవలం రెండే రెండు దేశాల ఉదాహరణలను చూద్దాం. ఒకటి నైజీరియా. ఆఫ్రికాలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న దేశం ఇది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. రెండోది కెన్యా. నయా ఉదారవాద విధానాలు అత్యంత జయప్రదంగా అమలు చేసిన దేశంగా కెన్యా గురించి సంపన్న పశ్చిమ దేశాలు నిన్నమొన్నటి దాకా పొగుడుతూ వచ్చాయి.
ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ) అందించిన గణాంకాలను బట్టి 1990లో నైజీరియా తలసరి తిండిగింజల ఉత్పత్తి 129.37 ఉండేది కాస్తా 2019 నాటికి 101.09కి పడిపోయింది. మూడే మూడు దశాబ్దాల లోపల 20శాతం కన్నా అధికంగా పడిపోయింది. కెన్యాలో కూడా ఇదే కాలంలో తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి 132.82, ఉండి 107.97కి పడిపోయింది. 1980లోనైతే కెన్యా తలసరి ఉత్పత్తి 155.96 ఉండేది. అంటే నాలుగు దశాబ్దాల వ్యవధిలో ముప్పై శాతానికి మించి పడిపోయింది! ఇంత గణనీయంగా దేశీయ ఉత్పత్తి తగ్గిపోతే ఇక దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆ దేశాలు కరువు ముంగిట నిలబడివుండే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రపంచ మార్కెట్లో తక్కువ ధరలకే దొరికేటప్పుడు దేశీయంగా ఎందుకు పండించడం అన్న సామ్రాజ్యవాదుల వాదన ఎంత బూటకమో దీనిని బట్టే స్పష్టం అవుతోంది. కొన్ని దేశాలు అన్ని రకాల పంటలనూ పండించలేనప్పుడు ప్రపంచ మార్కెట్లో పోటీ అన్నది అర్థం లేనిది. అన్ని దేశాలూ అన్ని రకాల పంటలనూ పండించి, తమకు అవసరం లేని వాటిని చౌకగా ఎగుమతి చేసి, కావలసినవాటిని దిగుమతి చేసుకున్నప్పుడు మార్కెట్ సూత్రం వర్తిస్తుంది. కాని కొన్ని దేశాల దగ్గర పెట్టుబడి అధికంగా పోగుబడినప్పుడు, మరికొన్ని దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయినప్పుడు సమన్యాయం వర్తించదు. అటువంటప్పుడు కీలకమైన తిండిగింజల విషయంలో దిగుమతుల మీద ఆధారపడవలసిన పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఏ దేశానికైనా ఆత్మహత్యా సదృశమే అవుతుంది.
వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన ప్రతీ దేశంలోనూ ఈ సత్యాన్ని అవగతం చేసుకున్నారు. దేశం స్వతంత్రంగా మనగలగడం అంటే ఆహార స్వయం సమృద్ధి అని నిర్థారించుకున్నారు. దానర్థం దేశంలో ప్రతీ ఒక్కరికీ సరిపడా తిండి లభించే స్థితి కోసం ప్రయత్నించారని కాదు. కాని కనీస స్థాయి వినియోగాన్ని గ్యారంటీ చేసేందుకు ప్రయత్నించారు. సామ్రాజ్యవాదుపై ఆధారపడకుండా మూడో ప్రపంచ దేశాలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఆహార స్వయం సమృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకున్నాయి. ఈ విధానాన్ని తొలుత ఆఫ్రికా దేశాలు విడనాడాయి. సామ్రాజ్యవాద ఒత్తిడులకు తలొగ్గాయి. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటున్నాయి. కరువు ముంగిట్లో నిలబడివున్నాయి.
భారతదేశం స్వతంత్రం వచ్చిన తొలిదినాల్లో ''గ్రో మోర్ ఫుడ్'' నినాదాన్ని చేపట్టి దేశీయంగా ఆహారోత్పత్తిని పెంచాలని ప్రచారం చేపట్టింది. కాని అమెరికా వలలో పడి పి.ఎల్-480 పథకం కింద అమెరికా నుండి ఆహారధాన్యాలను కొనుగోలు చేయడం మొదలుబెట్టింది. ఎప్పుడైతే 1960 దశకంలో సంభవించిన కరువు కాటకాల కాలంలో ఈ స్కీము అక్కరకు రాలేదో, అప్పుడే మన ప్రభుత్వానికి జ్ఞానోదయం అయింది. ఆహార స్వయంసమృద్ధి ప్రాధాన్యత బోధపడింది. ఆ తర్వాత హరిత విప్లవం చేపట్టింది. ఆ హరిత విప్లవం తన లక్ష్యాలను సంపూర్ణంగా నెరవేర్చిందని చెప్పలేం కాని ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మన కాళ్ళ మీద మనం నిలబడగల పరిస్థితి ఏర్పడింది. కాని సామ్రాజ్యవాదులు మాత్రం మన ఆహార స్వయంసమృద్ధిని దెబ్బ తీయడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలకు మోడీ ప్రభుత్వం ఊతం ఇచ్చినట్టు వ్యవహరించింది. నల్ల వ్యవసాయ చట్టాలను జారీ చేసింది. కనీస మద్దతు ధర వ్యవస్థను రద్దు చేయడానికి సిద్ధమైంది. మన దేశ ఆహార భద్రతకి ఈ కనీస మద్దతు ధర అనేది చాలా కీలకమైనది. దేశ రైతాంగం సాహసోపేతంగా సాగించిన పోరాటం ప్రస్తుతానికి మనల్ని కాపాడింది. ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. ప్రస్తుతానికి మన ఆహార భద్రత నిలబడింది. కాని అది అంతర్ధానం కాకుండా ఉండాలంటే ప్రజానీకం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)