Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అందరి కాళ్ళు పట్టుకున్నాను. అయినా అందరూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఎవ్వరూ నాభర్త ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ సమాజంపై ఉమ్మేయ్యాలి. వీళ్లంతా మనుషులుకారు కుక్కలు'' అంటూ ఆశ్రీన్ కట్టలు తెంచుకున్న ఆవేదనతో మాట్లాడుతుంటే హృదయం రోధించింది.
బుధవారం రాత్రి హైదరాబాద్ నగర నడిబొడ్డున సరూర్‌నగర్‌లో మతాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె భర్త నాగరాజు అనే దళిత యువకుడిపై ఆమె సోదరుడు మరికొంతమంది బంధువులు కిరాతకంగా తన కండ్లముందే నరికి చంపారు. తమ మతాలు వేరైనా ఆశ్రీన్ సుల్తానా నాగరాజు తమ కాలేజి రోజుల్లో నుండి ప్రేమించుకొని జనవరి 31న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. తమకు ఆశ్రీన్ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని వికారాబాద్, బాలానగర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ పోలీసులు వారిని పిలిచి కనీస కౌన్సిలింగ్ గానీ, కేసు నమోదుగానీ చేయకపోవడంతో హంతకులు రెచ్చిపోయి ఈ ఘతుకానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంటకు రక్షణ కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఈ దారుణ హత్యను మనిషైన ప్రతీ ఒక్కరూ తప్పక ఖండించాలి. అయితే, ఒక ఉన్మాద హత్యను మతంతో చూడాలా? మానవీయతతో చూడాలా? అనేది నేడు మనముందున్న ప్రశ్న. నాగరాజు హత్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఖండించారు. వారు ఖండించడం తప్పు కాదు. కానీ ఈ ఘటనను కూడా తమ మత విద్వేషాలకు వాడుకోవాడమే అమానవీయం. హంతకులు ఏ మతస్తులైనా దండించాల్సిందే. బాధితులు ఏ కులస్తులైనా అండనివ్వాల్సిందే. కానీ బీజేపీ నేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడమే దారుణం. హంతకులు ముస్లింలు కాబట్టి రెచ్చిపోతున్న వీరు రాష్ట్రంలో జరిగిన అన్ని కుల దురహంకార హత్యలను ఎందుకు ఖండించలేదు..!? నాగరాజు హంతకులను శిక్షించాల్సిందే. కానీ బీజేపీ వారి స్పందన అన్ని సందర్భాలో ఇలా ఎందుకులేదు.
రాష్ట్రంలో 70కి పైగా కుల దురహంకార హత్యలు జరిగితే బీజేపీ ఖండిస్తూ ఏనాడూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇటీవల భువనగిరిలో రామకృష్ణగౌడ్‌ను 10లక్షలు సుఫారీ ఇచ్చి చంపిస్తే బండి సంజరు ఒక్కమాట మాట్లాడలేదు. మంథని మధుకర్, ఆంబోజి, నరేష్, ప్రణరు, హేమంత్ వంటి యువకులు ఈ దూరహంకార హత్యలకు బలైనప్పుడు బీజేపీ నేతలు ఎవరూ నోరు విప్పలేదు. ఒక హిందువు మరో హిందువును చంపితే బీజేపీ సమర్థిస్తుందా? హంతకులు ముస్లింలు అయినప్పుడు మాత్రమే స్పందిస్తుందా..? మనుషుల హత్యలని మానవత్వంతో చూడాలి తప్ప మతంతో కాదని గ్రహించలేరా? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో అబంగపట్నం అనే గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్‌రెడ్డి చాలా అమానుషంగా ఇద్దరు దళిత యువకులను ముక్కునేలకు రాపించి మురుగునీటిలో ముంచితే అతన్ని ఎందుకు బహిష్కరించలేదు. పైగా తగుదునమ్మా అంటూ దళితులపై ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన భరత్‌రెడ్డి జైలు నుండి విడుదలై బయటకు వస్తుంటే గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పెద్ద పెద్ద పూలదండలతో ఊరేగింపుచేసారు. దళితులను అవమానించిన వారికి వీరు ఎంతటి అరుదైన గౌరవమిస్తారనడానికి ఇంతకంటే ఉదాహరణేం కావాలి?
