Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆప్ఘన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న భయానక రోజులు ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. కిక్కిరిసిన విమానాశ్రాయాలు, విమానం వచ్చేవరకు అక్కడే బిక్కుబిక్కుమంటూ రోజులు వెల్లదీసిన ఆఫ్ఘన్లు, ప్రాణాలు పోతాయని తెలిసినా విమాన రెక్కల మీద ప్రయాణం చేసిన పౌరులు, జీవితంలో కలుస్తామో, కలవమో అన్న భయం వెంటాడుతున్నా... బిడ్డలనైనా రక్షించుకోవాలని సరిహద్దుకవతల ముక్కుమొహం తెలియని అపరిచితులకు తమ చిన్నారులను అప్పగించిన తల్లిదండ్రులు.. ఇలా ఎన్నో ఉదంతాలు స్ఫురణకు వస్తాయి. అలా తాలిబన్ల 'కిల్ లిస్ట్'లో ఉన్న ఓ అమ్మాయి అక్కడి నుంచి బలవంతంగా విదేశానికి చేరుకుంది. ఇన్ని నెలల తరువాత తాను పోగొట్టుకున్న జీవితం గురించి... దానికి కారణమైన తాలిబన్లను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది.
ఓ తాలిబన్...
ఇప్పుడు నేను నీ నుంచి చాలా దూరం వచ్చేశాను. నా చుట్టూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. వారిని నేనెప్పుడూ చూడలేదు. అసలు వారు నా దేశం వారే కాదు. నేను ఉంటున్న గది నాలాంటి వారితో పూర్తిగా నిండిపోయి ఉంది. వందలమంది అపరిచితుల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో గది వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. ఆప్ఘన్‌కు ఇక్కడకు వాతావరణంలో చాలా వ్యత్యాసం ఉందని మాత్రం అర్థమైంది. ఇక్కడ రోడ్లు, దుకాణాలు, ఆహారం, సంస్కృతి ఎంత వైవిధ్యంగా ఉంటాయో అన్న ఆలోచనలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి.
నేను ఆప్ఘన్ మహిళను. జర్నలిస్టును. నా ప్రయాణం విజయవంతంగా సాగుతున్న రోజులవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఇప్పుడు నేను వాటన్నింటికీ దూరంగా వందల మైళ్లు ప్రయాణించేశాను. ఇది నేను కోరుకున్నది కాదు. పరిస్థితులు నన్ను బలవంతంగా ఇక్కడకు చేర్చాయి. నేను ఇక్కడికి కొన్ని నెలల క్రితం వచ్చేశాను. ఇక్కడ చాలా అందంగా ఉంది. మేముంటున్న గది కిటికీలోంచి పర్వతాలు, చెట్లు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని నేను నా దేశం వదిలి వచ్చినప్పుడు ఏ దుస్తులనైతే ధరించానో ఇప్పటికీ అవే ధరిస్తున్నాను. నా దుస్తుల నుంచి వచ్చే వాసనను గట్టిగా పీల్చినప్పుడు నా ఇంటి దగ్గరే ఉన్నట్లు భావిస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు ఆ వాసన నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది.
ఆప్ఘన్ దేశం 40ఏండ్లుగా కకావికలమవుతూ ఉంది. నా తల్లిదండ్రులు ఆ బాధను అనుభవిస్తున్నారు. నాకు 24ఏండ్లు. నాకు కూడా ఆ బాధ తెలుసు. ఇక్కడికి వచ్చాక అది మరింతగా అర్థమైంది. 20ఏండ్ల తర్వాత ఆప్ఘన్‌ను మీరు తిరిగి సొంతం చేసుకున్నారు. కాని వేలాది మందిని వారి ఇళ్ల నుంచి తరిమేశారు. నాతో సహా మీ నుంచి వారంతా దూరంగా పారిపోయారు. మీరు మమ్మల్ని వెనక్కి వెళ్లేలా చేశారు. మేము కలలుగన్న జీవితాల నుంచి, మా భవిష్యత్తు నుంచి..
ఇప్పుడు ఆప్ఘన్లో మా విజయాలేమీ లేవు. నాకు చివరగా మిగిలిన ఒకే ఒక్క అవకాశం దేశం విడిచిపెట్టడం. నేను ఇది కోరుకోలేదు. కాని మీరు దాన్ని చేశారు. మీరు గతేడాది విడుదల చేసిన 'కిల్ లిస్ట్'లో నా పేరు ఉంది. మీరు ఏదో ఒక రోజు నా కోసం వస్తారని మా అమ్మ భయపడింది. ఎక్కడైనా నేను సజీవంగా ఉంటే చాలనుకోని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. 'మేము బాగానే ఉంటామ'ని నాకు ధైర్యం చెప్పింది. కాని నేను నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. నా కొత్త జీవితాన్ని నేను మళ్లీ నిర్మించుకోవాలి. కాని ఇక్కడ నేను అచేతనంగా మిగిలిపోయాను. నాలాగే ఎంతోమంది కొత్త జీవితాలను ప్రారంభించాలని ఇంటిని, దేశాన్ని వదిలి వచ్చేశాం. మా దగ్గర అది తప్ప వేరే మార్గం కూడా లేదు. కానీ కొత్త జీవితం ప్రారంభించే అవకాశమే మాకు లేకుండా పోయింది.
