Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం ప్రపంచంలోనే చాలా వైవిధ్యభరితమైందని అందరూ అంగీకరిస్తారు. కులాలు, మతాలు, భాషలు, సాంస్కృతికంగానే కాక వ్యవసాయంలోనూ ఆ వైవిధ్యం కనిపిస్తుంది. దేశంలో నేటికీ 64శాతం ప్రజలు వ్యవసాయంమీద ఆధారపడితే బీహార్‌లాంటి రాష్ట్రంలో 75శాతానికి పైగా వ్యవసాయమే ఆధారం. తమిళనాడులో 50శాతం లోపు, కేరళలో 30-35శాతం లోపే వ్యవసాయంలో ఉన్నారు. వ్యవసాయంలో ఉన్న అసమానతలు వ్యవసాయ కార్మికులలోనూ వ్యక్తమవుతాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసమానతలు మరింత తీవ్రమవుతున్నాయి. దేశంలో నేడు రెండు విధానాలు అమలులో ఉన్నాయి. ఒకటి కేరళ మోడల్, రెండవది వాడుకలో పిలవబడుతున్న బీజేపీ సారధ్యంలోని నరేంద్రమోడీ గుజరాత్ మోడల్.
కేరళ వామపక్ష ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న నిర్వచనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి నిర్వచనానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉత్పత్తిదారులైన వ్యవసాయ కార్మికులు, కార్మికులు, రైతులు, వృత్తిదారులు, సామాజిక తరగతులకు ఆ ఉత్పత్తి ఫలాలు అందితేనే అది నిజమైన అభివృద్ధిగా వామపక్ష ప్రభుత్వం భావిస్తుంది. వీరిని టార్గెట్ గ్రూపులుగా పెట్టుకుని విధానాలను రూపొందిస్తుంది. బడా బూర్జువా, భూస్వామ్య రాజ్యాంగానికి లోబడి పరిమిత అధికారాలతోనైనా ఈ కృషి చేస్తుంది. అంతిమంగా శ్రామికవర్గాలకు ఉపయోగపడని అభివృద్ధిని అభివృద్ధిగా గుర్తించదు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలుగానీ, ఇప్పటి నరేంద్రమోడీ ప్రభుత్వం గానీ అభివృద్ధి అంటే భిన్న నిర్వచనంతో విధాన రూపకల్పన చేస్తున్నాయి. ఉత్పత్తి వర్గాల ప్రయోజనాలు వామపక్ష ప్రభుత్వాల లక్ష్యంగా ఉంటే, ఉత్పత్తిపై ఆధిపత్యం చెలాయిస్తున్న వర్గాల ప్రయోజనాలు బూర్జువా పార్టీల ప్రభుత్వాల లక్ష్యంగా ఉన్నాయి. ఈ లక్ష్యంతోనే నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో మూడు నల్లచట్టాలు, విద్యుత్తు బిల్లులు, భూ కార్పొరేషన్ లాంటివి తెచ్చింది. పర్యవసానంగా వ్యవసాయ కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, కౌలుదారులు గతంలో పొందుతున్న సౌకర్యాలకు, ఉపాధికి దూరమవుతున్నారు. వ్యవసాయంలో తెచ్చిన మూడు చట్టాలు తాత్కాలికంగా రద్దయినా విద్యుత్ విధానాలు రాష్ట్రాలలో అమలవుతున్నాయి. దేశంలో 40కోట్ల సాగుభూమి 15 కోట్ల కమతాలలో అంటే 60శాతం పైగా చిన్న, సన్నకారు, వ్యవసాయ కార్మికులు వ్యవసాయంలో ఉన్నారు. మన వ్యవసాయం స్వయం ఉపాధికి, స్వయం ఆహార సముపార్జనకు లోబడి వ్యాపార, ఎగుమతి పంటలు ఉంటాయి. ఇప్పటివరకు దేశాన్ని కాపాడుతుంది ఈ వ్యవసాయ పద్ధతే. బీజేపీ తీసుకొచ్చిన చట్టాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవసాయాన్ని