Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్ని రకాల మాంసం దుకాణాలను మూసివేయాలని ఏప్రిల్ 5న దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా పాలనా విభాగాలు చేసిన ప్రకటనలు మెజారిటీ మతస్థులతో పాటు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇది దక్షిణ ఢిల్లీ ప్రాంతవాసులకు కొత్త పరిణామం. కొన్ని సంవత్సరాల క్రితం దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా మాంసాహార వినియోగంతో పాటు కోడిగుడ్లపై కూడా నిషేధం విధించిన సంగతి దక్షిణ ఢిల్లీ ప్రాంతవాసులకు తెలుసు. తరువాత, ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏప్రిల్ 2 నుండి 11 వరకు గుళ్ళకు 200 మీటర్ల దూరంలో ఉన్న మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయినప్పటికీ, కొన్ని మున్సిపాలిటీలు ఆ తొమ్మిది రోజుల్లో అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులను జారీ చేశాయి.
ఘజియాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎంఎల్ఏ నంద కిషోర్ గుర్జర్ గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలనా యంత్రాంగానికి లేఖలు రాస్తున్నాడు. ఇది రాజ్యాంగంలోని ఏ చట్టంలో లేక పోయినప్పటికీ, షరామామూలైంది. భారతీయ జనతా పార్టీ హర్యానాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి మాంసం వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేస్తూ ఈ రకమైన నిషేధాలను విధిస్తుంది.
మంగళవారాల్లో మాంసాహారాన్ని తినకూడదనేది ఉత్తర భారతదేశంలోని మాంసాహారుల దీర్ఘకాల ఆచారంగా ఉంటున్నా, ఇది ఢిల్లీ ప్రాంతవాసులకు కొత్త పరిణామం. హిందూ మతస్థుల మనోభావాలను దెబ్బతీసే ''వాసన'' కారణంగా ఏప్రిల్ 2 నుండి 11 వరకు మాంసం దుకాణాలను మూసివేయాలని కోరుతూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ మేయర్ ముఖేష్ సూర్యన్ కమీషనర్‌కు లేఖ రాశాడు. నవరాత్రి ఉత్సవాల సమయంలో హిందువులు శాకాహారాన్ని తీసుకుంటారని, మద్యం, మసాలాలు తీసుకోరని, 99శాతం కుటుంబాలు ఆ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగించరని సూర్యన్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో గుళ్ళ వద్ద బహిరంగ మాంసం విక్రయాలు ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నాడు.
కానీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయల విక్రయాలపై ఎటువంటి నిషేధం విధించలేదు. కొన్ని ఏజెన్సీల నివేదికల ప్రకారం, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ, ముఖేష్ సూర్యన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, నిషేధాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని అన్నాడు. మాంసం విక్రయాల నిషేధంపై తూర్పు ఢిల్లీ మేయర్ కూడా వారితో గొంతు కలిపాడు. ఈ పరిస్థితుల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే... పెద్ద పెద్ద రిటైల్ స్టోర్స్ నుంచి మాంసాన్ని ఆన్లైన్లో తెప్పించుకొనే అవకాశం ఉంది. మాంసం విక్రయాలపై ఆధారపడే ముస్లింల ఆర్థిక పరిస్థితులను దెబ్బ తీయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం అని ప్రజలు నిర్దారణకు వచ్చారు.
మాంసం విక్రయ నిషేధాన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా విమర్శించారు. తనకు ఇష్టం వచ్చిన సమయంలో మాంసం తినడానికి, మాంసం విక్రయదారులు తమ వ్యాపారాలు చేసుకోవడానికి రాజ్యాంగం అనుమతించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మహువా మోయిత్రా ట్వీట్ చేసింది. ''రంజాన్ మాసంలో సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మధ్య మేము ఆహారం తీసుకోం. కాబట్టి, ముస్లింల ఆధిపత్యం ఉండే ప్రాంతాల్లో ముస్లిమేతరులు, టూరిస్టులను మాంసం తినకుండా నిషేధిస్తే మంచిదే అనుకుంటా. దక్షిణ ఢిల్లీలో ఆధిపత్యం సరైన దనుకుంటే, అదే జమ్మూ కాశ్మీర్‌కు కూడా సరైనదని'' నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు.
జేఎన్‌యూలో వివాదం
ఈ క్రమంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ పరిధిలోని జేఎన్‌యూలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు చెందిన విద్యార్థులు కొందరు శ్రీరామనవమి సందర్భంగా హాస్టల్లో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి, ఆ సందర్భంగా హాస్టల్లో మాంసాహారాన్ని ఆ రోజు వండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ హాస్టల్ కమిటీ అంతకుముందే నిర్ణయించిన మెనూ ప్రకారంగానే తమకు మాంసం తినే హక్కుందని మిగిలిన విద్యార్థులు అన్నారు. వారు నిర్వహించే కార్యక్రమాన్ని అగౌరవపరిచే ఉద్దేశ్యం తమకు లేదనీ, కానీ ఈ సందర్భంగా భిన్నమైన ఆహారపుటలవాట్లున్న హాస్టల్ విద్యార్థులు ఏం తినాలో నిర్ణయించే అధికారం ఒక లైసెన్స్‌గా మారకూడదని వారన్నారు. దీనిపై టీవీల్లో చర్చలు జరిగాయి. హిందూ సాంప్రదాయాల పట్ల అగౌరవం ఉందని తెలుపుతూ వ్యంగ్య చిత్రాల ద్వారా వివిధ పత్రికలు, ఛానళ్ళ ద్వారా ప్రచారం చేశాయి.
భారతదేశంలో శాఖాహారుల కంటే మాంసాహారులే ఎక్కువ అని తెలియజేసే రుజువులు అనేకం ఉన్నాయి. మాంసాహారాన్ని వినియోగించడం మానేసిన వారు చాలా పరిమితంగా ఉన్నారు. నవరాత్రి పండుగ సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. ఈ సమయంలో హిందువులు మాంసాహారం తినకుండా మానేస్తారు, కానీ ఈ సమయంలో మాంసం అమ్మకాలు, వినియోగం బాగా పడిపోయిందని తెలిపే సర్వేలు కూడా ఏమీ లేవు. ఇది చట్టవిరుద్ధంగా విధిస్తున్న నిషేధం. మాంసం విక్రయదారుల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే విధంగా బలవంతంగా శాకాహారాన్ని విధించడం తప్ప మరొకటి కాదు.
గోరక్షక చట్టాలు, గొడ్డుమాంసం వినియోగాన్ని నేరంగా పరిగణిస్తూ చేసిన చట్టాల తరువాత మాంసాహారం కంటే శాఖాహారమే ఉన్నతమైనదనే దానిపై ఇప్పుడు దృష్టి మళ్ళించారు. కానీ భారతీయ ఆహారపుటలవాట్లలో శాఖాహారమే ప్రాథమికమైనదని చూపే రుజువులు పెద్దగా లేవు. భారతదేశంలో మాంసాహారమే (కొన్ని జంతువుల మాంసం చౌకగా లభిస్తుంది కాబట్టి) ముఖ్యమైనది. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్లైన బాలమూరి నటరాజన్, సూరజ్ జాకబ్‌లు భారతీయుల ఆహారపుటలవాట్లపై సమర్పించిన పేపర్లో మొత్తం మాంసాహార వినియోగం విస్తృతి కన్నా మొత్తం శాఖాహారం వినియోగం విస్తృతి చాలా తక్కువ అని తెలియజేశారు.
కేవలం 20శాతం శాఖాహారులే
నటరాజన్, జాకబ్‌లు ''నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్నెస్‌ఎస్‌ఓ)'', ''ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్నెఫ్ హెచ్చెస్)'', ''ద ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే(ఐహెచ్ డీఎస్)''ల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా శాఖాహారం వినియోగ విస్తృతి 30శాతానికి మించి లేదని అన్నారు.
మెజారిటీ హిందూ మతస్థులు మాంసాహారులుగా, ఐదింట రెండొంతులు శాఖాహారులని ఎన్నెస్‌ఎస్‌ఓ సర్వేలో తేలింది, మూడింట ఒక వంతు కంటే కొంచెం తక్కువ శాఖాహారులని ఎన్నెఫ్ హెచ్చెస్ సర్వే తేల్చింది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో 2శాతం మాత్రమే శాఖాహారం వాడకంలో ఉంటే, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్లో 5శాతం కంటే తక్కువగా ఉంది. ఎన్నెస్‌ఎస్‌ఓ సర్వే చేసిన 17 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో 50శాతం పైన శాఖాహార వాడకం ఉంటే, ఆరు రాష్ట్రాల్లో 20శాతం కన్నా తక్కువగా ఉంది. హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో 75శాతం పైగా శాఖాహార వాడకం ఉంది. ముస్లిం, క్రైస్తవ మతానికి చెందిన ప్రజల్లో అధికంగా మాంసాహారం తినేవారే ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం, పర్యావరణాల ప్రాతిపదికన అందుబాటులో ఉండే ఆహారం, స్థానిక ఆధిపత్య సామాజిక సమూహాలకు సంబంధించిన సాంస్కృతిక రాజకీయాలతో పాటు ఆహారపుటలవాట్లలో లింగ సంబంధమైన తేడాలకు ప్రాంతీయ నమూనాను ఆపాదించారని వారన్నారు.