ఇటీవల హైదరాబాద్ నగర నడిబొడ్డున మల్కాజ్గిరి హిందూ గుడిలో పూజ కోసం దేవుని వద్దకు వచ్చిన ఓ భక్తురాలిని గుడి పూజారి అత్యంత కిరాతకంగా గుడిలోనే దారుణంగా హత్య చేస్తే.. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ ఎందుకు స్పందించ లేదు. సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో బీజేపీ నేతల ప్రోద్బలంతో అర్థరాత్రి పెత్తం దారులు దళితవాడపై పడి దాడి చేసినప్పుడు బీజేపీ ఎందుకు ఖండించలేదు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యంత అమానుషంగా దళితులు, మహిళలు మైనార్టీలపై రోజువారిగా దారుణ హింస జరుగుతుంటే వాటిని నివారించడానికి బీజేపీ తీసుకున్న చర్యలేమిటి? యూపీ హత్రాస్‌లో మనీషా వాల్మీకి అనే దళిత యువతిని అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి నాలుక కోసి, నడుములు విరిచి చంపేస్తే కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా చేసిన నీచత్వాన్ని బీజేపీ ఎలా సమర్థించుకుంటుంది? గుజరాత్ రాష్ట్రం ఊనా పట్టణంలో ఆవు చర్మం వలుస్తున్నారనే నెపంతో ఐదుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి తమ కార్లకు కట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన అమానవీయ చర్యను దేశం మరిచిపోతుందా? గుజరాత్ రాష్ట్రంలో దళిత యువకుడు ప్రదీప్రాథోడ్ గుర్రం ఎక్కాడని కిందపడేసి కొట్టి చంపిన ఉదంతాన్ని ఎలా మర్చిపోగలం? చావులోను విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం వీరికి అలవాటైన విద్యేగానీ, నాగరిక సమాజం అంగీకరిస్తుందా?
కులమత దూరహంకార హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా హత్య చేసిన నిందితులను కాపాడే పనిలో అధికార పార్టీ నేతలు ఉంటున్నారు. కులాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయకుండా, పోలీసు స్టేషన్లన్నీ రక్షణ కేంద్రాలుగా మారకుండా, పౌరసమాజం ప్రేమ పెళ్లిళ్లను సామాజిక బాధ్యతగా ప్రోత్సహించకుండా వీటిని ఎలా అరికట్టగలం? వరుస కులదురహంకార హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏ ఒక్క నాడు వీటిపై ఎందుకు నోరు విప్పరు? ఈ నాగరాజు అమానుష హత్యతోనైన ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రక్షణ చట్టం చేయాలి. పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పెళ్లి చేయడం, రిజిస్ట్రేషన్ చేయించడం వంటి ప్రత్యేక పనులు జరగాలి. అప్పుడే మనం మరో నాగరాజు బలికాకుండా చూడగలం. నాగరాజును హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి. ఆయన భార్య ఆశ్రీన్ సుల్తానాను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. యుక్తవయస్సులో ఉన్న ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం, నాగరాజు కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియో, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి.
పెరియార్ మాటల్లో చెప్పాలంటే ఉన్మాదం తలకెక్కిన ఎవ్వడికైనా మెదడులోని బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుంది. సరిగ్గా కుల మత ఉన్మాదులు అలానే వ్యవహరిస్తున్నారు. ఈ ఉన్మాద హత్యలను కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో చైతన్య వంతమైన యువతరం మొదళ్ళను కలుషితం చేయడానికి ఓ వైపు బీజేప,ీ ఆర్.ఎస్.ఎస్ శక్తులు విద్వేషాలను రెచ్చగొడుతుంటే మరోవైపున ఎంఐఎం మరికొన్ని ముస్లిం మతోన్మాద శక్తులు దానికి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం రెచ్చగొట్టి ప్రజల్లో చిచ్చులు పెట్టి తమ ఓటు బ్యాంకు పదిలం చేసుకోనే కుట్రలు చేస్తున్నారు. యువతరం ఈ మతోన్మాద శక్తులను ఐక్యంగా ప్రతిఘటించాలి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్మాదాన్ని ఖండిస్తూనే విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై యువతరం ఒక కన్నేసి ఉంచాలి.
- టి. స్కైలాబ్‌బాబు
సెల్:9177549646