వాణిజ్యంగా, వ్యాపారంగా మార్చటమే ధ్యేయంగా రూపకల్పన చేసినవి. అంటే స్వయం ఉపాధి, స్వయం ఆహారం అనే స్థానంలో వ్యవసాయం పూర్తి వ్యాపారంగా మారుతుంది. కాబట్టి ధనికులు, కార్పొరేట్లు వ్యవసాయంపై ఆసక్తిని కనపరుస్తున్నారు. వ్యవసాయం కార్పొరేటీకరణ చేయడం అంటే భూమిపై ఆధారపడ్డ రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులను భూమినుండి, ఉపాధినుండి తొలగించబడమే. ఆహార భద్రత వ్యాపార భద్రతగా మారిపోతుంది. కోవిడ్‌లాంటి విపత్తులో కూడా రైతు, వ్యవసాయ కార్మికులు 30 కోట్ల మెట్రిక్‌టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసారు. 34లక్షల కోట్ల విలువతో 16 నుండి 18 శాతం జీడీపీ భాగస్వామిగా మన వ్యవసాయ రంగం ఉంది. 15కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ప్రత్యక్షంగా, మరో 15 కోట్ల మంది గ్రామీణ పేదలు పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం వస్తే 30కోట్ల మంది ఉపాధి మరణశయ్యపై వేలాడుతుంది. ఇక రైతుల పరిస్థితి చెప్పనవసరం లేదు.
మొత్తంగా కార్పొరేట్ వ్యవసాయం రైతులకే కాదు, వ్యవసాయ కార్మికులకి కూడా పెను ప్రమాదంగా మారుతుంది. కొద్దీగొప్పా ఉన్న భూములను బలవంతంగా ప్రభుత్వ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు ఆక్రమించుకుంటాయి. అభివృద్ధి పేరు చెప్పి లక్షల ఎకరాల భూములు ప్రజలనుండి కొల్లగొడతారు. ప్రభుత్వమే భూబకాసురుడిగా తయారవుతుంది. పోరాడి సాధించుకున్న భూ సీలింగ్ చట్టాలు కనుమరుగవుతాయి. మోడీ చెపుతున్న చట్టాల రద్దు అనే సన్నాయి నొక్కుల్లలో పేదలకు ఉపయోగపడే ఈ వ్యవసాయ చట్టాలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ భూమి అంటే పేదలకు చెందాలనే భావన ఇప్పటికే బలహీనపడింది. ఇక కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ భూములను పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటాయి. అందుకు ఉపయోగపడటానికే కేంద్ర ప్రభుత్వం భూ కార్పొరేషన్‌ను ప్రారంభించబోతున్నది. ఇప్పటికే ప్రభుత్వ భూములపై కర్నాటక బీజేపీ ప్రభుత్వం కొత్త జీఓలు ఇచ్చి పేదల సాగులోని వేల ఎకరాల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కార్పొరేట్ వ్యవసాయానికే వందల వేల ఎకరాల భారీ కమతాలు ఉండాలి. వాటిలో పూర్తి యంత్రాల వినియోగం వస్తుంది. ఇప్పుడు సంవత్సరంలో 30, 40 రోజులకు పరిమితమైన వ్యవసాయ పనులు 10, 15 రోజులకు కుదించుకుపోతాయి. కోట్లాదిమంది ఉపాధిరహితంగా తయారవుతారు. మరోవైపు కార్పొరేట్లకు లాభాలే పరమావధి కాబట్టి ఆహారపంటలు కాకుండా వాణిజ్యపంటలు, ఎగుమతి ఆధారిత పంటలపై కేంద్రీకరిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలను కార్పొరేట్ సంస్థలు నియంత్రిస్తాయి. గత 2 సంవత్సరాలలోనే 30-50శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఎఫ్‌సిఐ కొనుగోళ్ళ నుండి వైదొలగి కార్పొరేట్ సంస్థల దగ్గర ప్రజాపంపిణీ వ్యవస్థకు కొనుగోలు చేస్తారు. కొన్ని సంవత్సరాలు సజావుగా ఉన్నట్టు అనిపించి అంతిమంగా కార్పొరేట్ల నియంత్రణతో ప్రభుత్వాలు కొనలేంత స్థాయికి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు. దీనితో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్థమై చివరికి చిందరవందరగా మారి నిర్వీర్యమైపోతుంది. సరుకులను సరఫరా చేయలేకపోతున్నామని, నగదు బదిలీని ప్రవేశపెట్టి చివరికి ఆహారాన్ని ఉత్పత్తి వర్గాలకు అందని ద్రాక్షగా మార్చేస్తారు. 23కోట్ల రేషన్‌కార్డులతో 85 కోట్లమంది నేటికీ ప్రజాపంపిణీ వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం భూములను కొల్లగొడుతుంది. ఉపాధిని తగ్గించి, ఆహార భద్రతను ఫణంగా పెడుతుంది. అంతిమంగా భూమిలాంటి సహజ వనరులను కబళించడం అంటే ప్రిమిటివ్ అక్యూములేషన్ ఆఫ్ క్యాపిటల్‌గా ప్రపంచంలో ఎలా జరిగిందో ఇప్పుడు దేశంలో కూడా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా నరేంద్రమోడీ వ్యవసాయాన్ని అలానే మార్చేస్తున్నారు.
కార్పొరేట్ వ్యవసాయం వల్ల రైతులు వ్యవసాయ కార్మికుల్లో చేరతారు. పనులు తగ్గడంతో పాటు వేతనాలూ పడిపోవటంతో వ్యవసాయ కార్మికుల జీవనమే ప్రశ్నార్ధకమవుతుంది. పాలకపార్టీలు వ్యవసాయ కార్మికుల పేదరికాన్ని అవకాశంగా తీసుకుని రాజకీయ ప్రాబల్యాన్ని సంఘటితం చేసుకునేందుకు కార్పొరేట్ వ్యవసాయం కూడా ఒక సాధనమవుతుంది. స్వంత ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు చేదోడుగా ఉన్న ఈ స్థితి నుండి కొన్ని తరగతులకు ప్రభుత్వ సహాయం లేకపోతే బతకలేని పరిస్థితి కార్పొరేట్ శక్తులు సృష్టిస్తాయి. ఇప్పుడున్న పథకాలకు ఇప్పటికే ప్రభుత్వ నిధులు తగ్గిస్తున్నారు. రాబోయే కాలం మరింతగా తగ్గిస్తారు. దీనితో ప్రభుత్వం సహాయం కోసం పేదల పోటీ ఉధృతమవుతుంది. ఓటేసే వారికే పథకాలనే పరిస్థితి వస్తుంది. చివరికి ఉత్పత్తి వర్గాలుగా ఉన్న వ్యవసాయ కార్మికులు భిక్షగాళ్ళుగా తయారయేందుకు కార్పొరేట్ వ్యవసాయం వేదికవుతుంది.
మరోవైపు ఉపాధి, స్వంత భూమిని కోల్పోవడమే కాక సామాజిక వివక్షత వికృతరూపం ధరించే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక అవసరాలు కూడా సామాజిక తరగతులను లొంగదీసుకోవడానికి ఆధిపత్య కులాలకు సాధనంగా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవసాయం వల్ల ఇప్పుడున్నవి కూడా కోల్పోవడంతో ఆధిపత్య కులాల పెత్తనం అధికమవుతుంది. కొత్త రూపాలలో కులవ్యవస్థ విలయ తాండవం చేస్తుంది. రాజ్యం ఆధిపత్య కులాల అడుగులకు మడుగులొత్తుతుంది. పూర్వకాలపు చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మ శాస్త్రాలు నూతన రూపాలు తీసుకుని కులవ్యవస్థను కాపాడతాయి. సామాజిక తరగతులను అణిచివేస్తాయి.
