Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐపీఓ అనగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఏదైనా ఒక కంపెనీ మూలధన సేకరణ కోసం తన వాటాలను స్టాక్ మార్కెట్ ద్వారా వివిధ రకాల వాటాదారులకు మొదటిసారి వాటాలను అమ్మడానికి చేసే ప్రయత్నాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఈ ఐపీఓ ద్వారా సదరు కంపెనీ ముందుగానే నిర్ణయించుకున్నంతమేరకు మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ దగ్గర మొత్తం ఎన్ని వాటాలు ఉన్నాయో, అందులో ఎన్ని వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలి అనుకుంటుందో, అట్టి వాటాలను ఏ రకమైన నిష్పత్తిలో రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టర్లు, ఇతరులందరికీ అందజేయనున్నారో సదరు వివరాలన్నీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబి) రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా సమర్పించి అనుమతి పొందవలసి ఉంటుంది.
ఏ కంపెనీ అయినా వాటాల విక్రయానికి స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ స్టాక్ మార్కెట్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియమనిబంధనల ప్రకారం పనిచేస్తోంది. ఎల్ఐసీ 632.5 కోట్ల వాటాలను కలిగి ఉన్నది. ఇందులో 3.5శాతం అనగా 22.1 కోట్ల వాటాలను అమ్మనున్నది. దీని ద్వారా 21వేల కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యవసానంగా ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఏకైక యజమానిగా ఉన్న సంస్థ ఇకనుండి కేంద్ర ప్రభుత్వంతో పాటు వాటాదారులు అందరూ కూడా యాజమాన్యంలోకి వస్తారు.
ఎల్ఐసీ ఐపీఓ అనంతరం దాని బిజినెస్ మోడల్‌తో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కూడా మార్పు కాబోతున్నది. మెచ్యూరిటీ విలువ కలిగిన కన్వెన్షనల్ పాలసీలతో పాటు మరణానంతరం మాత్రమే చెల్లించబడే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల అన్నింటిపై లభించే రాబడిని కలిపి పాలసీదారులకు యజమానికి పంపకం జరిగేది. ఇకముందు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై వచ్చే రాబడిని వాటాదారులకు మాత్రమే చెల్లించాలని చట్టంలో మార్పులు చేయడం జరిగింది. ఇన్నాళ్లుగా సంస్థ సంపాదించిన లాభాల్లో ఐదుశాతం యజమాని అనగా ప్రభుత్వానికి, 95శాతం పాలసీదారులకు పంపకం జరిగేది. ఇకనుండి అది 10 నిష్పత్తి 90గా ఉండనున్నది. ఈ రెండు మార్పుల వలన పాలసీదారుల ప్రయోజనాల కన్నా వాటాదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతున్నది. ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయివేటు కంపెనీలన్నీ అమలుపరుస్తున్నవి. సంపాదిస్తున్న లాభాలలో ఎక్కువ మొత్తాన్ని పాలసీదారులకు ఇవ్వవలసిందిగా ప్రయివేటు కంపెనీలకు చెప్పవలసింది పోయి ప్రభుత్వ కంపెనీని బలవంతంగా తమ లాభాల పంపక విధానాన్ని మార్చుకోమనడం గర్హనీయం.
ఈ ఐపీఓ అనంతరం అంతగా లాభాలకు ఆస్కారంలేని అనేక ఆఫీసులను కుదించే ప్రమాదం ఉన్నది. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు బీమా సౌకర్యాన్ని కల్పించాలన్న జాతీయోద్యమ లక్ష్యం దెబ్బతింటుంది. ఈరోజు ప్రయివేటు కంపెనీల సగటు పాలసీ ప్రీమియం 95 వేల రూపాయలు ఉంటే ఎల్ఐసీ సగటు ప్రీమియం 25 వేల రూపాయలు ఉన్నది. అనగా తక్కువ ప్రీమియం చెల్లించే తక్కువ ఆదాయం గల వారికి అత్యంత చేరువలో ఎల్ఐసీ మాత్రమే ఉన్నది. సగటు ప్రీమియం ఎక్కువగా ఉన్న చోట లాభాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అందుచేత ఎల్ఐసీ యొక్క బిజినెస్ మోడల్ లాభాపేక్ష వైపు మరల్చే ప్రక్రియలో తక్కువ ఆదాయం గల వారిని విస్మరించే ప్రమాదం కూడా ఉన్నది. మైక్రో ఇన్సూరెన్స్ పేరుమీద నిరుపేదలైన స్వయం సహాయక బృందాలన్నింటికీ కూడా నామమాత్రపు ప్రీమియంకి బీమా సౌకర్యాన్ని ఎల్ఐసీ మాత్రమే కల్పిస్తున్నది. గత 65 ఏండ్లుగా, ఎల్ఐసీ సేకరించిన పొదుపు నంతా ఎక్కువ శాతం మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా ఇస్తూ వచ్చింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూర్చి పెట్టింది ఎల్ఐసీ. రోడ్లు, రవాణా, విద్యుత్తు ప్రాజెక్టులు, మున్సిపాలిటీల మెయింటెనెన్స్‌ల వంటి వాటన్నిటికీ ఎల్ఐసీ నిధులను సమ కూర్చింది. వాటాదారుల క్షేమమే ప్రధానమైనప్పుడు మైక్రో ఇన్సూరెన్స్‌లు మౌలిక వసతుల కల్పనలు మరుగునపడి పోవలసిందే.
జీవిత బీమా అనేది దీర్ఘకాలిక కాంట్రాక్టు. అది నమ్మకం కలిగిన సంస్థ చేతిలో ఉంటే మరణానంతరం మిగిలిన వారికి ప్రతిఫలాన్ని కచ్చితంగా చెల్లించే అవకాశం ఉన్నది. ఈ అంశం భారతీయులలో బాగా నాటుకుని ఉండడం వల్లనే ఈ ఇరవై ఏండ్ల ప్రయివేటు బీమా కంపెనీల ఆగమనం అనంతర కాలంలోనూ ఎల్ఐసీ 75శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నది. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐని 49శాతానికి పెంచుతూ 2015లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క ప్రయివేటు కంపెనీ కొత్తగా నమోదు కాలేదు. దీనర్థం ప్రయివేటు కంపెనీలను భారత ప్రజానీకం నమ్మే పరిస్థితిలో లేదు. జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఐపీఓకి వెళ్ళిన రెండు కంపెనీలలోని వాటాల రేట్లు తక్కువస్థాయిలోనే ఉన్నవి. బీమా రంగం నిరంతర ఒడిదుడుకులను చవిచూడలేదు కాబట్టి ఈ పరిస్థితి నెల కొన్నది. అందువలన ఎల్ఐసీలో ఐపీఓను వ్యతిరేకిం చడం, సంస్థను అత్యంత ఘనంగా ఆదరించడమే ఈ ప్రయివేటీకరణ విధానాన్ని తిప్పికొట్టే వజ్రాయుధం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016