Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరకట్నం.. వేధింపులు.. కుటుంబ, వివాహ సమస్యలు.. గృహహింస.. కారణమేదైనా ఇల్లాలు ఆత్మస్థైర్యం కోల్పోతోంది. బలవన్మరణాన్ని ఆశ్రయి స్తోంది. ప్రతి 25నిమిషాలకు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుంటోంది. ఇది సమాజం సిగ్గుతో తలదించు కోవాల్సిన విషయం. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ విడుదల చేసిన గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రత మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య లకు పాల్పడే మహిళల్లో దాదాపు 40శాతం మంది భారతీయులే.
రోజుకు 61 మంది..
ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం భారతదేశంలో 2020లో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 50శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇంకా వీరిలో 14.6శాతం మంది అంటే 22,372మంది గృహిణులే ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే సగటున రోజుకు 61మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ప్రతి 25 నిమిషాలకు ఒక ఇల్లాలు బలవన్మరణాన్ని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రధానంగా మూడే కారణాలు..
సాధారణంగా ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నా గృహిణుల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడే కారణాలు మనకు కనిపిస్తాయి.. మొదటిది గృహహింస. 30శాతం మంది మహిళలు గృహహింసకు గురవు తున్నారని, పెళ్లి తర్వాత రోజువారీ ఇంటి చాకిరీ, అణచివేతకు గురవుతూ అత్తవారింటి జీవితంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. గృహహింసవల్ల మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
రెండోది వరకట్నం. గృహిణుల ఆత్మహత్యల్లో సగానికిపైగా వరకట్న వేధింపులతోనే జరుగు తున్నాయని తెలుస్తోంది. 1930 కంటే ముందు దేశంలో జరిగిన వివాహాల్లో కేవలం 40శాతం వివాహాల్లో మాత్రమే వరకట్న వ్యవహారాలు ఉండగా, 2000 తర్వాత ఈ సంఖ్య 90శాతానికి చేరుకుంది.
మూడో ప్రధాన కారణం ఆర్థికంగా పూర్తిస్థాయిలో భర్తలపై ఆధారపడి ఉండడం. దీని వల్ల నిరాశ, నిస్సహాయత, డిప్రెషన్ పెరిగిపోతుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. అంతేకాకుండా ప్రతి ఏడాది ఇది ఇంకా తగ్గుతూనే ఉంది. 'ఇంటి పనుల్లో బిజీగా ఉండడం వల్ల బయట ఇతర పనులు చేయలేమని, ఇంటి పనులు చేయడానికి ఇతరులు ఎవరూ సిద్ధంగా కూడా ఉండరు' అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 64శాతం మహిళలు అభిప్రాయపడ్డారు. అంటే శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెల్లింపులే లేని ఇంటి పని కోసం ప్రతి మహిళ ప్రతి రోజు ఐదుగంటలు తన సమయాన్ని కేటాయిస్తుంది. ఇంకా ప్రతి రోజు రెండున్నర గంటలు పిల్లలు, భర్త సంరక్షణ సేవలకు సమయాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు సొంత సంపాదన లేకపోవడంతో సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. వాళ్లు తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోలేకపోతున్నారు. మహిళలు ఆర్థికం గా ఇతరులపై ఆధారపడటం వలన వారు తమ డిప్రెషన్, ఆందోళనను తగ్గించు కోవడానికి, వివిధ మానసిక, ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడానికి వెనుకాడు తున్నారు. దీని వల్ల కూడా ఆత్మహత్యల శాతం పెరిగిపోతున్నట్లు సైక్రియాటిస్టులు చెబుతున్నారు.
నివారణ మార్గాలివీ..
ముందుగా ప్రభుత్వం డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలను నివారించే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే సమస్యను కొంత నివారించవచ్చు. అయితే సమస్యే ఉత్పన్నం కాకుండా మూల కారణాలను వెతికి పట్టుకొని నివారణ మార్గాలను కూడా అన్వేషించవచ్చు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారా కూడా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశముంది. దీని కోసం మహిళల ఉపాధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పురుషులు, మహిళలు ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచన విధానాల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరముంది. 2018లో ఆక్స్‌ఫామ్ ఇండియా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓ సర్వే నిర్వహించింది. పిల్లల సంరక్షణ బాధ్యతలను సరిగా నిర్వహించకపోతే మహిళలను కొట్టడం ఆమోదయోగ్యమేనని 33శాతం మంది చెప్పారు. కుటుంబానికి చెందిన పురుషులకు సరైన ఆహారాన్ని అందించకపోతే కొట్టవచ్చని 41శాతం మంది అభిప్రాయ పడ్డారు. దీని ద్వారా మనం ప్రజల ఆలోచనా విధానాన్ని అంచనా వేయవచ్చు. మహిళలు, ముఖ్యంగా గృహిణుల ఆత్మహత్యలను నివారించా లంటే ప్రజల వైఖరిలో, ముఖ్యంగా మగవాళ్ల వైఖరిలో మార్పు రావాల్సిన అవ సరం చాలా ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే ఫలితం వస్తుంది.
సెల్:9640466464
- ఫిరోజ్ ఖాన్