Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రణాళికబద్ధంగా వ్యవసాయరంగాన్ని అభివృద్ధిచేసి దేశంలోనే రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలబెడుతున్నామనీ, 2014 జూన్ నుంచి ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం పదే పదే చెపుతున్నది. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ విధానాన్నే తూచా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. జూన్-జూలైలో యాక్షన్‌ప్లాన్‌తోపాటు వ్యవసాయ రుణ ప్రణాళిక రూపొంది స్తున్నారు. ఈ ప్రణాళికలు అవసరాలను బట్టి కాకుండా గత సంవత్సరంపై కొద్దోగొప్ప పెంచి ప్రణాళిక రచన సాగుతున్నది. విత్తనాలు, ఎరువులు, రుణాలు తదితర అంశాలపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు. అధికారులకు ఉన్న అవగాహన మేరకు యాక్షన్‌ప్లాన్‌లో తెలియజేస్తారు. వానాకాలం-యాసంగి పంటలకు సంబంధించి ఉజ్జాయింపుగా అంకెలు వేస్తున్నారు. దేని ఆధారంగా లక్ష్యాలు నిర్ణయిస్తారో కూడా తెలియదు. ప్రణాళిక లేకుండా వ్యవసాయాన్ని కొనసాగించడంతో రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులతోపాటు అయోమయానికి గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అందువల్ల రాష్ట్ర వ్యవసాయరంగానికి శాస్త్రీయ ప్రణాళికను చేర్చి, అందుకు అనుగుణంగా కార్యక్రమాల నిర్వహణ కొనసాగాలి. ఉదాహరణకు 2021-22 వానాకాలం రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 140,12,444 ఎకరాలు లక్ష్యంగా ప్రకటించారు. కానీ వాస్తవంగా సాగైంది 129,68,933 ఎకరాలు మాత్రమే. దాదాపు 10,43,513 ఎకరాలు తక్కువ సాగైంది. లక్ష్యంలో ఇంత పెద్ద మొత్తం ఎలా తగ్గుతుంది?
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళిక ఉందా? లేక నామమాత్రంగా అధికారులు రాసిన యాక్షన్‌ప్లాన్‌ను మంత్రులు అంగీకరిస్తున్నారా? వ్యవసాయ అనుబంధ మంత్రులకు (వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్‌శాఖ, ప్రకృతి వైపరీత్యాల శాఖ, వ్యవసాయ రుణశాఖ) సమన్వయం లేక ఎవరికి తోచినట్టు వారు విధానాన్ని రూపొందించుకుంటున్నారు. దీంతో రైతులు మార్కెట్లో ఏ విత్తనాలు అందుబాటులో ఉంటే ఆ పంటలు సాగుచేసే దుస్థితి ఎదురవుతున్నది.
ఒక దశలో స్వయంగా సర్కారు మొక్కజొన్న, కందులు విస్తారంగా వేయాలని ప్రకటించింది. ఆ మాటలు నమ్మి రైతులు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నలు, ఏడు లక్షల ఎకరాల్లో కందులు వేశారు. కానీ వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మరో దశలో పత్తి పంటను సాగు చేయాలని సీఎం ప్రోత్సహించారు. దానితో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. కానీ ఆ సంవత్సరం మార్కెట్లో పత్తి కొనుగోళ్ళు సాగనేలేదు. కనీస మద్దతు ధరలకు కూడ కొనుగోలు చేయలేదు. ఈ మూడు సందర్భాలలో రైతులు కనీస మద్దతు ధరలు లభించక దివాళా తీశారు.