షెడ్యూల్డ్ తెగల ప్రజలు, షెడ్యూల్డ్ కులాల వారు, ఆ తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల వారు అతి తక్కువ శాకాహారాన్ని వినియోగిస్తారని ఎన్నెస్‌ఎస్‌ఓ అంచనాల్లో తేలింది. మరోవైపు, మూడింట రెండొంతుల మంది బ్రాహ్మణులు మాత్రమే శాఖాహారులని ఐహెచ్ డీఎస్ సర్వేలో తేలింది. మాంసాహారాన్ని తినే బ్రాహ్మణుల్లో కాశ్మీర్, కొంకణీ, బెంగాల్ బ్రాహ్మణులున్నారు. ఆఖరికి తేల్చేదేమంటే, మెజారిటీ భారతీయులు క్రమం తప్పకుండా లేక ఆయా సందర్భాలలో ఏదో ఒక రూపంలో మాంసాహారాన్ని తింటారు. కేవలం శాకాహారాన్ని మాత్రమే తినడమనేది భారతదేశంలో మెజారిటీ ప్రజల సాంస్కృతిక ఆచారం కాదు.
''శాఖాహార'' భావన
''హిందూ జనాభాలో అల్ప సంఖ్యాకులు భారతదేశంలో 'భారతదేశ శాఖాహార భావన'ను అలవర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని'' ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ అనిరుధ్ దేశ్ పాండే తన వ్యాసంలో పేర్కొన్నాడు. శాఖాహారాన్ని ఆయుర్వేదం సమర్థించిందని అనేక మంది విశ్వసించారు. చరకసంహిత లేక శుశ్రుత సంహిత లాంటి ఆయుర్వేద గ్రంథాలు అనేక అనారోగ్యాలకు మాంసాహారాన్ని నిర్దేశించాయని దేశ్ పాండే పేర్కొన్నాడు. బిడ్డను ప్రసవించిన తల్లికి శారీరక బలహీనతను అధిగమించేందుకు నెయ్యి, నూనె, కొవ్వు పట్టిన కండ మాంసం, మూలుగలున్న ఎముకలను తినాలని చరక సంహిత చెపుతుంది. అదే విధంగా జ్వరం తగ్గించడానికి నల్ల దుప్పి మాంసం మంచిది కాగా, కౌజు పిట్ట తెలివితేటలు, జీర్ణశక్తిని పెంచుతుంది. నెమలి మాంసం స్వరం, తెలివితేటలు, జీర్ణశక్తి, కంటి చూపు, వినికిడి శక్తిని పెంచుతుందని ఆయన అన్నాడు. ప్రాచీన భారతీయులు అనేక రకాల జంతువుల మాంసాన్ని తిన్నారని, వాటితో ప్రయో గాలు చేశారని పురావస్తు శాస్త్రాల రుజువులు సూచించాయి.
శాఖాహార వినియోగ ఆచారమనేది చారిత్రకంగా చూసినా, సమకాలీనతలో చూసినా ఒక కాల్పనికత, అది సాంస్కృతిక నిర్బంధ ఆచారం. ఒకవేళ రాజకీయ, సాంస్కృతిక జోక్యాల వల్ల శాఖాహార వినియోగం పట్ల ఉంటున్న ధోరణులు కఠినంగా (మత సంబంధమైన పండుగల సమయాన మాంసం విక్రయాల నిషేధం లాంటివి) ఉంటే, అప్పుడు అది సామాజిక నిర్మాణానికి, దేశ బహూళత్వానికి సవాల్‌గా మారుతుంది.
- టీ.కే.రాజ్యలక్ష్మి
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్
సెల్:9848412451