Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆకాశం అంటుకొనే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు, అవినీతి, బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు'' అని ప్రశ్నించారు మహాకవి శ్రీశ్రీ. దేశం ఆర్థికంగా దిగజారుతోంది ధరలు పైకి ఎగబాకుతున్నాయని చెప్పడానికి గుదిబండగా మారిన గ్యాస్ బండ ఒక ఉదాహరణ. వంటింట్లో గ్యాస్ ధర మంట పెడుతోంది. ఇప్పటికే ఆన్ టైం హై రికార్డులను తాకిన ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సిలిండర్ ధరల పెంపు సామాన్యుల కష్టాలను మరింత పెంచుతోంది.
గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి చేరింది. మరోవైపు, ఈ నెల ప్రారంభంలో, వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను కూడా పెంచారు. మే 1న 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర రూ.2355.50కి, అలాగే 5కిలోల ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధరను రూ.655కి పెంచారు. ఇలా వరుసగా పెట్రో, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలను పెంచుతూ పాలకులు సామాన్యులను ఆందోళనలోకి నెడుతున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 2014 మార్చి 1వ తేదీ నాడు సిలెండర్ ధర రూ.416 ఉండేది. ఇప్పుడు అది రూ.1050కు చేరింది. లోలోపల మగ్గిపోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం సగటు మనిషికి లేదు. ఎదిరించే తెగువ విపక్షాలకు లేదు. తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత పాలకులకు లేదు. డీజిల్, పెట్రోలు ధరలు కూడా ఇదే తీరున దాదాపు రెట్టింపుకు ఎగబాకాయి. కరోనా కష్టాలు, ఉపాధి లేమికి తోడు నిత్యవసర ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటే తట్టుకునే శక్తిని సగటు భారతీయుడు కోల్పోతున్నాడు. పన్నుల ప్రభావం వల్ల రాష్ట్రాల మధ్య ధరల్లో వ్యత్యాసం ఉన్నా ప్రభుత్వ విధానాలలో పెద్దగా తేడా ఏమీ లేదు. తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఎక్కడా చూసినా ప్రజాకంటకమే రాజ్యమేలుతోంది. పన్నుల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రాలపై కేంద్రం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప, ధరల నియంత్రణకు, సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. పాలనా కాలమంతా రాజకీయాలకే అంకితం చేస్తున్నారు. అదేమంటే కరోనా కాలంలో, ఆహార ధాన్యాలు, ఉచిత సరుకులు అందజేస్తూ, కోవిడ్ కట్టడికై వ్యాక్సిన్లు, ఆరోగ్య పరమైన మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ప్రజల కొరకే వెచ్చిస్తున్నామని కేంద్రం అంటోంది. అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా సహాయం అందట్లేదని రాష్ట్రాలు దెప్పిపొడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదింపులే లేవు. ఆ మాటకొస్తే దేశంలో ఫెడరల్ స్ఫూర్తి కనుమరుగై చాలా కాలమైంది. పైగా ప్రభుత్వాలన్నీ పన్నుల రూపంలో ఆదాయాన్ని పెంచుకోవడంలో పోటీపడుతున్నాయి. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఆడబిడ్డల కంట కన్నీరు రాకుండా అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం కోసమే ''ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని'' తీసుకొచ్చామని గొప్పలు చెబుతూ వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం... ఆడబిడ్డల నెత్తిన గ్యాస్ బండ రూపంలో మరింత గుదిబండను మోపి కన్నీరు పెట్టిస్తోంది. పైగా ప్రజలకు దక్కాల్సిన సబ్సిడీలకు కోతలు విధిస్తూ సామాన్యుల జీవితాల్లో మంటలు రేపుతుంది. ప్రజలకు ఇచ్చే రాయితీలో భారీగా కోతలు కోస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఖజానాపై సబ్సిడీ భారాన్ని భారీగా తగ్గించేసుకుంటోంది. ఉదాహరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీకి రూ.29,627 కోట్లు ఇవ్వగా 2020-21కు వచ్చేసరికి దానిని 25,520 కోట్లకు తగ్గించేసింది. ఇక 2021-22లో ఈ మొత్తం 12,480 కోట్ల రూపాయలకు పడిపోయింది. 2022-23లో ఇది కాస్తా కేవలం రూ.5,813 కోట్లు మాత్రం గానే ఉంది. అంటే కేవలం నాలుగేండ్లలోనే గ్యాస్ సబ్సిడీపై కేంద్రం రూ.25 వేల కోట్లు భారాన్ని తగ్గించేసుకుందన్న మాట. అంతేనా కరోనా రాక ముందు వరకూ సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. కానీ 2020 మే నుంచి ఆ విధానానికీ స్వస్తి పలికింది.
ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1000లు దాటిపోగా రాయితీ మాత్రం రూ.40లే ఇస్తోంది. అంటే వంట గ్యాస్ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మంగళం పాడినట్లే. ఓ వైపు ధరలు భారీగా పెంచేస్తూ మరోవైపు రాయితీనీ ఎత్తేస్తుండడంతో సామాన్యులు విలవిల్లాడి పోతున్నారు. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు ఇచ్చిన పేదల పరిస్థితి మరీ దారుణం. దేశంలో ఉజ్వల పథకం లబ్ధిదారులు 8కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది మరో కోటి మందికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని ప్రకటించింది. అయితే సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోతుండడంతో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.2కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు గ్యాస్‌ను రీఫిల్ చేయించుకోలేదని ప్రభుత్వమే వెల్లడించింది. ఇక ఎల్పీజీ ధరలు ఎందుకు పెంచుతున్నారన్న దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధామే ఇవ్వలేదు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్లే చమురు సంస్థలు గ్యాస్ ధరలను పెంచుతున్నాయని ప్రకటించినా అందులోనూ వాస్తవం లేదు. 2014-21 మధ్య కాలంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధర 31శాతం తగ్గగా అదే కాలంలో రిటైల్ ఎల్పీజీ ధర 110శాతం పెరిగింది. గతంలో విధానాల కారణంగా లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా, లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోనే రాయితీ మొత్తం జమవుతుందని, దాంతో అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వాలు చెప్పాయి. కానీ నగదు బదిలీ విధానంలో లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీనే భారీగా తగ్గిస్తుండటం ఆశ్చర్యకరం. ఉదాహరణకు గతంలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ మొత్తం కూడా పెరిగేది. ఆ మేరకు లబ్ధిదారుడికి నేరుగా లబ్ధి చేకూరేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే సబ్సిడీని తెగ్గోసేస్తోంది. దీని వల్ల నగదు బదిలీ అయినా, మరో విధానం అయినా లబ్ధిదారుడికి ఉపయోగం ఏమీ ఉండదు.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140