వ్యవసాయంలో ఉపాధి కుదించుకుపోయిన నేపధ్యంలో గ్రామీణ పేదలకు పని కల్పించడానికి వామపక్షాల ఒత్తిడితో 2005లో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే బీజేపీ బలహీనపర్చింది. నిధులను దారి మల్లిస్తున్నది. వామపక్షాల మద్దతుతో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం యూనియన్ బడ్జెట్లో 4శాతం నిధులు కేటాయిస్తే బీజేపీ 2శాతానికి తగ్గించి ఇప్పుడు 1.7శాతానికి పరిమితం చేసింది. మెటీరియల్ కాంపొనెంట్‌ను 40శాతానికి పెంచి కాంట్రాక్టర్లకు ద్వారాలు తెరిచింది. కొలతల పేరుతో వేతనాలు చెల్లిస్తూ రెండు పూటల హాజరు విధానాన్ని పెట్టి వేసవిలో ప్రజలు పనికి రాలేని స్థితిని కల్పించింది. ఉపాధిహామీలో కులాల విభజన తెచ్చింది. కార్పొరేట్ వ్యవసాయంతో పేదలకు ఉపాధి హామీయే ప్రధాన వనరవుతుంది. ఈ స్థితిలో వేతనాలు తగ్గించడం, ఉపాధిహామీకి పోటీని పెంచడం ద్వారా దీనిని గ్రామీణ ధనికవర్గ ప్రయోజనాలకు సాధనంగా మారుస్తారు. వ్యవసాయం అనుసంధానం పేరు చెప్పి కార్పొరేట్ల వ్యవసాయానికి అనుసంధానంగా ఉపాధి హామీ తయారవుతుంది.
కాబట్టి కేరళ వామపక్ష ప్రభుత్వానిది ప్రజా సంక్షేమం అయితే, నరేంద్రమోడీ ప్రభుత్వానిది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలను కార్పొరేట్ సంస్థలకు బలిచ్చే సంక్షేమం. సర్వస్వం కోల్పోతున్న వ్యవసాయ కార్మికులను విడదీయ టానికి, పోరాటాన్ని బలహీనపర్చడానికి కులం, మతం వినియో గిస్తారు. సోషల్ ఇంజనీరింగ్‌ను ప్రయోగించి శ్రామికుల మధ్య అనైక్యతను సృష్టించి పాలకవర్గాలకు అనుకూలంగా మార్చు కుంటారు. అందుకే కార్పొరేట్ వ్యవసాయం అంటే పైపైన చూస్తే తీవ్రత అర్థం కాదు. వ్యవసాయ కార్మికులను ఉపాధి రహితులుగా మార్చి, అడ్డాలో నిలబెట్టి తమను తాము అమ్ము కోవాల్సిన నవీన వెట్టిచాకిరీ, బానిసత్వాన్ని అమలులోకి తెచ్చే ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తుల అంతఃసారమే ఈ విధానాలు.
ఈ స్థితిలో వ్యవసాయ కార్మికులు బిచ్చగాళ్ళు కాదు, ఉత్పత్తి కారకులనే నినాదం మనకు కేంద్రం కావాలి. అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, అందరికీ ఆహారం, అందరికీ భూమి, అందరికీ సమాన హక్కులు, అందరికీ విద్య, అందరికీ వైద్యం మౌలిక అంశాలుగా వ్యవసాయ కార్మిక ఉద్యమాలు రావాలి. దేశవ్యాపిత డిమాండ్ల వెలుగులో ప్రాంతీయ డిమాండ్లను ప్రచారంలో పెట్టాలి. క్షేత్రస్థాయి పోరాటాలకు పదునుపెట్టాలి. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరినీ సమీకరించాలి. 200రోజుల ఉపాధి, శ్రమ చేసేవారికే భూమి, కేరళవలే బియ్యంతో పాటు 10,12 రకాల ఆహార వస్తువుల సరఫరా, పని ప్రదేశాలలో, వ్యవసాయ కార్మిక నివాసాలలో నినాదాలై ప్రతిధ్వనించాలి. వ్యవసాయ కార్మిక సంఘం క్షేత్రస్థాయిలో సమరశీల పోరాటాలకు ముందుకురావాలి. ఐక్య ఉద్యమాలను నిర్మించాలి.
- బి. వెంకట్