వర్షాలు బాగా పడడం వల్లగానీ, ప్రాజెక్టుల నుంచి నీరు రావడం వల్ల గానీ మాగాణి విస్తీర్ణం బాగా పెరిగింది. 26 లక్షల ఎకరాల నుంచి 48 లక్షల ఎకరాలకు వరి విస్తీర్ణం చేరింది. దీంతో ఆ పంట దిగుబడులు బాగా వచ్చాయి. 2019లో ఊహించనంతగా 180,56,489 టన్నుల వడ్లు పండాయి. 2020లో మరింత ఎక్కువగా 245,80,972 టన్నుల వడ్లు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తం పండడంతో రాష్ట్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ హయాంలో ఉన్న ఐకేపీ కేంద్రాలను, సహకార సొసైటీలను విస్తారంగా పెంచి 6,750 కొనుగోలు కేంద్రాలను తెరచి వడ్లు కొన్నది. ఈ వడ్లను కస్టమ్ మిల్లింగ్ ద్వారా బియ్యం ఆడించి ఎఫ్‌సీఐ సేకరించింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ఎఫ్‌సీఐకి మధ్యవర్తిగా పని చేసింది. కొన్ని లోపాలు చోటుచేసుకున్నా వడ్ల కొనుగోలులో మాత్రం గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల కొనుగోలుపై ఏర్పడిన తగాదా వల్ల గతంలో కొనుగోలు జరిగిన విధానాన్ని రెండు ప్రభుత్వాలూ అమలుచేయడానికి నిరాకరించాయి. కేంద్రం బాయిల్డ్‌రైస్ కొనుగోలు చేయనని ఒకవైపు చెబితే, రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవనని పంతం పట్టింది. ఆ విధంగా వడ్ల కొనుగోలు స్థంభించిపోయింది. ఒక దశలో ముఖ్యమంత్రి వరి పంట వేయకూడదని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా 36 లక్షల ఎకరాలలో 2021-22 యాసంగి వరి పంట వేయడం జరిగింది. పంట వేసిన తరువాత బీష్మించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరిచి ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. శాస్త్రీయ ప్రణాళిక రూపొందించాలంటే భూసార పరీక్షలు నిర్వహించి, ఏ భూమిలో ఏ పంట పండుతుందో నిర్థారించాలి. అందుకు తగిన విత్తనాలను ఉపకరణాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. కానీ ఈవేమి లేకుండానే వ్యవసాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ప్రణాళిక రూపొందించేటప్పుడు కనీసం వాస్తవ అంకెలనైనా గుర్తించారా? వానాకాలంలో జరిగినట్టే యాసంగిలోనూ అంకెల తప్పులు దొర్లాయి. ఈ తప్పులు ఉద్దేశపూర్వకంగా దొర్లాయా? లేక లక్ష్యమే అలా నిర్ణయించుకున్నారా? నిర్ణయిస్తే ముఖ్యమంత్రి వరి సాగుచేయరాదని చెప్పినప్పుడు, ప్రణాళికలో యాసంగిలో 52.80 లక్షల ఎకరాల వరిసాగును ఎందుకు లక్ష్యంగా పెట్టారు. ఇలా వ్యవసాయశాఖ రైతులను మరింత గందరగోళపరుస్తున్నది. అందువల్లనే రాష్ట్రంలో ఏ పంటలు ఎప్పుడు వేయాలో, ఎంత మోతాదులో వేయాలో? రైతులకు చెప్పగల స్థితిలో వ్యవసాయశాఖ లేదు. రుణ పరపతి కూడా ఎప్పుడిస్తారో? ఎప్పుడు ఇవ్వరో తెలియదు. మరో ప్రధాన విషయం ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్న నష్టం గురించి కనీస అవగాహనా, అంచనా లేదు. ఎంత నష్టం జరిగిందన్న వివరాలనూ సేకరించరు. పంటల నష్టం చివరి గింజ వరకు ఇస్తామంటూ ప్రభుత్వం గంబీర ప్రకటనలు మాత్రం నిరంతరం చేస్తుంది. ఈ మధ్య ముఖ్యమంత్రికి బదులు మంత్రులు వరంగల్ వెళ్ళి నష్టపోయిన రైతులను పరామర్శించి వచ్చారు. నెలగడుస్తున్నా నష్టపోయిన రైతుల ముఖం తిరిగి చూడలేదు. గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు రూ.38వేల కోట్లు నష్టపోగా, పరిహారం అందింది రూ.3,500 కోట్లు మాత్రమే. అది కూడా 14, 15వ పైనాన్స్ కమిషన్ నిధుల నుంచే ఇచ్చారు. 2015-16లో కేంద్రం ఫైనాన్స్ కమిషన్ నిధులకు తోడు అదనంగా రూ.790కోట్లు ఇచ్చింది. అవి మినహా గత ఏనిమిదేండ్లల్లో రాష్ట్రం గానీ, కేంద్రం గానీ, బడ్జెట్ నుంచి ఎలాంటి సహాయం చేయలేదు. నష్టపోయిన కౌలు రైతులు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత సంవత్సరం 12.5లక్షల ఎకరాలు, ఈ సంవత్సరం 8.4లక్షల ఎకరాలు నష్టపోయారు. రాళ్ళ వర్షంతో మరో రూ.1500 కోట్లు నష్టం జరిగింది. ఇన్ని నష్టాలు జరిగిన ప్రణాళికలో ఏనాడూ ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రస్తావించలేదు.
వ్యవసాయ ప్రణాళికను రూపొందించడానికి ఈ చర్యలు అవసరం
1. భూసార పరిక్షలు నిర్వహించాలి. 2. భూసారాన్ని బట్టి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులు అందుబాటులో పెట్టాలి. 3. వ్యవసాయ రుణాలను అందుబాటులోకి ఇవ్వాలి. 4. వ్యవసాయశాఖను గ్రామాల్లో రైతులకు అనుకూలంగా ఉంచాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. 5. ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాలు చెల్లించాలి. 6. మార్కెట్లో రైతులకు అందుబాటులో కమిటీలు పని చేయాలి. కనీస మద్దతు ధరలు అమలు జరపాలి.
సెల్:9490099108
- బి. బసవపున్నయ్య