నేను నీ నుంచి దూరంగా వచ్చేసినా నేను వదిలివచ్చిన నా కుటుంబసభ్యులు క్షేమంగా ఉండాలని నా పేరు, ఫొటో నీకు కనపడకుండా జాగ్రత్తపడుతున్నాను. చేతిలో పాస్‌పోర్టు పెట్టుకుని నా ప్రియ స్నేహితురాలు గత ఏడాది ఆగస్టులో కాబుల్ విమానాశ్రయానికి చేరుకుంది. తను కూడా జర్నలిస్టు. మేము ఇద్దరం కలిసి అప్లికేషన్ పూర్తిచేశాం. కానీ ఆమె అక్కడే ఉండిపోయింది. ఎన్నో గంటలు, ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత తను ఎయిర్‌పోర్టు దగ్గర్లోని వీధికి చేరుకోగలిగింది. చాలా దగ్గరకు వచ్చేసింది. కాని ఆమె లోపలికి ప్రవేశించలేకపోయింది. గేటు వద్ద కాపలాగా ఉన్న వారిని తప్పించుకుని రాలేక 14గంటల పాటు అక్కడే వేచి ఉంది. ఇంతలో మేము ఎక్కాల్సిన విమానం వచ్చేసింది. కాని తను నా పక్కన లేదు. ప్రతిరోజూ నాకు అది గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఈ సందర్భంలో ప్రపంచ జనాభాకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మేం ఎవరో తెలియకుండానే మాకు, మా కుటుంబాలకు చాలామంది మద్దతుగా నిలిచారు. దేశం విడిచి వచ్చేందుకు పాస్‌పోర్టులు, వీసాలు ఏర్పాటు చేశారు. కాని నా స్నేహితురాలు నా దగ్గరకు చేరుకోలేకపోయింది. ఆ బాధ నన్ను ఎంతో ఉద్వేగానికి లోను చేస్తోంది.
నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఆప్ఘన్ మొత్తం హస్తగతం చేసుకున్న మీరు అనుసరిస్తున్న ప్రణాళికలు, మా ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా మహిళల పరిస్థితులు, జర్నలిస్టుల భద్రత గురించి నేనెప్పుడూ ఆరా తీస్తూనే ఉంటాను. మాకిది కొత్త కాదు. మేము చాలాసార్లు నిరాశకు గురయ్యాం. అమెరికా వల్ల ఎన్నో సంవత్సరాలు మా అభివృద్ధి కుంటుబడింది. మీకంటూ సొంత ప్రణాళికలు లేవు. అక్కడ ఎంతోమంది నా స్నేహితుల గొంతులు మూగబోయాయి. వారి ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. ఎంతో ధైర్యవంతులు, విజ్ఞానవంతులైన నా ప్రియ జర్నలిస్టు స్నేహితులకు రక్షణ లేకుండా పోయింది. నా స్నేహితురాలు ఇప్పటికీ రిపోర్టింగ్ చేస్తోంది. అయితే చాలా రహస్యంగా.. ప్రయివేట్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో తన వీడియోలు వస్తున్నాయి. నాకు తన గురించి చాలా భయంగా ఉంది. నాకు తెలుసు, తను ఆ పనిని ఎంతో ధైర్యవంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోంది. తనకు ప్రమాదం పొంచివుందని తెలిసినా తన ప్రయాణం ఎప్పటికీ ఆపదు. ఎందుకంటే తను జర్నలిస్టు. ఆప్ఘన్ల గురించి ప్రపంచానికి చెప్పడమే తన ఆకాంక్ష.
ఇప్పటికీ నేను తనతో మెయిల్ ద్వారా సంభాషిస్తుంటాను. ఎలాగైనా తనని ఆ ఊబి నుంచి బయటికి తేవాలని ప్రయత్నిస్తుంటాను. కాని ఎప్పుడూ నేను ఇక్కడ పడుతున్న బాధల గురించి తనతో చెప్పలేదు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ నన్ను ఒక ప్రశ్న ఎప్పుడూ తొలిచేస్తూ ఉంటుంది. 'నేనెందుకు బయటపడ్డాను' అని...
ఇట్లు,
ఓ ఆఫ్ఘనిస్తాన్ యువ జర్నలిస్టు.